భవ బంధాలు
డి.కామేశ్వరి
"వరుణ్ , రేపు ఆదివారం కదా, మధ్యాహ్నం భోజనానికి రండి" జానకి కొడుకుతో అంది.
ఏదన్నా విశేషమా , ఎవరన్నా వస్తున్నారా" అరా తీశాడు.
"కొడుకుని అమ్మ పిలవడం, కొడుకు అమ్మని చూడడానికి రావడానికి విశేషం వుండాలా! కొంచెం మాట్లాడాలి. సాయంత్రం వరకు ఉండి వేళుదురు గాని."
వరుణ్ ఒక్క క్షణం ఆగి "తను లేదు. వాళ్ళింటి కి వెళ్ళింది" అని ఫోన్ కట్ చేశాడు. పదకొండు గంటలకి వచ్చిన కొడుకు భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా "పిలిస్తే గాని రావు. నెలయింది తెలుసా వచ్చి" అంది కినుకగా.
'అవునమ్మా ఆదివారం వచ్చేసరికి ఏమిటో బద్దకంగా వుంటోంది" రిలాక్స్ గా సోఫాలో వాలి "కిందటి వారం నీవు వచ్చావుగా , కలవడం ముఖ్యం ! ఎవరు ఎవరింటికి వస్తే ఏమిటి" అన్నాడు నవ్వి.
"నవ్య వుంటుందనుకున్నా అందుకే యిద్దరినీ రమ్మన్నా" తనూ ఓ సోఫాలో కూర్చుంటూ అంది.
"వారాని కల్లా గాలి అటు పోతుంది ఆవిడ గారికి. నేను ఏడు గంటలకి ఇంటికి వచ్చేసరికే లేదు. ఫోనన్నా చేసి చెప్పలేదు."
'అదేమిటి. మళ్ళీ ఏదన్నా గొడవ పడ్డారా అ, చెప్పకుండా వెళ్ళడం ఏమిటి!"
"అమ్మా నాకేం తెలియదు. నన్నేం అడక్కు" విసుగ్గా అని, "తనిష్టం వచ్చినప్పుడు వెళ్తుంది, వస్తుంది. నేనేం అడగను."
'అదేమిట్రా ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు. ఎక్కడి కెళ్ళావని భర్త అడగడు. యిదెం సంసారం . మీ యిద్దరి పద్దతి ఏం బాగులేదు" మందలింపుగా అంది.
"అమ్మా, నేనందుకే రాను. వచ్చిందగ్గర నించి నీతి బోధలు , సాధింపులు-- యింట్లో తన గోల, యిక్కడ నీ గోల. నేనేం చెప్పినా నీవు కోడలినే సపోర్ట్ చేస్తావు. ఎందుకు చెప్పడం , అన్నం పెట్టు తినేసి పోతా" దురుసుగా అన్నాడు.
"ఏమిటిరా నాన్నా చిన్న పిల్లాడి లా అలక, ముప్పై ఏళ్ళు వచ్చినా ' కొడుకు చేయి పట్టుకుని నిమురుతూ అంది జానకి. "నీ కంటే కోడలేలా ఎక్కువవుతుంది. కానీ,, మనింటి కొచ్చిన పిల్ల....కూతురే అనుకోవాలి. ఆ అమ్మాయి మనసు నొచ్చుకొని తల్లీ కొడుకు ఒకటే అనుకోకూడదని తన వైపు అలోచించి పెద్దదానిగా సర్ది చెపుతాను. బాబీ, ఒక ఆడదానిగా , అమ్మగా, భార్యగా -- అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మనః స్థితి ఎలా వుంటుందో మీకేం తెలుస్తుందిరా . పుట్టి పెరిగిన యింటిని, ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒక్కసారిగా అన్నింటికీ దూరమై కొత్త చోటు , కొత్త యిల్లు , కొత్త మనుష్యులు , కొత్త అలవాట్లు కొత్త వాతావరణం మధ్య యిదంతా నాది, వీళ్ళంతా ణా వాళ్ళు అనుకోడానికి సమయం పడ్తుంది. భర్త అన్నవాడే తన వాడు . కావాల్సిన వాడు అని నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయికి "నీకు మేమున్నాం . నీవు మాదానివి , ఈ ఇల్లు నీదే' అన్న భరోసా యివ్వడం మన పని. అలాంటి భార్యకి నీవు ఆసరాగా నిలవాలి. అత్త మా అమ్మలాంటిదే అనుకునే నమ్మకం కలిగించి తే మంచీ చెడ్డా చెప్పి మందలించగలదు అత్త. పెద్దదానిగా యిద్దరికీ సర్ది చెప్పడం ణా బాధ్యత గదా. కాని నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా."
"సరేలే నేనేదో అనేశానని, తను ఫీలయి పోయినట్టు ఊహించు కోకు. నేనేం అనలేదు. గొడవేం పడలేదు. నవ్య ప్రతి ఆదివారం పరిగెడ్తుంది. యీసారి శనివారమే వెళ్ళింది. చెబితే వద్దంటానా, వద్దంటే మాను కుంటుందా. అందుకే అసలు పట్టించుకోను" అసహనంగా అన్నాడు.
"నిన్న నవ్య ఇక్కడికి వచ్చింది. చాలాసేపు మాట్లాడింది తెలుసా" నెమ్మదిగా అంది జానకి. తెల్లబోయాడు వరుణ్. క్షణం లో తేరుకుని "ఆహా....మరి నన్నెందుకు అడుగుతున్నావు. తను నీకేం చెప్పిందో, అందుకేనా క్రాస్ ఎగ్జామీన్!" అన్నాడు సూటిగా చూస్తూ.
తన మధ్య నవ్య మధ్య జరిగిన సంభాషణ ఎంత వరకు చెప్పాలా అని తేల్చుకోలేక వీలయినంత తేలిగ్గా "ఏముంది. ఎప్పుడూ నీకూ తనకూ వున్నదే గదా. నీవేక్కడికి రావు. సర్దాల్లేవు. ఎవరితో కలవవు.....మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా పెళ్ళాల వెంట పార్టీలకీ, పిక్నిక్ లకీ వస్తారు. వరుణ్ రాకపోతే నా కెంత చిన్నతనం అవమానం ...అంటూ చెప్పుకొచ్చింది. అంత అడిగినప్పుడు వెళ్ళొచ్చుగదా."
"ఏమిటమ్మా ఆవిడ ఫ్రెండ్స్. ఆ పార్టీలు చూస్తె నాకు చికాకు. అంతా ఆర్టిఫిషియల్ మాటలు, నవ్వులు , మితిమీరిన షోకులు, చీప్ గా అనిపిస్తుంది. ఏమిటో ఆ మేకప్పు లు, పలకరింతలు , ఆ సుతారంగా మాటలు, లేనిది తెచ్చి పెట్టుకునే నవ్వులు పొగడ్తలు -- వాళ్ళెవరూ నాకు తెలియదు-- అక్కడికీ మొదట్లో తనకోసం కొన్ని సార్లు వెళ్లాను-- సెలవోస్తే చాలు పార్టీలు , హోటళ్ళు అంటుంది. నాకేమో మంచి పుస్తకం చదువుకోడం ప్రశాంతంగా పాటలు వినడం రిలాక్స్ గా వుండాలని వుంటుంది." విసుగ్గా అన్నాడు.
'అవును, ఆ అమ్మాయి సరదాలు వేరు. మీరిక్కడున్నప్పుడు చూశాగా. ఫోన్లు, స్నేహితులు -- మరీ ఎక్కువే అనుకో, కానీ ఏదో అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం, తన మన కిష్టం లేని పనులైనా యితరులవి , అందులో భార్యని సంతోష పెట్టడం కోసం కొన్ని చెయ్యాలిరా -- యింట్లో గొడవలుండాకూడదంటే ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దు బాట్లు తప్పవు" అనునయంగా అంది.
"అమ్మా, నేనూ పెళ్ళిళ్ళ కో, శుభకార్యా లకో వెళ్తా, నాకెవరూ తెలియకపోయినా నాకూ ఈ క్లబ్బులూ, హోటళ్ళ పార్టీలు, ఆడా మగ తాగుడు, ఏమిటో నాకెందుకో వెళ్ళాలనిపించదు. ఎప్పుడో ఏ రెండు మూడు నెలలకో ఓసారి ఏ న్యూయియర్ స్పెషల్ అకేషన్స్ అవీ, ఆఫీస్ పార్టీలు తప్పవు. సెలవు వచ్చే సరికల్లా పద అంటే నాకు కుదరదు. నేనేం తనని వద్దనలేదే. వెళ్ళు ఎంజాయ్ చేయి. నన్ను బాధపెట్టకు అన్ని ఎన్నోసార్లు చెప్పా" నిజాయితీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తల వూపింది అప్రయత్నంగా.
"తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలన్న ఆరాటం. పనీ పాటా లేదు. ఇంట్లో వంట బోర్ అంటూ మనిషిని పెట్టింది. అన్నీ ఆమె చేసి టేబిల్ మీద పెడ్తుంది. ఆఫీసు కెళ్ళి రావడం ఒకటే పని. యిల్లు, వంట , సర్దుకోడం దేని మీదా తనకి యింతరేస్ట్ లేదు. స్నేహితులు , తిరుగుళ్ళు ఫోను ఉంటె చాలు. ఇంకా, కాలేజ్ స్టూడెంటు లెవల్లో నే వుంది తను" విరక్తిగా అన్నాడు వరుణ్.
పెళ్ళయ్యాక ఏడెనిమిది నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్ మెంట్ రెడీ అయ్యేవరకు యిక్కడున్నప్పుడు నవ్య, కొత్త కోడలిగా వచ్చిన పిల్ల. తనే నేర్చుకుంటుంది అని కొన్నాళ్ళు అసలు ఏ పనీ చెప్పలేదు జానకి. చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెపుతూ కాస్త సాయంగా కూరలు తరిగిస్తా ఇలా యివ్వండి చపాతీ పిండి కలపనా, టేబుల్ మీద అన్ని నేను పెడతా మీరు కూర్చోండి" లాంటి చిన్న చిన్న పనులన్నా చేస్తుందేమో అని ఆశించింది కాని, లాభం లేకపోయింది. "ఏమిటో పనీపాటా అలవాటున్నట్టు లేదు-- ఇంట్లో అలా పెరిగినట్టుంది' అనుకుని జానకి సర్దుకు పోయేది.
"ఏమిటోరా , నువ్విలా అంటావు. నిన్న నవ్య చాలా సీరియస్ గా కంప్లైంట్ చేసింది.
"ఏమంది నీతో చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా" ఆవేశంగా అన్నాడు. జానకి సందిగ్ధంగా ఎలా ఏది చెప్పడం అన్న ఆలోచనలో పడినట్లు వూరుకుంది.'
* * *