"మహాత్మా! ద్రోణాచార్యా! మేము అడవులలో బహుకాలము ఇడుములుపడి వచ్చినాము. ఆపన్నులము. మీరు కరుణించవలెగాని కోపించరాదు. నేను మీ శిష్యుడను. ముందుగా మీ మీద బాణము వేయజాలను. ముందు మీరు బాణము వేయుడు".
అర్జునుని మాటలు విన్నాడు. ద్రోణుడు చిరునవ్వు నవ్వినాడు. మాటాడలేదు. అర్జునుని మీద ఇరువది బాణములు ప్రయోగించినాడు. అర్జునుడు వానిని నడుమనే త్రుంచినాడు.
ద్రోణార్జునులు భయంకరముగా యుద్దము చేసినారు.
ద్రోణుని బాణములు ఒకే పంక్తివలె ఏర్పడి అర్జునునివైపు సాగినవి. అర్జునుని బాణములు వాటిని విరిచి నేలకూల్చినవి. ద్రోణుని బాణములు హంసల సమూహమువలె కనిపించినవి. అర్జునుని బాణములు మేఘమువలె కనిపించినవి.
ద్రోణుడు ఇంద్ర, ఆగ్నేయ, వాయవ్య, వారునాస్త్రములను ప్రయోగించినాడు. అర్జునుడు ఆ దివ్యాస్త్రములను విఫలము చేసినాడు. అప్పుడు అర్జునుడు మహా భయంకరములయిన క్రూర బాణములను ద్రోణుని మీద గుప్పినాడు. అర్జునుని బాణ సముద్రమందు ద్రోణుడు మునిగినట్లుండగా, సకల కౌరవ సైన్యములోని వారందరును హాహాకారములు చేసినారు. ద్రోణుని భుజబలము క్రమముగా తగ్గినది.
అప్పుడు ద్రోణుని కుమారుడు అశ్వత్ధామ అర్జునుని ఎదిరించుటకు నిలిచినాడు. వారిరువురు దేవేంద్ర వృత్రాసురులవలె భయంకరముగా పోరినారు. అర్జునుడు అశ్వత్దామ రథమునకు పూన్చిన గుర్రములను నొప్పించినాడు. అశ్వత్ధామ అర్జునుని వింటినారిని నరికినాడు. అర్జునుడు వింటినారిని సరిచేసుకొను లోపల అశ్వత్ధామ అర్జునునిపై ఎనిమిది బాణములు వేసి సింహనాదము చేసినాడు. అదనుచూచి కౌరవ సైన్యములు అర్జునుని మీద పడినవి. అర్జునుడు నారిని సరిచేసుకొని పిడుగుల వంటి బాణములను కౌరవ సైన్యముల మీద గుప్పినాడు. అశ్వత్ధామ అర్జునుని బాణముతో నరుకుటకు అస్త్రములు ప్రయోగించినాడు. అశ్వత్ధామార్జునుల బాణముల తాకిడికి ఆకసమున మంటలు రేగినవి. ఈలోన అశ్వత్ధామ అంబులపొదల యందలి బాణములు వడిసిపోయినవి. అర్జునుడివి అక్షయ తూణీరములు. అతడు బాణములు ప్రయోగించుచునే ఉన్నాడు. అది చూచినాడు కృపాచార్యుడు. అశ్వత్ధామకు అడ్డుగా నిలిచి అర్జునుని ఎదిరించినాడు.
కృపాచార్యుడు తీక్షణములయిన బాణములను ప్రయోగించినాడు. అర్జునుడు అతివేగముగా బాణములను విరిచినాడు. కృపాచార్యుడు మండిపడినాడు. అర్జునుని కపిధ్వజమును కూల్చినాడు. అనేక బాణములను అర్జునుని మీద ప్రయోగించినాడు. సింహనాదము చేసినాడు. అది చూచినాడు అర్జునుడు అగ్గి అయినాడు. గొప్ప బాణములను వేసినాడు. కృపుని రాథపుకాడిని విరిచినాడు. చక్రములను కూల్చినాడు. గుర్రములను చంపినాడు. నొగలను నుగ్గు నుగ్గు చేసినాడు. సారథిని వధించినాడు. కృపుని రొమ్మున క్రూర భల్లాయుధమును నాటినాడు. విరథుడయి, భల్లాయుధమున నొచ్చిన కృపాచార్యుడు ఊరకుండ లేదు. అతడు అర్జునుని పై శక్తి ఆయుధమును ప్రయోగించినాడు. అది మంటలు కక్కుచు అర్జునుని మీదకు ఉరికినది. అర్జునుడు దానిని తునకలుగా నరికినాడు. కృపాచార్యునకు చేయునది తోచలేదు. అతడు తన చేతికి అందిన కత్తులను అర్జునుని మీదకు విసరినాడు. అర్జునుడు దానిని మధ్యనే నరికినాడు. కృపాచార్యుడు అశ్వత్ధామ రథమును ఎక్కినాడు. అది చూచిన కౌరవ సైన్యములు భయపడి హాహాకారములు చేసినవి. సైన్యము సాంతము భీష్ముని రథము వెనుకకు చేరినది.
భీష్ముడు బెదిరిన సైనికులను చూచినాడు. శంఖము పూరించినాడు. వారిలో ఉత్సాహము కలిగించినాడు. సైనికులను హెచ్చరించినాడు. అర్జునునితో యుద్దమునాకు తలపడినాడు. అర్జునుడు భీష్ముని చూచినాడు. అతడు రుద్రునివలె ఉన్నాడు. అర్జునుడు దేవదత్తము పూరించినాడు. కాని బాణము ప్రయోగించలేదు. తొలి బాణము భీష్ముని నుంచి రావలెనని వేచినాడు. భీష్ముడు గ్రహించినాడు. చిరునవ్వు నవ్వినాడు. భీష్ముడు బాణము వేసినాడు. అర్జునుడు బాణములు కురిపించినాడు.
భీష్మార్జునుల యుద్దము దేవదానవుల యుద్దమువలె కనిపించినది.
భీష్ముడు ఎనిమిది బాణములు వేసినాడు. అర్జునుని ధ్వజము త్రుంచినాడు. పది బాణములు వేసినాడు. గుర్రములను, ఉత్తరుని కొట్టినాడు. అర్జునుడు గాండీవమును చక్రాకారముగా తిప్పుచు అనేక అస్త్రములను ప్రయోగించి అగ్నివలె జాజ్వల్యమానుడయి వెలుగొందినాడు. అది చూచిన భీష్ముడు అనేక అస్త్రములను ప్రయోగించినాడు. వాటిని అన్నింటిని అర్జునుడు వ్యర్ధము చేసినాడు. భీష్ముని వింటిని నడుముకు నరికినాడు. భీష్ముడు జతలు నరికిన సింహమువలె మహాకోపమునొంది మరొక ధనుస్సును అందుకొని అర్జునునిపై క్రూర బాణములను పరంపరాలుగా పంపినాడు. అర్జునుడు వాటిని పరంపరలుగా నరికినాడు. భీష్ముని చక్ర రక్షకులు అర్జునుని మీద దూకినారు. అర్జునుడు వారిని చిటికెలో హతమార్చినాడు. అర్జునుడు బాణములు వేసి భీష్ముని నొప్పించినాడు. ధనుస్సును విరిచినాడు. భీష్ముని రొమ్ము నందు క్రూర బాణములు నాటినాడు. ఆ దెబ్బలకు భీష్ముడు మూర్చిల్లి నొగలమీద వాలినాడు. భీష్ముని సారథి అది చూచినాడు. రథమును తొలగించి తీసుకొనిపోయినాడు. అర్జునుడు అది చూచినాడు. రథమును తొలగించి తీసుకొనిపోయినాడు. అర్జునుడు అది చూచినాడు. సింహనాదము చేసినాడు. అతనికి అంతటితో తృప్తి కలుగలేదు. అతడు కౌరవ సైన్యము వైపునకు చూచినాడు. ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్ధామలు కనిపించినారు. వారందరు తనచేత ఓడినవారు. దూరమున దుర్యోధనుడు కనిపించినారు. ఉత్తరునితో చెప్పినాడు-దుర్యోధణుని మీదకు రథము తోలమన్నాడు. కౌరవ సైన్య మధ్యము నుండి అర్జునుని రథము దుర్యోధనునివైపు సాగినది.
దుర్యోధనుడు అర్జునుని ఆక్రమణ చూచినాడు. విజ్రుంభించినాడు. అర్జునుని మీద బాణములు కురిపించినాడు. అర్జునుడు అది చూచినాడు కోపించినాడు. కనుబొమలు ముడిచినాడు. రెండు బాణములను దుర్యోధనుని రొమ్మున నాటినాడు. ఆ బాణ ఘాతములకు దుర్యోధణుని రొమ్మున రక్తధారలు కారినవి. ఆ రక్తదారాలు మదపుటేనుగు మదజలధారలవలె ప్రకాశించినవి. దుర్యోధనుడు అర్జునుని మీదకు ఉరికినాడు. బాణములను అర్జునుని నొసట నాటినాడు. నొసటి నుండి రక్తము స్రవించగా అర్జునుడు బాల సూర్యునివలె తేజరిల్లినాడు.


