Next Page 

కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 1


        

                          కరుణశ్రీ సాహిత్యము - 5  

                                           హస్య వేదిక  

                                                                                                                                                                                                     డా || జంధ్యాల పాపయ్య శాస్త్రి

 

                                             నా పేరు గోదావరి

 

                               

 

    నా పేరు "గోదావరి" , మా వూరు "సహ్యగిరి."
    నా జన్మ స్థానం సహ్య పర్వతపంక్తులలో త్రంబకేశ్వరం. నేను అడి పాడి గంతులు వేసిన ప్రాంతం నాసిక్ నగరం. దీనినే పూర్వం "పంచవటి " అనే వారు. నేను నాతోడి చెలిమి కత్తెలతో కలిసి మెలిసి పెరిగి పెద్దదానినై క్రమక్రమంగా మిట్టపల్లాలు దాటి, గుట్టలూ, మెట్టలూ గడచి, అడవులు అతిక్రమించి , కొండల గుండా లోయలలో పడి,  సుడులు తిరిగి, అవరోధలన్నీ అధిగమించి కడలిరాయని గడపలో అడుగు పెట్టాను. అయన నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నాడు.
    నాపేరు "గోదావరి ", మా ఊరు సహ్యగిరి."
    నేను పుట్టినిల్లు మహారాష్ట్రమైనా మెట్టినిల్లు ఆంధ్రరాష్ట్రం.
    నాకొక గారాబు చెల్లెలు ఉంది. దాని పేరు కృష్ణవేణి. చిన్నప్పుడు అంతా "కృష్ణ' అనీ 'వేన్ణా" అనీ ముద్దుముద్దుగా పిలిచేవారు. పెరిగి పెద్దదై ఇప్పుడు 'కృష్ణవేణి' అయింది. మా కృష్ణ కధ చాలా ఉంది. అది మరెప్పుడైనా చెప్పుకుందాము. ఇప్పుడు నా కధ చెబుతాను. వినండి. నా పుట్టు పూర్వోత్తరాలు పురాణాలలో చెప్పబడి ఉన్నాయి. అవే చెబుతున్నాను.
    పూర్వం ఒకానొక సమయంలో పెద్ద కరువు వచ్చింది. తింటానికి తిండి దొరకక ప్రజలంతా బాధపడుతున్నారు. నేలంతా బీటలు వారిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రం పచ్చని పంట పైరులతో కంటికింపుగా కళకళలాడుతూ ఉంది. చుట్టూ పక్కల ఉన్న మునులంతా గౌతముల వారి ఆశ్రమానికి వచ్చారు. మహర్షి తపోవనంలో పండిన పంటతో వచ్చిన వారందరికీ ఆతిధ్య మిచ్చి అన్నం పెట్టి ఆదరించాడు.
    గౌతమ మహర్షి మహాతపస్సంపన్నుడు. ఉదార హృదయుడు. పరోపకార పరాయణుడు. జాలిగుండెల వాడు. అయన చేతితో గింజలు చల్లిన వెంటనే పంటలు పండే వరం ఆయనకు బ్రహ్మదేవుడి అనుగ్రహం వల్ల ప్రాప్తించింది.
    కరవు కాటకాల కాలంలో అందరికీ ఆహారం అందిస్తున్న అయన కీర్తి నలుమూలలా వ్యాపించింది. ప్రజలంతా ఆ మునీశ్వరుని ఔదార్యాన్ని వేనోళ్ళ కీర్తింపసాగారు. అది అక్కడి మునులకు అసూయ కలిగించింది.
    గౌతమ మహర్షి పేరు ప్రతిష్టలను తోడిమునులు సహించలేక పోయారు. "అన్నం పెట్టిన ఇంటికి కన్నవేసే దుర్భుద్ది ' వాళ్ళకు పుట్టింది.
    మునులంతా కుట్రపన్నారు. గౌతముడికి అప్రతిష్ట తెచ్చి పెట్టాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళంతా ఒక మాయగోవుకు సృష్టించి గౌతముని పంట పొలాల పైకి తోలారు. ఆదొంగ ఆవు పొలం మీద పడి మేస్తూ పంటంతా తొక్కి పాడు చేయసాగింది. మునులంతా ఆవు పొలం మేస్తున్నదని గౌతముడికి చాడీలు చెప్పారు.
    దయార్ద్ర హృదయుడైన గౌతమమహర్షి అవును కొట్టటం ఇష్టం లేక ఒక దర్భపోచతో "పో" అని మెల్లగా అడలించాడు. ఆ గడ్డి పోచ తగిలీ తగలక ముందే ఆ మాయగోవు నోరు తెరచి అరచి చచ్చిపడింది.
    ధూర్తులైన మునులు తమ ప్రయత్నం ఫలించినందుకు లోలోపల సంతోషిస్తూ గౌతమున్ని దూషించసాగారు.
    నీవు పాపం చేశావన్నారు. నీ ముఖం చూడగూడదన్నారు. గోహత్యామహాపాతకం నీకు చుట్టు కుంటుందన్నారు. నీ చేతి అన్నం తినం పొమ్మన్నారు. అనరాని మాటలన్నీ అని తమ కడుపు మంట తీర్చుకున్నారు.
    అమాయకుడైన గౌతమమహర్షి జరిగిన దానికి చాలా విచారించాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పమని చేతులు మోడ్చి మునులను ప్రార్ధించాడు. అప్పుడు మునులంతా కూడ బలుక్కుని "శివుని జటాజుటంలోని గంగాజలాన్ని తెచ్చి ఆ ఆవు మృతకళేబరం మీద పారిస్తే గాని నీ పాపం పరిహారం కాదన్నారు.
    పాపం గౌతమ మహర్షి ఆశ్రమంలోని పంటంతా మునులను అప్పగించి తాను పరమేశ్వరున్నిగూర్చి ఘోర తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
    గౌతముడు జరిగిన సంగతంతా పరమేశ్వరునికి విన్నవించి గంగాజలం అనుగ్రహించమని అర్ధించాడు. అపుడు మహేశ్వరుడు సహ్యాద్రి పంక్తులలోని బ్రహ్మగిరి శిఖరం మీద తన జటాజూటంలోని గంగాజలాన్ని కొంచెం ప్రసరింప జేశాడు. గౌతమమహర్షి ఆ జలధారను కొనివచ్చి చచ్చిన గోవును బ్రతికించాడు. మహర్షి తపోమహిమకు మునులంతా సిగ్గుపడ్డారు. క్షమించమని కాళ్ళ మీద పడ్డారు. ఉదారమూర్తి అయిన గౌతముడు వాళ్ళను దయతో మన్నించాడు. ఈ విధంగా మహర్షి గంగాజలాన్ని కొనివచ్చి గోహత్య పాపం నుంచి విముక్తుడైనాడు. ఇది బ్రహ్మాండ పురాణగాద.
    విన్నారుగా! గౌతమ మహర్షి తీసుకొని వచ్చిన ఆ పావన గంగాజలమే సన్నని జాలుగా --- చిన్న వాగుగా సాగి, పవిత్రమైన పంచవటి మీదుగా ప్రవహించి ఆంధ్రశాతవాహనుల రాజధాని అయిన ప్రతిష్టాన నగరం ప్రక్కగా పురోగమించి, భద్రాచల రామచంద్రుణ్ణి సందర్శించి, పట్టిసమ వీరభద్రురుణ్ణి సేవించి మహానదిగా - అఖండ గౌతమిగా - ఉరుకులు పరుగులు పెడుతూ ప్రవహించింది. ఆ మహానదిని నేనే.
    నా పేరు "గోదావరి" . మా వూరు "సహ్యగిరి."
    చచ్చిన గోవుకు ప్రాణదానం చేసినందున "గోదావరి" అన్నారు నన్ను. గౌతముడు తన తపశ్శక్తితో కొని తెచ్చాడు. కనుక "గౌతమి" అన్నారు. శివదేవుని శిరస్సు నుంచి దిగి వచ్చాను. కనుక "గంగ" అన్నారు.
    నేను అడుగు పెడితే చాలు; చేలు బంగారు పంటలు పండుతాయి. నా స్పర్శ తగిలితే చాలు; పుడమి తల్లి పులకించి పోతుంది. నా అంతరంగ తరంగాలు పొంగి పోరలితే చాలు;  దేశం 'అన్నపూర్ణ" అవుతుంది. నా గాలి తగిలితే చాలు;  కరువు కాటకాలు దూరదూరాలకు పరుగులు తీస్తాయి.
    నన్ను కష్టజీవులు "చల్లని తల్లి" అంటారు. పల్లె ప్రజలు "బంగారు తల్లీ" అంటారు. రైతు బిడ్డలు "వరాలతల్లి" అంటారు. గంగపుత్రులు "గోదావరి తల్లి' అంటారు. కవులు 'నదీమతల్లి' అంటారు.
    కవులంటే జ్ఞాపక మొచ్చింది. వాల్మీకి , భావభూతులు నన్ను గూర్చి చేసిన ప్రశంసలు లోకవిదితాలే గదా!
    క్రీ.శ. తొమ్మిదో శతాబ్దంవాడైన అలంకారిక శిరోమణి రాజశేకరుడు తన 'కావ్యమీమాంస' లో నన్ను విశేషంగా పేర్కొన్నాడు. మహాపండితుడైన వేంకటాధ్వరి తన 'విశ్వగుణాదర్శం'లో నన్ను బహుధా అభివర్ణించాడు. కాశ్మీరకవిచంద్రుడైన కల్హేణుడు తన "రాజతరంగిణి" సప్తతరంగాలకూ, నా సప్త గోదావరి పాయలకూ, రమ్యమైన ఔపమ్యం కూర్చాడు. మురారి మహాకవి తన 'అనర్ఘరాఘవం' లో "సప్తగోదావరీ హార నాయకమణి" గా భీమేశ్వరస్వామిని అభివర్ణించి నన్ను "అంధ్రదేశాలక్ష్మీ కంఠహారంగా " సంభావించాడు.
    ఇక ఆంధ్రకవులలో నన్నయ్యభట్టు గారికి నా మీద ఎంతో అభిమానం. అరణ్యపర్వంలో నా ప్రశంస తెచ్చి నాలో స్నానం చేస్తే దశాశ్వమేధాలు చేసినంత పుణ్యం వస్తుందన్నాడు. తీర్ధయాత్రలు చేస్తున్న అర్జునుణ్ణి "వేంగీదేశా"నికి తీసుకొని వచ్చి "గోదావరి స్నానం" చేయించాడు. అసలు ఆ వాగనుశాసనులు రాజమహేంద్రవరంలో నా ఇసుకతిన్నెల మీద కూర్చుండేగా ఆంధ్రమహా భారతానికీ "శ్రీవాణీ గిరిజాశ్చిరాయ" అటూ శీకారం చుట్టారు.


Next Page 

WRITERS
PUBLICATIONS