"ముందూ వెనకా ఆలోచించకు. ఆ ప్రయత్నంలో వుండు" అన్నారు శ్రీశ్రీగారు.
ఇరవైవేలూ, పత్రం రాసి తెచ్చాను. సారెకివ్వాల్సిన సామాన్లు, బీరువా, మిషన్, అన్ని రకాల చీరలు...వగైరాలన్నీ నా దగ్గరే వున్నాయి. పోతే_మంచం, డ్రస్సింగ్ టేబిల్ కొన్నాం.
పెద్ద సత్రం అద్దెకి తీసుకున్నాం.
పెళ్ళి వారు ముందే చెప్పేశారు__"పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యండి. మూడు పూటలు, పెళ్ళి జరగాలి. మేమంతా మొత్తం ఏభైమంది దాకా వస్తాం" అని...
* * *
పెళ్ళివారు విడిదిలో దిగారు. రాత్రి ఎనిమిది గంటలయ్యింది. ఒక పక్క బేండ్ మేళంతో పెళ్ళి పందిరి కిటకిటలాడుతూ, కళకళలాడుతోంది.
మానసికంగా కృంగిపోవడంతోపాటు, అలసటతో నాకు ప్రాణం వుందా లేదా అన్నట్టు అయిపోయింది.
తెల్లవారితే పెళ్ళి. రాత్రి తొమ్మిది గంటలకి ఉమ్మడియార్ షాపుకి వెళ్ళి మంగళసూత్రాలు కొని నేనే స్వయంగా తెచ్చాను. తెల్లవార్లూ నిద్రలేని వాళ్ళం నేనూ, మా వారూ, మా తల్లి.
పెళ్ళికూతురికి, పెళ్ళికూతురి అన్నదమ్ములిద్దరికీ, తండ్రికీ మాత్రం బట్టలు కొన్నాం. మా పిల్లలకి మంచి బట్టలు కూడా కొనలేదు. పెళ్లిలో ఏ ఖర్చు వస్తుందోనన్న భయం.
గౌరి పెళ్ళికి మా తల్లి (మా పెద్దమ్మాయి) మాతో పడిన కష్టం, ఆ పిల్ల చేసిన చాకిరీ చెప్పడానికి లేదు. ఇంతా చేసి, పెళ్లి పందిట్లోకి వచ్చిన మా బంధువులూ, కావలసిన వాళ్ళూ మా పిల్లల్ని చూసి 'మంచి బట్టలైనా కట్టుకోరాదూ! నలుగురిలో అసహ్యంగా వుంటుంద'ని చిన్నబుచ్చారు. వాళ్ళు శ్రీశ్రీ పిల్లలు. ఆ రక్తమే వాళ్ళలో ప్రవహిస్తోంది. ఇటువంటి మాటలకి బాధపడి, అవమానాలకి రగిలిపోయి, కృంగిపోయే రకంకాదు. అప్పుడు మా అందరికీ గౌరి పెళ్ళి అయిపోతే చాలు అనే తపన ఒక్కటే!
'కన్యధారపోయడానికి పీటలమీద మనం కూర్చోవాలండీ' అని శ్రీశ్రీగారితో అంటే నరికిపోగులు పెడతారేమోనన్న భయం.
'ఏం దారిరా' అని నాలో నేనే సతమతమైపోతున్నాను.
వేరే ఎవర్ని కూర్చో పెట్టాలి?
మా వాళ్ళు చాలామంది వచ్చారు.
పెళ్ళి మాత్రం సాంప్రదాయసిద్ధంగా జరిపించాల్సిందే అని మగ పెళ్ళివారు హెచ్చరిస్తూనే వున్నారు. అందులో గూఢార్ధం మా ఇద్దరికీ తెలుసు.
"ఏవండీ. పెళ్ళికూతుర్ని గౌరీపూజకి తీసుకు రమ్మంటున్నారు. పిల్లని బుట్టలో కూర్చోపెట్టాలట. కన్యాదాతలు పీటలమీద కూర్చోవాలట" అన్నాను.
"పద సరోజా! వెళ్ళి కూర్చుందాం" అన్నారు.
నాకు షాక్!..."నిజంగానే!" అన్నాను ఆశ్చర్యంతో.
చుట్టుపక్కల ఎవరయినా ఉన్నారా? మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? ఏమీ పట్టించుకొనే స్థితిలో లేను. నేనేమైపోతున్నానో నాకే తెలియదు. పెద్ద గండం తప్పిందన్న సంతోషం! అమాంతంగా వారిని కౌగిలించేసుకున్నాను.
"ఇదేమిటి సరోజా!" అన్నారు.
"అది అంతేనండీ. నేనిప్పుడేమీ మాట్లాడే పరిస్థితిలోలేను. రండి వెళ్దాం" అన్నాను.
వారిని మాత్రం పట్టు పంచె కట్టుకోమన్నాను. నేను కట్టిన చీరలోనే వెళ్ళి కూర్చున్నాను.
ఆయన సరిగ్గా ఐదు నిముషాలే కూర్చుని "మిగిలిన తంతు అంతా మా ఆవిడ చేస్తుంది. నేనలావెళ్ళి సిగరెట్ కాల్చుకుంటాన"ని పందిట్లోకి వెళ్ళి కూర్చున్నారు.
ఆ తతంగమంతా అయిపోయిన తర్వాత పెళ్లి పందిరిలోకి వచ్చి వారిని పిలిచాను.
మేమిద్దరం పెళ్లి మండపంలో కూర్చున్నాం. నేను నీళ్ళుపోస్తూంటే శ్రీశ్రీగారు పెళ్ళికొడుక్కి కాళ్ళుకడిగారు.
'నీ జన్మ తరించిందయ్యా! మహాకవి శ్రీశ్రీలాంటి వారు నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నార'ని అనుకున్నాను. వారికి గౌరిమీద ఎంత ప్రేమో ఆ ఒక్క సంఘటనతోనే స్పష్టంగా తెలుస్తోంది. లేకుంటే ఈయనేమిటి అంత ఓపిగ్గా అయిదు నిముషాలైనా కూర్చోడం ఏమిటి? ఆ అదృష్టానికి నోచుకున్న గౌరిని అభినందించకుండా ఉండలేకపోయాను.
పెళ్ళి బాగా జరిపించామని, పెళ్ళివారితోపాటూ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అన్నారు.
11_11_76వ తేదీ రాత్రి 12వ తేదీ రెండు పూటలూ పెళ్ళి జరిగింది.
12వ తేదీ సాయంకాలం టీ పార్టీతో గానకచేరీ కూడా ఏర్పాటు చేశాం.
అనుకున్న ప్రకారం ఎటువంటి గొడవలూ లేకుండా పెళ్ళి జరిగిపోయింది. 'అప్పగింతలు బయలుదేరేముందు చెయ్యాల'ని అన్నారు.
తెల్లవారుఝామున నాలుగు గంటలకి ప్రారంభించాం. (అంటే 13వ తేదీ అన్నమాట).
నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా దుఃఖం ఆగలేదు. కన్నతల్లి వుండి జరిపించాల్సిన ముచ్చట్లూ, పెళ్ళీ అనుకున్నాను. నా చెల్లెలు జ్ఞాపకం వచ్చింది.
శ్రీశ్రీగారి కళ్ళు చెమ్మగిల్లాయి.
'శ్రీశ్రీ కంటతడి పెట్టడమా!' అని నాకు ఆశ్చర్యం వేసింది.
పిల్లని కారులో పెళ్ళివారితో పంపించేశాను. పిల్లతో నన్ను రమ్మని మా వియ్యంకుడు గారు శ్రీ చంద్రమౌళిగారు వారి పెద్ద కోడలు లక్ష్మీ బలవంతం పెట్టారు.
"క్షమించండి నేను రాలేన"ని మా అమ్మగారిని పంపాను.
నా రెండవ చెల్లి మిసెస్ రాజబాబు నాకు చాలా సహాయంగా వుండి పెళ్ళి పన్లలో ఒక కాపుకాచింది. పెద్ద చెల్లి స్టూడియో పన్లలో చాలా బిజీ.
అందరూ వెళ్ళాక నేను శ్రీశ్రీగారి దగ్గిరకి వెళ్ళాను.
* * *


