Previous Page Next Page 

ఫస్ట్ క్రష్ పేజి 2

 

పని విషయంలో దిట్ట కాబట్టి ఎటువంటి వారైనా అతనికి ఆకర్షితులవుతుంటారు అతని దగ్గర కొత్త మెళకువలు నేర్చుకునేందుకు. 
అతని గురించి తెలిసిన అమ్మాయిలు మాత్రం ఆబ్బె వీడితో టైం వేస్ట్ అని దూరంగా ఉంటారు. 
పొరపాటున ఏ అమ్మాయికైనా ఎదురైనా వినీల్ వైపు చూడకుండా తలవంచుకుని వెళుతుంటారు ఈ ప్రవరాఖ్యుడితో మనకెందుకులే అని.
అదీ ఒకందుకు మంచికేలే అనుకుంటాడు వినీల్. 


****


సాయంత్రం సమయం ఆరు గంటలే కాబట్టి ఆ హోటల్ లో ఆ టైం లో రష్ తక్కువే ఉంటుంది.
రాత్రి అయ్యేకొద్దీ యువ జంటలు, ఫ్యామిలీస్ గుంపులు గుంపులు గా వచ్చి పిల్లల గేమ్స్, పిచ్చాపాటి, రకరకాల తినుబండారాలు    ఎంజాయ్ చేస్తుంటారు.
ఆ రోజు కూడా వినీల్ ఆ హోటల్ లో కూర్చుని మిర్చి బజ్జీ తింటూ సాగర్ కెరటాలు చూస్తూ లాప్టాప్ ఓపెన్ చేసి తన ప్రాజెక్ట్ చూస్తున్నాడు.
గడువు దగ్గర పడటంతో ఆ ప్రాజెక్ట్ రెండు రోజుల్లో పూర్తి చెయ్యాలి.
అందుకోసం రాత్రి చాలాసేపు పని చేస్తున్నాడు కూడా.
ప్రాజెక్ట్ ఆలోచనలతో సతమతమవుతున్న వినీల్ లాప్టాప్ లో ట్రింగ్ ట్రింగ్ మన్న శబ్దం విని ఓహ్ బాస్ లైన్ లోకి వచ్చాడు అనుకుంటూ వైర్లెస్ ఫోన్ చెవిలో పెట్టుకుని హాయ్ మృణాల్ గుడ్ ఈవినింగ్ అన్నాడు. 
వాట్సాప్ కాల్ లో బాస్ తో ప్రాజెక్ట్ గురించి సీరియస్ గా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. 
ఇంతలో ఓ యువతీ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం బిగ్గరగా వినిపిస్తూ బాగా డిస్టర్బ్ చేస్తోంది అతన్ని.  బాగా విసుగు కలిగిస్తోంది కూడా.
అటు ఇటు చూసాడు వినీల్ ఎవరిది ఆ ఏడుపు గొంతు అన్నట్లు.
కొంచెం దూరంలో ఓ టేబుల్ దగ్గర ఓ యువతీ ఉఁహూహూ అంటూ ఏడుపు రాగం తీస్తోంది.  
ఆ అమ్మాయి ఏడుపు రాగానికి వినీల్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు.
అందులో ఆ ఏడుపు మామూలుగా లేదు. సినిమాటిక్ గా, తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది.
వినీల్ పక్కన ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది  అని గమనించిన మృణాల్ ఆర్ యూ ఓకే వినీల్ ఎనీ ప్రాబ్లెమ్, నేను మరలా ఫోన్ చేసేదా అని అడిగాడు.
అబ్బెబ్బే అదేం లేదు అని సర్ది చెప్పాడు వినీల్ అతని ప్రశ్నలకు సమాధానమిస్తూ. 
ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎంతవరకు వచ్చింది. రెండు రోజులే టైం ఉంది. పూర్తవుతుంది కదా అని సందేహంగా అడిగాడు బాస్.
తప్పకుండా అవుతుంది మృణాల్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు వినీల్. టెస్టింగ్ రేపటితో కంప్లీట్ అవుతుంది. రేపు సాయంత్రానికల్లా సబ్మిట్ చేస్తాను అన్నాడు.
బాస్ కు బాగా తెలుసు వినీల్ గడువుకు ముందే అన్నీ రెడీ చేసి ఉంచుతాడు.    ఆ యువతి ఏడుపు రాగం ఎక్కువవుతూ ఉంటే ఇక భరించలేక వినీల్ గట్టిగా ఆ యువతితో హలో మేడం ఇక్కడ ఆన్లైన్ మీటింగ్ జరుగుతోంది. ఏవండీ ప్లీజ్ కాస్త మీ ఏడుపు శబ్దం తగ్గించండి. ఇక్కడ నేను వేరే వారితో మాట్లాడుతున్నాను. బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు పెద్ద గొంతుతో కొంచెం విసుగ్గా.
దానితో ఇంకా రెచ్చిపోయిన ఆమె ఇంకొంచెం బిగ్గరగా ఏడుపు కంటిన్యూ చేసింది.
ఈలోగా వినీల్ తన బాస్ తో  మాట్లాడటం పూర్తి చేసాడు.
ఆ అమ్మాయి ఏడుపు సొద ఇక ఆపాలని కుర్చీలోంచి లేచాడు.
ఆవిడ దగ్గరికి వెళ్లి వినీల్ ఆ యువతితో మేడం, ఇక మీరు మీ ఏడుపు కంటిన్యూ చేసుకోండి. పెద్దగా ఏడ్చినా ఫరవాలేదు. ఎందుకంటే నా మీటింగ్ అయిపొయింది అని అన్నాడు పలకరింపు నవ్వుతో.
మీ మీటింగ్ అయిపోయిందని మీ కోసం నేను ఏడుపు కంటిన్యూ చెయ్యాలా, ఎంత స్వార్ధం మీకు, నా ఏడుపుకు కారణం, దాని వెనకున్న నా బాధ మీరేం పట్టించుకోరా అంటూ టేబుల్ పైనున్న టిష్యూ పేపర్ లో ముక్కు చీదుతూ తాను ఇంకా ఏడుపు ఆపకుండా అలా వెక్కిళ్లు పెడుతోంది.
చుట్టుపక్కల టేబుల్స్ దృష్టి వీరిద్దరిపైన పడింది. 
వినీల్ కి కంగారు మొదలయ్యింది అందరూ తన వైపే చూస్తూ ఉండటంతో.
అప్పటికే అందమైన ఆ అమ్మాయిని చూస్తూ కుర్రకారు చాలా మంది ఆమెకు దగ్గరగా ఉన్న టేబుల్స్ లో కూర్చుని తదేకంగా ఆమె అందాన్ని జుర్రేస్తున్నారు.
ఇక అందరి దృష్టి ఆమెతో పాటు వినీల్ పై కూడా పడింది.
ఆమ్మో ఇదేందీ అనవసరంగా ఇలా ఇరుక్కుపోయాను ఈ అమ్మాయి దగ్గరకొచ్చి. ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో అనుకుంటూ మదనపడుతున్నాడు వినీల్.
ఇంక లాభం లేదు అనుకుంటూ ఈ ఏడుపు మేళం తప్పేట్లు లేదు అనుకుని, ఇపుడు చెప్పండి ఎందుకు మీ ఏడుపు. నేనేమైనా ఓదార్చగలనా అన్నాడు.


****


ఆమె అందం ఓ బాపు బొమ్మలానో, అజంతా శిల్పంలానో ఉంది.
ఆమెను చూస్తుంటే రెప్ప వాల్చ బుద్ధవటల్లేదు.
అలానే చూస్తుండి పోవాలనిపిస్తోంది వినీల్ కి. 
మొదటిసారి అంత అందాన్నిఅంత దగ్గరగా చూడటం వినీల్ కి కొత్తగా మరులు కొలుపుతోంది.
గుండెలో సన్నని ప్రేమ గుబులు కూడా మొదలయ్యింది. 
ఆమె కోల మొహం, తెల్లని మేని ఛాయ, కోటేరేసిన సంపెంగ లాంటి ముక్కు, నల్లని త్రాచులాంటి ఒత్తయిన పొడవాటి వాలు జడ, అందంగా తీసిన నడుమ పాపిట, తీరైన విల్లు లాంటి కనుబొమ్మలు, ఎడమ చెంపపై పెసరగింజంత నల్లని దిష్టి చుక్క లాంటి పుట్టు మచ్చ, అబ్బా అంత సొగసును మునుపెన్నడూ చూడలేదన్నట్లు అలానే చూస్తుండి పోయాడు ఆమె వైపు.
ఆ చీర కట్టులో ఆమె ఎల్లోరా శిల్పంలా మిరుమిట్లుగొలుపుతోంది.
ఎక్కడా కృత్రిమ వేషధారణ మచ్చుకైనా లేదు.
ఎంతో సామాన్యంగా తన సహజ సౌందర్యంతో అందానికి అద్దంలా ఉంది.
ఆ పెదాలకు లిప్స్టిక్ లేదు.
గులాబీ రేకులు విచ్చుకున్నట్లు అతి సున్నితంగా, మృదువుగా ఉన్నాయి.
మొదటి సారి అంత అందం కళ్లెదుట కనిపించేసరికి వినీల్ కి ఓ వైపు ఆశ్చర్యంగానూ, మరో వైపు ఆనందంగానూ ఉంది. 
తనను తదేకంగా చూడటం చూసి, ఇక చూసింది చాలు కూర్చోండి నా సమస్య చెపుతాను మీతోటి అని వినీల్ వైపు కొంటెగా చూస్తూ, మృదువుగా అంది.
ఆమె మాటలకు కొంచెం ఖంగు తిని చెప్పండి చెప్పండి అన్నాడు కంగారుగా.
ఇంతలో ఆమె ఫోన్ మ్రోగింది. అవతలనుంచి ఆమె స్నేహితురాలు మాట్లాడుతోంది.
ఆ మాటలకు ఇటునుంచి ఈవిడ బిగ్గరగా ఏడుపు. ఒక వైపు మాట్లాడుతూనే వినీల్ వైపు చూస్తూ టిష్యూ చేతికందివ్వమని చెయ్యి చాచింది. ఆమె చేతిలో టిష్యూ పేపర్ పెట్టాడు వినీల్ ఆవిడ సమస్య ఏంటో అర్ధం కాక. 
అంతేలేవే అందరూ నన్నొదిలెయ్యండి. మా వాళ్ళు నన్ను ఎవరికో ఒకరికి కట్టబెడతారు. అప్పుడు నేను జీవితాంతం ఏడవాలిసిందే. మీరందరూ నా ఏడుపు చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు ఎంచక్కా. ఇక నాకు ఏ మార్గం లేదు ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని గట్టిగా ఫోన్ లో మాట్లాడుతూ మళ్ళీ ముక్కు తుడుచుకుంటోంది.
అలా తుడిచి తుడిచి తెల్లని ఆ సంపెంగ లాంటి ముక్కు ఎర్రగా మారి మరీ ముద్దొస్తోంది.
టేబుల్ పైనున్న ఆమె ఐడెంటిటీ కార్డు చూసాడు.
ఆమె పేరు విజిత. అపోలో హాస్పిటల్స్ లో డాక్టర్ అని ఉంది.
ఓహ్ ఈవిడగారు డాక్టర్ అన్న మాట అనుకున్నాడు మనసులో వినీల్.
మీరు డాక్టర్ అయ్యుండి ఆత్మహత్య అంటారేంటండి అన్నాడు విజిత వైపు భయంగా, కంగారుగా చూస్తూ.
మీరు నా ప్లేస్ లో ఉంటె తెలుస్తుంది లెండి నా బాధ ఏమిటో. నా కిష్టం లేకుండా నా పెళ్లి చేస్తే ఎలా. చెప్తే ఇంట్లో అస్సలు వినిపించుకోవట్లేదు అంది నిష్టూరంగా. 
ధైర్యంగా మీ వాళ్లకు మీ మనసులో మాట చెప్పండి. భయమెందుకు అన్నాడు ఇంకో టిష్యూ ఆమె చేతికందిస్తూ.
ఇక చాలు. ఇంకా ముక్కు చీదమంటారా మీ కోసం అంది ఇంకేం పనిలేదా అన్నట్లు.
వద్దు లెండి అన్నాడు. 
ఆవిడ చేతిలో టిష్యూలు తన చేతిలో పెడితే, వెళ్లి డస్ట్ బిన్ లో వాటన్నిటినీ వేసొచ్చాడు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS