Next Page 

సంసారంలో శ్రీశ్రీ పేజి 1

                     

                                          సంసారంలో  శ్రీ శ్రీ


                                                                        __సరోజా శ్రీ శ్రీ

                                                         రెండవ భాగం   

                                               మనిషికి ఒక జన్మ చాలు

    మరుసటిరోజు  పళ్ళూ, హార్లిక్సూ  వగైరా  తీసుకొని  హాస్పిటల్ కు వెళ్ళాను. ఇంకా ఆవిడ రాలేదు. డ్రైవర్ సుబ్బారావు టిఫిన్ తెచ్చి, ఆవిడ్ని  తీసుకురావడానికి  వెళ్ళాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి, "రేపు ఉదయం  ఆపరేషన్  ఏడు గంటలకే  చేస్తా"నని  చెప్పి  వెళ్ళారు.

    పదిగంటలు కావస్తోంది. రమణమ్మ  గారు ఇంకా  రాలేదు. "మీరు  రెస్ట్ తీసుకోండి. నేను రాసుకుంటాను" అన్నాను  శ్రీ శ్రీ గారితో.

    "నువ్వు కూడా  రెస్ట్ తీసుకో. అవన్నీ  ఎత్తికట్టు. తర్వాత రాసుకుందాం. ఏమైనా  మాటలు  చెప్పు వింటాను" అన్నారు.

 
    నేను కూడా  రాసే మూడ్ లో లేను.

    "మాట్లాడ్డం  కాదుగానీ నాకు కొన్ని  సందేహాలున్నాయి....

    లిస్టయితే పెద్దదే.

    కానీ ఒకటి రెండు అవకాశం  వచ్చినప్పుడల్లా అడుగుదామనుకున్నాను.

    ఇప్పుడు  అడుగుతాను  చేస్తారా"అన్నాను"

    "చచ్చుప్రశ్నలు  వెయ్యకుండా  వుంటే  చెప్తాను" అన్నారు.

    "మళ్ళీ జన్మ ఉందంటారే! అది నిజమేనా?" అని అడిగాను.

    "నేననుకున్నట్టు  చచ్చు  ప్రశ్నే  వేశావు. ఎత్తిన  జన్మని  వృధా  చేసుకొని  చచ్చిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుతామంటే నాకు నమ్మకం లేదు  సరోజా! మనిషికి ఒక జన్మ చాలు. దాన్ని సార్ధకం  చేసుకోనిద్దూ. ఉన్నదాన్ని వదిలేసుకొని  లేనిది  ఉందనుకోవడమంత  మూర్ఖత్వం  మరొకటిలేదు" అన్నారు. కొంతసేపు  మౌనంగా  వున్నాను.

    "ఏవండీ! మీకు నీరసంగా  లేదుకదా" అని  అడిగాను.

    "నా గురించి అనవసరంగా  బెంగ పెట్టుకుంటున్నావు. నీకింకా  నా సంగతి తెలియదు. నేను మూడుసార్లు  మృత్యువుతో  పోరాడి  గెలిచాను. 1930లో అరవై రోజులు  టైఫాయిడ్ తో బాధపడ్డాను. జీవితం  మృత్యువుతో  ఎలా పోరాడుతుందో  తెలుసుకున్నాను. లాభం  లేదని నన్ను కిందకి కూడా  దించేశారు.

    మొదటిసారి  నేను పుట్టిన  వెంటనే  చనిపోవలసిందట. నా నుదుటిమీద  ఈ మచ్చ చూశావా? మా బంధువు ఒకాయన చుట్టతో  కాల్చి  బతికించాడు. మెడ వెనుక, చేతి మణికట్టు మీద చుట్టతో  కాల్చారు. గుర్తుగా ఈ మచ్చలున్నాయి.

    చిన్నప్పటి నుండి  తిరుగుబాటు  మనస్తత్వం  నాది. మీరంతా  దేవుళ్ళని, ఆత్మల్ని నమ్ముతారు. ఈ రెండూ అబద్ధాలే. ఇంతకీ నువ్విప్పుడు నీ సంతోషీ బామ్మని (సంతోషీమాతని), నీనామాలవాడినీ (వెంకటరమణ మూర్తిని) యధావిధిగా  పూజించుకునే  ఇక్కడికి వచ్చావా?" అని అడుగుతూ  నవ్వారు.

    ఇంతలో  కారు హారన్ మోగింది.

    ఏవండీ, మీ ఆవిడ వచ్చారు. ఆవిడచేత చివాట్లు   తినీతినీ   నా ముఖం  వాచిపోతోంది. ఇంక నేను  ఇంటికి  వెళతాను" అన్నాను.

    "ఇవాళ  సాయంకాలం  నాలుగు గంటలకి  కారు పంపుతాను" అన్నారు.

    "ఇంకా కదలలేదూ..." అంటూ లోనికి  అడుగు పెట్టారావిడ.

    "ఎవరో ఒకరుండాలిగా? మీరొచ్చారు నేనిక  వెళుతున్నాను" అన్నాను.

    "ఆయనేమైనా  పసిపిల్లాడా? లేక  నాతో ఈసుకి  కాపలానా ?" అని అడిగారు.

    "ఛీ ఛీ" అన్నాను.

    "అంటే నీ ఉద్దేశం ?" అన్నారావిడ.

    "మీరెలాగైనా  అనుకోండి" అన్నాను.

    "పాపం ! ఎందుకలా  సరోజమీద  విరుచుకుపడతావు" అన్నారు శ్రీశ్రీ గారు.

    "మీరు దాన్ని వెనకేసుకొస్తే  నాకు ఒళ్ళు  మండుతుందండీ" అన్నారావిడ.

    "నేను వెళ్ళొస్తానండీ" అని  శ్రీశ్రీగారితో  చెప్పి బైటకొచ్చేశాను.                               *             *             *               *


    మళ్ళీ సాయంత్రం  నాలుగు గంటలకి  హాస్పిటల్ కి  వచ్చాను. "మధ్యాహ్నం భోం చేశారా? బాగా నిద్రపట్టిందా?" ఇలా  ఎన్ని  ప్రశ్నలడిగినా  అన్నిటికీ  "ఊఁ ఆఁ" అనే సమాధానమిచ్చారు శ్రీశ్రీ గారు.

    "ఈ ఆఁలూ, ఊఁలూ తప్పిస్తే  నేనడిగినవాటికి  సమాధానాలు చెప్పటానికి  వేరే మాటలే లేవా?" అని అడిగాను.

    "అబ్బ! నొప్పి ఎక్కువగా వుంది సరోజా! నీతో చెప్తే  బెంగపడతావని  ఊరుకున్నాను. కానీ నువ్వు వూరుకోనిస్తేనా? నీ ప్రశ్నలతో  చంపేస్తున్నావు" అన్నారు.

    "సారీ అండీ" అన్నాను.

    "మరేం ఫరవాలేదులే. రేపీపాటికి  అన్నీ సర్దుకుంటాయి. నువ్వు మాత్రం రేపు ఉదయం ఆరుగంటలయ్యేసరికి  ఇక్కడ వుండాలి. సుబ్బారావు అయిదుగంటలకే  వచ్చేస్తాడు. నీ ముసలమ్మ పూజలున్నాయిగా? అవన్నీ రేపటికి  ఎత్తికట్టేయ్. వీల్లేదంటే  మాత్రం త్వరగా  ముగించుకొని టైముకి మాత్రం ఇక్కడుండు.

Next Page