Next Page 

నీరజ పేజి 1


                                         నీరజ
                                                                                       --సి. ఆనందరామం

                        
    

    తలుపులు వేసి ఉన్నాయి. ఆ మూసినా తలుపులవైపు చూస్తూ అలా నిలబడి పోయింది నీరజ.
    తప్పదు....కదలాలి! ఆ తలుపులు తట్టాలి!
    శక్తినంతా కూడదీసుకుని నడిచింది -తలుపు తట్టింది.
    "ఎవరు?" అని విసుగ్గా వినిపించింది. వర్దనిస్వరం-ఒక్కనిముషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
    నీరజనుచూసి నిర్ఘాంతపోయింది వర్ధని.
    "నువ్వు....నువ్వు..." అంది.
    "వచ్చేసాను పిన్నీ! బయటపడి వచ్చేసాను!"
    పొంగివస్తోంది ఏడుపు నీరజకి -కానీ మరొకరిముందు ఏడవటం నీరజకు అలవాటులేదు. వర్ధనిముందు అసలు ఏడవదు.
    వర్ధని ఏంమాట్లాడలేదు. దెయ్యాన్ని చూస్తున్నట్లు నీరజను చూస్తూ నిలుచుంది-లోపలకు రమ్మనికూడా అనలేదు -నీరజ తనే లోపలకు నడిచింది.
    సందడికి పడుకున్నవాడు లేచివచ్చాడు కామయ్య. నీరజనుచూసి సంభ్రమంగా "వచ్చావా? ఎలా వచ్చావ్? ఎక్కడ చిక్కుపడ్డావ్? పోలీసులు విడిపించారా?" అన్నాడు. "పోలీసులుకాదు -నేనే తప్పించుకోగలిగాను..."
    "ఎలా?"
    వర్ధని కోరచూపులతో కామయ్యమాటలు ఆగిపోయాయి.
    "అవును! నువ్వు తప్పించుకోగలిగావు - వాళ్ళ పనితీరాక అవతలపారేస్తే తప్పించుకుని వచ్చావు - ఇంక మా తిప్పలు మొదలు! నాకు పెళ్ళికావలసిన ఇద్దరు పిల్లలున్నారు!"
    వర్ధని ఒక్కొక్కమాట ఒక్కొక్క గుండుదెబ్బలా తగిలింది నీరజకు.
    ఈనాటి వర్ధని మాటలలో తను ఎదుర్కోబోయే సమస్య వికటాట్టహాసం చేస్తూ ప్రత్యక్షమవుతోంది-అందుకే నీరజ భయపడుతోంది-బాధపడుతోంది-
    క్షణాలలో నీరజ వచ్చినవార్త చుట్టుపక్కలకు వ్యాపించింది - ఇలాటి వార్తలు వాటికవే రెక్కలువచ్చినట్లు వ్యాపిస్తాయి.
    అందరూ వచ్చేసారు...
    నీరజ పై ప్రాణాలు పైనేపోయాయి - ఇప్పుడు వీళ్ళందరికీ తను సమాధానాలు చెప్పుకోవాలి! పొమ్మనటానికి లేదు - అది మర్యాద కాదు! ఇది సమాజం!
    సుధ నీరజను కౌగలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంది - ఏ కారణంగానో నిజంగానే కన్నీళ్ళు వచ్చాయి ...
    "ఎంతపని జరిగింది నీరూ! ఇలా మళ్ళీ మా కళ్ళబడతావని అనుకోలేదు ..."
    ఆగి కన్నీళ్ళు తుడుచుకుంది.
    "అయితే నీ గొలుసు ... మొన్న కొత్తగా చేయించుకున్నావు చూడు, అది పోయినట్టేనా? ఎంత బాగుందో! తలుచుకుంటే నాకే బాధగా ఉంది..."
    "అది పోలేదు!"
    "పోలేదూ?"
    ఆశ్చర్యంగా అడిగింది సుధ -ఇందాక లేనిబాద ఇప్పుడు స్పష్టంగా వినిపించింది ఆ గొంతులో...
    "ఆ గొలుసుతప్ప నీ దగ్గిరేముంది తీసుకోవటానికి?"
    "ఏమీలేదు -ఏమీ తీసుకోలేదు -"
    "అయితే కేవలం మానభంగంచేసి పంపేసారన్నమాట? అంతేనా?"
    "ఏ భంగమూ ఎవరూ చెయ్యలేదు!"
    అంతవరకూ కుతూహలంగా వింటున్న కామాక్షమ్మ కల్పించుకుని చిరునవ్వుతో అంది -
    "నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నీరజా! అవును! అలాగే సమాధానం చెప్పాలి ! లేకపోతే ఎవరైనా పాడయిపోయామని చెప్పుకుంటారా? పాడయిపోయిన ఆడదాని బ్రతుకేముంది? చిరిగిన విస్తరి....చూడు, ఎవరడిగినా ఇలాగే చెప్పు!...ఇంతకీ ఆ దొంగలు ఎక్కడికి తీసికెళ్ళారు నిన్ను? ఎక్కడుంచారు? ఎలా వచ్చావ్? వాళ్ళే దింపారా? నువ్వే వచ్చావా?"
    తన శ్రేయోభిలాషిణికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక పొంగి వచ్చే జుగుప్సను దిగమింగుతూ నవ్వింది నీరజ -ఏడవటం ఇష్టంలేక...
    సావిత్రమ్మ అభిమానంగా నీరజ దగ్గరకు జరిగింది-రహస్యం చెప్పింది.
    "ఒక్కమాట! డాక్టర్ చేతిలో ఒక వందో, రెండు వందలో పారేస్తే, నువ్వు చెడిపోలేదని సర్టిఫికేట్ ఇస్తాడు - ఎవడూ నోరెత్తలేడు - నీకు లక్షణంగా పెళ్ళయిపోతుంది. వాళ్ళమీద కోపంతో కేసుపెట్టావంటే నీ బ్రతుకే బజారున పడుతుంది..."
    ఇంకా గుసగుసగా ఏదో వాగాబోతున్న సావిత్రమ్మనుచూచి లెంపకాయకొట్టాలనిపించింది నీరజకు.
    అది చేతకాక అక్కడినుంచి వెళ్ళిపోవాలని లేచి నిలబడింది - ఎక్కడికి వెళ్తుంది? వర్ధనిచుట్టూ మరో పెద్ద గుంపు ఉంది - ఆబగా కుతూహలంతో వాళ్ళు అడిగే ప్రశ్నలకు తన శాయశక్తులా ఆ కుతూహలం పెంపొందిస్తూ సమాధానాలు చెప్తోంది వర్ధని... మధ్యమధ్యలో కళ్ళు తుడుచుకుంటోంది!
    "ఇది తిరిగి వచ్చిందని ఆనందించనా ? మొత్తం కుటుంబానికే అప్రతిష్ట వచ్చిందని బాధపడనా?"    
    అని వాళ్ళనే అడుగుతోంది -
    వాళ్ళు లోలోపల ఆనందిస్తూ పైకి నిట్టూరుస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు ...
    పోలీస్ ఆఫీసర్ మురళి మరో ఇద్దరు కాన్ స్టేబుల్స్ తో వచ్చాడు -
    పోలీసులను చూడగానే శ్రేయోభిలాషిణులందరూ చెల్లాచెదురైపోయారు...
    నిలువునా వణికిన నీరజ 'తప్పదు - తప్పదు' అనుకుని పళ్ళుబిగబట్టి కూర్చుంది.
    "కర్మ! చివరకు పోలీసులు ఇంటిమీదకు తయారయ్యే దశ పట్టింది -" అని గట్టిగా స్వాగతం పలుకుతూ వెళ్ళిపోయింది వర్ధని...
    "మిస్! నీరజ మీరేకదూ!"
    నీరజనూ, పరిసరాలనూ జాగ్రత్తగా పరిశీలిస్తూ అడిగాడు మురళి.
    "అవును!"
    ఆ కంఠంలో స్థైర్యానికి లోలోపల కొంచెం ఆశ్చర్యపోయాడు మురళి...
    "సరిగ్గా వారంరోజుల క్రిందట ఒక గేంగ్ ఎత్తుకుపోయింది మిమ్మల్నే కదూ!"
    "అవును!"
    "ఎలా ఎత్తుకుపోయారు?"
    "షాపింగ్ చేసుకుని బస్ కోసం, బస్ స్టాండ్ దగ్గర నించున్నాను. నాతోపాటు మరికొందరు కూడా ఉన్నారు అందరిమధ్యనుండీ నన్ను ఎత్తుకుపోయి కారులో తీసుకుపోయారు..."
    "ఎవరూ ఏమీ చెయ్యలేదా?"
    "నేను అరిచాను - మరికొందరు మూగారు. వాళ్ళదగ్గర ఆయుధాలున్నాయి. ఎవరిమటుకు వాళ్ళే భయపడిపోయారు?"
    "అది కారా? టాక్సీయా?"
    "ఏమో! అవన్నీ గుర్తించేస్థితిలో లేను నేను!"
    "కారు నంబర్ కొందరు నోట్ చేసారు. కానీ అది రాంగ్ నంబరని తేలింది! అది ఎలాంటి కారో తెలుసుకోగలిగితే మాకు ఉపయోగిస్తుంది..."
    "అయామ్ సారీ! నన్ను కారులో కూచోబెట్టటమూ, కళ్ళకు గుడ్డకట్టడమూ, అన్నీ ఒకదానివెనుక ఒకటి జరిగిపోయాయి - నాకు పెనుగులాడటానికి కూడా అవకాశం లేకపోయింది-"
    "వాళ్ళు ఎందరు?"
    "అయిదుగురు!"
    "ఎక్కడకు తీసికెళ్ళారు?"
    "అది ఒక హోటల్ కావచ్చు- సరిగ్గా చెప్పలేను!"
    "ఈ వారంరోజులూ అక్కడే ఉన్నారా?"
    "అవును!"
    "వాళ్ళు మిమ్మల్ని ఏమీ బాధించలేదా?"


Next Page 

WRITERS
PUBLICATIONS