Next Page 

కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 1


                                    కాలాన్ని వెనక్కి తిప్పకు
                                                         (మరికొన్ని కథలు)

                                                                                                                 డి. కామేశ్వరి

                                                       

 

    "మమ్మీ" ఊఁ అంది కల్యాణి. వంటపనిలో మునిగి మామూలుగా అంది.
    "మమ్మీ, మమ్మీ నీకెవరన్నా మంచి గైనకాలజిస్ట్ తెలుసా. ఇదివరకు నీవొకసారి ఎవరో లేడీ డాక్టరు దగ్గరకు వెళ్ళావు. ఆవిడ పేరేమిటి?" గొంతు తగ్గించి అడిగింది చిత్ర.
    చారుపోపు వేస్తున్న కల్యాణి చటుక్కున కూతురి వైపు తిరిగి, "గైనకాలజిస్టా! ఎవరికి ఎందుకు?" ఆశ్చర్యంగా చూస్తూ అంది. చిత్ర కాస్త కళ్ళు వాల్చి, "ఐ మిస్డ్ మై పీరియడ్స్ మమ్మీ" అంది.
    ఆ మాటకు కల్యాణి గుండె ఒక్క బీట్ మిస్ అయింది. కలవరంగా "అంటే... అంటే" అంది గాబరాగా. కూతురి మొహం చూడగానే ఏదో తట్టింది ఆమెకు.
    "ఐ థింక్ ఐయామ్ ప్రెగ్నెంట్" అంది చిత్ర చాలా మామూలుగా ఉప్మా కోసం పెట్టిన జీడిపప్పు పలుకు ఒకటి నోట్లో వేసుకుంటూ.
    కల్యాణి తెల్లపోతూ కూతురి వంక అయోమయంగా చూసింది.
    "ఏమిటి, ఏం అంటున్నావు?" సరిగా వినలేదేమోనన్నట్టు, నమ్మలేనట్టు రెట్టించింది.
    "ఈ నెల పీరియడ్స్ రాలేదు మమ్మీ. అనుమానం వచ్చి యూరిన్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది" చిత్ర తల్లివంక చూస్తూ అంది.
    కల్యాణి కాళ్ళు వణికాయి. చటుక్కున కూర కింద ఉన్న స్టౌవ్ ఆర్పేసి, డైనింగ్ టేబిల్ దగ్గరకు వచ్చి కుర్చీలో కూలబడింది. "ఏమిటంటున్నావు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఏమిటసలు సంగతి? నిజం చెప్పు. ఇదేమన్నా ప్రాక్టికల్ జోకా!" నల్లబడ్డ మొహంతో అడిగింది కల్యాణి.
    "ప్రాక్టికల్ జోకా, నీతోనా? నిన్నటి నుంచీ ఈ సంగతి నీకెలా చెప్పాలా అని భయపడి చెప్పలేదు. లేట్ అయిపోతుందని చెప్పానివాళ." ఎంబ్రాసింగ్ గా చూస్తూ అంది.
    కల్యాణి నిలువుగుడ్లేసుకుని చేసింది. 'హౌ...హౌడజ్ ఇట్ హేపెన్?" తన గొంతు తనకే వినిపించనట్లుగా గొణిగింది.
    ఏమిటా సిల్లీ ప్రశ్న అన్నట్లు చూసింది చిత్ర. "ఇట్ జస్ట్ హేపెన్డ్. దట్ బ్లడీ ఫెలో ఏం ఫరవాలేదు. ఒకసారికి ఏం కాదు. సేఫ్ పీరియడ్ అంటూ చెప్పాడు" కళ్ళెగరేస్తూ అంది.
    "ఎవరు? ఎవరువాడు? నీకెంత ధైర్యమే. ఏ జలుబో చేసిందన్నంత తేలికగా చెపుతున్నావు. ఎంత ధైర్యంగా డాక్టరు దగ్గరకెళ్ళాలని అడుగుతున్నావు." కోపంతో కళ్యాణి మాటలు తడబడ్డాయి. "ఇది మీ డాడీకి తెలిస్తే పాతేస్తారు నన్ను. ఎంతకు తెగించావు." కోపంతో మొహం ఎర్రబడిపోయింది. అసలు ఇదంతా నిజమని కల్యాణి ఇప్పటికీ నమ్మలేకపోతోంది.
    ఇండియాలో ఈతరంలోనైనా ఎంత మాడర్న్ గా, ఫార్వర్డ్ గా పెరిగినా, ఓ అమ్మాయి వచ్చి తల్లితో ఓపెన్ గా తాను ప్రెగ్నెంట్ అన్న విషయం అతి మామూలుగా చెప్పడం అన్నది నమ్మలేని విషయంలా జీర్ణించుకోలేకపోతోంది. ఫారెన్ కంట్రీస్ లో, అమెరికాలో అక్కడా పిల్లలు చాలా స్వేచ్చగా సెక్స్ లైఫ్ నడుపుతారని, హైస్కూలు లెవెల్ నుంచి బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్ లు, విచ్చలవిడిగా తిరిగి కడుపులు, అబార్షన్లు అతి మామూలు అయిపోయాయని చదవడం, వినడం జరిగింది. కానీ, మనదేశంలోనూ కొన్నిచోట్ల అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రీగా తిరిగినా, రహస్యంగా పెద్దలకు తెలియకుండా తిరగడం ఉంది. అక్కడక్కడా అమ్మాయిలకు అబార్షన్లు గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రుల జరపడం లాంటివి ఉన్నాయి కానీ, ఇలా ఒక అమ్మాయి తల్లితో తాను ప్రెగ్నెంట్ అని కాస్తయినా జంకు గొంకు లేకుండా చెప్పడం, అదీ తన కూతురవడం అన్నది ఊహించలేని కల్యాణికి పెద్ద షాక్ ఇది!
    "ఏమిటి మమ్మీ అలా చూస్తావు కొంపమునిగినట్లు! డాక్టర్ దగ్గరికెళితే జస్ట్ టూ మినిట్స్ జాబ్".
    అప్పటికి కల్యాణి ఈ లోకంలోకి వచ్చిందానిలా లేచి కూతురి చెంప చెళ్ళుమనిపించింది. కోపంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది. "నోర్ముయ్. ముందు నోర్ముయ్. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తా. ఎవడా వెధవ? ముందది చెప్పు. ఎవడు వాడు?" కళ్ళెర్రబడగా గద్దించి అడిగింది.
    చెంప దెబ్బతిన్న చిత్ర రోషంగా తల్లి వంక చూసింది. "ఎవడో ఒకడు. ఎవడైతే ఏం? నీవు డాక్టరు దగ్గరకు తీసుకెళతావా, లేదా? అది చెప్పు ముందు" పొగరుగా అంది.
    "ఏం వాడెవడో వాడినే తీసుకెళ్ళమనకపోయావా డాక్టరు దగ్గరకు. నా అవసరం ఏమొచ్చింది? ఇంతకు తెగించిన దానివి, ఎవడైతేనేం అన్నదానివి నాదాకా ఎందుకు ఇది. గప్ చుప్ గా మాకెవరికీ తెలియకుండా ఆ అబార్షనేదో నీవే చేయించుకోవాల్సింది. "కల్యాణి కూతురి వంక తిరస్కారంగా చూసింది.
    "ఆ సందీప్ గాడు రావడానికి భయపడి ఏడుస్తున్నాడు". "సందీప్" పేరు చెప్పేశాక నాలిక కొరుక్కుంది. "ఎవరన్నా చూస్తే అంటూ భయపడుతున్నాడా స్టుపిడ్. డాక్టర్ అబార్షన్ కి హజ్బెండ్ గానీ, పేరెంట్స్ గానీ ఉండాలంది"
    "ఓ తమరు అప్పుడే అన్ని ప్రయత్నాలూ చేసే నా దగ్గరకు వచ్చారన్నమాట! ఆ సందీప్ అంటే ఆ తెల్లగా, మెడలో చెయిన్... ఆ అగర్వాల్ కొడుకేనా? వాడు నీకోసం పుస్తకాలంటూ ఇంటికి కూడా వచ్చాడు. వాడేనా?" కోపంగా అడిగింది.
    చిత్ర తలాడించింది కాస్త ఎంబ్రాసింగ్ గా చూస్తూ "పట్టుమని ఇరవై ఏళ్ళు లేని మీరు చదువుకోమని కాలేజీలకు పంపిస్తే - మీకు ఇప్పటినుంచి లవ్ లు, సెక్స్ లు కావాల్సి వచ్చాయా? ఉత్తి ప్రేమలూ, సెక్స్ లేనా, పెళ్ళి కూడా ఏమన్నా చేసుకున్నావా? పెళ్ళెందుకు చేసుకుంటాడులే వాడు. ఈజీగా దొరికావని నీతో తిరిగాడు. వాడి అవసరం తీరాక మొహం చాటేశాడు. డాక్టరు దగ్గరికి కూడా రావడానికిష్టపడలేదంటే వాడెంత గడుసువాడో, నిన్నెలా తెలివిగా వాడుకున్నాడో అర్థం అయిందా ఇప్పటికన్నా...." కసిగా, హేళనగా అంది.
    "మమ్మీ ఫర్ గాడ్ సేక్, ఇటీజ్ టూలేట్ టూ డిస్కస్ ఆల్ దిస్. అయిందేదో అయింది. నా తప్పో, వాడి తప్పో జరిగిందేదో జరిగింది. చెప్పు నీవు హెల్ప్ చేస్తావా? నన్ను ఏదో ఏర్పాటు చేసుకోమన్నావా? ఏదో పొరపాటు జరిగింది. దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్.."
    ఆ పొగరు, నిర్లక్ష్యం చూసేసరికి కల్యాణికి తిక్కరేగింది. "ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట! ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎస్. ఓకె! వెళ్ళు. నీవేం చేసుకుంటావో చేసుకో. ఇంత చేసిన దానివి అదీ నీవే చేసుకో.." కల్యాణి కోపంగా లేచి స్టవ్ వెలిగించి కూర కలిపింది.
    "బుద్ధి అంటే తప్పు చేశాను అని, మీ కాళ్లు పట్టుకు ఏడవాలా? అలా అయితే సంతోషంగా ఉండేదేమో మీకు?" కసిగా అంది చిత్ర.
    "కనీసం నీ మాటల్లో జరిగిందానికి పశ్చాత్తాపం, తప్పు చేశానన్న భావం ఉంటే నాకు కాస్తన్నా జాలి ఉండేది నీ మీద. నాట్ ఎ బిగ్ డీల్ అని అంటున్నావంటే, నీకసలు ఏం జరిగిందో, దాని పర్యవసానం ఎలా ఉంటుందోనన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నావంటే నీవెంత మూర్ఖురాలివో తెలుస్తోంది. మన ఇండియాలో ఓ పెళ్ళికాని పిల్ల గర్భం దాల్చడమంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలీదు. ఇది పైకి తెలిస్తే ఏ తలమాసిన వెధవా కూడా నిన్ను పెళ్ళాడడు. ఉత్తప్పుడు ఎంత మాడర్న్ గా, అభ్యుదయ భావాలు పలికినా, పెళ్ళి వేళకి వచ్చేసరికి వంశాలు, సంప్రదాయాలు చూస్తారు." 


Next Page 

WRITERS
PUBLICATIONS