ఉత్తర గోగ్రహణము
గోగణములు ఉపప్లావ్యమునకు వెళ్ళుటకు నిలుపదలచినాడు దుర్యోధనుడు. కొంత సైన్యముతో వాటిని వెంబడించినాడు. అది చూచినాడు అర్జునుడు. దుర్యోధనుని మీదకు ఉరికినాడు. అర్జునుని దుర్యోధనుని వైపు సాగనివ్వక భీష్మ, కర్ణులు వేయేసిమంది సైనికులతో అర్జునునకు అడ్డునిలిచినారు. అర్జునుడు గోవులను మరలించినందున, దుర్యోధనుడు నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరిగివచ్చినాడు. కౌరవ సైన్యముల వెనుక నిలిచినాడు.
దుర్యోధనుడు వెనుదిరుగుట చూచిన అర్జునుడు ఆనందోత్సాహములతో ఉబ్బిపోయినాడు. "ఉత్తర కుమారా! దుర్యోధనుడు ఎక్కడ ఉన్నను వానివైపు రథము తోలుము. దుర్యోధనునకు ఎవరు అడ్డము వచ్చినను వారిని దునుమాడెదను" అన్నాడు.
కౌరవులకు అర్జునుడు ప్రచండాగ్నివలె కనిపించినాడు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్ధామ, కర్ణులు అతిరభసముగా అర్జునుని మీదికి వచ్చినారు. దుశ్శాసన, దుష్ప్రహ, దుర్ముఖాది దుర్యోధణుని సోదరులు, శకుని సైంధవులు మున్నగు బంధుజనులు, బాహ్లిక సోమ దత్తాది సామంతులు ఒక్కసారియే అర్జునుని మీదకు దండెత్తినారు. వారు ఏనుగుల గుంపులను అర్జునుని మీదకు తోలినారు. గుఱ్ఱపుదండు లను అర్జునునిమీదకు ఉరికించినారు. కాల్బల సైన్యములతో అర్జునుని ముట్టడింప చేసినారు.
అర్జునుడు అది చూచినాడు. విజృంభించినాడు. రథమును కౌరవసైన్యములోనికి ఉరికించినాడు. ఏనుగులను కూల్చినాడు. గుర్రములను రాల్చినాడు. ఆటలాడు పద్దతిని కౌరవ సైన్యమును చీల్చి చెండాడినాడు. కౌరవ సైనికులు అనేకులు కూలినారు. మిగిలినవారు అర్జునుని చూచి భయపడినారు. పక్కకు తొలగినారు. తప్పుకున్నారు.
యుద్ద భూమి సాంతము రక్త సిక్తమయినది. సైనికులు భీతావహము చెంది కేకలు పెట్టినారు. తమ బలములు చెదిరి పోవుటను చూచిన భీష్మ, ద్రోణ, కర్ణ అశ్వత్ధామాదులు అర్జునుని ఎదిరించుటకు సిద్దమయి నిలిచినారు.
అర్జునుడు వీరాధి వీరులను చూచినాడు. ఉల్లాసము గలవాడు అయినాడు. దివ్య బాణములచేత ప్రకాశించినాడు. ద్రోణుని మీద డెబ్బది బాణములు వేసి నొప్పించినాడు. అశ్వత్ధామ మీద ఏడు బాణములను, కృపాచార్యునిమీద పది బాణములను, దుష్ప్రహుని మీద పన్నెండు బాణములను, దుశ్శాసనుని మీద పదిహేను బాణములను, శకునిమీద ఎనిమిది బాణములను, భీష్ముని మీద అరువది బాణములను ప్రయోగించినాడు. కర్ణుని గుర్రములను నొప్పించినాడు. సారథి కవచమును చీల్చినాడు. కర్ణుని మర్మస్థానమున గల ఎముకలను నొప్పించినాడు.
అప్పుడు కర్ణుడు కోపించినాడు. మండిపడినాడు. అర్జునుని గుర్రములను కొట్టినాడు. ఉత్తరుని దేహమున బాణములు గుచ్చినాడు. పన్నెండు బాణములు అర్జునుని మీద ప్రయోగించినాడు. అర్జునుడు మహా కోపము గలవాడయి బాణ సమూహములచేత కర్ణుని ఆక్రమించినాడు. గరుత్మంతుని రెక్కలు సర్పములను ఆక్రమించినట్లు అర్జునుని బాణములు కర్ణుని ఆక్రమించినవి.
కర్ణార్జునుల యుద్దము ప్రళయ భయంకరముగా కనిపించినది. కౌరవ సైనికులు వారి యుద్దమును చూచి ఆశ్చర్యపడినారు.
కర్ణుడు అగ్నివలె ప్రకాశించినాడు. కర్ణుని టెక్కెము అగ్ని జ్వాలవలె వెలిగినది. కర్ణుని బాణములు అగ్ని శిఖలవలె మండినవి.
అర్జునుడు మేఘమువలె ప్రకాశించినాడు. అతని బాణములు వర్షధారలు అయినవి. అతని ధ్వజము మెరుపువలె వెలిగినది. అర్జునుడు మేఘ బాణములను వర్షధారలచేత కర్ణుని గర్వమనెడి అగ్నిని చల్లార్చినాడు.
కర్ణుడు మరల క్రూర బాణములను అర్జునుని మీద ప్రయోగించినాడు. అర్జునుడు రోషకషాయిత నేత్రుడయి అనేక దృఢ, ప్రకాశ, ఘోర, తీక్ష, క్రూర భల్లాయుధములను కర్ణుని దేహమందు గుప్పినాడు. అవి కర్ణుని శిరస్సు నందును, నొసటి యందును, కంఠము నందును, భుజముల యందును, రొమ్ముల యందును దట్టముగా పిడుగులవలె గ్రుచ్చుకున్నవి. ఆ దెబ్బలకు కర్ణుడు భయపడినాడు. భూమి అదరునట్లు రథములను తోలించి పారిపోయినాడు.
కర్ణుడు పారిపోవుటణు చూచినాడు. ఉత్తరుడు సంతోషాతి రేకమున సింహనాదము చేసినాడు. అర్జునుడు దేవదత్తమును పూరించినాడు. దానితో దిక్కులు పిక్కటిల్లినవి.
"మహావీరా! అర్జునా!" ఉత్తరుడు ముకుళిత హస్తుడయి అన్నాడు "నీ పరాక్రమము అసమానము. నీతేజస్సు అంతకంతకు అభివృద్ధి చెందుచున్నది. నాకనులు చీకట్లు కమ్ముచున్నవి. నాకు భయమగుచున్నది. ఇక నేను రథమును నడిపించాజాలను".
"ఉత్తర కుమారా! కౌరవ సేనావాహినిలో కర్ణుడే మొనగాడు. అతడు ఓడినాడు. పారినాడు. ఇంక విజయము మనను వరించినట్లే. నీవు ధైర్యముగా ఉండుము. అదిగో ద్రోణాచార్యుడు మనవైపునకే వచ్చుచున్నాడు. రథము అతనివైపు తోలుము" అన్నాడు అర్జునుడు.
ద్రోణార్జునుల రథములు ఎదురుబదురుగా నిలిచినవి. వారు పోరుకు తలపడనున్న మహాగజములవలె ఉన్నారు. అర్జునుడు ద్రోణునకు నమస్కరించినాడు. అన్నాడు:-


