"ఎవరు అద్దంముందు నిల్చున్నా, 'నేను నీ ప్రతి బింబాన్ని. నువ్వు అద్దం ముందు నిల్చున్నప్పుడు కనిపిస్తాను. గోడముందు నిలబడితే కనబడను. కనబడలేదుకదా అని లేననుకుంటావేమో! ఎప్పుడూ నీ వెంటనే వుంటాను. నువ్వు ఏం చేస్తున్నదీ కనిపెడుతూనే వుంటాను. నువ్వు నవ్వితే నవ్వుతాను. ఏడిస్తే ఏడుస్తాను.
అద్దం ముందు నిలబడి నాలో నిన్ను చూసుకో.
ప్రస్తుతం నీకు నేనిచ్చే సలహా కాలాన్ని జాగ్రత్తగావాడుకో. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ కొంచెంకాలమే మంజూరు అయ్యిందని హెచ్చరిస్తున్నాను. నీ వంతు కొచ్చినకాలాన్ని పొదుపుగా వాడుకో..." అని చెపుతూ వుంటే,
"ఏమిటండీ ఇదేమైనా నీళ్ళా పాలా, పొదుపుగా వాడడానికి. అయినా అద్దంముందు మాటలేమిటండీ" అంటే "అదొక సరదా" అనేవారు.
కానీ అద్దంలో ప్రతిబింబం చెప్పిన మాటల అర్ధం గురించి ఆలోచిస్తూ వుంటే పిచ్చే ఎక్కుతుంది.
అద్దంమాట ఎలాగున్నా, ఆయన మనసు నిజంగా అద్దంలాంటిదే. పాపం! ఒక్కోసారి అతి చిన్న కోరికని కూడా తీర్చుకోలేక పోయేవారు. ఒక్కొక్కటీ కళ్ళముందు తిరుగుతున్నాయి.
వారనుకున్న విషయమో, లేక తన కోరికో నాతో చెపితే, నేను గంటల్లో నెరవేర్చే ఏర్పాట్లు చేసేదాన్ని.
1975 వ సంవత్సరంలో జనవరి రెండవ తేదీన, ఆయన పుట్టిన రోజునాడు ఒక పని చేద్దాం అనుకున్నారట. మా పెద్ద ఇల్లు అంటే రవణమ్మగారి ఇంటి ముందు వరుసగా చాలా గుడిశలున్నాయి. వాటిలో పదిపన్నెండేళ్ళ మధ్య వయస్సుగల పిల్లలు చాలామంది వున్నారు. 65గురు మగపిల్లలకీ, 65 గురు ఆడపిల్లలకీ కలిపి మొత్తం 130 కార్డులు పంచిపెట్టాలి. నూటముప్పయిదాకా సీరియల్ నెంబర్లు ఆ కార్డుల మీద వుంటాయి.
అందరూ ఒక వరసలో నిలబడితే, తన ఒకే ఒక కొడుకు బైజు (వెంకటరమణ)చేత, మనవడిచేత 'మగపిల్లలకి చాక్ లేట్లూ, ఆడపిల్లలకి గులాబి పువ్వులూ పంచిపెట్టాలనుకున్నాన'ని నాతో చెప్పారు.
"కానీ నా దగ్గర పది రూపాయలు లేకపోవడం వల్ల నేను చేద్దామనుకున్నది చెయ్యలేక పోయాను. అది నా అరవై అయిదవ జన్మదినం పోనీ 76 లో అరవై ఆరో ఏడు వచ్చింది. అంటే 1976, జనవరి రెండవ తేదీన.
ఆ రోజు, ఆ గుడిశల్లోని పిల్లల చేతనే, '66' అనే అంకెలు రాసిన అట్టలు పట్టించి ఊరేగుదామనుకున్నాను. కానీ అది కూడా చెయ్యలేకపోయాన"ని ఆయన నాతో చెప్పినప్పుడు నా ప్రాణం ఉసూరుమనిపించింది.
"ఎంతపని చేశారండీ. ఒక్కమాట నాతో అని వుంటే ఎంతో చక్కగా చేసేవాళ్ళం. దీనికేవైనా వందలూ వేలూ ఖర్చు అవుతాయా" అని ఎంతో బాధపడ్డాను.
"ఎందుకు బాధపడతావు సరోజా! మనం అనుకున్నవన్నీ అయిపోతాయేమిటి?" అన్నారు.
"అన్నీ కాకపోయినా కొన్నయినా మనకి అందుబాటులో వున్నవి నెరవేర్చుకోవచ్చు కదండీ. నాతో ఎందుకు చెప్పారుకారు?" అని గొడవ చేస్తే "నీతో చెపితే మందవల్లి అంతా కొనేసి మన ఇంట్లో పడేస్తావనే భయంతోనే చెప్పలేదు సరోజా!" అన్నారు.
అప్పుడు నేను వారిని అడిగాను. "చాక్ లెట్లూ, గులాబీ పూల వరకూ బాగానే వుంది. కానీ '66'వ నెంబరు రాసి ఊరేగడమేమిటో నాకు అర్ధంకాలేద"ని అడిగాను.
"కొందరిని ఆ అట్టలు తిరగేసి పట్టుకొమ్మంటే. '66' అనే అంకెలు '99'గా మారతాయి. తొంబై తొమ్మిది సంవత్సరాలు బ్రతకడం అంటే ఇరవై ఒకటో శతాబ్దంలోకి ప్రవేశించడం అన్నమాట. అరవై ఆరు తర్వాత ఇంకా ముప్పయి మూడేళ్ళు బ్రతకాలన్నమాట.
ఒకప్పుడు నేను 'బ్రతకడం అసాధ్యం. చచ్చిపోవడమే మంచిద'ను కున్నాను. అలా చాలాసార్లు అనుకున్నాను. కానీ ప్రతీసారీ నాలో జీవించాలనే తీవ్రకాంక్షదే పైచెయ్యి అవుతూ వచ్చింది. ఆ రోజుల్లో ఎలాగైనా బ్రతికుండాలని పించేది. కానీ ఎందుకు బ్రతకాలో తెలిసేది కాదు. ఈనాడు నేను బ్రతికుండడం నా ఒక్కడికే కాదు. నా జాతికే అవసరం" అని అన్నారు.
* * *
గద్దర్ గజ్జెలు
"అందుకోసం ఆరోగ్యం బాగా చూసుకోవాలికదండీ. ఇలా మీరు తాగడమే కాక సిగరెట్లు జోరుగా కాల్చేస్తూ వుంటే ఆరోగ్యం బాగుండేదెట్ట్టా" అని అడిగాను.
"రెండూ ప్రమాదకరమైనవేనని తెలుసు సరోజా ! కానీ ఇవి ఏవి ఎవరి అదుపుల్లో వున్నాయనేది ముఖ్యం. నేను సిగరెట్లకిగానీ మద్యానికిగానీ బానిసని కాను. ఎంతదూరం వెళ్ళినా ఎక్కడ ఆగదలుచుకుంటే అక్కడ ఆగగలను" అని అంటూ వుంటే_
"నిజంగానే అంతటివారేనండీ. ఎంతకయినా సమర్ధులు" అన్నాను.
ఓసారి నేనూ వారూ మా గుమ్మంలో అరుగులమీద చెరోవైపూ కూర్చున్నాం. (వీధి గుమ్మం అరుగుల మీద కాదు. గేటుదాటి ఇంట్లోకొస్తే మా పెద్ద గ్రిల్ గేటు ముందు రెండు అరుగులు వున్నాయి)
ఆయన ఇంట్లో వుంటే మాత్రం తువ్వాలు లేకుంటే లాగు కట్టుకొనేవారు అంతే. ఇక బనీయన్ కానీ లాల్చీగానీ వేసుకొనే పనేలేదు.
ఒక మధ్య వయస్కుడు లోనికి వచ్చి, పసుపు పట్టించి నామాలు పెట్టిన ఒక చెంబు చూపించి 'గోవిందా గోవిందా' అంటూ వారి ముందు ఆ చెంబు పెట్టాడు.
అప్పుడే సిగరెట్ వెలిగించి ఆరిపోయిన అగ్గిపుల్లని ఆ చెంబులో వెయ్యబోయారు శ్రీశ్రీగారు. అతను ఆ చెంబు వెనక్కి లాక్కొని వారిని చురచుర చూసి వెళ్ళిపోయాడు.
"ఎంత నాస్తికులయినా మరీ ఏవిటండీ ఆ పనులు" అన్నాను.
"నీకు తెలియదు ఊరుకో సరోజా! మళ్ళీ ఈ పరిసర ప్రాంతాలకిరాడు. అదే ఐదు పైసలు నువ్వు వెయ్యి ఈ ప్రాంతాన్ని వదలడు. దేవుడి పేరుతో ముష్టి. ఇదొక వ్యాపారం. ఇలాంటి వాళ్ళకి డబ్బులు వేయడం అంటే 'ఇలాగే అడుక్కు తినండిరా నాయనా' అని వాళ్ళని ఎంకరేజ్ చెయ్యడం అన్నమాట. అదే నాకు నచ్చదు.
వాడు ఆ చెంబు లేకుండా వచ్చి 'ఆకలి వేస్తోంది బాబూ' అని అడిగి వుంటే ఐదు పైసలు కాదు ఐదు రూపాయలిచ్చి 'కడుపు నిండా తిను నాయనా! కానీ ఇలా అడుక్కొని మాత్రం తినకు. గట్టిగా వున్నావు. చక్కగా ఒళ్ళొంచి పని చేసుకొని మరీ తినమ'ని నాలుగు చీవాట్లు కూడా పెట్టి పంపేవాడ్ని" అన్నారు.
ఇలా గతానికి సంబంధించిన ఆలోచనల్లో మునిగిపోయిన నాకు కాలింగ్ బెల్ చప్పుడు వినబడలేదు. వంటింట్లో నుండి వంటావిడ పరుగెత్తుకొచ్చి "అమ్మా! అయ్యగారొచ్చారమ్మా" అని చెప్పింది.
"వెళ్ళి తలుపు తియ్యండి మామీ !" అన్నాను.
ఆయన లోపలికి వచ్చి "గొంతు చించుకొని 'సరోజా సరోజా' అని అరుస్తుంటే వినిపించలేదూ ! పట్టపగలే కలలు కంటున్నావేమిటి?" అని అడిగారు.
"ఆఁ కల అనే అనుకోవచ్చు. గతమంతా జ్ఞాపకం వస్తూంటే దాన్నే మరోసారి అనుభవిస్తూ కూర్చున్నా" అన్నాను.
"చెప్పాను కదా! నువ్వు ఏ పదిహేనవ సెంచరీలోనో పుట్టాల్సినదానివి. ఇప్పుడు పుట్టి నా ప్రాణం తీస్తున్నావు" అన్నారు.
"పోనీ అలాగే అనుకోండి. నావి పాతకాలపు బుద్దులు. పాతకాలపు ఆలోచనలు. పాతకాలపు చాదస్తాలు. నేను పాతకాలపు మనిషిని. ఒక విధంగా అందువల్లే మీరు బతికిపోయారు. సరేకానీ ముఖం అలా కళకళలాడిపోతోంది. ఏవిటి సంగతి?" అని అడిగాను.
"చెప్పుకో చూద్దాం" అన్నారు.
"అబ్బ! నా వల్ల కాదు కానీ మీరే చెపుదురూ" అన్నాను.
"మనం చైనా వెళుతున్నాం" అన్నారు.
"మనమా? నేను కూడానా? భలేవారే. నా మాటకేం గానీ నిజంగా మీరు చైనా వెళుతున్నారా" అన్నాను.
"అవును సరోజా! నాకు అబద్ధం చెప్పడం చేతకాదని నీకు తెలుసుగా? పైగా ఇందులో అబద్దానికేం వుంది?" అన్నారు.
"వివరంగా చెప్పండి ప్లీజ్" అన్నాను.
"నాకు పందొమ్మిది వందల యాభై నాలుగులోనే రష్యా వెళ్ళడానికి అవకాశం కలిగింది సరోజా! కానీ నేనొకటి తలిస్తే, చక్రవర్తుల రాజగోపాలాచారిగారు మరొకటి తలచడంవల్ల ఆ అవకాశం చేజారిపోయింది. అవి హిందీ చీనీ భాయీ భాయీ రోజులు. ఆంధ్ర రాష్ట్రం అప్పటికింకా ఏర్పడలేదు.
ఆ రోజుల్లో కమ్యూనిస్టుపార్టీ నలభై అయిదుగురు సభ్యులతో బలిష్టమైన ప్రతిపక్ష పార్టీగా వుండేది. కమ్యూనిస్టులు తనకు ప్రధాన శత్రువులకి రాజాజీ సగౌరవంగా చాటేవారు.
నేను కమ్యూనిస్టుల ఓటుతో ఎగువ సభకు ఎన్నికైనవాడ్ని. అప్పుడే చైనాకు వెళ్ళే సౌహార్ద ప్రతినిధివర్గంలో సభ్యుడిగా నాకు ఆహ్వానం వచ్చింది.
ఈ విషయం రాజాజీకి చెప్పి పాస్ పోర్ట్ విషయమై కలక్టర్ కి సిఫారసు చేయవలసిందిగా కోరాను.
'దానికేం? తప్పకుండా చేస్తాన'ని అన్నారాయన. ఆ మాటలు నమ్మి వెయ్యి రూపాయల ఖర్చుతో ఉన్ని దుస్తులు కుట్టించడం మొదలైన పనులన్నీ చేశాను. తీరా ఆఖరి క్షణంలో నా పాస్ పోర్ట్ మంజూరుకాలేదు. దానికి కారకులెవరైనదీ నాకు అనుమానం వున్నా, సాక్ష్యాదారాలు లేక ఊరుకున్నాను. నాటి నుంచి నిన్న మొన్నటిదాకా నా చైనా యాత్ర ఒక సాధ్యంకాని స్వప్నంలాగే మిగిలిపోయిందనుకున్నాను.


