Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 1


                            కరుణశ్రీ సాహిత్యం -2   
                                                          ---- డా|| జంధ్యాల పాపయ్య శాస్త్రి


                         
                                              కరుణశ్రీ
                                            (గౌతమబుద్ధ)        
    
    
                                                 పునరాహ్వానము
    
    దయసేయం గదవయ్య శాక్యమునిచంద్రా! నీ పదస్పర్శచే
    గయిసేయం గదవయ్య భారతమహీఖండంబు; దీవ్యత్కృపా
    మయ మందార మరంద బిందులహరీ మందస్మితాలోకముల్
    దయసేయం గదవయ్య మానవమనస్తాపంబు చల్లారఁగన్.
    
    స్వార్ధజ్వాలల దేశభద్రతలు స్వాహా యయ్యె; విద్రోహముల్
    వర్దిల్లెన్; కుటిల ప్రచారములు దుర్వారంబు లయ్యెన్; మన
    స్పర్దాసంకులమైన యీ జగతికిన్ శాంతిం బ్రసాదింప సి
    ద్దార్ధస్వామి! మరొక్కమారు దిగిరావయ్యా పురోగామివై.
    
    హింసాశక్తులు రక్తదాహమున దండెత్తెన్ దరిద్ర ప్రజా
    సంసారమ్ములపై; పురోగమనముల్ స్తంభించె; స్వాతంత్ర్యమే
    ధ్వంసంబయ్యె; కిరాతశాత శరవిద్దంబైన యిద్దారుణీ
    హంసన్ గాయము మాన్పి కావవలెనయ్యా! రమ్ము వేగమ్మునన్.
    
    ఆటంబాంబుల బీటవారినది బ్రహ్మాండంబు; సద్భావమే
    మోటైపోయెను; పంచశీల పథకమ్ముల్ దుమ్మువట్టెన్; దురా
    శాటోపంబులు హద్దు మీరినవి; పోరాటమ్మెఆరాటమై
    లూటీ చేసిరి మానవత్వమును ఆలోకింపు లోకప్రభూ!
    
    హాలోన్మత్తులు దేవదత్తులు; జిఘాంసాలోలులౌ అంగుళీ
    మాలుల్ రేగిరి; లోభ మోహ మద కామ క్రోధ మాత్సర్యదు
    ర్వ్యాళక్ష్వేళ కరాళ హాలహల కీలాభీలమై అల్లక
    ల్లోలమ్మయ్యె జగమ్ము సర్వము దయాళూ! రమ్ము రక్షింపగన్.
    
    ఘీంకారంబొనరించుచుం బయికి దూకెన్ చీనిచీనాంబరా
    లంకారమ్ముల కొమ్ముటేన్గు; తడవేలా శాక్యసింహా! యికన్
    జంకుం గొంకును లేని నీ మధుర హస్తస్పర్శతో తన్మనో
    హంకారం బెడలించి పాదముల సాష్టాంగంపడంజేయవే!
    
    యుద్దజ్వాలలు మూగె; భీతిలి జగమ్ముయ్యాలలూగెన్; రుషా
    క్రుద్ధవ్యాఘ్రము గాండ్రుగాండ్రు మనుచున్ గ్రెన్నెత్తురుల్ త్రాగె; జా
    త్యౌద్దత్యమ్ములు రేగె; దుండగుల యత్యాచారముల్ సాగె; నో
    సిద్దార్ధా! ప్రళయాగ్ను లార్పవె! ప్రజాశ్రేయమ్ము చేకూర్పవే!

                                     శుద్దోదనుఁడు
    

    ఏ దివ్యతేజస్వి యౌదార్యనిరతి బృం
        దారకవితతి విందారగించు
    ఏ శాంతనిధి భావవైశాల్య గరిమ ప్రా
        క్పశ్చిమాంబుధుల కైక్యము ఘటించు
    ఏ నిశ్చలధ్యాని మౌనముద్ర సమస్త
        భారతావనికి సౌభాగ్యరక్ష
    ఏ మేటి యౌన్నత్య మీనాఁటి కానాఁటి    
        కేనాఁటి కెవ్వ రూహింపలేరు
    
    ఏ సదయమూర్తి హృదయవాహినుల చలువ    
    మంటిలోనుండి బంగారుపంట లెత్తు
    ఆ మహీధరమండలస్వామి యలరు
    నలఘు మహిమాలయుండు హిమాలయుండు.
    
    ఈ హిమశైలరాజమున కించుక దక్షిణమందు, రోహిణీ
    వాహిని యొడ్డునన్, గపిలవస్తుపురమ్ము సమస్త వస్తు స
    మ్మోహకమై విరాజిలు, సమున్నత సౌధ చిరత్న రత్న సం
    దోహ కళా విలాసములతో జిత దైవతరాజధానియై.
    
    ఆ దరహాసభాసురముఖాంబురుహమ్ము నిజప్రజాళి కా
    మోదము గూర్ప, శాక్యకులముఖ్యుఁడు తత్పుర మేలుచుండు శు
    ద్దోదాన మేదినీపతి; శుభోదయుఁడై యనురాగరంజితా
    హ్లాదకరప్రబుద్ధకమలాకరుడై సుమనోభిరాముడై.
    
    క్షాత్రకులావతంసుఁడగు శాక్యనృపాలు విశాలశీతల
    చ్చత్రము క్రింద చల్లగ, ప్రశాంతిగ, కాలము బుచ్చుచుందు రే
    మాత్రము లోటులేక, యసమర్ధత కెక్కడ చోటులేక, సా
    ర్వత్రిక సౌఖ్యజీవనపరంపర తామరతంపరై ప్రజల్.
    
    ఐక్యము డిగ్గలేదు ప్రజలందు; వెలందుల నాత్మగౌరవా
    ధిక్యము తగ్గలేదు; రణధీరులు పూరుషు లెల్ల; రత్న మా
    ణిక్యములే కుమారులు; పునీతము ధర్మము; లోప మెన్నఁగా
    శక్యము గాదు శాక్యపరిషత్ పరమేశ్వరు పాలనమ్మునన్.
    
    ఆ యుర్వీవిభుఁ డాభిజాత్యవతు, లన్యోన్యానురక్తల్, మహా
    మాయాదేవి మహాప్రజాపతి యసామాన్యల్ యశోధన్యలౌ
    జాయారత్నము లిర్వురుం గొలువ నిచ్చల్ వొల్చు, నాపద్మినీ
    ఛాయా సంగతి సప్తరశ్మిగతి, నిస్తంద్రప్రభాసాంద్రుఁడై.
    
    శాంతి అహింస యొక్కటయి సత్యముతో జతగూడినట్లు, వి
    క్రాంతియుఁ గాంతియుం బురుషకారముతో సమసించినట్లు, వా
    సంతికయున్ లవంగియు రసాలముతోఁ బెనగొన్నయట్టు, ల
    క్కాంత లనారతమ్ము ప్రియకాంతు భజింతు రభిన్నచిత్తలై.
    
    ఆ కలకంఠకంఠుల రసార్ద్ర రహఃప్రణయైకకాకలీ
    శ్రీకి వసంతుఁడై, గుణవశీకృతసర్వదిగంతుఁడై, ప్రజా
    నీకము నేలు రాజు; నిజనిర్మలకీర్తిపతాక లుల్ల స
    న్నాక తరంగిణీ విలసనమ్ముల నుల్లసనమ్ము లాడఁగన్.
    
                                             
    స్యందన పంక్తులా! ద్విరదజాలమూలా! హయరాజులా! స్ఫుర
    న్మందిరపాళులా! సుభటమండలులా! ధనధాన్యరాసులా!
    ఎందుఁ గొరంతలేదు మనుజేంద్రునకున్; గరవయ్యె జీవితా
    నందరసైకకంద మొక నందన ముగ్ధ ముఖారవిందమే!
    
    ఆ యినవంశవార్నిధిహిమాంశుని పట్టపుదేవియౌ 'మహా
    మాయ' ప్రియానురాగ సుమమాలల హాయిగ తీయతీయఁగా
    నూయలలూగుచున్ గనియె నొక్క కలన్ బరమప్రమోదసం    
    ధాయకమైనదాని నొకనాఁటి ప్రశాంతనిశాంతమం దిటుల్ -


Next Page 

  • WRITERS
    PUBLICATIONS