Previous Page Next Page 

శశిరేఖ పేజి 2

"రేపు" అని కేక వైచి శశిరేఖ తన యింటిని చేరెను.
ఆమె తల్లి వంటచేసి వాకిట కూర్చుని యుండెను.
తల్లి - అమ్మాయీ!ఇంక పొద్దుపోయిందాకా యేం చేస్తున్నావే?
శశి - పొద్దస్తమానం  యింట్లో వుంటాను చాలదూ? సరే కాని, నాన్న ఎంత సేపటికి వస్తారు?
తల్లి - కొంచెం పొద్దుపోయి కాని రానన్నారు యివాళ. ఎందుకు?
శశి - మీతో ఒక సంగతి చెప్పాలనుకున్నాను.పోనీ చెపుతాను,కోప్పడవు కదా?
తల్లి - సరే చెప్పు.
శశి - నాకెన్నో యేట పెళ్ళయింది?
తల్లి - ఎందుకిప్పడు?పదోయేట.
శశి -నాకు పెళ్ళోద్దని  యేడ్చాను జ్ఞాపకం వుంది?నాకు రామారావే తప్ప ఎవరూ వద్దని.
తల్లి - అవున్లే.
శశి - నేను వద్దంటూ వుంటే నా కిష్టంలేని వాడికిచ్చి పెళ్ళి చెయ్యడం మీకు న్యాయమేననుకున్నారూ?
తల్లి - చిన్నదానికి నీకేం తెలుసును?రామారావు ఈ డెక్కడ నీయీడెక్కడ? అతన్ని వాళ్ళవాళ్ళు
సిమపంపుతూవుంటే నీ కోసం ఆగి నిన్ను పెళ్ళి చేసుకుంటాడు గావును?
శశి - అతను వచ్చిందాకా వుంటాననలేదూ?
తల్లి - చాల్లే, తెలిసి తెలిసి మాటలు. ఇప్పటికింకా అతను వచ్చే జాడలేదు కదా!ఇప్పటిదాకా పెళ్ళిలేకండా ఉండేదానావు గావును!
శశి - అది పోనీ, నాకు బుద్ది వచ్చేదాకా అన్నా వుంచారూ? అయిందేమో అయింది. మిమ్మల్నని యేం  కార్యం ? ఇంతకూ నే చెప్పేది చేపపినానుగా! ఇప్పుడు మీరు చేసిన సంబంధం నాకు ఇష్టంలేదు. పెళ్ళిలో అతన్ని చూసి ఇష్టంలేక ఏడ్చానుకానూ? అప్పవణ్ణించి అప్పడుప్పడు నేను చూచిన దాన్నుంచి,వినిన సంగతులనించి అతనితో కాపరమంటే భయంగా అసహ్యంగా తోస్తోంది.అంత గర్విష్టి, స్వార్ధపరుడూ, ఎవరూ లేరు ఏమ్తేతేనేమి! అతనిమీద నాకు ప్రేమలేదు. అతను నాకు భర్త కాలేడు.నేనిదివరకే మీతో ఆ సంగతి చెప్పినాను.రేపు కార్యమంటున్నారు.ఇప్పడే చెప్పతున్నా.నా కది యిష్టంలేదు.
తల్లి- నీ కేమన్నా మతిపోయిందా? ఎవరన్నా యీ సంగతులు బోధిస్తున్నారా?పిచ్చిమాటలాడక నోరు మూసుకో. అతని కేం లోపమని నీ కిష్టంలేదు? కురూపా, కుంటా, గుడ్డా, దరిద్రుడా, ఏమని అక్కర్లేదంటున్నావు? ఎవరన్నా వింటే నవ్వరూ?ఎటువంటివాడ్తెనా భర్తని ద్తేవముగా చూచుకోమన్నారు.ఇంతేనా నీ తెలివి?
శశి- ఈ వాదాలు చాలా సార్లయినాయి. ఎప్పుడో ఎవడో మా యిద్దరిని కూచోపెట్టి, అర్ధంలేని వాగుడు వాగినాడని, ఎల్లకాలం ఇష్టమున్నా, లేకపోయినా పడి యాడవమన్నావూ? నేను చిన్నదాని కాదు, తేలికపోవడానికి? రేపు వాళ్ళని కార్యానికి  రానిచ్చారంటే  మీకూ వాళ్ళకి కూడా మాట దక్కదు.
తల్లి - బాగానే వుంది. చివరికి, కనిపెంచినందుకు ఉద్ధరిస్తున్నావు తల్లి. అమ్మా, యివేం బుద్ధులు,కులానికి, కన్నవాళ్ళకి కీర్తి తెచ్చేది.పోనీ పోనీ అని వూరుకున్న కొద్ది మించిపోతోంది వ్యవహారం.ఇవాళ మీ నాన్న గారు  రానీ కనుక్కుంటాను, ఎవరిపంతం నేగ్గుతుందో? తప్పకుండా వెంటనే వాళ్ళని రమ్మని రేపు వారంనాటి ముహూర్తానికే  కార్యం చేస్తాను.ఏదో వాళ్ళ చేతుల్లో పడితే,అటు తరవాత వాళ్ళ యిష్టం నీ యిష్టం ఏమిటో ఆ బెదిరింపు చూస్తానుగా!
శశి - నాకు భయం గావును! కార్యానికి యిక్కడ కొచ్చినప్పుడు ఆయనతోనే చెపుతాను నా కిష్టంలేదని, బుద్ది కలవాడా, మానుకు వెడతాడు.పట్టుపట్టినాడా అంత చదువుకున్నవాడికి అంత బుద్ది లేకపోతుంది?
తల్లి - మొగుడింటికి  కాపరానికి పోకుండా ఏం చేస్తావే, నిర్భాగురాలా?
శశి - మీ దగ్గిరే వుంటాను. మీకంటే నాకింకెవరు కావాలి? (కొంచెం యోచించి )నాకు మనసు కుదిరినవాడు కనబడితే పెళ్ళి చేసుకుంటాను,ఎప్పుడో ఒకప్పుడు.   
తల్లి - ఛి, ఛి, నోరుముయ్యి. విపరీతం బుద్ధులు పుడుతున్నాయేమే యిట్లా! సిమెళ్ళిన  రామారావు వెతుక్కుంటోవస్తాడా యేమిటే నీ కోసం?
శశి - అదికాదు.అతన్ని ఎప్పుడో మరిచిపోయినాను. సరే. ముందుగా చెప్పినాను మీతో. తరువాత నన్నంటే లాభంలేదు.
అని ఆమె లోపలికి పోయెను. ఏమో గొణుగుకొనుచూ ఆమె తల్లి అక్కడే కూర్చుని యుండెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS