అద్దంతో సంభాషణ
"నువ్వూ వెళ్ళలేకపోయావా సరోజా!" అని అడిగారు శ్రీశ్రీగారు.
"మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం నాకిష్టంలేదండి. అదీకాకుండా మనడ్యూటీ మనం చేసేశాం. పెద్దావిడ మా అమ్మ వెళ్ళింది. పెళ్ళికూతురు తండ్రి, అన్నదమ్ములూ వెళ్ళారు. అంతకన్నా ఇంకేం కావాలి?
అదిసరేకానీ ఒక్క విషయం దాచకుండా చెప్పాలి. మీరు కంటతడి పెట్టడం నాకాశ్చర్యం వేసింది. గౌరి అత్తవారింటికి వెళ్ళిపోతూవుంటే నిజంగానే మీకు బాధ కలిగిందా?" అని అడిగాను.
"ఏమిటాప్రశ్న సరోజా! అత్తవారింటికి వెళ్ళడం కోసమేగా పెళ్ళి చెయ్యడం. గౌరి నాకొచ్చే ఉత్తరాలన్నీ జాగ్రత్తచేసేది. పిల్లలంతా స్కూలుకి వెళ్ళిపోతే నాకొచ్చే టెలిఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేది.
నేనింటికి రాగానే 'అప్పా! తిలక్ గారు ఫోన్ చేశారు. విశ్వేశ్వరరావుగారు ఫోన్ చేశారు. హైద్రాబాద్ నుంచి ఏ.వి.రావుగారు ట్రంకాల్ చేశా'రని చెప్పేది. 'రేప్పొద్దుటికి ఇడ్లీ బియ్యం అయిపోయాయి. అయిదు రూపాయలిమ్మ'ని అడిగేది. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి కంట తడిపెట్టాను" అన్నారు. "శ్రీశ్రీగారు కూడా ఏడుస్తారన్నమాట" అని అడిగాను.
"ఏమోకానీ ఆ ఏడుపుమాత్రం కేవలం దుఃఖంతో కూడుకున్నది కాదు. దాని వెనకాల ఎంతో ఆనందం వుంది సరోజా! సరే మనం కూడా ఇంటికి పోదాం పద" అన్నారు.
"పిల్లల్నందర్నీ లేపుతాను. వాళ్ళని తీసుకొని మీరు వెళ్ళండి. నేను సామాన్లన్నీ తీసుకొస్తాన"న్నాను.
నేనూ, మావారూ గౌరి పెళ్ళయ్యాక మా ఇంట్లో చాలా విషయాలు చక్కబెట్టుకోవాలనుకుంటూ దాని పెళ్ళికోసమే ఎదురుచూశాం.
గౌరి పెళ్ళితో నాలో ఒకవిధమైన తెగింపు భావం ఆవరించింది. ఎక్కడున్నవాళ్ళని అక్కడ వుంచితే మంచిదనిపించింది. జీవితంలో నేను ఎన్నివిధాల ఎంత నష్టపోతున్నానో తెలుసుకో గలిగాను.
గౌరి అత్తవారింటికి వెళ్ళిపోయిన రెండురోజుల తర్వాత మా మరిదిగారికి శ్రీశ్రీగారు వాహిని కృష్ణమూర్తి ద్వారా బ్రాండ్ లేండ్స్ హోటల్లో ఉద్యోగం ఇప్పించారు.
ఆ హోటల్ ప్రొప్రయిటర్ గారికి శ్రీశ్రీగారు బాగా తెలుసు. తెలియడం మాత్రమేకాదు. మంచి స్నేహితులు కూడా. వారు భీమారావు (మా మరిది)గారికి ఉద్యోగంతోపాటు అక్కడే వుండడానికి ఇల్లు కూడా ఇచ్చారు. దాంతో తన కొడుకులిద్దర్నీ తీసుకుని ఆయన వెళ్ళిపోయారు.
చాలాకాలం తర్వాత పెద్ద రిలాక్స్ ఫీలింగ్ వచ్చింది. నేను మాత్రం గౌరి పెళ్ళి జరగడం పెద్ద ఘనకార్యం చేసినట్టు అనుకున్నాను.
ఆడపిల్ల బరువుతీరింది. మగపిల్లలతో ఎక్కడున్నా ఎలాగున్నా అట్టే బాధ వుండదని, భీమారావుగారు కూడా సంతోషించారు.
మా పరిస్థితులు మళ్ళీ మలుపులు తిరిగాయి. కోలుకోవడం ప్రారంభించాం. ఇంటి ఆర్ధిక పరిస్థితులు మెరుగనుకునే సమయానికి అప్పు ఇచ్చిన వాళ్ళ గొడవ తగులుకుంది. 'ఇక ఈ జీవితానికింతే' అనుకున్నాను.
ఇంట్లో ఎవరూలేరు. వారు కంపెనీకి వెళ్ళిపోయారు. ఆలోచనలతో నా మనస్సు గతంలోకి వెళ్లిపోయింది.
ఎన్ని కష్టాలున్నా, ఎంత ఇబ్బందిగావున్నా వారినోటంట ఏదైనా ఒక మాటవస్తే మాత్రం అప్పోసప్పోచేసి, లేదా వస్తువులు తాకట్టయినా పెట్టేసి నెరవేర్చేసేదాన్ని. మొదట్లో మొహంవాచేలా చివాట్లు పెట్టినా తర్వాత మెచ్చుకొనేవారు.
ఒకసారి "సరోజా! గదిలో నావెనకాల అద్దం ఒకటి పెడితే ఎలాగుంటుంద"ని అడిగారు.
"అదేమిటి? వెనకాల అద్దం ఏమిటండీ" అని అడిగాను.
అంటే అంతకుముందే 65వ సంవత్సరంలోనే చాలా పెద్ద అద్దాలు రెండు కొన్నాను. ఒక్కొక్కటి ఆ రోజుల్లో 600 రూపాయలు పెట్టి కొన్నాను. పెద్ద పేలెస్ లలో వుండే అద్దాల్లాంటి పెద్ద అద్దాలవి.
నాకు ఎక్కువగా అద్దం చూసుకొనే అలవాటు లేకపోయినా అద్దాలంటే మాత్రం చాలా సరదా. ఇంటినిండా అద్దాలు పెట్టడమంటే మరీ సరదా. ఒక అద్దం మా హాల్ లో పెట్టేశాను. రెండవది నా స్నేహితురాలనబడే ఒక అమ్మాయి కాజేసింది. అదొక పెద్దకథ. అది ఇక్కడ అనవసరం. శ్రీశ్రీగారు అద్దానికి ఎదురుగుండా కూర్చొని కావాలని గట్టిగా దమ్ములాగేవారు. రెండు పెగ్ లు బిగించి 'లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అని దాని ముందు అడుగులు వేసేవారు.
"గురువుగారికి అద్దం అంటే ఇష్టమా ఏమిటి?" అని అడిగితే నవ్వేసేవారు.
ఆ అద్దంముందే టేబిల్, బ్రాందీ సీసా, గ్లాసూ పెట్టమనేవారు. అద్దం ముందు కూర్చుని తాగేవారు.
ఒక్కోసారి నన్ను పిలిచి "చూడు సరోజా! నాకు కుడివైపున వున్న ఈ టేబిలూ గ్లాసూ అద్దంలో ఎడమవైపున ఉన్నాయి. ఎడమచేత్తో సిగరెట్ కాలుస్తున్న శ్రీశ్రీ అద్దంలో కుడిచేత్తో దమ్ములాగుతున్నాడు చూడు" అనేవారు.
"వెనకాల కూడా అద్దం వేస్తే బాగుంటుంది" అని మరోసారి అన్నారు. అసలే అద్దాలపిచ్చి నాకు. ఇక ఆయన నోటింట ఆమాట రెండవసారి వచ్చిందంటే_ఊరుకుంటానా? ఇరవై నాలుగ్గంటల్లో ఆ పెద్ద అద్దానికి ఎదురుగా అంతపెద్దది కాకున్నా అలాగని మరీ అంతచిన్నది కూడా కాని మరో అద్దాన్ని కొనేసి వేసేశాను.
శ్రీశ్రీగారు గదిలో అడుగు పెడుతూనే "అబ్బబ్బో! అద్దం కొనెయ్యడమూ తగిలించెయ్యడమూ కూడా అయిపోయిందేమి"టంటూ. "ఏందారి సరోజా! నీతో ఏమాటైనా అనడానికి భయమే ! వెంటనే ఆ పని చేసేస్తావు. ఇలాగయితే ఎలా చెప్పు? నీలో వున్న సద్గుణమూ దుర్గుణమూ కూడా అదే. ఒక పని చెయ్యాలంటే చేసి తీరతావు" అని మెత్తగా మందలించినా చాలా సంతోషించారు.
ఆ అద్దాలు రెండూ వారి జ్ఞాపకంగా ఇప్పటికీ సురక్షితంగా వున్నాయి. రెండు అద్దాలకి మధ్య అంటే గదిలో వెనక అద్దానికీ, హాల్లో ముందు అద్దానికీ మధ్య_తలుపు వుంది ఆ తలుపు తీసేసి, రెండు అద్దాలకీ మధ్య కుర్చీ వేసేదాన్ని.
అద్దంలో కనిపించే ప్రతిబింబాల గురించి వారు చాలా గమ్మత్తుగా చెప్పేవారు. ఆయన చెప్పేమాటలు ఒకటి రెండు మాత్రమే రాస్తాను.


