సుబ్బారాయుడు పైపంచె దులుపుకొని భుజంమీద వేసుకొని, గబగబా బయటకు వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిపోతున్న భర్తను ఓ క్షణం చూసి నాగరత్నం నాగమ్మమీద విరుచుకుపడింది.
"ఈ రాలుగాయి గుంటకు చదువు చెప్పిస్తే ఇక నీకు అందుతుందా?" అంది నాగమ్మ నుద్దేశించి.
"బోడి చదువు లేకపోతే పోయింది కాని నన్ను గుంటా గింటా అంటే పడేదిలేదు. ఆఁ ఇప్పుడే చెబుతున్నాను." రోషంగా అంది పార్వతి.
"ఏమిటేవ్, నా తిండి తింటూ నన్నే బెదిరిస్తున్నావ్?" కళ్ళెగరిస్తూ అంది నాగరత్నం.
"నీ సొమ్మేం తింటంలేదు, మా మామయ్య... కాదు... మా తాతయ్య సొమ్ము తింటున్నాం" అంది పార్వతి మొండికెత్తినదానిలాగ. "తాతయ్య ఆస్తిమీద మా అమ్మకూ హక్కు వుంది. పైగా చిన్న మామయ్య ఆస్తినంతా వేసుకొని తినేస్తున్నారు." పార్వతి గబగబా అనేసింది.
పార్వతి మాటలకు నాగమ్మ, నాగరత్నం, ఇద్దరూ వెర్రిముఖాలు పెట్టారు.
నాగరత్నం ఎలాగో తెప్పరించుకొని అంది, "ఇవన్నీ నీకు మీ అమ్మ నేర్పించినవేనా?
"మా అమ్మకు నేర్పించే తెలివే వుంటే మేం ఇలా ఎందుకుండేవాళ్ళం?"
"వేలెడంతలేవు ఎన్నేసి మాటలంటున్నావే? పెద్దంతరం చిన్నంతరం లేకుండా కూస్తున్నావ్! అసలు తప్పంతా మాదేలే. ఆ ఇద్దరిలాగే మేమూ పట్టించుకోకుండా వుంటే బాగుండేది. మీ అమ్మ జోలి కట్టుకుని నిన్ను బతికించేది" అంది నాగరత్నం వ్యంగ్యం ఉట్టిపడే స్వరంతో.
"ఇంతకంటే అదే బాగుండేదేమో!"
"పార్వతీ! నోరు మూస్తావా లేదా?" నాగమ్మ చెయ్యి గాలిలోకి లేచి నిలబడిపోయింది.
పార్వతి తల్లి వైపు ఓసారి చూసి, నిర్లక్ష్యంగా అక్కడనుంచి వెళ్ళిపోయింది. పార్వతి అటూ ఇటూ అశాంతిగా కాసేపు తిరిగి ఇంటి వెనక దొడ్లోకి వెళ్ళింది. అక్కడున్న పొట్లపోదులూ బీరపాదులూ పీకెయ్యసాగింది. జామచెట్టు ఎక్కి కూర్చుంది. చిన్న చిన్న పిందెల్ని కోసి దొడ్డంతా గిరాటు వెయ్యసాగింది.
నాగమ్మ వంట చేస్తూంది. కాని మనస్సంతా దిగులు దిగులుగా వుంది.
పార్వతి మరీ ఇలా తయారయిందేమిటి? వయస్సుకు మించిన మాటలు! తను ఊహలో కూడా అనుకోలేదు. ఇది నాన్న ఇల్లనీ ఆ ఇంట్లో తనకూ స్థానం ఉందనీ చిన్నన్నయ్య ఆస్తి తింటున్నారని కూడా అనిపించలేదు. కాని పార్వతికి ఇంత చిన్న వయస్సులోనే ఇవన్నీ ఎలా తోచాయో! తనకు ఇంత వయస్సు వచ్చినా తట్టని విషయాలు పార్వతి మాట్లాడుతోంది? ఏం చేయాలి? ఇక దాని పెళ్ళి గురించి ఆలోచించాల్సిందేనా? పార్వతికి ఇప్పుడే పెళ్ళా? ఇక దాని చదువుకు స్వస్తివాచకం పాడాల్సిందేనా? నాగమ్మ ఆలోచిస్తూ పొయ్యిముందు కూచుంది. ఆమె మనసు మథనపడసాగింది.
"అయ్యో! అయ్యో! దీనికేం పోయేకాలం వచ్చిందే! దీని తలపండు పగల! దీని పొగలెల్ల! ఎట్లా బీరమొక్కలు పీకేసిందో? నాగమ్మ తల్లీ!" దొడ్లోకొచ్చిన నాగరత్నం అక్కడ చిందరవందరగా పడివున్న బీర మొక్కల్ని చూసి కేకలు పెట్టింది.
నాగమ్మ బయటకు పరుగెత్తుకొచ్చింది.
"గుంట నా కొంప కూల్చటానికే పుట్టిందర్రోయ్!" తిట్లకు లంకించుకుంది నాగరత్నం. ఒక జామకాయ పిందె వచ్చి నాగరత్నం నెత్తిన పడింది.
నాగరత్నం ఉలిక్కిపడి చెట్టుకేసి చూసింది. "ఒసేవ్, తేరితిండి తింటుంటే నీకు ఒళ్లు పొగరెక్కిందే. జామకాయ తీసుకొని నన్ను కొడతావంటే! రానియ్ మీ మామయ్యను. ఇవ్వాళ తేలిపోవాలి. ఈ ఇంట్లో మీరయినా ఉండాలి, నేనయినా వుండాలి" అంటూ విసవిసా లోపలకు వెళ్ళిపోయింది నాగరత్నం.
"ఒసేయ్ దెష్టకుంకా! ముందు అక్కడనుంచి దిగు" పిచ్చిగా అరచింది నాగమ్మ. ఆమెకు మతిపోయినంత పనయింది.
"దిగను. ఇక్కడనుంచి దూకి చస్తాను, మీ అందరి పీడా వదుల్తుంది" అంది పార్వతి మొండిగా జామపిందెను నేలకేసి చాలా గట్టిగా కొడుతూ.
నాగమ్మకు కాళ్ళలోనుంచి వణుకు పుట్టుకొచ్చింది.
ఇది అన్నంతా చేసే రకం! ఏ కాలో చెయ్యో విరిగితే? ఈ బతుక్కుతోడు అవిటితనం కూడా తోడయితే!
"తల్లీ! నన్ను సర్వనాశనం చెయ్యకే నిన్ను చూసుకొనే ఇన్ని బాధలు అనుభవిస్తూ బతుకుతున్నాను. నీకెలా చెబితే అర్ధం అవుతుందే నా బాధ?" అంటూ నాగమ్మ రెండు చేతులతో తల పట్టుకొని చెట్టు మొదట్లో కూలబడిపోయింది. పార్వతి మొండితనం తల్లి ఏడుపుముందు ఇట్టే కరిగిపోయింది. గబగబా చెట్టుదిగి తల్లి దగ్గరకొచ్చింది.
తీరా దిగొచ్చాక నాగమ్మకు పార్వతిమీద కోపం వచ్చింది. "ఇలాంటి పని చెయ్యవు గదూ?" అంటూ జుట్టు పట్టుకొని వంగతీసి బాదింది. పార్వతి ఒళ్ళప్పగించి నిల్చింది. ఏడుపూలేదు. మాటాలేదు. నాగమ్మే కొట్టికొట్టి చేతులు నొప్పిపుట్టి ఊరుకుంది!
* * *
పళ్ళంచక్రం క్రింద చెరుకు గడలా, కాలచక్రంలో పడి నలిగిపోతూనే నాగమ్మ మరో మూడు సంవత్సరాలు జీవితాన్ని లాక్కొచ్చింది.
ఇప్పుడు పార్వతికి పదహారో ఏడు వచ్చింది.
సంవత్సరం దాటిపోయింది పెద్దమనిషి అయి. పిల్ల కూడా బాగా ఏపుగా పెరిగింది. నాగరత్నం, సూర్యకాంతం సగబడ కట్టేసిన రంగుపోయిన చీరలు కట్టుకున్నా, ఆమె శరీరం యౌవనపు మిసమిసల్ని విరజిమ్ముతూనే వుంది.
పార్వతి సహజ సౌందర్యవతి. వయసుతోపాటు ఆమెలో మొండితనం కూడా పెరిగింది. ప్రతి నిముషం ప్రవాహానికి ఎదురు ఈదటానికి ప్రయత్నిస్తూనే వుంది.
సూర్యకాంతం పురిటికి పుట్టింటికి వచ్చింది. మొగుడు దిగబెట్టటానికి వచ్చాడు. ఆ ఉన్న రెండు రోజులూ సూర్యకాంతం మొగుడు పార్వతిని గుడ్లు మిటకరించుకొని చూస్తూనే వున్నాడు. పార్వతికి అతని మీద మహా చిరాకు వేసింది అతను అలా చూస్తుంటే. వంటిమీద పరుగులు పాకుతున్నట్లనిపించేది.
"ఆయన త్వరగా వెళ్ళిపోతే బాగుండునమ్మా!" అంది సూర్యకాంతం, మొగుడు వచ్చిన మూడో రోజు తల్లితో.
"అదేమిటే! నాలుగు రోజులు ఉండమనాల్సింది పోయి, వెళితే బాగుండునంటావే?" తల్లి విస్మయంతో అంది.
"నాలుగు రోజులిక్కడుంటే నా మొగుడు నాకు దక్కడే అమ్మా!" అంట్ల గిన్నెలు తీసుకొని దొడ్లోకి వెడుతున్న నాగమ్మ చెవుల్లో ఆ మాటలు పడి యాంత్రికంగా ఆగిపోయింది.
అక్కడే ఓ మూల కూచుని చలం నవల చదువుతున్న పార్వతి చెవులు రిక్కించి వినసాగింది.
నాగరత్నం కూతురు మాటలు అర్ధంకాక తెల్లమొహం వేసింది.
"ఆ గుంట ఆయన్ను చుట్టూ తిప్పుకుంటుందే! ఆయన వచ్చినప్పటినుంచీ చూస్తున్నాగా, ఆ టక్కులాడిమీదే ఉన్నాయి కళ్ళు, ఏం మంత్రం వేసిందో ఏమో!" సూర్యకాంతం నిష్ఠూరంగా అంది.
"మరీ అదుపూ ఆజ్ఞ లేకుండా పోతూంది. ఆ అమ్మకు అదేమీ పట్టదు. దానికి పెళ్ళీ పేలాలు ఏగుతాయని నాకు మాత్రం నమ్మకం లేదు. అంత ఏగినా అది ఆ మొగుడుతో కాపరం చెయ్యదు. ఎవడితోనో లేచిపోయి ఈ కుటుంబానికి మచ్చ తెస్తుంది. అలా చూస్తూండు. దాని వయ్యారాలూ, ఆ కళ్ళు తిప్పడాలూ... అయ్యో రామా... అసలు సంసార లక్షణాలున్నాయంటే?" అంది నాగరత్నం ఓరకంటితో నాగమ్మ వైపు చూస్తూ.
నాగమ్మ చేతిలోవున్న కూరగిన్నె పడిపోయింది.
ఆమె కొయ్యబారి నిల్చుండిపోయింది.
పార్వతి చేతిలోని పుస్తకాన్ని గిరాటువేసింది.
అది విసురుగా వచ్చి సూర్యకాంతంముందు పడింది.
అంతకంటే విసురుగా వచ్చి నిల్చుంది పార్వతి తల్లి కూతుళ్ళకు ఎదురుగా.
"గుడ్లప్పజెప్పి నీ మొగుడే నన్ను మింగేలా చూస్తున్నాడు. బుద్ధి చెప్పుకో, కుక్కలా ఆడపిల్లల చుట్టూ తిరగక్కుండా. నేను మంత్రం కూడా వెయ్యాలీ ఆ ఆముదం మొహంగాడికి? నీ మొగుడు కనిపిస్తేనే నాకు డోకు వస్తుందే!" గబగబా అనేసింది పార్వతి రోషంతో రొప్పిపోతూ.
బిత్తర పోయారు తల్లీ, కూతుళ్ళిద్దరూ.
నాగమ్మ గబగబా పార్వతి రెక్క పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోసాగింది. తల్లి వెంట వెళుతూ తిరిగి చూస్తూ అంది పార్వతి:
"చూస్తూండండి, తప్పక ఎవడితోనో లేచిపోతాను. మీ వంశానికి మచ్చ తెస్తాను. మీ గౌరవానికి మసిపూసి నా కసి తీర్చుకుంటాను. ఏమయినా నీ మొగుడులాంటి జిడ్డు మొహంగాడ్ని మాత్రం చేసుకోను."
నాగరత్నం, సూర్యకాంతం మాటలే మరచిపోయారు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ వుండిపోయారు.
తల్లిచేత మొట్టికాయలూ, తిట్లూ తిని, అన్నం తినకుండానే కటికి నేలమీద పడుకొని హాయిగా నిద్రపోతున్న కూతురు పక్కనే కూచుని వుంది నాగమ్మ ఆలోచిస్తూ.
ఆమె కూతుర్ని కన్నార్పకుండా చూసుకుంది.
నిజమే, పార్వతికి పెళ్ళీడు వచ్చింది, కనీసం దానికి ఈ బానిసత్వం నుంచయినా విముక్తి దొరుకుతుంది పెళ్ళి చేసేస్తే"
ఆ రోజునుంచి రోజూ నాగమ్మ పార్వతి పెళ్ళి గురించి ఆలోచిస్తూనే వుంది.
"కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావ్?" అన్నారు లోకులు.
"ఏమయినా సంబంధాలు వస్తున్నాయా?"
"వెన్ను ముదిరిపోతే పెళ్ళి కావటం కష్టం. త్వరగా చేసెయ్_"
"ఈ రోజుల్లో కట్నాలు కుమ్మరించందే పాపం, మంచి సంబంధాలు ఎక్కడినుంచి వస్తాయిలే!"
తెలిసినవాళ్ళు రకరకాలుగా పార్వతి పెళ్ళి గురించి ప్రశ్నించసాగారు. నాగమ్మ అన్నీ విని మౌనంగా వుండిపోయేది. ఏం జవాబు చెబుతుంది?
కూతుర్ని పెద్ద చదువులు చదివించి ఏ డాక్టర్నో చెయ్యాలనుకున్న వెంకట్రావు, నాగమ్మల కోర్కెలు మట్టిగలసిపోయాయి.
పార్వతి చదువు ఎనిమిదవ తరగతిలో ఆగిపోయింది.
నాగమ్మ కలలు కళ్ళతోనే కరిగి కన్నీరుతో కలసి కరిగిపోయాయి.
ఆ రెండు పొట్టలకు గడవడమే గగనం అయిపోయింది.
రెక్కలు పడిపోయేలా కష్టంచేసి, కడుపుకు ఇంత ముద్దకోసం నానా మాటలూ పడాల్సి వస్తూంది. దానికితోడు యిప్పుడు పార్వతి పెళ్ళి సమస్య నాగమ్మ గొంతుకు గాలంగా తగుల్కొంది.
24
వేసవికాలం.
సూర్యాస్తమయం అయినా వేడిగాల్పులు తగ్గలేదు.
సుబ్బారాయుడు ఆరుబయట మంచంమీద కూచుని చుట్ట కాల్చుకుంటున్నాడు.
"అమ్మాయ్! కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు!" నాగమ్మను కేక పెట్టాడు సుబ్బారాయుడు.
దోసకాయ చెంబుతో మంచినీళ్ళు అందించింది నాగమ్మ. చెంబుడు నీళ్లు గటగటా తాగి ఖాళీచెంబు అందించాడు చెల్లెలికి.
నాగమ్మ చెంబు అందుకుంది. కాని అక్కడనుంచి కదలలేదు. సుబ్బారాయుడు గమనించనట్లే చుట్టదమ్ము గట్టిగా పీల్చాడు.
"అన్నయ్యా! పార్వతికి ఏదైనా పెళ్ళి సంబంధం వుంటే చూడు" అంది చిన్న గొంతుతో.
"సరే చూద్దాంలే!" అన్నాడు సుబ్బారాయుడు అతి మామూలుగా.
"ఇంకేం! అయితే ఆ భద్రయ్య కిచ్చి చెయ్యరాదూ?" అంది నాగరత్నం, మనమణ్ణి చంకనేసుకొచ్చి నిలబడి.
"అదేమిటి వదినా అలా అంటావు! బంగారు బొమ్మలాంటి పార్వతిని ఆ ముసలాడికి ఇవ్వమంటావా? చూస్తూ చూస్తూ నా బిడ్డ గొంతు కొయ్యమంటావా?" అంది నాగమ్మ బాధపడుతూ.
"నీదంతా మరీ చోద్యం! ముసలాడంటావేం! ఇంకా ఏభయ్ నిండినయ్యో, లేదో? భద్రయ్యకేం, గుండుపిక్కలా వుంటాడు.
"పార్వతికి ఇంకా పదహారుకూడా నిండలేదు వదినా!" అంతకంటే ఏమనాలో తెలియక అంది నాగమ్మ రుద్దకంఠంతో.
"అయితే మాత్రం ఏం? అంత ఆస్తిపరుడు నీ కూతుర్ని అడిగాడంటే అది నీఅదృష్టం అనుకో. కూటికీ గుడ్డకూ కరువు లేకుండా నాలుగు కాలాలపాటు జరిగిపోతుంది. నీకూ ఇంత నీడ దొరుకుతుంది."
ఆఖరు మాటలు నాగమ్మ ఆత్మాభిమానంమీద గట్టిగా దెబ్బకొట్టాయి.
కోపంగా అంది నాగమ్మ- "వదినా! నీ కెందుకమ్మా అంత చులకన నేనంటే! ఒకప్పుడు ఈ ఇంట్లో, నీ కళ్ళముందే, నువ్వేనాడూ వూహించలేని రాణివాసం నేను వెలగబోశాను. ఏ రోజుకు ఎవరి పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. అంత తేలిగ్గా గోంగూరలో పురుగులా తీసేయమాక. నేనూ ఈ ఇంటి ఆడబిడ్డనే అనే విషయాన్ని మర్చిపోకు.
"చూశారా! చూశారా! ఇప్పుడు నేనేం అన్నానని ఇన్ని మాటలు అంటుంది? నా పుట్టింట్లో నేను తనంత అల్లారు ముద్దుగా పెరగలేదని ఎంత ఎత్తిపొడుస్తుందో! అందుకే అంటారు మంచికిపోతే చెడు ఎదురవుతుందని. నీ మంచికి చెబితే ఎన్ని మాటలన్నావు నాగమ్మ తల్లీ... అసలు ఇన్నింటికీ మా బంగారం మంచిదయితే... ఆ ఇద్దరిలాగే ఈ మనిషి బరువు నెత్తినేసుకోకుండా వుంటే..." నాగరత్నం నోరు తెరిచేసింది. గలగలా మాటలు దొర్లిపోతున్నాయి అవలీలగా, కొండమీద నుంచి దొర్లే రాళ్ళలాగ.
"ఇక చాల్లే వదినా!" అంటూ నాగమ్మ గుడ్లనీరు గుడ్లనింపుకొని లోపలకు వెళ్ళిపోయింది.
సుబ్బారాయుడు, బండరాయిలా, చుట్టదమ్ములు పీలుస్తూ వుండిపోయాడు.
పార్వతికి పదిహేడో సంవత్సరం కూడా మరో రెండు నెలలకు నిండిపోతుంది. పెళ్ళి విషయం ఎత్తినవాళ్ళు లేరు. నాగమ్మ రాత్రింబవళ్ళు పార్వతి గురించిన దిగులుతోనే కుంగిపోతూంది. పార్వతి వ్యక్తిత్వం ఆ ఇరుకు వాతావరణంలో ఇమడక అవస్థపడుతోంది.
నాగమ్మ మనస్సు పరిపరివిధాల ఆలోచించసాగింది. పార్వతి వయస్సుకు తను ఒక నిండు జీవితాన్నే చూసింది. వివాహం అయింది. బస్తీ కాపరం పెట్టింది. బిడ్డతల్లయింది. ఐదోతనం మంటగలసింది. తలచెడి, పుట్టినింటి నీడను చేరింది.


