Next Page 

బొమ్మ బొరుసు  పేజి 1

 

                                  బొమ్మ బొరుసు

                                                                                                        --వసుందర

                                       

 

                                      

         
    "అధోగతిలో ఉన్న ఏ దేశమైనా బాగుపడాలంటే విప్లవ మొక్కటే మార్గం. ఆవేశం ఉన్న చోట కానీ విప్లవం సాధించబడదు. మన యువతరంలో చెప్పుకోతగ్గ ఆవేశం కానరాదు. కానీ కొంతలో కొంత విద్యార్ధులు నయం. వారికి చెప్పుకోతగ్గ ఆవేశం ఉంది. మన దేశంలోని అవినీతిని అరికట్టడానికి విద్యార్ధులు ముందడుగువేయాలి." పదవిలో లేని ఒక రాజకీయ నాయకుడు ఒక కళాశాల ఆవరణలో విద్యార్ధుల్ని ఉద్దేశించి చేసిన ఉపన్యాస సారాంశమిది. ఈ ఉపన్యాసం విద్యార్ధి నాయకుడు చంద్రాన్ని బాగా అవేశపరచింది. విద్యార్ధులలో చంద్రానికి చాలా గౌరవముంది. అందువల్ల తన నాయకత్వంలో అవినీతిని ఎదిరించాలని చంద్రానికి తోచింది. ఉపన్యాసం కాగానే చంద్రం ఆ రాజకీయ నాయకుణ్ణి కలుసుకుని విద్యార్ధుల్లో తన పలుకుబడిని వివరించి చెప్పి తనవల్ల కాగల ప్రయోజనా లేమున్నాయో ఆయన్నుంచి తెలుసుకోగోరాడు.
    "పాలడబ్బాలు బ్లాకులో తప్ప దొరకడం లేదు, హోటల్ వాళ్ళు సినిమా దియేటర్ల వాళ్ళు అకారణంగా ధరలు పెంచేశారు. ఆఫీసుల్లో లంచాలిస్తే తప్ప పనులు జరగడం లేదు. ఇలాంటి సమస్యలు విద్యార్ధులు చూస్తూ ఊరుకోవలసినవి కావు ...." అన్నాడు. రాజకీయనాయకుడు. ఇంకా విద్యార్ధులు ఏమేమీ చేయాలో , ఎలా ప్రవర్తించి ఈ అక్రమాలను ఎదుర్కోవాలో, విపులంగా చంద్రానికి విశాదపరిచాడు. చంద్రం ముందడుగు వేసి సింహనాదం చేశాడు. అతని నాయకత్వంలో విద్యార్ధులు మూక ఉమ్మడిగా ఊరి మీద పడ్డారు. తాము చెప్పినట్లు వినని పక్షంలో విధ్వంసానికి దిగగలమని బెదిరించారు. విద్యార్ధులు చేసే అల్లర్లలో పోలీసులు కలగజేసుకునేది తక్కువ కాబట్టి, చాలా మందికి విద్యార్ధుల బారి నుండి తప్పించుకోడం కష్టమైంది. పైగా విద్యార్ధుల ఆశయాల వెనక ఒక నగరపు జనాభా మద్దరు ఉంది.
    హోటళ్ళల్లో ఫలహారాల ధరలు తగ్గాయి. పాలడబ్బాలు బజార్లో అన్ని దుకాణాల్లోనూ కనిపిస్తున్నాయి. ఆఫీసుల్లో కాగితాలు ఏ లంచాలు లేకుండానే కదులుతున్నాయి.
    ఇవన్నీ శాంతియుతంగా సాధించబడినవి అనుకుంటే పొరపాటు. ఒక సినిమా దియేటర్లో కుర్చీలు విరిగాయి. ఒక కాఫీ హోటల్లో కప్పులు పగిలాయి. ఒక దుకాణంలో పప్పులు బురద పాలయ్యాయి. ఒక ఆఫీసరు, గుమస్తా చావుదెబ్బలు తిన్నారు. అయితే ఏం - హటాత్తుగా నగరంలో చెప్పుకోదగ్గ - ఆశించదగ్గ - మార్పులు వచ్చాయి.
    నగరంలో చాలామంది విద్యార్ధులకు బ్రహ్మరధం పట్టారు. ఎందరో వ్యాపారస్తులకూ, అవినీతి పరులకూ విద్యార్ధులు సింహస్వప్నంగా మారారు. చంద్రానికి నగరంలోనే కాక ఇంకా బయట కూడా చాలా పేరొచ్చింది.
    ఈ ఉద్యమం కారణంగా ఆ ఊళ్ళోని కాలేజీలన్నీ రెండు వారాలు మూత పడ్డాయి - ఒక చంద్రమతీ కళాశాల తప్ప! ఆ కళాశాల కేవలం ఆడపిల్లలు చదువుకునేది.
    చంద్రమతీ కళాశాల విద్యార్ధినులకు నీరజ నాయకురాలు . విద్యార్దినులలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. చదువుతూ , రాజకీయాలకూ సంబంధం లేదనీ, చదువుకునే రోజుల్లో ఇతర వ్యాపకాల జోలికి తాము పోరాదని నీరజ పట్టుపట్టింది. అందువల్ల ఆ కళాశాల మాములుగానే నడిచింది.
    రెండు వారాల ఉద్యమపు టుద్రేకంలో చంద్రం ఈ సంగతి అంతగా పట్టించుకోలేదు. కానీ ఉద్యమం ముగిసి కాలేజీలు తిరిగి ఆరంభం కాగానే ఈ విషయం అతని దృష్టికి తీసుకురాబడింది. యువతులైనా, యువకులైనా, విద్యార్దులందరూ ఒకే తాటి మీద, ఒకే బాటలో నడవాలని, నగరం మొత్తం మీద తమకు సహకరించని ఏకైక కళాశాల విద్యార్ధినులు - విద్యార్ధి లోకానికి క్షమార్పణ చెప్పుకోవాలని, చంద్రం నీరజకు హెచ్చరిక పంపాడు.
    ఈ విషయంలో తమ తప్పేమీ లేదనీ, ఆవిషయాన్ని సహేతుకంగా నిరూపించుకోడానికి తను సిద్దంగా ఉన్నాననీ నీరజ జవాబు పంపింది.
    ఈ విధంగా ఆ ఊళ్ళోని మ్యునిసిపల్ హల్లో రేండు కాలేజీల ప్రతినిధులు కలుసుకునే ఏర్పాటుకు ప్రాతిపదిక పడింది. ఈ సమావేశానికి రెండు కాలేజీల నుంచీ విద్యార్ధి విద్యార్ధినులు వచ్చారు.
    పురుషుల వర్గానికి ప్రతినిధిగా చంద్రం, స్త్రీ వర్గానికి ప్రతినిధిగా  నీరజ ఒకరికొకరు ఎదురుగా నిలిచారు.
    "విద్యార్ధులందరూ కలిసికట్టుగా ఉండాలి -" అన్నాడు చంద్రం.
    "విద్యకు సంబంధించినంత వరకూ ...." అంది నీరజ.
    "చదువుకుంటున్నంత మాత్రాన మనం మన చుట్టూ ఉన్న కుళ్ళును చూస్తూ ఉపేక్షించకూడదు. చేయగలిగింది చేయాలి....' అన్నాడు చంద్రం.
    'ఆ చేసే ముందు మన అసలు బాధ్యతను గుర్తించాలి. మన అసలు బాధ్యత చదువు. చదువుకు భంగం రాని విధంగా మాత్రమే మనం సంఘసేవ చేయాలి...." అంది నీరజ.
    "మన చుట్టూ ఇంత కల్మషం పేరుకుపోతుంటే , ఇంత అవినీతి పాకి పోతుంటే చూస్తూ ఎలా ఊరుకునేది?" అన్నాడు చంద్రం.
    "పక్షిని కొట్టాలనుకున్నప్పుడు అర్జునుడికి ఆ పక్షి వాలిన చెట్టు కానీ, దాని కొమ్మలు గాని, ఆకులూ కానీ కనబడలేదు. అతని దృష్టి - లక్ష్యం మీదనే కేంద్రీకరించబడి ఉంది. మన లక్ష్యం చదువు ....' అంది నీరజ.
    హల్లో ఆడవారి తరపు నించి విపరీతంగా చప్పట్లు వినబడ్డాయి. చంద్రం జవాబు కోసం మగవాళ్ళు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
    'చదువు సమాజశ్రేయస్సు కోసం. అదే మన లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు అక్కరకు రానప్పుడు చదువు వ్యర్ధమే" అన్నాడు చంద్రం. పోటీగా పురుషులు బలం కొద్ది చప్పట్లు కొట్టారు.
    "సమాజశ్రేయస్సు కోసం చదువుకోవడానికి వచ్చి, అది పూర్తి కాకుండానే మళ్ళీ సమాజశ్రేయస్సు పట్ల శ్రద్ధ చూపడం అస్థిర మనస్తత్వాన్ని తెలియజేస్తుంది...."
    "సమాజం నన్ను పిలుస్తుంటే అటు పోకుండా ఆగలేను...."
    నీరజ మొహం ఎర్రనయింది. "ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఈనాటివా? అసలు చదువుకోవడానికి చేరేముందీ సమస్యలు లేవా? అప్పుడు లేని బాధ ఇప్పుడు హటాత్తుగా ఎలా వచ్చింది? ఒకవేళ ఈ కొద్ది కాలమూ ఒర్చుకున్నామనుకుంటే - చదువు కూడా ఎల్లకాలమూ ఉండేది కాదు గదా! ఒకటి రెండు సంవత్సరాలలో అది పూర్తి చేసుకునే సమాజాన్నుద్దరించవచ్చును గదా"
    చంద్రం విసుగ్గా - "మనదేశం ప్రగతి పధాన నడవకపోవడానికి ఆడవాళ్ళే కారణం. సమస్యలన్నీ పురుషునివి. పరిష్కరించవలసిన బాధ్యత పురుషుడిది. అనుభవం మాత్రం అడదానిది....." అన్నాడు. విద్యార్ధులు పెద్దగా ఈలలు కూడా వేస్తూ చప్పట్లు చరిచారు.
    "వాదించడం చేతకాని ఉడుకు మోతులు వాదనకు పక్కదార్లు పట్టిస్తారు. మనం చర్చిస్తున్నది ఆడా, మగ గురించి కాదు- చదువు, సమాజ శ్రేయస్సు గురించి. సమాజ శ్రేయస్సు గురించి ఆలోచన చదువుకు ముందు చేయాలా, మధ్యలో చేయాలా, ఆఖరున చేయాలా ?' అంది నీరజ.
    క్రమంగా చర్చలు గాడి తప్పడమే కాక, అక్కడి పరిస్థితిలో ఉద్రిక్తత హెచ్చింది. కాస్సేపయ్యే సరికి అక్కడ అల్లర్లు ప్రారంభమయ్యాయి. పురుషత్వం, స్త్రీత్వం పై ఆధిక్యత చూపించడం కోసం అవమానకరమైన కొన్ని సంఘటనలుప్రారంభమయ్యాయి. తమ ఉద్యమంలో తమకు సహకరించని చంద్రమతీ కళాశాల విద్యార్ధినుల పై విద్యార్ధులు ప్రతీకారం తీర్చుకున్నారు. అక్కడి గొడవ సంగతి ఊళ్ళోకి పాకి పోలీసులు కలగజేసుకునే సమయానికి కొంతమంది ఆడవాళ్ళకు అన్యాయం జరిగిపోయింది.
    'నేను ఓడిపోయాను......'అనుకుంది నీరజ ఏడుస్తూ. సమాజ శ్రేయస్సు నెదిరించే ఆవేశాన్నేదిరించిన తన తప్పును అప్పటికి గుర్తించిందామె.
    'నేను ఓడిపోయాను ....' అనుకున్నాడు చంద్రం - మానభంగం నేరానికి జైలు కటకటాల వెనుక నిలబడి.
    'నేను ఓడిపోయాను' అనుకున్నాడు రాజకీయ నాయకుడు- ఆవేశమే గాని ఆలోచనలేని విద్యార్ధులను విప్లవ రధ చోదకులుగా చేయాలని అనుకున్నందుకు.
    నగరంలో మళ్ళీ ఫలహారాల ధరలు, దియేటర్ల ప్రవేశ రుసుము ఎప్పటిలా అయిపోయాయి. పాలడబ్బాలు బ్లాకు మార్కెట్ లోకి వెళ్ళిపోయాయి.
    విద్యార్ధుల ఆవేశపు ప్రయోజనాలను బొమ్మగా చూసేవారందరూ వారి ఆవేశపు టనర్ధాలనే బొరుసును కూడా గుర్తిస్తే - వారిని వారి మానాన చదువుకోనీయవలసిన అవసరాన్ని గుర్తిస్తారు.

                                         ***


Next Page 

WRITERS
PUBLICATIONS