Previous Page Next Page 

శిక్ష పేజి 2


    ఆ శరణాలయంలో ప్రవేశించాక అక్కడి జీవితానికి అలవాటు పడిపోతారు పిల్లలు. తెల్లవారి ఐదుగంటలకి లేవడం ఆరుగంటలలోపల చకచచ అందరూ పిల్లలు పక్కలు తీసుకుని, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానంచేసి ప్రార్ధనా మందిరం చేరుకోవాలి. రోజూ ప్ర్రార్దన పదిహేను నిమిషాలు ఆ తర్వాత అంతా భోజనశాల చేరుకుంటారు. అక్కడ ఒక్కొక్కరికి ఒక కప్పు పాలుదొరుకుతుంది. ఆ పాలుతాగి ఐదేళ్ళు దాటినపిల్లలంతా పుస్తకాలు తీసుకొని చదువుకోవడానికి కూర్చుంటారు తొమ్మిది గంటలకి భోజన గంటవినపడగానే పిల్లలంతా బిలబిలలాడుతూ భోజనశాల చేరి తమ అల్యూమినియం కంచం-గిన్నె-గ్లాసు పుచ్చుకుని వరసగా వంటవాడి దగ్గిర క్యూలో వెళ్ళాలి. వంటవాడు అన్నం, ఓ కూర గిన్నెలో పులుసుపోస్తాడు. పిల్లలు డైనింగ్ హాల్లో చాపల మీద కూర్చుని ఆవురావురుమంటూ తింటారు, తినగానే పళ్ళాలు కడిగి పెట్టుకుని తమ గదిలోకి వెళ్ళిబట్టలు మార్చుకుని స్కూలుకి బయలుదేరాలి. ఆ ఉదయం తొమ్మిది గంటలకి తిండి తర్వాత తిరిగి స్కూలు 4-30 కి వదలినాక 5గం||కి వచ్చి మళ్ళీ కప్పు టీ, దాంతో రెండు బ్రడ్ ముక్కలుగాని రెండు బిస్కట్లుగాని తీసుకుంటారు. మొహాలుకడుక్కుని ఓ గంట ఆడుకున్నాక సాయంత్రం తిరిగి ప్రార్ధన ఆ తరువాత ఏడున్నరకి మళ్ళా భోజనం-రాత్రి భోజనం రెండు చపాతీలు, కూర-గుప్పెడు అన్నం-పెరుగు-తొమ్మిది గంటలకి నిద్ర.
    ఈ కార్యక్రమం పిల్లల జీవితాలు క్రమపద్ధతిలో- క్రమశిక్షణలో నడపడానికి దోహదం చేస్తాయన్న విశ్వాసంతో ఏర్పాటు చేశారు ఆనాటిపెద్దలు ఆయాలు పసివాళ్ళ ఆలనా పాలనా చూడాలి-పాలు పట్టాలి- స్నానం చేయించాలి. స్కూలుకి వెళ్ళని పిల్లలని ఆడించాలి. పని వాళ్ళుగదులు తుడవాలి, బట్టలుతకాలి, అంట్లుతోమాలి, వంటవాడు వండాలి, వడ్డనవాడు వడ్డించాలి. గుమస్తా ప్రతిరోజూ శరణాలయానికి కావల్సిన దినుసులు, కూరలు అన్ని తెప్పించాలి వంట ఏర్పాటు సక్రమంగా జరిగేది చూడాలి, లెక్కలు రాయాలి మేనేజరు నెలసరి ఖర్చు చూడాలి, రోజుకోసారి శరణాలయంలో అందరూ ఎవరిపని వారుచేస్తున్నధీ లేనిదీ చూసి వెళ్ళాలి.
    ఇలా వ్యవహారం అంతా పకడ్బందీగా ఏర్పాటు చేశారు శరణాలయం ఆరంభించిన రోజులలోకాని యిప్పుడు ఎవరి పనులువారు చెయ్యరు.
    ఇప్పుడు ఇదంతా కాగితాలలో తప్ప కార్యాచరణలో కనపడదు. ఉదయం 5 గంటలకి పిల్లలంతా లేవడం వరకు మాత్రం పాత ఆచారం ప్రకారం జరుగుతుంది. ఆరు గంటలకి ప్రార్ధన మందిరం చేరవలసిన పిల్లలకి వాళ్ళ పక్కలు తీసుకోవడం, పెద్ద పిల్లలు చిన్నవాళ్ళ పక్కలు తీసి వాళ్ళ చేత మొహాలు కడిగించడం, స్నానాలు చేసుకోవడం, చేయించడం, గదులు తుడుచుకోవడంతో ప్రార్ధన టైము దాటిపోతుంది పిల్లలంతా తమ తమ పనులు చేసుకుని వాళ్ళంతట వాళ్ళే ప్రార్ధన జేసుకుంటారు. అట్నించి వచ్చాక ఇదివరకు పిల్లలకిచ్చే పాల బదులు కప్పుడు టీ నీళ్ళు యివ్వబడుతున్నాయి. ఆ నీళ్ళు తాగాక చిన్నపిల్లలు చదువుకోవడానికి కూర్చున్నా వయసు వచ్చిన పిల్లలకి ఎన్ని పనులు, చదువుకోడానికి తీరికే దొరకదు. వంటాయనకి ఒక అమ్మాయి, కూరలు తరిగియ్యాలి, మరో అమ్మాయి బియ్యం కడిగియ్యాలి. మరో అమ్మాయి మసాలా రుబ్బాలి. వంటతను సిగరెట్టు కాల్చుకుంటూ పిల్లలచేత పనులు చేయిస్తాడు. అదేం అని అడిగే సాహసంలేదు పిల్లలకి అడిడితే నా వక్కడివల్ల యీ పని అవదు. భోజనం కావాలంటే చేయండి అంటాడు, చెయ్యకపోతే స్కూలు టైముకి అన్నం పెట్టడు. అతనికి సహాయం చెయ్యడానికి పెట్టిన నౌకర్లు ఒకడు మేనేజరు యింట్లో మరొకరు గుమస్తా యింట్లో చేస్తారు. మిగిలినవాడు బజారు వంక పెట్టి ఊరంతా తిరిగి పని అయ్యాక వస్తాడు ఆయాలు సరేసరి చిన్న పిల్లల పోషణకోసం పెట్టిన వాళ్ళు ఆరయినా నిద్రలేవరు, పిల్లలు ఆకలితో గోలపెడితే నిద్రమత్తులో రెండు తగిలిస్తారు. స్నానం చేయించడానికి అంత పసిపిల్లలని వంటి రెక్కతో విసవిసలాడుతూ లాక్కుపోయి నీళ్ళ గదిలో కూలేస్తారు. వాళ్ళ మల మూత్రాలు శుభ్రం చేయాల్సివస్తే వాళ్ళ కోపం అవధులు దాటుతుంది దిక్కుమాలిన వెధవలు ఏఅమ్మకి అబ్బకి పుట్టారో, అడ్డమైన వాళ్ళకి చెయ్యాలి. అంటూ తిడ్తూ శాపనార్ధాలు పెడుతూనే ఆపిల్లలని పురుగుల్లా విదిల్చి, కసిరికొట్టి నానా హింస పెడ్తారు. వాళ్ళు పెట్టే చిత్రహింసకి అంత పసివాళ్ళూ ఏడవటం కూడా మరచిపోయి బిక్క చచ్చి బిక్కుబిక్కుమని చూడడానికి అలవాటు పడిపోతారు. ఆ చంటిపిల్లల దురవస్థ చూడలేక శరణాలయంలో పెద్దపిల్లలే వారి సంరక్షణ భారం స్వీకరిస్తారు. తామూ ఒకప్పుడు అంత దయనీయ స్థానంలోనే వుంటూ పెరిగామన్న సత్యం గుర్తించి ఆ పసిపాప ఆలనా పాలనా వాళ్ళే చేసుకుంటారు. దాంతో ఆయాల పని మరింత సుఖం-స్నానం చేయించడం, పాలు పట్టడం అంతా పిల్లలే చూసుకుంటారు, ఎటొచ్చీ పెద్దపిల్లలు స్కూలు కెళ్ళే సమయంలో ఆ పసివాళ్ళకి ఆయాల చేతిలో నరకం తప్పదు. ఆ పసివాళ్ళు ఏడిస్తే పాల బదులు గంజినీళ్ళు పడ్తారు. పసిపాపల కోసం వచ్చే పాల డబ్బాలన్నీ ఏమయిపోయాయి!! అని అడిగే నాదుడు లేడు. రోజుకి రెండుసార్లు పాలని పట్టాలి. పాలో నీళ్ళోపట్టేవాళ్ళకే తెలియదు. అని గంజి తాగి ఆ పిల్లలు చావకుండా బతక్కుండా పుల్లలాంటి కాళ్ళు, చేతులతో ఆకలికి ఎప్పుడూ గీ అని ఏడుస్తుంటారు, కొన్నాళ్ళకి వాళ్ళ పేగులు ఎండిపోయి ఆ ఆకలి వారిని బాధించని స్థితికి చేరుకుంటారు.

 Previous Page Next Page