"పెళ్ళికూతుర్ని చూడడానికి." జవాబిచ్చాడు సీతంరాజు.
"పెళ్ళికూతుర్ని చూడడానికా!" ఆశ్చర్యంగా అడిగాడు సృజన్ బాబు.
"అవును-ఆ బాగు లోపలపడేసి రా! త్వరగా చూసి వద్దాం."
"కాని...ఎందుకు ఆ అమ్మాయిని చూడటం?"
"కాలేజీలో నుంచి బయటపడి ఉద్యోగం చేస్తున్నా ఇంకా ఈ కొశ్చన్ మార్కులు పోలేదన్న మాట. మరేమీ లేదురా బాబూ. ఆ పెళ్ళికూతురు అనుమాన సౌందర్యవతి అయుంటుందని మేమూ -కాదని మా స్నేహితుడు సురేంద్ర - వాదించుకుంటున్నాం ఎడిటరుగారూ. మీ రెవరితో ఏకీభవిస్తారో చెపుదురుగాని-పదండి" అతని భుజంమీద చేయివేసి బలవంతంగా లాగుతూ అన్నాడు సీతంరాజు.
"అరె! ఈ బాగ్ లోపల పెట్టనీండ్రా..."
"నువ్వేం పెట్టక్కర్లేదులే. ఆ పెళ్ళికొడుకు మొహానపడేయ్. వాడికి ముహూర్తం టైము వరకూ వేరే పనే ఏడ్చింది గనుక..." అంటూ అతని చేతిలోని బాగ్ అందుకొని సురేంద్ర చేతికిచ్చాడు సీతంరాజు.
అందరూ పెళ్ళికూతురి ఇంటివైపు కదిలారు.
పందిట్లోంచి తెలుగు సినిమాపాటలు హోరెత్తించే స్తున్నాయ్. ఆ ఆవరణంతా వరసల్లో పేర్చబడ్డ కుర్చీలూ వివాహవేదికా, అక్కడక్కడ గుంపులుగా కూర్చొని బాతాఖానీవేస్తున్న పెళ్ళికూతురు తరపు బంధువులు.
"పెళ్ళికూతురు ఏ గదిలో ఉందో ఎలా తెలుసుకోవడం?" నెమ్మదిగా అన్నాడు శ్రీధరం.
"ఇంట్లోజొరబడి అన్ని గదులూ వెదికితేసరి ఎక్కడో చోట ఉంటుందికదా." అన్నాడు వీర్రాజు.
అందరూ ఇంటివేపు నడిచారు పందిట్లోంచి.
"ఒరే ఇలా వెళ్ళడం బావుండదేమోరా" సంశయంగా అన్నాడు సృజన్ బాబు.
"ఎందుకని బావుండదు?" అడిగాడు శ్రీధరం.
"బహుశా-వాడి పెళ్ళికికూడా ఇలాగే చేస్తామని భయపడి అలా అంటున్నాడ్రా. వీడి మాటలు వినకండి" నవ్వుతూ అన్నాడు సీతంరాజు.
మరింక మాట్లాడలేక వారిని అనుసరించాడు సృజన్ బాబు.
ఇంట్లో ఎదురవుతోన్న పిల్లా, పెద్దా అందరినీ తప్పించుకొని లోపలకు చొరవగా నడవసాగాడు సీతంరాజు. అతని వెనుకే సైన్యంలాగా వీర్రాజూ, శ్రీధరం, సృజన్ బాబు నడుస్తున్నారు వరసగా. ఎవరి హడావుడిలో వాళ్ళుండడం మూలాన వీళ్ళగురించి పట్టించుకొన్నవారే లేదు. మూసివున్న ఓ గది తలుపులముందు ఆగిపోయాడు సీతంరాజు.
"తలుపులు మూసిఉన్నాయి కాబట్టి-బహుశా పెళ్ళి కూతురు ఈ గదిలోనే ఉండుంటుంది" అన్నాడు నెమ్మదిగా.
ఈ లోగా గది తలుపులు తెరుచుకుని ఓ ముసలావిడ బయటికొచ్చింది.
"నమస్తే మామ్మగారూ!" అన్నాడు సీతంరాజు పరిచయం, బంధుత్వం ఉన్న వాడిలాగా. ముసలావిడ అతని వంక తేరిపార చూసింది.
"నిన్ను గుర్తుపట్టలేదు నాయనా!" అంది ఆశ్చర్యంగా.
"ఎలా గుర్తుంటుంది లెండి. ఎప్పుడో మీచిన్నప్పుడు-ఐ మీన్ నా చిన్నప్పుడు చూశారు నన్ను-ఇంతకూ పెళ్ళి కోకూతురు ఈ గదిలోనే ఉందా?"
"అవును ఎందుకు?"
"అదే వీళ్ళంతా పెళ్ళికొడుకు స్నేహితులట! చూస్తామని..."
"ఉహుఁ ఇప్పుడు వీల్లేదు. ఎలాగూ రేపు పీటల మీద చూస్తారుగా. ఈ కాసేపూ ఓపికపట్టమను."
సీతంరాజు వెనక్కు తిరిగాడు.
"ఒరేయ్! ఇప్పుడు చూడకూడదంటున్నార్రా మామ్మగారు. అందుచేత "ఎందుకు?" అని అడక్కుండా అందరూ నా వెనకే రండి..." అన్నాడు బయటకు నడుస్తూ.
ఆ ఇంటి పక్కనున్న ఆవరణలోకి నడిచి ఆగాడు సీతంరాజు.
"అదిగో! ఆ కిటికీ కనబడుతోంది చూడండి. బహుశా అదే పెళ్ళి కూతురున్న గది అయుండాలి! ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి స్పష్టంగా పెళ్ళికూతుర్ని ఆ కిటికీలోనుంచి చూడవచ్చు. నువ్వెళ్ళరా వీర్రాజూ ముందు."
వీర్రాజు వెళ్ళి నిముషంలో తిరిగి వచ్చాడు.
"కిటికీకి దగ్గరగానే కూర్చుందిరా పెళ్ళికూతురు నల్లగా ఉన్నా చాలా అందంగా ఉందిలే!"
ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ఆ అమ్మాయిని చూసి వచ్చారు సీతంరాజూ, శ్రీధరం.
ఆఖర్లో సీతంరాజు బలవంతంమీద తనూ వెళ్లి కిటికీలోనుంచి లోపలకు చూశాడు సృజన్! పెళ్ళి దుస్తులలో ఉన్న ఆ అమ్మాయిని చూస్తూనే ఉలిక్కిపడ్డాడతను. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్! ఆ అమ్మాయి-ఆమె ఒకరేనా? ఒకరే అయితే....మరి....ఈ వివాహమెలా జరుగుతోంది? ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుందామె? ఏమీ అర్ధం కావటం లేదు సృజన్ బాబుకి. నెమ్మదిగా అక్కడినుంచి వెనుకకు వచ్చేశాడు.
అందరూ పెళ్ళికూతురు గురించే మాట్లాడుకొంటున్నారు.
"నేను చెప్పలేదుట్రా! సురేంద్రగాడు ప్రేమించిన అమ్మాయంటే ఎంతో అందంగా ఉండి ఉండాలీ అని!"
"నల్లగా ఉన్నా చాలా ఆకర్షణీయంగా ఉంది..."
"ఇంతకాలం పెళ్ళి వొద్దో అని కూర్చున్నందుకు చివరకు అదృష్టం ఇలా వరించింది వాడిని..."
"నువ్వేం మాట్లాడవేరా?" సృజన్ బాబుని అడిగాడు శ్రీధరం.
"పదండి! అక్కడికెళ్ళి మాట్లాడుకోవచ్చు" అని విడిదింటివేపు నడువసాగాడు సృజన్. అతని మనసంతా అల్లకల్లోలంగా తయారయింది.
"ఆ అమ్మాయే! అనుమానం లేదు. ఆ కనుబొమలు చూస్తేనే తెలిసిపోతుంది. ఒక ప్రత్యేకత ఉందామె అందంలో! ఎక్కడ వున్నా, ఎంత మందిలో ఉన్నా ఇట్టే గుర్తించవచ్చు."
అందరికంటే ముందుగా యిల్లు చేరుకున్నాడు సృజన్ బాబు.
"వీళ్ళంతా ఏరీ?" అడిగాడు సురేంద్ర.
"వెనుక వస్తున్నారు..." తనూ ఓ కుర్చీలో కూలబడుతూ అన్నాడు సృజన్ బాబు.
"ఇంతకూ చూశారా?"
"ఓ! అందరూ నిన్ను అదృష్టవంతుడంటున్నారు___" నువ్వు తెచ్చుకొంటూ అన్నాడు సృజన్. తన ప్రాణస్నేహితుడితో మనస్పూర్తిగా మాట్లాడలేక పోతున్నందుకు అతనికి బాధగా ఉంది. యూనివర్శిటీలో చేరిన దగ్గర్నుంచి వదిలే వరకూ ఇద్దరూ ప్రాణస్నేహితులుగా గడిపారు. ఉద్యోగాల వేటలో చెరో ఊరికి వెళ్ళినా ఒకరి గురించి మరొకరు తలచుకొంటూనే ఉన్నారు. వీలయినప్పుడల్లా కలుసుకొంటున్నారు. ఇద్దరిమధ్యా దాపరికం లేదు ఏ విషయంలోనూ! ఇదే మొదటిసారి లోపల ఒక ఆలోచనచేస్తూ బయటకు మరోలా మాట్లాడటం.
