నాగమ్మకు, చాలాకాలం వరకు సుబ్బారాయుడు పార్వతిని తన ఇంటి కోడలుగా చేసుకుంటాడని ఆశ ఉండేది. కాని వాళ్లు కట్నాల కోసం సంబంధాలు గాలిస్తూండటం చూసిన ఆమె ఆ ఆశ పోయింది. రెండో అన్నయ్యా, మూడో అన్నయ్యా ఏనాడో బస్తీలో కాపరాలు పెట్టారు. చలపతికి పార్వతిని చేసుకుంటే బావుణ్ణు! చలపతి పార్వతంటే ఒకప్పుడు పడి చచ్చిపోయేవాడు. తన పిచ్చి కాకపోతే తన ఆలోచనలకు అర్ధం వుందా? ఇప్పుడు చలపతి చిన్నప్పటిలా వున్నాడని తను ఎలా అనుకోగలదు? తన కళ్ళముందే తన తోడబుట్టినవాళ్లు ఎంత మారిపోయారు? ఇద్దరి ఆస్తికి వారసుడై, ఇద్దరి తల్లులకు ముద్దుబిడ్డగా పెరిగే చలపతి తన కూతురు పార్వతిని చేసుకుంటాడని ఆశించడం ఏమిటి?
"కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తావు నాగమ్మ వదినా?"
"ఈపాటికి ఇద్దరు బిడ్డల తల్లి కావల్సింది! పాపం, ఇంతవరకూ పెళ్ళే కాలేదు."
"దమ్మిడీకి తికానాలేనివాళ్ళకు ఇంద్రుడూ చంద్రుడూ కావాలంటే ఎక్కడనుంచి వస్తాడమ్మా! లక్షణంగా ఆ భద్రయ్యకు ఇచ్చి సుఖపడక?"
"ఈ విధంగా ఓ వైపు నాగమ్మను లోకులు కాకుల్లా పొడుస్తూనే వున్నారు.
లోకం చేసే ఈ కాకిగోల అహర్నిశం నాగమ్మ చెవుల్లో గింగురుమంటూనే వుంది.
"ఏం అన్నయ్యా! అలా ఊరుకుంటే ఎట్లా? పార్వతి పెళ్ళిమాట ఏంచేశావ్?" అంది ఒకరోజు నాగమ్మ అన్న సుబ్బారాయుణ్ణి నిలదీసి.
"ఎక్కడ చూడమంటావమ్మా?" అన్నాడు అరక కడుతూ సుబ్బారాయుడు.
"అట్లా అంటే ఎలా అన్నయ్యా? పిల్లను ఇంకా ఎంత కాలం ఇంట్లో కూచోపెట్టుకుంటాం?" ఆమె కంఠంలో కోపం, దుఃఖం కూడా ఉబికి వచ్చాయి.
"నన్నేం చెయ్యమంటావమ్మా! దమ్మిడీ కట్నం లేకుండా ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావటం ఎంత కష్టమో నువ్వు అర్ధం చేసుకోవాలి."
"అన్నయ్యా!" అతి దీనంగా వుంది నాగమ్మ కంఠం.
సుబ్బారాయుడు నాగమ్మ ముఖంలోకి చూసాడు.
"అన్నయ్యా! నీ కిద్దరు కొడుకులున్నారు..." అభిమానం గొంతుకడ్డంపడగా మాటలు పెగల్లేదు.
"నాదేముందమ్మా! మీ వదిన ఒప్పుకోదు. పైగా వున్నదంతా ఖర్చుపెట్టి వాళ్ళకు చదువులు చెప్పించాను. నీ కూతుర్ని చేసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చిప్ప చేతికివ్వాల్సిందే" అంటూ ఎడ్లను అదిలించి ముందుకుసాగాడు సుబ్బారాయుడు.
నాగమ్మ వెనకే నడుస్తూ అంది: "నువ్వెంత మారిపోయావు అన్నయ్యా! ఒకప్పుడు నేను కింద నడిస్తే అరిగిపోతా ననుకొనేవాడివి. నేను కొంచెం కూడా కష్టపడటాన్ని చూడలేకపోయేవాడివి. అలాంటి అన్నయ్య ఏమయిపోయాడు?" నాగమ్మ ఇంతకాలంగా హృదయంలోనే దాచుకున్న ఆవేదన మాటల్లో ధ్వనించింది.
సుబ్బారాయుడు నిలబడిపోయాడు. ముఖంలో లీలగా విషాదరేఖ కనుపించి ఇట్టే మాయమయింది, ఎదురుగా వస్తున్న భార్యను చూడగానే!
"పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు, ఆ భద్రయ్యకు ఇచ్చి చెయ్యి." పెద్దగా భార్యకు వినిపించేలా అనేసి అరక తోలుకుని వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు.
"మీకెందుకులెండి! ఆవిడగారి కూతురికి ఏ గంధర్వుణ్ణో, కలెక్టర్నో తెస్తుందిట!" వెటకారంగా భర్తను ఉద్దేశించి అంది నాగరత్నం.
"వదినా!" చాలా గట్టిగానే అరిచింది నాగమ్మ. అప్పటికే సుబ్బారాయుడు వీధి వాకిలి దాటి వెళ్ళిపోయాడు. నాగరత్నం ఓసారి నాగమ్మను చూసి లోపలకు వెళ్ళిపోయింది.
నాగమ్మ తలలో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి.
అంతరాంతరాల్లో లోతుగా ఎవరిమీదో కసి సముద్రంలా ఘోష పెట్టింది.
ఇక తను అంతపనీ చేస్తుంది.
ఆ భద్రయ్యకే పార్వతిని యిస్తుంది.
నాగమ్మ పైటచెంగుతో కళ్ళద్దుకుంటూ భద్రయ్య ఇంటికి కబురు పెట్టింది.
అక్కడ నిలుచుని వున్న పార్వతి వణుకుతున్న కంఠంతో, బలిపీఠం మీద ఎక్కబోతున్న మేకపిల్లలా "అమ్మా!" అంది.
"అవును తల్లీ, నీ గొంతు నా చేతుల్తో కోస్తున్నానమ్మా! నీ రక్తంతో చేతులు తడుపుకాబోతున్నానమ్మా! ఏ తల్లీ చేయలేని పనిని చేస్తున్నానమ్మా! ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు" అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకొని భోరున ఏడ్చింది.
పార్వతి మొండితనానికి తల్లి కన్నీరుముందు నిలబడే శక్తి ఏనాడూ లేదు. తల్లి అసహాయతను అర్ధం చేసుకొంది. తల్లి గుండెలకు అతుక్కుపోయి కన్నీరు కార్చటంకంటే ఇంకేమీ అనలేకపోయింది.
నాగమ్మ చనిపోయిన భర్తనూ, బతికేవున్నాడనుకుంటున్న చిన్నఅన్నయ్యనూ తల్చుకుంటూ కంటికి కడివెడుగా నీరు కార్చింది.
25
భద్రయ్య తరలివచ్చి పార్వతిని పెళ్ళి చేసుకున్నాడు.
పెళ్ళి జరుగుతున్నంతసేపూ నాగమ్మ కళ్ళనీరు కారుస్తూనే వుంది కూతురికి పట్టిన దుర్దశను తలచుకొని.
తనూ, ఆయనా కలిసి పార్వతి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నారు! ఎన్ని ఊహాసౌధాల్ని నిర్మించుకున్నారు! పార్వతిని ముసలాడికి కట్టపెట్టిన తనను ఆయన ఆత్మ తప్పక శపిస్తుంది.
"ఊరుకో నాగమ్మా! ఇష్టమయి ఇచ్చుకున్నాక ఏడిస్తే ఏమొస్తుంది?"
"అల్లుడూ, కూతురూ పదికాలాలపాటు సుఖంగా వుండాలని కోరుకో! ఏడవకూడదు. శుభం కాదు." తలొకరకంగా ఓదార్చసాగారు, పెళ్ళికొచ్చిన ముత్తయిదువులు.
పెళ్ళయిన తెల్లారే పార్వతిని వెంటబెట్టుకుని అల్లుడింటికి వెళ్ళింది నాగమ్మ. తల్లి వస్తేగాని అత్తవారింటికి వెళ్ళనని మొండికెత్తింది పార్వతి. నాగమ్మకు తప్పలేదు.
"పెళ్ళయిన తెల్లవారే అల్లుడింటికి వెళ్ళటం మర్యాద కాదమ్మా! లోకం మనకోసం ఏం చేస్తుందని దానికి భయపడాలి? అసలు ఈ పెళ్ళికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నిన్ను ఈ నరకం నుంచి తప్పించటానికే. నువ్వు ఇక్కడే వుంటే నాకు ఆ మొగుడూ అక్కర్లా, ఆ సంసారం అక్కర్లా!" పార్వతి ఖచ్చితంగా అంది.
నాగమ్మ కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. తన బిడ్డ తన కోసం ఇంత త్యాగం చేసిందా! పార్వతిని తనివితీరా కావిలించుకుంది.
నాగమ్మ అల్లుడింట్లోనే వుండిపోయింది. అనుకున్నదానికంటే హాయిగానే కాలం గడిచిపోతోంది.
మళ్ళీ ఇన్నాళ్ళకు నాగమ్మకు కాళ్ళకింద భూమి చిక్కినట్లయింది.
చేతికింత ఆసరా దొరికినట్లయింది.
ఇక్కడ కాళ్ళూ చేతులు దగ్గర పెట్టుకుని కూచుంటుందని కాదు. కూతురిచేత ఇవతల పుల్ల అవతల పెట్టించకుండా ఇంటి చాకిరంతా నాగమ్మే చేసుకుపోతుంది. అయితే తను ఆ పనిని సంతోషంగా చేస్తుంది. స్వతంత్రంగా చేస్తుంది. ఇక్కడ బానిసత్వం లేదు. వేళ కింత తిండి, సంవత్సరానికి ఓ రెండు మల్లు పంచెలూ ఏ సాధింపులూ లేకుండా దొరుకుతాయి. అంతకంటే తనకేం కావాలి? పైగా పార్వతి తన కళ్ళ ముందే వుంటుంది.
భద్రయ్య ఏభై ఎకరాల మాగాణిగల ఆసామి. పెద్ద లోగిలి వుంది. స్వంత వ్యవసాయం చేసుకుంటాడు. నల్లటి విగ్రహం, లావు పాటి పొట్టా -- మొత్తంమీద కొంచెం వికారంగానే వుంటాడని చెప్పాలి. మొదటి భార్య పోయి రెండు సంవత్సరాలయింది. పిల్లలు కలుగుతారని ఆశలేని భద్రయ్య దంపతులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న భద్రయ్య చెల్లెలి కొడుకును దగ్గరకు తీశారు. వాడ్ని భద్రయ్య దంపతులు సొంత కొడుకులాగే పెంచారు. అతని పేరు సూర్యనారాయణ. అతనికిప్పుడు ఇరవై రెండవ సంవత్సరం. పట్నంలో ఫైనల్ ఎం.ఏ. చదువుతున్నాడు. భద్రయ్య ఈ వివాహం అయేంతవరకూ సూర్యనారాయణకు తెలియనివ్వలేదు.
సూర్యనారాయణ భద్రయ్య వివాహం సంగతి విని నానా మాటలంటూ ఉత్తరం వ్రాశాడు. భద్రయ్య చూడకుండా పార్వతి ఆ ఉత్తరాన్ని చదివింది.
"నీకు ఈ వయసులో వివాహం కావలసి వచ్చిందా! అంత చేసుకున్నా ఏ ముప్పయి ఏళ్ళో వున్న వితంతువును చూసి వివాహం చేసుకో లేకపోయావా? ముక్కు పచ్చలారని బాలికను, నీ డబ్బును ఎరగా చూపించి వివాహం చేసుకోవటానికి సిగ్గనిపించలేదూ? నీకు పిల్లలుంటే ఆ అమ్మాయి ఈడు కూతుళ్లుండేవాళ్ళే!" అంటూ మొదలుపెట్టి ఘాటుగానే ముగించాడు.
ఆ ఉత్తరం చదివిన పార్వతికి చాలా ఆనందమే కలిగింది. ఆమె దృష్టిలో ఆదర్శమూర్తి అయిపోయాడు సూర్యనారాయణ. ఎప్పుడు వస్తాడా? అని తహతహలాడసాగింది.
ఒకటి రెండుసార్లు పార్వతి సూర్యనారాయణ గురించి భద్రయ్య దగ్గర ఎత్తింది. ప్రతీసారి భద్రయ్య మాట మార్చేసేవాడు.
వంటింట్లో పెత్తనమంతా నాగమ్మదే. ఇప్పుడిప్పుడు అల్లుడికి అన్నం తనే వడ్డిస్తూంది. అల్లుడూ కలుపుగోలుతనంగానే మాట్లాడుతున్నాడు. కాని ఆ కలుపుగోలుతనంగానే మాట్లాడుతున్నాడు. కాని ఆ కలుపుగోలు తనంలో ఏదో వెకిలితనం కనిపించకపోలేదు నాగమ్మకు. అల్లుడు కనుక సర్దుకుపోక తప్పదని సరిపెట్టుకొంది.
ఒకోసారి అల్లుడి ప్రవర్తనకు నాగమ్మ మనసు చివుక్కుమనేది. మళ్ళీ తను పొరపడుతున్నాననుకొనేది. అసలు ఆ మనిషి తరహాయే అంతేమో అనుకునేది ఒకోసారి.
రాత్రిపూట అన్నం వడ్డిస్తుంటే భద్రయ్య ఆమె కళ్ళలోకి అదోరకంగా గుచ్చి చూసేవాడు.
తిన్న అన్నమంతా ఏమవుతుందో, అంత ఆకలిగా చూస్తాడు అనుకునేది. ఆ చూపులకు నాగమ్మ మనస్సు జుగుప్సతో నిండిపోయేది. శరీరం తేళ్ళూ, జర్రులూ పాకుతున్నట్లు జలదరించేది. ఎంత సరిపెట్టుకుందామన్నా. మనిషిమీద అసహ్యం వెయ్యసాగింది.
ఏమయినా అతను తన అల్లుడు.
తన కూతురు సౌఖ్యమే తనకు కావల్సింది.
తన కూతురు కాపరం చక్కగా వుండటమే తాను కోరుకునేది. అర్ధం అయినా కానట్లే సర్దుకుపోసాగింది నాగమ్మ.
ఒక రోజు రాత్రి, నాగమ్మ జీవితంలో ఏనాడూ ఊహించరాని రాత్రి.
ఏ ఆడదాని జీవితంలోనూ రాకూడని రాత్రి.
అది కాళరాత్రి.
మనిషిలో ఒదిగి ఉండే పశుత్వం.
తరతరాలుగా మగవాడిలో జీర్ణించుకుపోయిన దౌర్జన్యం....సాకారంగా నాగమ్మ ముందుకొచ్చి నిలిచాయి ఆ రాత్రి.
ఆ రోజు వంటింట్లో అల్లుడు తిన్న ఎంగిలి పళ్ళెం వంగి తీస్తోంది. నాగమ్మ పైట చెంగు ఎవరో గట్టిగా గుంజారు. నాగమ్మ బిత్తరపడి వెనక్కు తిరిగి చూసింది. భద్రయ్య!
నాగమ్మ ఒళ్ళు చీదరతో జలదరించింది.
'ఛీ!' అంటూ తోకతొక్కిన త్రాచులా లేచింది. రోషంతో రక్తం కుతకుతలాడింది. ఎదురుగా నిల్చున్న భద్రయ్య మీదకు గోడకాన్చి వున్న పీటను ఎత్తి విసరబోయింది. ఒక్క క్షణం తటపటాయింది. భద్రయ్య, ఈ పశువు, తన అల్లుడు! తన కూతురు మెళ్ళో మాంగల్యం కట్టినవాడు!
కసికొద్దీ పీటను, కిందవున్న అన్నం పళ్ళెం మీదకు విసిరింది.
"ఖంగ్" మని పళ్ళెం మోగింది.
భద్రయ్య గాబరాగా, హడావిడిగా బయటకు పరుగెత్తాడు.
"నువ్వు పార్వతికి మొగుడువైపోయావ్! లేకపోతే ఆ పీట నీ ముఖం మీదే పడేది" అన్న నాగమ్మ మాటలు భద్రయ్య చెవుల్లో పడకపోలేదు. ఉబికి వస్తున్న రోషాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని పళ్ళబిగువుమీద ఆపుకుంది.
నాగమ్మ ఆ రాత్రంతా తన బతుకూ ఎంత తేలికయిపోయిందో తలుచుకుంటూ ఏడ్చింది.
తెల్లవారి ఆమె బట్టలు సర్దుకొని ప్రయాణం అయింది. ఒక మాట పడ్డా, తను అన్నా, అన్న ఇంట్లో వున్న దారి వేరు!
"ఇప్పుడెక్కడి కమ్మా ఈ ప్రయాణం?" పార్వతి తల్లి ప్రయాణం కావటం చూసి ప్రశ్నించింది.
"మామయ్య దగ్గరకమ్మా! చూడాలని గాలి మళ్ళింది" అంది నాగమ్మ తల ఎత్తకుండానే.
"అబద్ధం! నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. అసలు ఏం జరిగిందమ్మా? మీ అల్లుడు ఏమయినా అన్నారా?" అంది పార్వతి.
నాగమ్మ ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది.
తను ఏం చెబుతుంది? ఎందుకు వెళుతున్నానని చెబుతుంది? తనకు జరిగిన అవమానం ఒకరితో చెప్పుకొనేదా? పైగా కన్నకూతురితో ఏమని చెప్పుకుంటుంది. నీ మొగుడు నా కొంగు లాగాడని ఏ తల్లయినా కూతురితో చెప్పుకోగలదా?
"నువ్వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక్క క్షణం వుండను, నీ కోసమేగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. పద, వెళ్ళిపోదాం! నీకు ఈ ఇంట్లో వుండటం ఇష్టంలేకపోతే నేను వుండమని బలవంతం చెయ్యను. నాలుగిళ్ళు పాచిపని చేసుకొని బతుకుదాం పద!" అంది పార్వతి రుద్ధకంఠంతో.
పార్వతి ఎంత మొండిదో నాగమ్మకు తెలుసు. అన్నమాట చేసి తీరుతుంది. తను చెప్పి లాభంలేదు.
బట్టల మూట లోపల పెట్టింది.
మౌనంగా వెళ్ళి ఇంటి పనుల్లో మునిగిపోయింది. తన కూతురు కాపుర బాగుండడమే కావాల్సింది. పార్వతి కోసం తను ఎన్ని బాధలైనా పడాలి. ఎన్ని అవమానాలైనా భరించాలి.
26
నాగమ్మకు అల్లుడింట్లో యమలోకపు తెరలు లేచినయ్.
భద్రయ్య అయిందానికీ, కానిదానికి నాగమ్మమీద కారాలు, మిరియాలు నరుతున్నాడు.
పిల్లిమీదా కుక్కమీదా పెట్టి అత్తను నానా మాటలూ అంటున్నాడు.
అయినా భద్రయ్య ఆకలి చల్లారలేదు అనే విషయాన్ని అతని చూపులు ప్రతి నిముషం తెలియజేస్తూనే వున్నాయ్. అల్లుడు అనే మాటలకంటే అతని చూపుల్ని భరించడమే నాగమ్మకు కష్టంగా ఉంది. పార్వతి అసలు సంగతి ఎక్కడ పసికట్టేస్తుందోనని భయపడసాగింది నాగమ్మ. నాగమ్మ ఇంటిపని చేసుకుంటూంటే ఎదురుగా వచ్చి నిలుచుని భద్రయ్య తననే గమనిస్తూండటం ఆమెకి అసహ్యం వేసింది. తన మీద తనకే అసహ్యం వేసింది.


