Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 1

 

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి


          శ్రీ ఎన్. టి. రామారావు  ప్రసంగాలు


              (జనవరి 1983 నుంచి మే 1984 వరకు )

        భవిష్యత్తుకు వెలుగు బాట.

మహోర్తులగ జలధి తరంగాల్లా ఉత్సాహంతో ఉప్పొంగుతున్న ఈ జనసందోహాన్ని చూస్తుంటే నాలో ఆవేశం తొణికిసలాడుతుంది. పుట్టి ఏడాది అయినా నిండని మా "తెలుగుదేశం' ఇంత త్వరలోనే అదికారంలోకి రావడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. ఒక్క తెలుగువాళ్ళే అసంభవాన్ని సంభవం చేయగలరని , తెలుగు పౌరుషం దావాగ్నిలా, బడబాగ్నిలా ప్రజ్వరిలించి అక్రమాలను, అన్యాయాలను దహించగలదని రుజువు చేశారు. అందుకు తెలుగుబిద్దగా నేను గర్విస్తున్నాను. నాకు నా జాతి చైతన్యం మీద, పరాక్రమం మీద అచంచలమైన నమ్మకముంది. నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆగ్రహిస్తే వాళ్ళ హృదయాల్లోంచి లావా ప్రవాహాలు వెలికి చిమ్ముతాయని నాకు తెలుసు. తెలుగు శౌర్యం విజ్రుంభిస్తే ఎంత శక్తి వంతమైన అక్రమ శక్తి ఐనా నేల కరుస్తుందని లక్షలాది ప్రజలు ఆచరణలో నిరూపించారు. అందుచేతనే మీ ముందు విన్రముడనై ఇది మీ విజయం ------ ఆరుకోట్ల తెలుగు వీర ప్రజానీకం సాధించిన అద్భుతమైన, అపూర్వమైన విజయమని మనవి చేసృన్నాను. ఈ మహత్తర చారిత్రాత్మక విజయంలో నా పాత్ర ఎంత? మహా సముద్రంలో నీటి బిందువంత మాత్రమే. కాబట్టి తెలుగుదేశం గెలుపు తెలుగు ప్రజలందరి గెలుపని ప్రకటిస్తున్నాను.
    ఈ ఎన్నికల్లో జనబలం అన్నింటినీ జయించింది. తెలుగు జాతి ఆత్మాభిమానం అంగడి సరుకు కాదని, తెలుగువాడు మూడో కన్ను తెరిస్తే అధర్మం, అక్రమం, అన్యాయం కాలి బూడిదై పోతామని మన రాష్ట్రంలో విజ్రుంభించిన జన చైతన్య ఝుంఝు ప్రభంజనం చాటి చెప్పింది. దాని ముందు కొండలు కూడా బెండులా ఎగిరిపోతాయని రుజువైంది. మీరిచ్చిన ప్రోత్సాహ తరంగాల మీదనే నా ప్రచార జైత్రయాత్ర అవిఘ్నంగా ఆపత్రిహతంగా సాగిపోయింది.
    నాపట్ల ప్రజలు ప్రదర్శించిన వాత్సల్యానికి, చేకూర్చిన ఈ అద్బుతవిజయానికి ఎలా, ఏమని కృతజ్ఞత చెప్పాలో నాకు తోచడం లేదు. నిజానికి మీ ప్రేమానురాగాల గురించి వర్ణించడానికి మాటలు చాలవు. మీ ఋణాన్ని తీర్చుకోవడానికి నాకు ఒక జన్మ చాలదు. మళ్ళీ జన్మంటూ ఉంటె తెలుగుతల్లి కి తనయుడనై పుట్టి మీ సేవలో నా జీవితాన్ని చరితార్ధం చేసుకోవాలని ఉంది. నాలోని ప్రతి అణువునూ ప్రతి రక్తపు బొట్టూనూ మీ కోసం ధారబోయాలని ఉంది. ఈ ఎన్నికల రణరంగంలో నన్ను అభిమానించి, విజయోస్తు అని ఆశీర్వదించి , రక్త తిలకం తీర్చి మంగళహారతులు పట్టిన తెలుగు మహిళలకు ప్రత్యేకించి అభినందనలు అర్పిస్తున్నాను. ఇక తెలుగు వాడినీ, వేడినీ ప్రతిబింబించే ఉడుకు నెత్తురు ఉప్పొంగే నవయువాతరం గురించి ఏం చెప్పాలి? వాళ్ళు వీరభద్రుల్లా విక్రమించారు. తెలుగుదేశం విజయసాధనలో అగ్రగాములయ్యారు. అలాంటి నా తమ్ముళ్ళకు నేనే చెప్పేదొక్కటే. ఇది మీ భవిష్యత్తు కు మీరు వేసుకున్న వెలుగుబాట. పొతే చిన్నారి పొన్నారి చిట్టిబాలున్నారు. వాళ్లకు ఓట్లు లేవు. అయినా శ్రీరాముని సేతుబంధనలలో ఉడుత సహయంలా ఈ బుడతలు చేసిన కృషికి నేను ముగ్దున్నాయ్యాను. రేపటి వేకువ విరిసే ఈ లేత గులాబీ మొగ్గలను ప్రేమాభిమానాలతో ఆశీర్వదిస్తున్నాను.
    'తెలుగుదేశం' ఎన్నికల ప్రణాళికలో రాష్ట్ర అభివృద్దికి అనేక అంశాల కార్యక్రమం ఉంది. రాష్ట్ర ప్రజానీకం నామీద, తెలుగుదేశం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని నాకు తెలుసు. ప్రణాళికలోని వివిధ అంశాలను, వాటి ప్రాముఖ్యాన్ని బట్టి క్రమంగా అమలు జరుపుతాము. ఈ విషయంలో ఏరుదాటి తెప్ప తగలేసే  తప్పుడు పని చేయబోమని హామీ ఇస్తున్నాను. ప్రధానంగా సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు వర్గాల అభివృద్దికి మా శాయశక్తులా కృషి చేస్తాము. త్రాగేందుకు మంచి నీళ్ళకు సైతం నోచుకోని ఊళ్లున్నాయి. తలదాచుకోను తావులేని నిర్భాగ్య జీవులున్నారు. రెక్కాడినా డొక్కాడని శ్రమజీవులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వాళ్ళను వెంటనే ఆదుకోవాలి. ఆ సమస్యలను పరిష్కరించాలి. గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి కలలు గన్నారు. అదే రామరాజ్యం  అన్నారు. రేలుగుదేశం గ్రామాభ్యుదయం కోసం నిర్విరామంగా పాటు పడుతుంది. బడిపిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పధకం, రెండు రూపాయలకు కిలో బియ్యం పేద ప్రజలకు అమ్మించడం, సక్రమంగా అమలు జరుపుతాము. వ్యవసాయం, పరిశ్రమలు, సమతూకంలో ,సర్వరాభివృద్దికి కృషి చేస్తాము. రాష్ట్రంలో వెనునబడిన కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటాము. ఏ రూపంలోనూ ప్రాంతీయ సంకుచిత తత్వాలకు ఆస్కారం లేకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి దీక్ష వహిస్తాము.
    ఈ కార్యక్రమం అనుకున్నట్లు ఆచరణలోకి రావాలంటే పాలనా వ్యవహారాలు సక్రమంగా సజావుగా సాగాలి. ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి. ఉద్యోగులు ప్రజా పీడకులు కాకుండా, వాళ్ళు ఉప్పు తింటున్న సేవకులుగా భావించుకోవాలి. కాని దురదృష్టవశాత్తు మన పాలనా వ్యవస్థ అలా లేదు. అధికార దర్పం, పనిలో జాప్యం, లంచగొండి తనం, వగైరా నానారకాలైన జాడ్యాలకు అది కేంద్రమైంది. ముప్పై  అయిదేళ్ళుగా పొరలు పొరలుగా పేరుకొని ఘనీభవించిన కాలుష్యాన్ని ప్రక్షాళనం చేయవలసి ఉంది. అయితే ఇది అనుకున్నంత తేలిక వ్యవహారం కాదని నాకూ మీకు కూడా తెలుసు. తెలుగునాట ప్రవహించే సమస్త పవిత్ర నదీ జలాలన్నింటితో కడిగినా ప్రక్షాళనం కానంతటి కశ్మలం పేరుకొనివుంది. ఇది 'తెలుగుదేశం' కు సంక్రమించిన వారసత్వం. కాబట్టి ఒక్కరోజులో ఈ పాలనా వ్యవస్థను మార్చడం అయ్యే పని కాదు. అయితే ప్రజల సహకారంతో, నిజాయితీపరులైన అధికారుల అండతోనూ ఈ కృషిలో జయప్రదం కాగలమన్న ఆత్మవిశ్వాసం నాకు ఉంది. మన అధికారులలో సమర్దులూ, నిజాయితీగా విధి నిర్వహణ చేసేవాళ్ళూ  ఉన్నారు. కానీ గతంలో యీలాంటి వాళ్ళకు ప్రోత్సాహం లభించక పోగా నీతి నిజాయితీలకు కక్ష కార్పణ్యాలే బహుమతులై మిగిలాయి. తెలుగుదేశం పాలనలో అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుంది. అలాగే అవినీతికి అలవాటు పడిన ఉద్యోగుల కూడా ఈ సందర్భంలో ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను. గతంలో ఏ అనివార్య రాజకీయ కారణాల వల్లనో, ఇతర కక్కుర్తి వల్లనో అక్రమాలకూ, అధికార దుర్వినియోగానికి పాలడిన వాళ్ళు ఇప్పుడైనా పశ్చాత్తాపం చెంది, తమ పద్దతులు మార్చుకుంటే మంచిది. లేకపోతే అలాంటి వాళ్ళ విషయంలో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించి తీరుతాము. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ విషయంలో మమ్ము ఏ శక్తీ ఆడ్డలేదు. కనుక వాళ్ళను ఏ శక్తీ రక్షించలేదని కూడా తెలియజేస్తున్నాను. ఆన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు మాతో సహకరించి తెలుగునాడు సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగుల సాధకబాధకాలను మా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది. ముఖ్యంగా చాలీచాలని జీతాలతో బాధపడేవాళ్ళ కు తగిన సహాయం చేస్తుంది. అదే సమయంలో విధ్యుక్తధర్మ నిర్వహణలో నిజాయితీ , సమర్ధంగా పని చేయాలని కోరుతుంది. అనేక రంగాల్లో అనుభావజ్జులూ మేధావులూ మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరి సహకారాన్ని మేము సవినయంగా అర్ధిస్తున్నాము.

రాను రాను మన రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజల మాన, ధన ప్రాణాలకు ,స్త్రీల శీలానికి రక్షణ లేకుండా పోయిందని అందరికీ తెలుసు. మన సమాజంలో అరాచక, హింసా , దౌర్జన్య శక్తులు వికటతాండవం చేస్తున్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. బందిపోట్లనూ, గూండాలను సమస్త సంఘ వ్యతిరేకులను నిర్ధాక్షిణ్యంగా అణచివేసే విషయంలో అధికారులు తీసుకునే చొరవను అభినందిస్తుంది. పోలీసు శాఖలో ఉత్పాహవంతులు, సమర్దులూ, సాహసికులూ, నీతిపరులయిన వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళనూ మా ప్రభుత్వం అభిమానిస్తుంది. ఆదరిస్తుంది. ప్రజలను రక్షించవలసిన ఈ శాఖలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు, పోలీసుల జీవితాలను బాగు పరిచేందుకు ప్రయత్నిస్తాము. పోలీసులను ప్రజలు నిజంగా తమ రక్షకులు అనుకునేట్లు ఆ శాఖను తీర్చి దిద్దాలన్నది మా సంకల్పం. అందుకు సహకరించవలసినదిగా ఆ శాఖ ఉద్యోగులందరినీ కోరుతున్నాను.
    మన తెలుగునాడు వ్యవసాయ ప్రధానమైనది. అయినా రైతాంగం గిట్టుబాటు ధరలేక తగినంత పెట్టుబడి లేక నానా యిబ్బందులూ పడుతుంది. తెలుగుదేశం వ్యవసాయభివృద్ది కి, దానితో పాటు సత్వర పారిశ్రామిభివృద్దికి పాటుపడుతుంది. మా ఎన్నికల ప్రణాళికలో ఈ రంగాలలో తీసుకోవలసిన చర్యల గురించి పేర్కొన్న అన్ని అంశాలను అమలు జరుపుతామని మనవి చేస్తున్నాను. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అన్ని వనరలూ మానకున్నాయి. వాటిని నిర్ణీత పధకం ప్రకారం పట్టుదలతో అమలు జరపడం ద్వారా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టవలసి వుంది. ఇలాంటివే ఇంకెన్నో జటిల సమస్యలు మనముందున్నాయి. వాటన్నింటిని ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకోవలసి వుంది. ఈ సందర్భంలో తెలుగుదేశంను అనూహ్యమైన మెజారిటితో గెలిపించిన తెలుగు ప్రజలందరికీ నాదో విన్నపం. ఈ విజయానికి మీరే కర్తలు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలలో కూడా మీవంతు పాత్ర పూర్తిగా నిర్వహించాలి. ఇది మీ ప్రభుత్వం. మీ సేవకు మనసా వాచా కర్మణా అంకితమైన ప్రభుత్వం. ఈ నూతన ప్రభుత్వాన్ని ప్రతిష్టించడంలో ప్రజలు చూపిన శ్రద్ద్డాసక్తులు, చొరవ నిర్మాణాత్మక కార్యకలాపాలలో సైతం చూపించాలని, తెలుగు నాడును వెలుగునాడుగా తీర్చి దిద్దే మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని అర్ధిస్తున్నాను. మీరు కేవలం ప్రేక్షకులుగా వుంటే చాలదని మనవి చేస్తున్నాను.
    ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికి అధినేతలు. కాని ఇప్పుడు అది మనదేశంలో తల క్రిందులుగా వుంది. సామాన్యుడు ఓటు  కాలంలోనే మాన్యుడవుతున్నాడు. ఆ తర్వాత ప్రజల గోడు వినిపించుకునే దిక్కే లేదు. ప్రజాస్వామ్యం ఈ మూడున్నర దశాబ్దాలలో మేడిపండులా, కరి మింగిన వెలగపండులా తయారైంది. తెలుగుదేశం ప్రజాస్వామ్యాన్ని ఒక విశిష్ట జీవన విధానంగా, చారిత్రిక పరిణామక్రమంలో మానవజాతి అశేష త్యాగాలు చేసి సాధించుకున్న వరంగా భావిస్తుంది. వ్యక్తీ స్వేచ్చకు సమిష్టి సౌభాగ్యానికి అంతకుమించిన మంచి సాదనం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడటం పవిత్ర కర్తవ్యంగా మేము భావిస్తున్నాము. ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలంటే ప్రతిపక్షం కూడా సంఘటితంగా సమర్ధంగా వుండి తీరాలి. మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తాం. వాళ్ళు ఇచ్చే సూచనలను శ్రద్ధగా పరిశీలిస్తాం. సముచితమైన హేతుబద్దమైన విమర్శలను ఆహ్వానిస్తాము. మా తప్పులు నిర్దిష్టంగా చూపితే సరిదిద్దుకుంటాం. ఎన్నికల్లోనే కాదు, ప్రజాసేవలో కూడా ప్రతిపక్ష మిత్రులను పోటీ పడమని కోరుతున్నాను. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరంగా , శోభాయమానంగా వర్దిల్లెట్లు కృషి చేయాలని కోరుతున్నాము. మా పార్టీకి శాసనసభలో అత్యధిక సంఖ్యాబలం ఉన్నా ప్రతిపక్షాల పట్ల ఏమాత్రం చిన్నచూపు చూడమని ఆ విషయం ఆచరణలో నిరూపిస్తామని హామీ యిస్తున్నాము. అంతేకాదు మా పార్టీ హేయమైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదు.  ఆవిధంగా ప్రతిపక్షాన్ని బలహీనపరచి ప్రజాస్వామ్యాన్ని, ప్రహసనంగా మార్చే పాపానికి ఓడిగట్టదు. కాబట్టి ఈ విషయంలో మా ప్రతిపక్ష మిత్రపక్షాలు నిశ్చింతగా ఉండవచ్చు. శాసనసభలను అలక్ష్యం చేసి చక్కబెట్టుకోవాల్సిన వేరే స్వప్రయోజనాలు మాకు లేవు. అందుచేత ప్రజాసమస్యల పరిష్కారాన్ని గురించి చర్చించటానికి సరైన ఏకైక వేదికగా శాసనసభను తెలుగుదేశం భావిస్తుంది. ప్రతిపక్షం కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తుంది.
    ప్రజాస్వామ్య సమాజంలో ప్రతీకలకు విశేష ప్రాముఖ్యం వుంది. అందువల్ల పత్రికల స్వేచ్చ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏవిధమైన జోక్యం కల్పించుకోదు. ఎంతటి నిశిత విమర్శాలనైనా సంతోషంగా స్వీకరిస్తుంది. ఆ విమర్శల్లో వాస్తవముంటే గుర్తించి లోపాలను సరిదిద్దుకుంటుంది. నిర్హేతుకమైన ఆరోపణలైతే , ఆ విషయం జనం ముందుంచుతుంది. ప్రజాస్వామ్య సౌధానికి గల నాలుగు మూల స్తంభాలలో ఒకటైన పత్రికా ప్రపంచం పట్ల మా ప్రభుత్వ వైఖరి యిది. ప్రజా హృదయాలను అద్దంలా ప్రతిఫలించే ప్రతికల పట్ల ప్రజాసేవకు దీక్ష వహించిన యే ప్రభుత్వమూ భయపడవలసిన  అవసరం లేదు. 
    మా పార్టీని ప్రభుత్వాన్ని పొగడినా, తెగడినా అన్ని పత్రికల పట్ల సమాన దృష్టితోనే వ్యవహరిస్తాము. పత్రికా స్వేచ్చను హరించడానికి అవభ్యాతికరమైన బిల్లులను ఎట్టి పరిష్టితులలోనూ తెలుగుదేశం ప్రవేశపెట్టదని అసందిగ్ధంగా ప్రకటిస్తున్నాను. మా ప్రభుత్వ విధానాలలోని ఆచరణలోని మంచి చెడ్డలను నిర్మాణాత్మకంగా విమర్శిచమని, ప్రజలకు యదార్ధ పరిస్తితులను తెలియజేయమని పత్రికలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
    అలాగే రాజ్యాంగం గ్యారంటీ చేసిన పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించడంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్త వహిస్తామని కూడా స్పష్టం చేస్తున్నాను.
    వ్యక్తుల స్వార్ధ ప్రయోజనాల కోసం, పార్టీ మీద, ప్రభుత్వం మీద ఏవిధమైన వత్తిడి చేయవద్దని పార్టీ ప్రముఖులకూ , కార్యకర్తలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. 'తెలుగుదేశం' శాసనసభ్యులు ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలని ప్రజల సమిష్టి ప్రయోజనాలకు పాటు పడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
    'తెలుగు దేశం' ప్రాదుర్భావం గురించి, దాని ముందున్న బరువైన బాధ్యతల గురించి నా మనస్సులోని భావాలను మీకు వివరించాను. ఇక మీదట కూడా ఈ ప్రజారధాన్ని మీరే లాగాలి. తెలుగుజాతిని నయనానందకరామైన నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలే ఉద్యమించాలి. అప్పుడే మన ఆశలు ఆకాంక్షలు ఫలిస్తాయి. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం, ఈ మంత్రివర్గం , అధికార బృందం అంతా మీ సేవకులు. నిజమైన ప్రజాస్వామ్యంలో ఉండవలసిన పద్దతే అది. ఇంతటి మహత్తర విజయాన్ని సాధించిన తెలుగు ప్రజలకు అసాధ్యమన్నది లేదు. కాబట్టి మీ పార్టీ మీద అది సారధ్యం వహించే ప్రభుత్వం మీదా అజమాయిషీ, సర్వధికారాలూ , మీకున్నాయి. తెలుగుబాష, సంస్కృతుల కోసం తెలుగుజాతి సమగ్ర అభ్యుదయం కోసం అందరూ చేయూత నివ్వాలని మరోసారి అర్ధిస్తున్నాను. సర్వకాల సర్వావస్థల్లో తెలుగు కీర్తి పతాకం సగర్వంగా నింగిలో ఎగిరేట్టూ చూస్తాననీ, మీ అందరి అభిమానం, ఆశీస్సులు రక్షా కవచంగా ధరించి, తెలుగు వెలుగులను దిగంతాల పర్యంతం వ్యాప్తి చెందేటట్లు ప్రయత్నిస్తానని తెలుగుజాతి మహోజ్వల భవిష్యత్తు కోసం అమరవీరులు ధారపోసిన వీర రక్తపు ధార సాక్షిగా శపథం చేస్తున్నాను. 

    ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1983 జనవరి 9న , లాల్ బహదూర్ స్టేడియంలో అశేష జనవాహినిని ఉద్దేశించి.......

 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS