Next Page 

కదిలే మేఘం పేజి 1


                          కదిలే మేఘం
                                               ---కొమ్మూరి వేణుగోపాలరావు

                     
    

    ...రాజా హాస్పిటల్ హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలో ఏ యితరచోట్లా లేని అత్యంతాధునికమైన చికిత్సా విభాగాలతో, ఆయా శాఖలలో ప్రవీణులైన డాక్టర్లతో కొన్ని కొట్లరూపాయలలతో ప్రారంభించబడి, కొద్దిరోజులకే గొప్ప పేరు తెచ్చుకుంది. జనరల్ హాస్పిటల్ లో కూడా లేని అద్భుత సౌకర్యాలెన్నో అక్కడ వున్నాయి.
    ఆమాన్యులకు అందుబాటులో లేనిమాట నిజమే కాని-అక్కడి ఫీజుకు తట్టుకోగలిగినవారు దేశంలో ఎక్కడెక్కడ్నుంచో వచ్చి ట్రీట్ మెంట్ తీసుకువెడుతూ వుంటారు.
    ఆ హాస్పిటల్ లొ సెకండ్ ఫ్లోర్ లో వున్న యిరవై మూడో నెంబర్ గదిలో రాత్రి పదకొండు గంటల వేళ మహేష్ బెడ్ మీద పడుకుని వున్నాడు.
    గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది.
    తలుపు దగ్గర అలికిడయింది. మహేష్ నిద్రపోవటంలేదు. తలత్రిప్పి చూశాడు.
    "ఎవరూ?"
    జవాబులేదు. బెడ్ లైట్ వెల్తుర్లో ఓ ఆకారం స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలకు రావటం కనిపించింది.
    "ఎవరు?" అన్నాడు మళ్ళీ.
    "నేను...." ఓ మృదువైన కంఠం.
    వెంటనే గుర్తుపట్టాడు.
    "సునందా? నువ్వా.... ఈ రాత్రివేళ"
    "ఏం రాకూడదా?"
    "అలా అని కాదు...."
    "మొదట లైట్ ఎక్కడుందో చెప్పు. నాకేవీ కనబడ్డంలేదు."
    "అక్కడ డోర్ కు ఎడమవైపు, ఆ వరసలో మొదటి స్విచ్."
    సునంద తడుముకుంటూ స్విచ్ నొక్కింది. గదంతా మెర్క్యురీ లైటు వెలుగుతో నిండిపోయింది.
    "మైగాడ్! ఏమిటంత చిక్కిపోయావు?"
    మహేష్ నవ్వాడు. "అంత ఏమీ చిక్కిపోలేదులే. నామీద నీకున్న అభిమానం అట్లా అనిపింపజేస్తుంది."
    "నీమీద నాకు అభిమానమా? ఉందని ఎవరు చెప్పారు?"
    "లేదా? లేకపోతే మరీ మంచిది. ఎందుకంటే నామీద అభిమానం లేనివారినే నేనెక్కువగా అభిమానిస్తాను"
    సునంద నవ్వింది.  నువ్విప్పుడు ముత్యాల్లాంటి ఆమె పలువరస తళుక్కుమని మెరిసినట్లయింది.
    గదిలోవున్నా ఫేముకుర్చీని అతనికి దగ్గరగా లాక్కుంది. "అలా విముఖత ప్రదర్శించటమే నీలోవున్న గొప్ప ఆకర్షణ!"
    మహేష్ మాట మార్చటానికన్నట్లుగా "ఈ సమయంలో సాధారణంగా విజిటర్స్ ని ఎలౌ చెయ్యరే. నువ్వు ఎలా రాగలిగావు?" అన్నాడు.
    "నన్నెవరాపుతారు? ఆపితే ఆగేదానిలా కనిపించి వుండను. గేట్ మేన్ గానీ, క్రిందవున్న సిస్టర్స్ గాని, నన్ను చూసి ఏమీ మాట్లాడలేదు"
    గోడవారగా పెట్టబడి వున్న బ్రీఫ్ కేస్ మీద అతని దృష్టిపడింది. "ఏమిటి? రైలుదిగి సరాసరి యిక్కడికే వచ్చేశావా?"
    "అంతేమరి. అంతకన్నా ఏంచెయ్యను" నువ్వు యింట్లో లేవని తెలుసుగా"
    "అసలు నేనిక్కడ వున్నాననీ, యిదంతా ఎవరు చెప్పారు?"
    "చంద్రం లెటర్ రాశాడు. వెంటనే బయల్దేరి వచ్చేశాను."
    ".....నీ హజ్బెండ్ కు ఏమని చెప్పావు?"
    "ఏం? నిజమే చెప్పాను. నీ దగ్గర కేనని"
    "నా పేరు ఆడపెరుగా మార్చేశావా?"
    సునంద కిలకిలమని నవ్వింది. "మా ఆయన అంత అనుమానం మనిషని నీ ఉద్దేశమా?"
    "ఉద్దేశం కాదు. ఉన్న నిజం"
    "సరే ఏదో చెప్పాను. సరేనా?"
    "మహేష్ ఆమెముఖంలోకి చూస్తున్నాడు. చాలా దూరం ప్రయాణం చేసి రావటంవల్ల కనబడుతోన్న అలసటా, చెదిరివున్న ముంగురులూ, నలిగివున్న చీరె- అయినా ఎంతో అందంగా గోచరిస్తున్నది.
    "మహేష్!"
    "ఊ?"
    "అసలేమిటి నీ సుస్తీ?"
    "సుస్తీలేదు, ఏవీలేదు. ఎందుకో కొన్ని రోజులబట్టీ నీరసంగా వుండి యింట్లో కుదరక హాస్పిటల్లో చేరాను. చంద్రం ఊరికినే కంగారుపడి హడావుడి చేస్తున్నాడు"
    "చాలా సీరియస్ అని రాశాడు."
    "వాడి మొహం, మొదట్నుంచీ వాడి తత్వం తెలుసుగా. అయిన దానికీ కానిదానికీ కంగారు పడే రకం"
    "కాదు. నువ్వబద్దం చెబుతున్నావు. నిన్ను చూస్తోంటే ఏదో పెద్ద డిసీజే అయి వుంటుందనిపిస్తోంది"
    "అదేం లేదు. రెస్ట్ కోసం చేరాను. ఒకరకంగా చెప్పాలంటే చేంజ్ కోసం."    
    "దేనినుంచి ఛేంజ్?"
    అతనేం మాట్లాడలేదు.
    "ఓ విషయం అడిగేదా?"
    "నువ్వెమడుగుతావో నాకు తెలుసు"
    "సరే చెప్పు ఎందుకలా జరిగింది?"
    ".....తెలీదు"
    "అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు సింపుల్ గా తెలీదంటే నమ్ముతాననుకోకు. హరిణీ, నువ్వూ అంత గాఢంగా ప్రేమించుకుని, అష్టకష్టాలూ పడి ఓదగ్గరగా చేరి- యిప్పుడలా విడిపోయారంటే సామాన్యమైన సంగతేమీ కాదు"
    "నిజంగా....నాకూ అర్ధంకావటంలేదు"
    "అర్ధంకాకుండానే యింత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారా?"
    "పెద్ద పెద్ద నిర్ణయాలు....మనకి మనం అర్ధమయేలోపలే తీసుకోబడుతూ వుంటాయి"
    "కావచ్చు. నువ్వు చాలా తెలివైనవాడివి"
    "తెలివైనవాడు ఓడిపోకూడదని ఎక్కడుంది?"
    సునంద ఏమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దమావరించింది.
    "సునందా! అంతదూరం నుంచి శ్రమపడి నన్ను చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞున్ని. ఇక్కడ హాస్పిటల్లో ఎంతసేపని వుండగలవు? ఇంటి తాళంచెవి ఒకటి నాదగ్గరా ఒకటి చంద్రం దగ్గరా వుంటాయి. ఇక్కడిదిస్తాను. వెళ్ళి ఇంట్లో రెస్టు తీసుకుని రేప్రొద్దుట వద్దువుగాని" అన్నాడు మహేష్.
    "వెళ్ళను. నిన్నిలాంటి స్థితిలో వొంటరిగా విడిచి ఇంటికి వెళ్ళలేను. ఇక్కడే వుంటాను"

Next Page