Next Page 

అష్టదళం 2 పేజి 1


                             అష్టదళం 2

                                          పోల్కంపల్లి శాంతాదేవి    

 

 

       

    ఒకరోజు రంగసాని ఇంటినుండి మనిషి వచ్చాడు.

     అతడి పేరు చెన్నయ్య.

     "చిట్టికి బాగా సుస్తి చేసింది. వారంరోజులు నుండి తిండిలేదు. మిమ్మల్నిఒకసారి వచ్చి చూడమంది అలివేణి."

    "చిట్టి ఎవరు?" అడిగాడు సూర్య.

     "నీలవేణి కూతురు హరిచందన"

    పేషెంట్లను చూడడం ముగించి, అతడితో బయలుదేరాడు సూర్య.
 
     "ఏమిటీ సుస్తీ?" దారిలో అడిగాడు.

     "ఏం సుస్తీయో, ఏమిటో మాకేమీ అర్దం కావడంలేదు. మీరే వచ్చి చూడండి డాక్టరుగారూ."        గదిలో మంచంమీద దిండ్లకు ఆనుకుని వుంది హరిచందన.

     జుట్టు విరబూసుకుని వుంది.

    తొలకరి ఉరుము హఠాత్తుగా వినిపించినట్లుగా పగలబడి నవ్వింది హరిచందన - సూర్య గడపలో అడుగుపెట్టగానే -

     ఫక్కుమన్నట్లుగా మొదలైన నవ్వు ఆగని ఉరుములా అలా కొనసాగుతూనే వుంది.
     
    ఆ నవ్వు ఎంత అస్వాభావికంగా వుందో, ఆ పిల్ల ముఖమూ అంత అస్వాభావికంగా వుంది.

     విరబోసిన జుట్టు, ఆ ముఖమూ.... ఆ పిల్ల హరిచందన కాదు - చంద్రరేఖ అనిపిస్తోంది.
   
    నవ్వి, నవ్వి ఆ కళ్లలో నీళ్లు.    
   
    ఎర్రగా కందిపోయిన ముఖం.

    గొంతులో నరాలు చిట్లిపోతాయోనన్నట్లుగా  నవ్వి నవ్వి ఏడుపు ప్రారంభించింది.

     గుమ్మం దగ్గరే స్థాణువులా నిలబడి చూస్తున్నాడు సూర్య.

     ఇంత చిన్న వయసులో హిస్టీరియా!

    నరాల బలహీనతో, అణుచుకున్న కోరికో, తీరని అశాంతో కారణం కావాలి ఇలాంటి జబ్బు రావడానికి .
   
    ఇంత చిన్న వయసులో అవి ఆమెలో చోటుచేసుకునే అవకాశం ఎక్కడుంది?

    దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురయినా ఇలా అయ్యే అవకాశముంది.

    కానీ ఆమెకింకా పెళ్లికాలేదు కదా?

    అలా అని పెళ్ళి వయసు మించిపోలేదు కదా? పెళ్లి కాలేదన్న దిగులువల్ల హిస్టీరియా వచ్చిందనుకోవడానికి.

    ఆలోచిస్తూ ఆమె పడుకున్న మంచంవేపు రెండడుగులు వేశాడు సూర్య.

     "అక్కడే ఆగరా. నా దగ్గరికి రాకురా!" పిడుగుపడ్డట్టుగా అరిచింది హరిచందన.

     ముఖంలో, కళ్లల్లో కణకణ మండే అగ్నిలాంటి ఆగ్రహం.

     "వారంరోజుల నుండి తిండిలేదు, నిద్రలేదు. రెప్పయినా మూయలేదు. ఈ వారంరోజులుగా ఆ గొంతులో అంత బలం ఎందుకుందో, ఎక్కడిదో అర్దం కావడంలేదు చినబాబూ!"  ఆవేదనగా అంది నీలవేణి.

    "ఇదివరకు ఇలా ఎప్పుడయినా అయ్యేదా?" మరో రెండడుగులు ముందుకు ఆమెకేసి నడిచాడు.

    ఇంకో రెండు అడుగులు ఆమెకేసి వస్తే ఆమె చేతికందుతుంది.
     
    "ఇలా ఎప్పుడూ కాలేదు."

    అలివేణి నోట్లో మాటుండగానే  వీపు క్రింద వున్న దిండు తీసి విసురుగా సూర్య ముఖంకేసి విసిరింది హరిచందన.

     "రాకు... .నా దగ్గరికి రాకు. చంపేస్తాను!"

    ఆమె మాట లక్ష్య పెట్టనట్టుగా, ఆమెను సమీపించి చేయందుకున్నాడు.

     విసురుగా విదిలించివేసింది అతడిని. ఆ విదిలించడంలో ఏనుగు బలం.

     హిస్టీరియా లక్షణాలతో  ఇలాంటి వైపరీత్యం కూడా చోటు చేసుకుంటుందని తెలుసు అతడికి.

    "పిరికిపందా! నాకు భయపడి చేతికి తాయెత్తు కట్టుకున్నావు కదరా. మళ్లీ నన్ను తాకి, నన్ను మంటలకి గురిచేస్తావురా?" హరిచందన నిలువునా మండిపోతున్న అగ్నిశిఖలా వుంది. ఆగ్రహంతో ఆమె ఎద ఎగిసి ఎగిసి పడుతోంది.

     గోసాయి ఇచ్చిన తాయెత్తు షర్ట్ చేతిలోపల దండకి వుంది. అది పైకి కనిపించదు. కనిపించని తాయెత్తు గురించి ఆమెకి ఎలా తెలిసింది?

    హిస్టీరియా కేసులో వైపరీత్యాలు చోటు చేసుకున్నా, దివ్యదృష్టి మాత్రం కలగదు కదా!

    ఆమెను ఏదో ఆత్మ ఆవహించినట్టుగా స్పష్టంగా తెలుస్తూంటే, ఇది హిస్టీరియా అని మభ్యపెట్టుకోవడంలో అర్దంలేదు.    

    "అది ఏం మాట్లాడుతుందో మీకేమైనా అర్దమవుతోందా చినబాబూ?"

    "అర్దమవుతోంది, బాగా అర్దమవుతోంది."

    "ఏమైంది బాబూ దానికి?"

    "మీ అమ్మాయికి పిచ్చి పట్టింది. పిలిచేబదులు, మంత్రగాడిని పిలిస్తే లాభముంటుంది."

    "నన్ను దెయ్యమంటావురా? నీ నాలుక చీలుస్తాను. నా పేరు చంద్రరేఖ. రంగసాని నా తల్లి. నన్ను మానభంగం చేసి, నా చావుకి కారణమైన నిన్ను, నేను జన్మజన్మలకీ వదలనురా. తాయెత్తు కట్టుకుని బతికిపోయాననుకుంటున్నావేమో? నేను తెగించి నీమీద పడితే, నిన్ను చంపడమో, నేనుమంటల్లో కాలిపోవడమో జరుగుతుందిగానీ, నిన్నిప్పుడే అంత తేలిగ్గా చావనివ్వను. నిన్ను క్షణం క్షణం భయానికి గురిచేసి,చంపుతాను. నువ్వెంత దారుణంగా నన్నుచంపావో, అంత దారుణంగా నిన్ను చంపుతాను. నీ ప్రాణాలు తీస్తాను"

    "నిన్ను పాడుచేసిన వాడు దారుణంగా యాక్సిడెంట్ లో చచ్చాడు. ఇంకా తీరలేదా నీ పగ?"

    "జన్మ జన్మలకీ తీరని పగరా ఇది!"

    "ఏభై ఏళ్ళ క్రిందటి చంద్రరేఖ ఇప్పుడు దీనిమీదికి రావడం ఏమిటి బాబూ? అది పోయేనాటికి పుట్టనైనా పుట్టని మీరు దాన్ని పాడుచేయడం ఏమిటి?" ఆశ్చర్యపోయింది అలివేణి.

    "నేను మాతాతగారి పోలికలతో వుంటానుకదా. నన్నామె మా తాతగారిననుకుని వుంటుంది."

    "తాతాగారి పోలిక కాదురా! తాతవే. ఈ ప్రపంచానికి నువ్వు జయసూర్యవేమోగానీ, నాకుమాత్రం నువ్వు మణిచంద్ర భూపాల్ వే!"

    రంగసాని ఏడుస్తూ హరిచందనను కౌగలించుకుంది.

    "చంద్రా? నువ్వు చనిపోయావన్న విషయమే నాకు తెలియదే. ఆ రోజు మేనాలో బలవంతంగా ఎక్కిస్తుంటే ,"వెళ్లనమ్మా! నాకు పెళ్ళి చేసుకోవాలని వుంది" అని నువ్వు కాళ్లు పట్టుకుని ఏడ్చినా, వినకుండా పంపించాను.  నామీద అలిగినట్టుగా నువ్వు మళ్లీ నా కంటికి కనిపించలేదు. ఎక్కడున్నావో, ఏమైపోయావో తెలియక ఎంత కుళ్లి కుళ్లి ఏడ్చానో? ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లన్నీ ఇంకిపోయాక,  ఇవాళ ఇన్నేళ్ళకి 'చంద్రని' అంటూ నా ముని మనవరాలిమీదకి  వచ్చావా? నువ్వు వాడి చేతిలో చచ్చావా? చస్తే నీ శవమైనా నాకప్పగించలేదే ఆ దుర్మార్గుడు? నిన్ను నా చేతులతో మట్టి చేసుకునే అదృష్టమైనా కలిగించలేదే ఆ పాపిష్టివాడు....."రాగాలు తీయసాగింది.

     "ఎన్నో సార్లు మనింటికి వచ్చానే! నువ్వు ఏడవడం చూసాను. కానీ నీ కళ్లపడలేకపోయాను. ఎక్కడో నేను బ్రతికే వున్నానని నువ్వు అనుకోవడమే మంచిదనిపించింది. "

    ఒళ్ళు మండుకొచ్చింది అలివేణికి.

    "ఎప్పుడో చచ్చిదెయ్యమైనదానితో ఆ కబుర్లేంటి? చంద్రా అంటూ ఆ ఏడుపేంటి? చీపురు తీసుకుని నాలుగు మర్దిస్తే సరి, నా చిట్టికి వారంరోజులుగా కంటికి కునుకు  లేకుండా, కడుపుకు తిండిలేకుండా చేసిందిపాడు దెయ్యం."

    నీలవేణి ఇంత జరుగుతున్నా, మౌనప్రేక్షక పాత్ర వహించింది. ఆమె ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడదు.

     సూర్యకి ఆమెను చూస్తే ఆశ్చర్యం. చిత్రమైన క్యారెక్టర్ అన్పిస్తుంది.

     "ఇహ నాతో పనిలేకపోవచ్చు, నేను వెళ్ళనా?" అడిగాడు సూర్య.
   
    "నాకేమిటో భయంగా వుంది చినబాబూ! వారం రోజులుగా తిండీ, నిద్రాలేకుండా ఎలా బ్రతుకుతుంది? దీని ఆరోగ్యం ఏమవుతుంది? ఇలా ఇంకెన్నాళ్లుంటుంది? నిజంగా దీనికి దెయ్యమే పట్టిందా? ఆమధ్య మునసబుగారి భార్య ఇలాగే దెయ్యం పట్టినట్టుగా చేస్తుంటే, పట్నం తీసికెళ్లి పెద్ద డాక్టర్ కి చూపించాడు. అది హిస్టీరియా అని మందులిచ్చి బాగుచేశారట."

    "నలభై ఏళ్ళ క్రిందట ఈ ఇంట్లో చంద్రరేఖ అనే ఆవిడ వుండేదని, ఈ ఊరి దొరవారి బంగళాకి మేనా ఎక్కివెళ్ళి తిరిగిరాలేదని, తెలుసా హరిచందనకి?"

    "అప్పుడప్పుడు మా అమ్మమ్మ తన పెద్దకూతురు చంద్రను తలుచుకుని, కంటనీరు పెట్టడం చందనకి తెలుసు బాబూ"

    "చిన్నప్పటినుంచి విన్న సంగతులు మనసులో నాటి, ఆ చంద్రని తానేనని ఊహించుకునే అవకాశం హిస్టీరియా కేసుల్లో సంభవమే. మనసు బలహీనపడినప్పుడు  మాత్రమే ఇలా అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తుంటాయి. మనిషి అస్వాభావికంగా ప్రవర్తించడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి, తను విన్న దెయ్యాల కథల్లో పాత్రలకి పాత్రధారులవుతుంటారు. మీరొప్పుకుంటే మీ మనుమరాలిని సిటీకి తీసుకెళ్లి, పెద్ద డాక్టర్ల చేత పరీక్షలవీ చేయించి, ట్రీట్ మెంట్ మొదలుపెడతాను."

    "గాలిచేష్ట అని ఇంత స్పష్టంగా తెలుస్తూంటే, మందుమాకులు ఏం పనిచేస్తాయమ్మా? అంబాజీని పిలుచుకు వస్తాను. ఆయన వాకిట్లో అడుగు పెడితేచాలు. ఎలాంటి దెయ్యమైనా పారపోవాల్సిందే" అన్నాడు చెన్నయ్య.

    "ఆ సందేహం కూడా తీరిపోతుంది. అంబాజీని పిలిచి భూతవైద్యం చేయించమంటారా బాబుగారూ?"

    "డాక్టరుగా నేనటువంటి సలహా ఇవ్వకూడదు! అది మీ  ఇష్టం. డాక్టరు నా అవసరం మీకు పడినప్పుడు పిలిస్తే వస్తాను."


                  *    *    *    *    *    *


    వారంరోజులు గడిచాయి.

    చెన్నయ్య ఉరుకులు పరుగులమీద వచ్చాడు.

    "మీరు త్వరగా రావాలి చినబాబూ! మీరొస్తేనేగానీ చిట్టి దక్కదు."

    "ఇంకా అలాగే వుందా?"

    "అలాగే వుంది! రెండువారాలుగా ఒక మెతుకైనా ముట్టలేదని అన్నం తినమ్మా అని తల్లీ, అమ్మమ్మ బ్రతిమాలితే నాకే అన్నం ఇష్టముండదు. పుట్టతేనె మీద బుద్ది పుడుతుంది" అంటూ ఎన్నడూ గోడలైనా ఎక్కనిపిల్ల, మట్టగోచీ, పెట్టి ఇంటిముందున్న  వేపచెట్టుమీదకి కోతిలా ఎక్కిపోయి చిటారుకొమ్మల్లే తేనెపట్టు వుంటే పిండుకుని త్రాగింది.  ఆ పిల్లను మెల్లగా దింపుదామని ప్రయత్నిస్తే,  దిగదు. ఎవరయినా ఎక్కి, ఆ పిల్లను మెల్లగా ఎక్కితే  దూకేస్తానని బెదిరిస్తుంది. బ్రతిమాలగా, బ్రతిమాలగా డాక్టర్ బాబు వస్తే దిగుతానంది.

    సూర్య వెళ్లేసరికి వేపచెట్టు  కింద జనాలు గుమిగూడి వున్నారు.
   
    అందరి ముఖాల్లోనూ ఆత్రుత, కంగారు.

     ఎక్కేప్పుడు ఎలా ఎక్కిందోగానీ దిగేప్పుడు కొంచెం కాలుజారినా, కొమ్మ విరిగినా ఆపిల్ల క్రిందపడితే కాళ్లూ చేతులు విరగకుండా, తలపగిలి చస్తుంది.

     చిటారుకొమ్మల్లో కూర్చున్న చందననే చూస్తున్నారంతా.
   
    "డాక్టర్ బాబు వచ్చాడే. ఇక దిగి రావే...." అలివేణి ప్రాధేయపడింది.

Next Page