Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu


                                      
    "నేను మీతో ఒక్కమాట చెప్పిపోదామని వచ్చాను."
    "చెప్పవచ్చు."
    స్వరం తగ్గిస్తూ "నేను ఇక్కడినుంచి వెళ్ళిపోబోతున్నాను. మళ్ళీ ఎన్నటికీ తిరిగిరావటం పడదు" అన్నది సునీత.
    "మంచిది, మళ్ళీ అక్కడొక నాటకం ప్రారంభం."
    శూలాలు గుచ్చుకున్నట్లు బాధపడింది సునీత.
    "రాధా! నేను నాటకాలు ఆడతానో లేదో న అంతరాత్మకు తెలుసు. ఈ కుటుంబానికి కోడలుగా, నా శిష్యురాలుగా నన్నెంతో ఆదరించినందుకు...."
    "నేను విచారిస్తున్నాను."
    "కృతజ్ఞత తెలుపుకుందామని వచ్చాను."
    "మీ సమయాన్ని చాలా వ్యర్ధం చేసుకున్నారు."
    "ఆ జవాబులన్నీ తన శ్రమఫలితమే. మడ్డి మొహాన్ని కడిగి జీవకళ ఇచ్చానన్న విశ్వాసంకూడా లేదు. ఛీ ...... తనదే తప్పు.'
    "రాధా! నా జవాబు వింటావా?"
    "ఆజ్ఞ కాబోలు."
    "నేను తలుచుకుంటే మీ తాతయ్యగారినే శాసించగలను. వేణు నా చేతిలో కీలుబొమ్మ అయ్యేవారు. నువ్వు పల్లెటూరి మోద్దులాగే ఉండేదానివి. డాక్టరు గారు తన సర్వస్వాన్ని నాకేనాడో ధారాదత్తం చేసేవారు. కాని నాలో రాక్షసత్వం ఇంకా ప్రజ్వలించలేదమ్మా. నేను రాక్షసిని కాదు. నీ సమయాన్ని వ్యర్ధం చేశానన్నావు. నిజమే, రాధా, నేను నీతో ఇప్పుడు మాట్లాడిన కొద్ది క్షణాలే కాదు, నువ్విక్కడికి వచ్చిననటి నుండి ఇప్పటివరకు, నేను నీతో గడిపిన ప్రతి క్షణమూ కూడా బూడిదలో పోసిన పన్నీరయింది. నా ఆనందాన్ని కూడా కాదని నీకోసం నాలో అణువణువునూ నిర్జీవంచేశాను. పిచ్చిదానా, ఆజ్ఞాపించేదాన్నయితే నువ్వు నా కిలా జవాబు చెప్పేందుకు సాహసించి ఉండవు. నన్ను దీనంగా ఏడుస్తూ అర్దించేదానివి. నా మీద నీకున్న అనుమానాలన్నింటికీ జవాబు వేణును అడుగు. చెప్పనంటే నీతా ఆజ్ఞాపించిందను, వస్తాను, రాధా. నేను నీ వేణును లాక్కుంటానని భయపడకు. వారిని నీకే అర్పించాను. నీకే అర్పించాను."
    సునీత వెళ్ళిన రెండు మూడు నిమిషాలకు వేణు కిందికి వచ్చాడు.
    "సునీత ఏదీ?"
    "వెళ్ళింది!"
    "అప్పుడే? ఏమన్నది? ఎందుకు వచ్చిందిట?"
    "మీరే అడగకపోయారా?"
    "ప్చ్ ప్! వివరంగా చెప్పు, రాధా!"
    "మీకేమీ తెలియదా?"
    "నాకేం తెలుసు? డొంకతిరుగుడు మానేసి సరిగా చెప్పు."
    "డొంక తిరుగుడేముంది? మీరు మన పెళ్ళి కాక ముందు ఆమె వలలో పడ్డారు. అంటే మీ పరిభాషలోప్రేమించుకున్నారు."
    "ఎవరు? ఎవరన్నారు?"
    "నేనే అంటున్నాను. అప్పుడీమె నిరాకరించబట్టే తాగుడు అలవాటు..."
    "ఉఫ్!" వేణు ముద్దాయిలా నిట్టూర్చాడు. సోఫాలో కూర్చుంటూ "కొంతవరకు నిజమే, రాధా" అన్నాడు.
    "ఆమెనే పెళ్ళి చేసుకుంటే ఈ విరహంపాలిట పడేవారు కాదు."
    "రాధా, నువ్వు నన్నెంత ఎత్తిపొడిచినా నేను బాధపడను. ఒక విలవైన వ్యక్తిని పోగొట్టుకున్ననన్న విచ్రం మాత్రం...."
    "ఇప్పుడు మాత్రం ఏమయింది? ఏ రాత్రో నన్ను పిస్తోలుతో కాల్చేసి...."
    "షటప్, రాధా, నోరు జారకు!"
    రాధ దగ్గిరికి వచ్చింది. "మామయ్యా! ఆమె నాకోసం నిన్ను త్యాగం చేసింది. నే నామెకోసం..."
    "ఓహ్, రాధా!" ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. "త్యాగం ..... త్యాగం ఆ రెండక్షరాల మధ్యనేనెంతో నలిగిపోయాను నువ్వూ అదే మాటనకు, రాధా! భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. నాకు, ఆమెకు మధ్య ఏ సంబంధమూ లేదు.....ఉండదు. అటువంటిదేమైనా ఉంటే అక్కయ్య నన్నీపాటికి షూట్ చేసి ఉండును."
    "ఆమె నెన్నడూ కలుసుకోను, మాట్లాడనని నామీద ప్రమాణంచెయ్యి, మామయ్యా!"
    "నీ.....నీ..... సాక్షి ......కలుసుకోను .... మాట్లా ....డ....ను" అంటూ ఆమెను చెయ్యిపట్టుకుని, తన గదిలోకి తీసుకువెళ్ళాడు. ఇనపపెట్టె తెరిచి కొన్ని డైరీలు వెతికి తీశాడు.
    "ఇతరులముందు ఎన్ని అబద్దాలాడినా, తనకు తాను ఎవ్వరూ అబద్ధం చెప్పుకోరు. ఎన్ని అక్రమాలు, అన్యాయాలు, హత్యలు చేసినా అన్నీ వాళ్ళ డైరీల్లో వ్రాసుకుంటారు. సునీతకు కూడా చూపించని ఈ నా డైరీలు నీకు చూపిస్తున్నాను. రాధా, ఒకవేళ నీకింకా నామీద నమ్మకం లేకపోతే ఇవి చదువు, తెలుస్తుంది నాకు, నీతాకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో? నువ్వు ఆమెకు కృతఘ్నత చూపించావు. ఈ మహానగరంలో తన జీవితసారాన్ని కాచి పోసింది. మట్టిలో మట్టి బెడ్డగాఉన్న నీకు, మణి రూపు ఇచ్చింది. అవి చదువు. భోజనం చేశాక అక్కయ్య ఇంటికి వెళదాం. నాన్న అక్కడికే వెళ్ళారు. సునీత ఎవరో, ఆమె తల్లిదండ్రులెవరో తెలుస్తుంది."
    వేణు రాధపక్కనే కూర్చుని వెనక్కు జారగిల బడ్డాడు.    
    సాధ్యమైనంత తక్కువగా సామాన్లు సర్దేసు కున్నాడు. అన్నీ కట్టేశాక సునీత వెళ్ళి టాక్సీ తెచ్చింది. పది గంటలకు పూరీ పాసెంజరు నాంపల్లి స్టేషను నుండి బయలుదేరుతుంది. టేబిల్ వాచ్ తొమ్మిది న్నర చూపిస్తుండగా సునీత, యాదగిరి టాక్సీలో కూర్చున్నారు.
    ఇన్నాళ్ళుగా ఉన్న ఆ ఇంటిని, పరిసరాలను విడిచి వెళుతున్నందుకు వాళ్ళు కన్నీరు నింపుకున్నారు. రాజు భోరున ఏడ్చాడు. ఇంటి తాళంచేతులు ఇస్తూ "రెండు మూడు రోజులు అయ్యాక మా పెద్దవాడు వస్తాడు. ఇల్లంతా అప్పగించు, రాజూ!" అన్నాడు గిరి.
    "స్వంత తమ్ముడిలా మెలిగావు. నేను ఏం ఇవ్వ గలను? రేపటినుండి వేణు ఇంటికి వెళ్ళు. నేను చెప్పాను. నీలకంఠంగారు సెలవుల్లో వస్తారేమో? వస్తే పెద్దమ్మ స్మృతులను సాగదీస్తూ విచారించవద్దను."
    టాక్సీ వెళ్ళుతూంటే, రాజు జలజలరాలే కన్నీటితో చూస్తూ నిల్చున్నాడు. వెళుతూ "అక్కయ్యను మరిచిపోకు, రాజూ!" అంది సునీత. కనిపించినంతవరకు రాజు టాక్సీని, రాజును సునీతా, యాదగిరి చూస్తూనే ఉన్నారు.
    టాక్సీ విశ్వం ఇంటిముందు ఆగింది.
    చప్పుడు విని నిర్మల తలుపుతీసి ముఖం చిట్లించింది. విశ్వంకూడా వెలపలికి వచ్చి "ఓ! నువ్వా! ఇంకా పదకొండుకు చాలా టైముంది. డాక్టరు గారింటికేనా?" అన్నాడు.
    మాట్లాడలేదు. చేతిలో ఉన్న కవరు ఇస్తూ అంది:    
    "తొమ్మిదిన్నర అయింది. ఇది చదువుకో! తరవాత ఏం చేస్తావో , చెయ్యవో నేను చూడను. విశ్వం, ఎవరికీ నామీద అనుమానం ఉండదు. తెల్లవారేసరికి."
    "చిత్రంగా మాట్లాడుతున్నావు. ఇదేమిటి?"
    "ఒక చిత్రం ముగిసిపోబోతున్నది. దాని జవాబు అంతే ..... బాజీ లేవగానే అత్త ముద్దులు చెప్పిందను." చరచరా వచ్చి టాక్సీలో కూర్చుని, "పోనియ్!" అంది.

                              *    *    *

    పదికి తొమ్మిది నిముషాలు తక్కువగా ఉన్నది. ఆర్తి, సారథి, గోవిందరావు, రాధ, వేణు అందరూ హాల్లో కూర్చున్నారు. విశ్వం, సునీత ఇంకా రాలేదు. ఎవరికి వారే తలలు వాల్చుకుని దీర్ఘాలోచనల్లో మునిగిఉన్నారు.
    అంతలో ఎవరో పరిగెత్తుకువస్తున్న ధ్వని, విశ్వం గుమ్మంలో ప్రత్యక్షంకావటం ఒక్కసారే జరిగింది.
    "రె! రె ఏమిట్రా ఆ పరుగులు?" వేణు అటు చూసి అన్నాడు.
    అదేం వినిపించుకోలేదు. చేతిలో ఒక మడతపెట్టిన కాగితం విసిరేస్తూ, "తొందరగా స్టేషనుకు రా. సునీత వెళ్ళిపోతున్నది. మళ్ళీ రాదుట. ట్రెయిను పదీ అయిదుకు బయలుదేరుతుంది. వేణూ, ఆలస్యంచెయ్యకు. సునీత నీకు మేనమరదలు. ఆ దయామయి నీకు దక్కదు. మళ్ళీ రాదు. మళ్ళీ రాదు. వేణూ....వేణూ" అంటూ అక్కడే నిల్చోలేదు. గిరుక్కున వెనుదిరిగి ఉద్వేగంగా పరుగుతీశాడు. తనయినా సునీత నిష్క్రమణాన్ని ఆపాలన్న ఆదుర్దా!
    తన ముందు పడ్డ కాగితాన్ని అందుకుని మడతలు విప్పాడు వేణు.
    ముద్దులొలుకుతూ ముత్యాల్లా ఉన్న సునీత హస్తాక్షరి చెబుతూంది.
    "ప్రభూ!
    ఈ కాగితం విశ్వం మీకు అందించేసరికి నేను వెళ్ళిపోయి ఉంటాను. చివరిసారిగా మీతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలిగాను. పాదధూళి పొందగలిగాను. ప్రేమపూర్వకమైన మీ సందేశం తీసుకోలేక పోయాను. ఎందుకంటే నేను వెళుతున్నట్లు చెప్పనిదే, మీరు నాకు ఆ సందేశం ఇవ్వరు. వెళుతున్నానని తెలిస్తే వెళ్ళనివ్వరు.
    మీ సమక్షంలో నా పాత్రా, నా ఉనికీ ముగిసి పోయాయి. దేవుడు నాకు ఒప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుకోగలిగాను. ఇక నేను ఉన్నా, లేకపోయినా ఒకటే! ఉంటే అనర్ధాలు కొన్ని సంభవించవచ్చు. వెళ్ళటమే మంచిది కదూ?
    డాక్టరు గారితో, మీతో, మీ నాన్నగారితోకూడా చెప్పాను, నా జన్మరహస్యం ఇవ్వాళ చెబుతానని. నేను అన్నమాట నిలబెట్టుకుంటున్నాను. డాక్టరుగారికి అన్నీ తెలుసు. అయినా నేనే చెబుతున్నాను కనక వినండి.
    ఒక స్త్రీలో క్షణికోద్రేకం నాకు జన్మనిచ్చింది. ఆ స్త్రీ ఎవరో కాదు. మీ నాన్నగారి ముద్దుచెల్లెలు. పేరు దేవకి. ఇరవై సంవత్సరాల గతానికి వెళితే ఇదంతా కనబడుతుంది. మీ నాన్నగారు, యాదగిరి స్నేహితులు. ఆ యాదగిరే నాకు తండ్రి. మా నాన్న ఇంటి యజమానిగా పరిచయమై నాకు తోడునీడ అయ్యాడు. మీ నాన్నగారితో చెప్పండి దేవకి కులట కాదని, యౌవనోద్రేకంతో తొందరపాటుకు గురి అయి తల్లి అయిందని, వారి ఆప్తమిత్రుడైన యాదగిరి ఆమె బిడ్డనైన నాకు తండ్రి అని.    
    డాక్టరుగారు..... వారు దైవస్వరూపులు, వేణూ! మీరు నన్ను ప్రియురాలిగా ప్రేమించినదానికన్నా. వారు నాపట్ల చూసిన ఆదరణా, ఆప్యాయతా గొప్పవి, ఎంతోమంది ఆమె చల్లని నీడలో సేదతీర్చుకున్నారు. కల్యాణి వంటి తెగిన గాలిపటాలుకూడా ఆమెనుండి దారి వెతుక్కున్నాయి. మన ఇద్దరిమధ్య అనుబంధం బలపడటానికి వారుగూడా కారకులే! వారే కనక నామీద అనాదరణ వహించినట్లయితే, నేనుగాని, మీరుగాని ఇంత దగ్గిరికి వచ్చి ఉండేవాళ్ళం కాదు.
    అమ్మ మరణించిననాటినుండి నేను దురదృష్ట వంతురాల్నే కదూ? తుదకు నావాళ్ళందరినీ కనుక్కో గలిగినా ప్రపంచం పిలిచే పిలుపునుండి తప్పుకోలేక పోతున్నాను. ఎక్కడికి ఎటు వెళ్ళుతున్నానంటే చెప్పలేను. అమ్మ సమాధినైనా చూస్తానో లేదో మరి!
    కాలేజీలో మీ ఉత్తరం ..... ఆ నాటినుండి నాకు తటస్థపడిన వ్యక్తులు ఒక్క నీలకంఠం, కరుణ తప్ప మీరందరూ ఒకేచోట క్షేమంగా ఉన్నారు. అదే నేను కోరుకున్నాను. పాపం, నీలకంఠంవాళ్ళే దూరాన ఉన్నారు.
    నేను మీ నౌకరును. మీ చెప్పుచేతల్లో దానిని. అయినా మీరు నన్నెన్నడూ అలా లేదు. మీ నాన్నగారు మీకు అధికారాలిచ్చి సారథి గారికోసం వెళ్ళాక ఒక స్నేహితురాలుగా ఎంతో ఉన్నత స్థానం ఇచ్చి, హోదాలను, అంతస్తులను ప్రదర్శించకుండా ఎంతో సౌమ్యంగా ప్రవర్తించారు. ఎన్ని మాటలన్నా, చెంపదెబ్బలు కొట్టినా నన్ను ప్రేమించారు. నేను ధన్యురాల్ని, వేణూ! మీ ప్రేమే నన్ను నైతికహద్దులను దాటనివ్వలేదు. పశువాంఛలను తీర్చే యంత్రంగా మారనివ్వలేదు. ఆనాడు కాలేజీలో మీరు కవరు పంపడమే ఎంతో మంచిదయింది.
    నిర్మల, రాధ ఎందుకో నామీద కినుక వహించారు. ఇకనుండి ఆ అపోహలను తొలగించుకోమని మీరు రాధకు చెప్పండి. నిర్మల తనే తెలుసుకోగలదు.
    తన బిడ్డగా నన్ను స్వీకరిస్తానని డాక్టరుగారు అన్నారు. వారి కోరిక నేను తీర్చలేకపోయాను; పోతున్నాను. నన్ను క్షమించమనండి.
    విశ్వం మీకు నా గురించిన రహస్యాలెన్నో చెబుతాడు. డాక్టరుగారికి చెప్పుకోలేనివెన్నో అతనికి చెప్పుకున్నాను. స్నేహితులకోసం ప్రాణాలను అడ్డు వెయ్యగల ఉత్తమ ప్రాణమిత్రుడు విశ్వం. ఎంతో పుణ్యం చేసుకుంటేతప్ప, అటువంటి మిత్రులు దొరకటం కష్టం. అతణ్ణి జాగ్రత్తగా కాపాడుకోండి.
    గోల్కొండలో మీరు నా మెడలో కట్టిన లాకెట్ ను మీ గుర్తుగా తీసుకువెళుతున్నాను. నా మరణపర్యంతం అది నావెంట ఉంటుంది. నేను మరణించిననాడు అది నాతోనే దహనమై మట్టిలో కలిసిపోతుంది. వేణూ! ఈ శేషజీవితాన్నంతా అనుక్షణం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే గడుపుతాను.
    డాక్టరుగారు అప్పుడే అన్నారు, తుఫానులాంటి సంఘటన ఒకటి సంభవిస్తుందని. అప్పుడు అదింత ముఖ్యపాత్ర వహిస్తుందని అనుకోలేదు. వారి దివ్యదృష్టి అబద్ధం కాలేదు. ఈ తుఫాను ఇంతటితో ముగిసిపోతే ఎంతైనా మంచిది. ఇందులో మొదటి నిష్క్రమణం నాదే అయినందుకు సంతోషంగా ఉంది, వేణూ!
    నీలకంఠంవస్తే (సెలవుల్లో తప్పకుండా వస్తారు) నమస్సులు, పెద్దమ్మగారి ఆశీర్వాదాలు చెప్పండి. కరుణతో అతణ్ణి మునపటికన్నా మెలుకువగా సంరక్షించుకో మనండి. తనకన్నా చిన్నదాన్నే అయినా కల్మషాల కతీతుడై పెద్దమ్మా అంటూ, నాలో తన తల్లిలాంటి వ్యక్తిని చూస్తున్నానంటూ పసిమనస్సుతో నాకేదోమాతృత్వపు అనుభూతీ, ఆనందం కలిగించిన అతణ్ణి పంపుతూంటే అదే చివరి చూపు అనుకోలేదు. మేము వెళుతున్నట్లు అతనికి మీరే వ్రాయండి.అతను వచ్చినపుడు నా మాటగా ఉదాత్తమైన జీవనపథాన్నే కొనసాగిస్తూ ధైర్యంగా జీవించమనండి.
    మీకు, విశ్వం సారథి సోదరులకు, ఆర్తి వదినకు, మామయ్యగారికి, రాధకు, నిర్మలకు నమస్సులు. అంతకన్నా ఏం చెప్పను? నేనన్న మాటలన్నీ మరిచి నన్ను ఆశీర్వదించండి. చిరంజీవులు బాజీ, రజనీ ప్రియలకు ఆశీస్సులు.
    రమణాశ్రమం లాంటి ప్రదేశాల్లో బాధితులకు, వ్యథితులకు శాంతి లభిస్తుందని నాన్న చెప్పాడు. అయితే అక్కడికే వెళతామన్న నమ్మకం లేదు. మీరు మళ్ళీ నా గురించి వాకబులు, వెతకటానికి దేశాటనం లాంటివి చెయ్యకండి.
    వేణూ!
    మీతో ఈ అనుబంధానికి, ఈ తియ్యని పిలుపుకు ఎన్ని యుగాలు నిరీక్షణ చెయ్యవలసివచ్చిందో? ఎన్ని జన్మల్లో తపస్సు చేశానో? ఎంత సంస్కారం, పుణ్యం ఉంటే నాకీ జన్మ లభించిందో? యుగాల తరబడీ మనం ప్రేమికులమేనా, ప్రభూ? మున్ముందు జన్మల్లోకూడా మీతో నాకీ అనుబంధం లభించాలి. అలా చెయ్యమని దేవుని వేడుకొంటాను.    
    బృందావనంలో మురళీకృష్ణలై నాలో మీరు ఉన్నారు. రాధనై మీలో నేనున్నాను. నా కృష్ణులు మీరు. మీ రాధను నేను.




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.