Next Page 

ఏటిలోని కెరటాలు  పేజి 1

   
                        ఏటిలోని కెరటాలు

                                             __పోల్కంపల్లి శాంతాదేవి


    "అమ్మా. దేవీ! దేవతా! విన్నావా?.... మీ అత్తయ్య ఊరినుండి గోవిందస్వామి వచ్చాడు." లోనికి కేకవేశారు సూర్యదేవులు.

    "ఇదిగో! తలుపు ప్రక్కన ఉండి వింటూంది." భుజాలనిండా పమిటకొంగు సవరించుకొంటూ, చిరునవ్వు చిందిస్తూ వచ్చి ద్వారంలో నిలబడింది" శ్రీమహాలక్ష్మి. కళలు, ఆకారంలోనూ అలంకరణలోనూ నింపుకొని, సౌశీల్యం మూర్తీభవించిన ఆయన సతీతిలకం శ్రీలక్ష్మి.

    గోవిందస్వామి, తలుపు రెక్క వెనుకనుండి తొంగిచూస్తూ సగమే అగుపడుతూన్న దేవదాసి వంక చూస్తూ, ఉన్నతులముందు సామాన్యుడు చూపవలసిన వినయంతోనూ, తన పెద్దతనంవల్ల పిన్నల ఎడ చూపవలసిన సరళ వాత్సల్యాలతోనూ, చెప్పాడు కొంచెం విచారంగా, "మీ మామయ్య గారికి సుస్తీ చేసిందమ్మా! మీ అత్తగారు మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారు. మీ తాతగారిని కూడా!"

    ఆ ఇంటికి ఒక్కగానొక్క ఆడపడుచు కృష్ణవేణి. ఇక్కడికి కొద్ది మైళ్ల దూరంలో ఉండే వజ్రకోట ఆమె మెట్టినిల్లు, పుట్టింటివారూ, మెట్టింటివారూ దేశముఖ్ లే! ఇటూ, అటూ గుర్ర పరుగెత్తలేని భూములు; ఎన్ని తరాలవారు కూర్చొని తిన్నా తరగని శ్రీమంతం. చుట్టుపట్ల ముప్పైమైళ్ళ వరకూ వారికి సాటిరాని వైభవం ఖ్యాతీ ఉన్నాయి. ఏ విషయంలోనూ పుట్టింటికి మెట్టినిల్లూ, మెట్టినింటికి పుట్టినిల్లూ తీసిపోవు!

    ముప్పయేళ్ళుగా నమ్మినబంటు అయి కృష్ణవేణి వాళ్ళ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ, వారి ప్రాపున గూడుకట్టుకొని చల్లగా సంసారం సాగిస్తున్న మేనేజరు గోవిందస్వామి.

    ఆడబిడ్డకు సంభవించిన ఆపడ ఏమిటో సవిస్తరంగా తెలియని శ్రీలక్ష్మి. కలవరంగా అడిగింది: "అన్నగారికి కలిగిన అనారోగ్యమేమిటి, గోవిందస్వామి?"

    "మొన్న కొత్తగూడేనికి గుర్రం వేసుకుని వెళ్ళి పైరులవీ చూచుకొని తిరిగి వస్తున్నారట బాబుగారు. ఏమై బెదిరిందీ తెలియదు; గుర్రంరాళ్ళలోకి, రప్పల్లోకి దారితీసి బాబుగారిని క్రిందపడవేసింది. అక్కడే దున్నుకొంటూ పనులు చేసుకొంటూ ఉన్న రైతులే బండికట్టుకొని అందులో యింటికి తీసుకు వచ్చారు, ఆయనను. ముఖానికీ మోచేతులకూ దెబ్బలు తగిలాయి. మోకాలు బెణికి పోట్లూ, మంటలూ తీసుకొన్నాయి. కాపడాలూ, తోమడాలూ అవుతున్నాయి. ఇంకా కాలు స్వాధీనం కాలేదు. స్వయంగా కూర్చోవడం లేవడం కూడా లేదు. అంతా అమ్మగారూ, నౌకర్లూ చూస్తున్నారు."

    "ఎంత చేతిక్రింద నౌకర్లు ఉన్నా, తను బాబుగారి పరిచర్యల్లో మునిగి ఉన్నప్పుడు ఇంట ఆప్తులైన మరో మనిషి అవసరం ఉంటుందని, పెద్దకోడలు దేవతమ్మగారిని పంపించమని చెప్పారు, కృష్ణవేణమ్మ దొరసాని. పెద్దబాబుగారిని కూడా వచ్చి అల్లుడుగారిని ఒకసారి చూచి పొమ్మన్నారు." చెప్పాడు గోవిందస్వామి.

    అందరి ముఖాలూ, మనస్సులూ విచారంతో నిండిపోయాయి.

    దేవదాసి చెల్లెలు సువర్ణ ప్రతిమ వచ్చి, "అక్కా, తాతయ్య స్నానంచేసి పట్టుపంచ కట్టుకొని వస్తున్నాడు!" అనిచెప్పింది.

    సువర్ణ ప్రతిమ అంతా తల్లి పోలిక. తల్లి శ్రీలక్ష్మిని అద్భుత సౌందర్యవతిగా చెప్పుకొంటారు. ఆ చుట్టుపట్ల జనం. పుట్టినప్పుడు సువర్ణప్రతిమ పసిడిబొమ్మగానే ఉండేది. అందుకే తల్లి మురిపెంగా ఆ పేరు పెట్టుకొంది కూతురికి కాని, మధ్య పాలపళ్ళు పోయి గట్టిపళ్ళు రావడంతో చంద్రుడికి మచ్చలాగ అయింది ఆ ముఖానికి. మిట్టపళ్లు వచ్చి ఆ పిల్ల అందాన్ని చెడగొట్టేశాయి. అందుకని, ఇప్పుడా పేరు ఎబ్బెట్టుగా ఉంటుంది కొంచెం.

    తాతగారి సంధ్యావందనం ఏర్పాట్లకు ఆలస్యమైందన్న తత్తరపాటుతో పరిగెత్తింది దేవదాసి.

    దేవదాసి తాతగారు గోపాల దేవులు; సత్పురుషులు; ధర్మపరాయణులు; భక్తితత్పరులు. రాజప్రసాదంవంటి విశాలమైన వారి భవంతిలో దసరా ఉత్సవాలతో, శ్రీరామనవమి ఉత్సవాలో, హరికథలో, భజనలో ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. గ్రామస్తులు మహోత్సాహంతో, నిర్మలాంతఃకరణతో వాటిలో పాల్గొంటారు.

    రోజు రోజుకూ వృద్ధాప్యం పైబడుతూంటే అన్ని వ్యవహారాలనుండి విరమించుకొని, తమ బరువు బాధ్యతలన్నీ కొడుకు సూర్యదేవులకప్పగించి విశ్రాంతిగా కృష్ణా రామా అనుకొంటున్నారు గోపాలదేవులు, మూడు సంవత్సరాలనుండీ.

    ఆయన ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. ప్రత్యేకంగా ఆయనలో అనారోగ్యమేమీ కనబడకున్నా ఎప్పుడూ తమ గదిలోనే కాలక్షేపం చేస్తుంటారు. కాలకృత్యాలకు, స్నాన భోజనాలకు బయటికి వస్తారు. ఆ వచ్చినప్పుడు ఆయనకంట అశుచీ, అశుభ్రమన్నది పడిందీ అంటే కొంపలంటుకొన్నాయన్నమాటే. పని మనుషులవల్ల ఆప్రమాదం ఉంటుందని ఆయన పనులన్నీ కోడలే నిర్వర్తించేది, అత్యంత భక్తి శ్రద్ధలతో. ఈ రెండేళ్ళ నుండి పెద్దకూతురు దేవదాసికి అప్పగించింది ఆమె.

Next Page