Next Page 

నన్ను ప్రేమించవు పేజి 1


                            నన్ను ప్రేమించవూ
                                                

                                         -మంజరి
   
                                                                       నాంది

                                                    

                                                    

  

  రాత్రి ఎనిమిది దాటింది సమయం.
    ప్రతి రోజూ కొన్నివేల మంది ప్రయాణం చెయ్యడానికి ఉపయోగపడే విశాలమైన విశాఖపట్టణం రైల్వేస్టేషన్ రద్దీగా ఉంది. రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్య నాలుగైదు ఎక్స్ ప్రెస్ రైళ్ళు తరచుగా ఒకేసారి ఆ స్టేషన్ కి వస్తాయి. అందుచేత ఆ సమయంలో రైల్వేస్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది.
    రాత్రి సమయంలో విశాఖపట్నం రైళ్ళు వస్తుంటే ముప్పై కిలో మీటర్ల దూరం ఉండగానే స్టీల్ ప్లాంట్ లో వెలుగుతున్న దీపాలకుంతి "విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు" అని నినదిస్తున్నట్టు దేదీప్యమానంగా కనిపిస్తుంది. అటువంటి విశాఖ పట్టణానికి రాష్ట్రంలోని పట్టణాల నుండి పల్లెల నుండి ప్రతి దినం వేలమంది బ్రతుకు తెరువుకోసం వస్తారు. అలా వచ్చే ప్రతివాళ్ళూ తమతోపాటు ఒక కథ తీసుకొస్తారు. స్పందించే హృదయముంటే ప్రతి కథ వెనుక కష్టాలు, కన్నీళ్ళు గమనించవచ్చు.
    సరిగ్గా పదిహేను గంటల తరువాత జరగబోయే ఒక సంఘటనలో భాగస్తులైన నలుగురు వ్యక్తులు వివిధ ప్రదేశాల్లో ఉన్నారు. ఎక్స్ ప్రెస్ ట్రైన్ కి లైను ఇవ్వటంకోసం దువ్వాడ రైల్వే స్టేషన్ లో అరగంట క్రితం నిలిపిన ప్యాసింజర్ రైల్లో కిటికీ ప్రక్కన కూర్చొని స్టీల్ Editప్లాంట్ లోని దీపాలను ఆసక్తిగా చూస్తున్నాడు ఒకతను.
    అతని పేరు రామకృష్ణ.
    రాత్రి తొమ్మిది దాటిన తరువాత రైల్వే స్టేషన్ కి వచ్చింది ప్యాసింజర్ రైలు. చాలా కంపార్ట్ మెంట్లు ఖాళీగా ఉన్నాయి. అది చివరి స్టేషన్ కావడం వల్ల ఆరవనెంబరు ప్లాట్ ఫాం కేటాయించారు దానికి. షుమారు పదిమంది ప్రయాణీకులు క్రిందకు దిగారు.
    ఫ్లాట్ ఫాం మీద అడుగుపెట్టాడు రామకృష్ణ.
    అతనికి పాతిక సంవత్సరాలు ఉంటుంది వయసు. సాదా దుస్తులు వేసుకున్నాడు. ఓ కాగితం ప్యాకెట్ అతని చేతిలో ఉంది. దానిని జాగ్రత్తగా పట్టుకున్నాడు. అతను రైల్వే స్టేషన్ పరికించి చూసాడు. విద్యుద్దీపాల కాంతి పరుచుకున్న స్టేషన్ సందడిగా కనిపించింది. అతను విశాఖ పట్టణం ఎప్పుడూ రాకపోవడం వల్ల అలాగే నిలబడి చూస్తుండిపోయాడు. కంపార్ట్ మెంట్లని వదిలి ప్రక్కలైను లోంచి వెళ్ళిపోయింది ఇంజను. రైల్వే సిబ్బంది కంపార్టుమెంట్ల తలుపులు మూయసాగారు.
    పది నిముషాల తరువాత రామకృష్ణ అక్కడ నుంచి కదిలి మొదటి ఫాట్ ఫాం మీదకు చేరుకున్నాడు. స్టాల్స్ దాటుకుంటూ గేటు వద్ద టిక్కెట్ ఇచ్చి బయటకొచ్చాడు. స్టేషన్ ముందున్న విశాలమైన ఆవరణ రిక్షాలతోను, ఆటో రిక్షాలతోను నిండి ఉంది.
    రామకృష్ణ రోడ్డు పైకి వచ్చి ఆగాడు.
    "దగ్గరలో లాడ్జి ఉందాండి?" రోడ్డు ప్రక్క నిలబడ్డ ఒకతన్ని అడిగాడు.
    "ఆ రోడ్డులో ఉంది...." చెప్పి చేత్తో చూపించాడు.
    అతను చూపించిన రోడ్డులోకి నడిచాడు. అక్కడ వరుసగా లాడ్జీలు కనిపించాయి. ఓ చిన్న లాడ్జీలోకి నడిచి.
    "ఒక మడత మంచం కావాలి..." అడిగాడు.
    "ఐదు రూపాయలు..." చెప్పాడు కౌంటర్ లోని వ్యక్తి.
    రామకృష్ణ ఐదు రూపాయలు చెల్లించాడు. లాడ్జి పై భాగంలో హాలు మాదిరిగా ఉన్నచోట వరుసగా వేసిన మడత మంచాల్లో ఒకటి అతనికి ఇవ్వబడింది. దుప్పటి, దిండుఅడిగాడు రామకృష్ణ. దానికిఅదనంగా రెండు రూపాయలు ఇమ్మన్నాడు బోయ్.
    "వద్దులే..." చెప్పాడు.
    బాత్ రూమ్ కి వెళ్ళి మొహం కడుక్కుని, తను తెచ్చిన ప్యాకెట్ విప్పి అందులోంచి టవల్ తీసి తుడుచుకున్నాడు. ప్యాకెట్ తిరిగి కట్టేసి దానిని కౌంటర్ లో ఇచ్చిబయటకొచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత సినిమా హాలు ఎదురుగా బండి కనిపించింది. ఆ బండి చుట్టూ రిక్షా కార్మికులు ఉన్నారు.
    రామకృష్ణ వాళ్ళతో కలిశాడు.
    భోజనం కావాలంటే పదిహేను రూపాయలు ఖర్చు చెయ్యాలి. రేపు సాయంకాలం వరకూ అక్కడే ఉండాలి. తన వద్దనున్న కొద్దిపాటి డబ్బు ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే, తెలిసిన వాళ్ళెవరూ లేని ఆ నగరంలో ఇబ్బందులు పడాలి. ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేస్తే తప్ప తిరిగి ఇంటికెళ్ళడానికి చార్జి మిగలదు. అందుచేత విశాఖపట్టణంలో అతి చౌకగా లభించే రోడ్డు ప్రక్క బండిలోని ఇడ్లీ తినసాగేడు.
    అప్పుడే అదే బండికి ఎదురుగా న్న వీధిలోకి తిరిగాడో వ్యక్తి.
    అతను వెంకటేశం.

                                 *    *    *    *
    వెంకటేశం ఆర్.టి.సి. డ్రైవరుగా మద్దిలపాలెం డిపోలో పనిచేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అతనికి పెళ్లయింది. పెళ్ళిలో ఇవ్వగా మిగిలిన కట్నం తీసుకు రమ్మని వెంకటేశం తల్లి అతని భార్యని వేధించేది. తల్లికి ఎదురు చెప్పడం అలవాటు లేని వెంకటేశం ఆ నిర్ణయం పట్టించుకునేవాడు కాదు. కట్నం వ్యవహారం అతనికి సంబంధించినది కాదు అనుకునేవాడు. అలా అనుకోవడమే అతని కొంప ముంచింది.
    ఒకరోజు కోడలితో తగువు పెట్టుకున్న వెంకటేశం తల్లి ఆవేశంతో కోడలిపైన కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వెలిగించి అంటించింది. అప్పటి వరకూ ఆ తగువులో కల్పించుకోని వెంకటేశం చప్పున భార్యవైపు పరిగెత్తాడు. శరీరం కాలడం వాళ్ళ కలిగిన బాధ భరించలేక ఆమె లోపలకు పరిగెత్తింది. వెంకటేశం ఆమె వెంట పరిగెత్తి చాప అందుకుని భార్యకు చుట్టి క్రిందపడేసి మంటలు ఆర్పాడు. ఆమె కట్టుకున్న పాలిష్టర్ చీర కాలి చర్మానికి అంటుకుపోయి దొర్లించడం వలన చర్మం మొత్తం ఊడిపోయింది. ఆమె హృదయ విదారక ఆర్తనాదాలు వెంకటేశం గుండెల్ని పిండేసాయి.
    అప్పుడు గ్రహించాడు, తల్లి భార్యని వేధిస్తున్నదని తెలిసి తెలియనట్టు నటించడం ఎంత తప్పో, ఆమె వారం రోజుల పాటు ఆస్పత్రిలో నరకయాతన అనుభవించి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి, కొడుకుల్ని అరెస్ట్ చేసారు. ఆ కేసు నుండి బయటపడడానికి, ఉద్యోగం నిలుపుకోవడానికి ఎకరం పొలం అమ్మాడు.
    తల్లి డబ్బుకోసం తన భార్యని వత్తిడి చెయ్యటం, తగువుకి సిద్దపడటం వెంకటేశానికి తెలుసు. ఇటువంటి నిర్ణయాలు భార్య చెప్పేవరకూ భర్తకి తెలియదని అనుకోవడం తప్పు. ఇంట్లో భార్యపడే ఇబ్బందులు ఏదో రూపంలో భర్తకి తెలుస్తాయి. వాటిని గుర్తించకపోతే భర్తగా అతను తన బాధ్యతలు నెరవేర్చలేక పోయాడని, మనిషిగా ఏదో లోపం ఉందని అర్ధం. తెలిసి కూడా మౌనంగా ఉన్నాడంటే భార్య పుట్టింటి నుంచి డబ్బు తేవాలని ఆశిస్తున్నాడన్న మాట.
    సరిగ్గా అదే జరిగింది వెంకటేశం నిర్ణయంలో. దానికి అతను మూల్యం చెల్లించాడు.
    రేపు ఉదయం ఐదు గంటలకు అతను డ్యూటీకి వెళ్ళాలి. తనకి బదులుగా మరో డ్రైవర్ని ఆ డ్యూటీకి పంపి, తను మధ్యాహ్నం డ్యూటీ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఆ వీధి లో నివసిస్తున్న ఇంకో డ్రైవరు ఇంటికి వెళుతున్నాడు.
    ఆ వీధికి సరిగ్గా కిలోమీటరు దూరంలోని సారా కొట్టులో సారా త్రాగుతున్నాడు ఆశిరయ్య.

                                *    *    *    *
    ఆశిరయ్య ఏభై సంవత్సరాలు ఉంటుంది వయసు. ఆ వయసులో కూడా అతను బలిష్టంగా ఉంటాడు. ముప్పై సంవత్సరాల నుండి ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో కూలీగా పని చేస్తున్నాడతను.
    భార్యపోయి పదేళ్ళు అయింది. అతనికి ఇద్దరూ ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. నాలుగు నెలల క్రితం రెండో అమ్మాయి ఇంటికొచ్చింది. ఆమె తిరిగి భర్త దగ్గరికి వెళ్ళలేదు. ఆశిరయ్య ఎంత వత్తిడి చేసినా తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోలేదు.
   ఓ పెద్ద మనిషిని తీసుకొని అల్లుడు దగ్గరకు వెళ్ళాడు ఆశిరయ్య అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు. ఎవరో ఒకామె కూడా ఉంది. ఆమె మెడలో పుస్తెల తాడు క్రొత్తగా కనిపిస్తోంది. ఆమె కదలికలు స్వతంత్రం ఉన్న మనిషి కదలికల్లా ఉన్నాయి. అల్లుడికి నచ్చ చెప్పడానికి వచ్చిన ఆశిరయ్యలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఆ రోజు అక్కడే ఉండి పెళ్ళికిచ్చిన కట్నం, వస్తువులు నెల రోజుల్లో తిరిగి ఇవ్వడానికి అల్లుడితో ఒప్పందం చేసికొని తిరిగొచ్చాడు.
    పది రోజులక్రితం చిన్న కూతురికి మరో పెళ్ళిచేశాడు. అతను గాజువాకలో టైలరింగ్ షాపు పెట్టుకున్నాడు. జీవితంలో భార్య, భర్త విడిపోవడం ఎంతో కష్టంతో కూడిన పని. కాని కొంతమంది విషయంలో విడిపోవడం, తిరిగి పెళ్ళి చేసుకోవడం సులభంగా, చట్ట ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఇప్పుడు ఆశిరయ్య సంతోషంగా ఉన్నాడు, అలాంటి సంతోషం కలిగినప్పుడు స్నేహితుల్ని తీసుకొని సారా కొట్టుకి వెళతాడు. సంతోషంగా లేనప్పుడు వెళ్ళడని కాదు. అప్పుడు మనసు బాగోలేదని వెళతాడు. జీతం తీసుకున్నరోజు డబ్బు ఎక్కువగా ఉందని త్రాగుతాడు. పులి మేక ఆటలో వస్తే వాటికి మరికొంత చేర్చి సారాకి ఖర్చు చేస్తాడు. డబ్బులు పోతే పోయయనే దిగులుతూ త్రాగుతాడు.

Next Page