Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu



    "రక్తదాహం .... హుఁ ... నిన్నంత సులభంగా చావనిస్తావా? మొదట నీ ప్రేమ అనే యమపాశంలో చిక్కు కున్న నీతా అనబడే ఒక పాపి రక్తం నీ కళ్ళముందు..."
    వేణు గొంతు ఎండిపోయింది. "నీతా.... నీతా..."
    ఆమె కణత దగ్గిర పిస్తోలు. "చెప్పు.....చివరి మాట....ఒకటి....రెండు..."
    వేణు రివ్వున లేచి ఆమె చేతిలో పిస్తోలు లాగి దూరంగా విసిరేశాడు. ఆమెను దగ్గిరగా వాటేసుకుని ఎద నదుముకున్నాడు. సునీత విడిపించుకో చూసింది. వేణు వదలలేదు. తన కుడిచేతితో ఆమె తల నిమురుతూ, "నీ మాట వింటాను, నీతా" అన్నాడు.
    గాద్గదికంగా "భగవాన్!" అంది. "నాచేత దెబ్బలు తిన్నారు. మీ నాన్నగారు, డాక్టర్ గారైనా కొట్టి ఉండరు. నా నెత్తి మీద మీ చెయ్యి అలాగే ఉంచి, ప్రమాణం చెయ్యండి, వేణూ!"
    వేణు చెయ్యలేదు.
    "రక్త బంధువులు, స్నేహితులు, మమతలు వీటికన్నా మీకదే ఎక్కువా?""కాదు. ఎప్పటికీ కాదు." రెండు చేతులతోనూ ఆమె ముఖం పైకెత్తి ఆమె కళ్ళలో నీడ చూసు కున్నాడు.
    'సుఖంగా జీవించేందుకు పుట్టాం అంటారు. నేను కాదనను. ఈ దుర్వ్యసనాలు సుఖసాధనాలు కావు. సుఖం అంటే కలుషితమై, నైతికంగా అధఃపతనం చెందటం కాదు. అన్నీ తెలిసిన మీరే ఇలా చేస్తే నేను ... నేనేం చెప్పను, వేణూ?"
    ఆమె తన మంచికోసం ఎంత ఆక్రోశిస్తున్నదో తెలిసివచ్చింది వేణుకు.
    "ప్రయత్నిస్తాను, సునీతా!"
    "ప్రయత్నం కాదు. ఇక తాగితే నామీద ఒట్టు."
    "స్స్ స్! ఒక్కసారే మానటం కష్టం!"
    "అయినా సరే! జీవితావసరాలు కొదవ అయితేనే ఒకపట్టాన మరణం రాదు. అనండి....మీ నీతా సాక్షిగా తాగనని.....అనండి, వేణూ..."
    "తాగను..... నా నీతా సాక్షిగా తాగను..." ఆమె తల మీద తన తల వాల్చాడు. సునీత కళ్ళలో ఆనంద బాష్పాలు ప్రవాహంగా వస్తున్నాయి.
    
                                                     *    *    *

    ఇంటిదగ్గిర తలెత్తుకోలేకపోయాడు వేణు. ఎప్పుడో ఎవరో ఒకరు తుపాకీ తూటాలా ప్రశ్న వేస్తారని భయపడుతూనే భోజనం ముగించాడు. ఎవరూ అసలు పెదవైనా కదపలేదు.
    రాత్రల్లా వేణు ఎంతో నిగ్రహంగా ఉన్నాడు. తాగాలన్న వాంఛ తీవ్రంగా వచ్చేది. కూజాలో నీళ్ళు వంపుకుని తాగేవాడు. తెల్లవార్లూ నిద్రే లేదు. తాగాలని బుద్ధిపుట్టినప్పుడల్లా అదే పని.
    తెల్లవారి తొమ్మిదింటివరకూ గదిలోనుండి రానే లేదు. రాధ ఇంకా నిద్రపోతున్నాడేమోనని మేల్కొలప టానికి వచ్చింది. కళ్ళు తెరిచేఉన్నాయి. మౌనంగా వెళ్ళబోయింది. వేణు పిలిచాడు. ఆమె ఆగింది.
    "ఇంకెప్పుడూ తాగను. నాతో మాట్లాడవూ?"
    మాట్లాడలేదు.
    ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. "దేవుని సాక్షి! నా మాట నమ్మవూ?"
    చేతులను వదుల్చుకుంది. "తాగేవాళ్ళ మాటలు నీటిమూటలు, మామయ్యా! ఏదీ అంత సులభంగా నమ్మటం మానుకున్నాను. నన్ను మా ఇంటికి పంపెయ్యి!"    
    వేణుకేమీ తోచలేదు. కుర్చీలో కూర్చుంటూ తల పట్టుకున్నాడు. "అందరూ వెళ్ళండి! ఎవరి దోవ వాళ్ళు చూసుకుని సుఖపడండి. మిగిలేది నేను. ఏకాకిని. నేను చచ్చినరోజు నా శవాన్ని కార్పొరేషన్ వాళ్ళే ఈడ్చేస్తారు. కాకులైనా నా పాడు శరీరాన్ని ముట్టవు. నాకు చావైనా రాదు. మీ కక్ష తీరుతుంది.....చస్తే...."
    రాధ మరి అక్కడ ఉండలేదు.

                              *    *    *

                                  21

    పొద్దున్నే ఆశ్రమంనుండి ఒకామె పరిగెత్తుకు వచ్చింది. ఒగరుస్తూ, "ఆమె....ఆమె కళ్యాణి....చచ్చి పోయింది, డాక్టర్" అన్నది ఆందోళనగా.
    ఆర్తి ఊపిరాడనిదానిలా అయిపోయింది. "ఎప్పుడు? ఎప్పుడు?"
    "ఏమో? రాత్రి మీకు వచ్చేశాక, ఓ గంటకు కడుపులో నెప్పిగా ఉందన్నది. గదిలోకి వెళ్ళి కాసేపు పడుకున్నది. అంతలో ఆమెకు నెలలని మాలో ఒకామె చెప్పింది. ఇద్దరు ముగ్గురం గదిలోకి వెళ్ళాం. మీ దవాఖానాకు తీసుకువెళదామనుకుంటూ ఉండగానే ఆమె సుఖంగా ప్రసవించింది...."
    "ప్రసవించిందా ..... ప్రసవించిందా?"
    "ఆఁ ... అవును. ఆడపిల్ల. తల్లీ బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నారు. పన్నెండుగంటలకల్లా మరొక గదిలో ఆమెకు పక్కా అదీ అమర్చి అందులోకి మార్చాము. కొద్దిసేపటికే నిద్రపోయింది. తెల్లారి చూసేసరికి .... గుండెల మీద పాపను పెట్టుకుని విగత జీవిగా పడి ఉంది."
    ఆర్తి తల దిమ్ముగా అనిపించింది. ఒక నిమిషం చలనరహితంగా ఉంది. వచ్చినామె అంది: "రాత్రే మీతో చెబుదామనుకున్నాము. వాళ్ళు క్షేమంగానే ఉన్నారని, అర్దరాత్రి లేపడం ఎందుకు, ఉదయమే చెబుదామని ..... ఆ సలహా ఆమే చెప్పింది, డాక్టర్! మీకు ఒక కాగితంగూడా రాసి పెట్టింది. దానిమీద డాక్టరు గారు తప్ప ఎవరూ ముట్టుకోవద్దని ఉంది."
    ఆర్తి త్వరత్వరగా ఆశ్రమంవైపు నడిచింది. అది నిన్న రాధ, వేణుగూడా ఆమెను వెంబడించారు.
    దక్షిణంగా ఉన్న గదిలో మంచంమీద కల్యాణి శవం ఉంది. ముఖం చూస్తూనే ఏదో విషం మింగిందని ఆర్తి కనుక్కోగలిగింది. పక్కన ఉన్న ఒక స్టూలుమీద పాలపొడి డబ్బాకింద ఒక కాగితం ఉంది. దానిమీద' "దయచేసి మీరెవరూ దీన్ని ముట్టుకోవద్దు. డాక్టర్ గారిని పిలిపించండి" అని ఉంది. దాన్ని తీసుకుంది ఆర్తి.
    "డాక్టర్ చెల్లీ,
    ఆశీర్వదిస్తున్నానమ్మా! ఇది నువ్వు చదువు తూండేసరికి నేను వజ్రపుచూర్ణం మింగిన మృతదేహంగా మాత్రమే మిగిలిఉంటాను. వజ్రపుపొడి ఎక్కడిదో నా వేలి ఉంగరం చూస్తే తెలుస్తుంది.
    అనుకోకుండా, తలచిన బాధలు పడకుండానే తల్లి నయ్యాను. అందరూ నిద్రపోయే ఈ నిశిరాత్రిలో పాపపంకిలమైన నా తనువు చాలించమన్న ఘోష మారుమోగినట్లుగా తోచింది. మూడుసార్లూ అదే శబ్దం. ఎక్కడినుంచి వచ్చిందో, ఎవరు చేశారో నాకూ తెలియదు మరి.
    ఒళ్ళంతా నీరసంగా ఉంది. అయినా నీతో ఏదీ చెప్పకుండా వెళ్ళటం భావ్యంకాదు కనక ఓపిక చేసుకుని వ్రాస్తున్నాను. ఇప్పుడే పాపాయికి కడుపునిండా పాలు పట్టాను. నిర్విచారంగా నిద్రపోతున్నది. వాళ్ళ అమ్మ అనే నికృష్ణజీవి నిష్క్రమించబోతున్నదని దానికేం తెలుసు?
    ఒక నిశ్చయానికి వచ్చాను. పాపాయి లోకంలో అడుగుపెట్టి, పెద్దదై, నేను సజీవంగా ఉన్నపక్షంలో నిజం తెలుసుకుని, నన్ను ఎందుకిలా చేశానని అడగవచ్చు. నేను చెప్పినా, చెప్పకపోయినా తెలుసుకుంటుంది. క్షమిస్తుందో, అసహ్యించుకుంటుందో తెలియదు.
    అదీగాక, నేను బతికిఉండిగూడా చేసేదేమీ లేదు. పాపాయిని పెంచే భారం నీదే! సుశిక్షితయైన నీలాంటిదాన్ని చెయ్యి. అప్పుడే నా ఆత్మకు శాంతి.
    కళ్ళు మూసుకుపోయి, ముళ్ళు ఉన్న దోవ తొక్కాను. ఫలితం అంత విషాదం కాదుగానీ, ముళ్ళు గుచ్చుకున్న ప్పుడు పొందిన బాధ జ్ఞాపకం వస్తే మనస్సు వికలమవుతుంది.
    ఇంకొక విచారమేమంటే, నేను నీ దగ్గిరికి రాకున్నా బాగుండేది. నేను తిరిగి కనిపించటంచేతనే నా మొదటి భర్త - నీ జీవన రథసారథి నీకు ద్రోహం చేశానని, తనకు శిక్ష విధించుకున్నానంటూ నీకు వ్యథ కలిగించారు.
    అయినా నువ్వు నేను ఫలానా అని తెలుసుండీ మన్నించావు. ఎప్పటికైనా పక్కలో బల్లెమని తెలిసీ నన్ను నీ అండలో చేర్చుకున్నావు. అజాతశత్రు వైన నీ చల్లని భవనాల్లోనే మరణిస్తున్నానన్న తృప్తి నాకు ఉంది.
    ఒక మహా చైతన్యస్రవంతి, దేవతలకే అలభ్యమైందనిపించే అమోఘ కరుణాధార నీనుండి లోకవ్యాప్తంగా వ్యాపిస్తున్నది. అది నేను స్పష్టంగా చూడగలిగాను. నీ ప్రతి మాటలో, చేష్టలో దాని తాలూకు చిలకరింపులు ప్రతివారికి చల్లదనాన్నిస్తాయి.
    ఒక అజ్ఞాతశక్తి నన్ను నీనుండి రమ్మంటూ తీవ్రంగా ఆకర్షించింది. ఆ ఆకర్షణను తప్పుకోలేక పోతున్నాను.
    మరీ మరీ చెప్పనవసరం లేదు. నీకు అన్నీ తెలుసు. నా తరవాత దీన్ని- ఆశ్రమాన్ని-నువ్వే నిర్వహించు. కష్టమనుకుంటే చిరంజీవిని సునీతకు కొంత భారం ఒప్పగించు. నేనామెను కొన్నాళ్ళుగా గమనించాను. నీవలె ఆమె కరుణాసముద్రురాలు.
    పాప కేపేరు పెట్టాలో ఒకసారి చెప్పాను.
    అందరికీ నమస్సులు. నా శవాన్ని అగ్నిసంస్కారం చేసి రూపు మాపెయ్యి. నాకు సమాధి కట్టించవద్దని నా కోరిక. నా శరీరంలో ఒక్క అణువూ, కనీసం జ్ఞాపకం కూడా భూమిమీద ఉండకూడదు. నన్ను చితిలో పెట్టాక పాపనెత్తుకుని నువ్వే ఆ చితికి నిప్పంటించు. ఇది నువ్వు తప్పకుండా చెయ్యాలి.
    పాపకు న ఆశీస్సులు.
    వారు..... వారు.....నీ భర్త వస్తే - ప్రణామాలు చెప్పు!
                                                                                       -కళ్యాణి."
    "ఎంతపని చేశావ్, కళ్యాణీ!" కళ్ళనుండి రెండు నీటిచుక్కలు రాలి కళ్యాణి ముఖంమీద పడ్డాయి.
    "పాప ఏదీ?"
    ఎవరో ఆర్తికి పాపను అందించారు. గట్టిగా వక్షానికి అదుముకుని, "రజనీ ప్రియ.....రజనీప్రియ..." అంది.    
    ఇదేమీ పట్టని పసిపాప కల్మషరహితంగా నవ్వు తూంది.    
    వేణు నీలకంఠానికి, విశ్వానికి కారుమీద వెళ్ళి చెప్పాడు. వాళ్ళేగాక సునీత, కరుణ, ఈమధ్య రావటం తగ్గించుకున్న నిర్మల, ఎక్కడికీ వెళ్ళని యాదగిరి కూడా వచ్చారు. అందరి సమక్షంలోనూ కళ్యాణి దేహం బూడిద అయింది.

                             *    *    *

    కళ్యాణి పోయి నెల అయింది. గోవిందరావుగారు ఉత్తరం వ్రాశారు. ఎప్పటి సమాచారమే!    
    కళ్యాణి మరణించిన తరవాత సునీత ఆశ్రమ భారం తీసుకుంటానంది.
    "వద్దులే, పాపా! నాకు పెద్ద పనేం ఉంటుంది, ఆస్పత్రివేళల్లో తప్ప? ఇతర సమయం చాలు. ఎలాగూ మీరందరూ చేయూత ఇస్తూనే ఉన్నారాయె" అంది ఆర్తి.
    సునీత కాలాన్ని ఏమాత్రమూ వ్యర్ధం చెయ్యటం లేదు. ఈమధ్య కథలుకూడా వ్రాస్తున్నది.
    "నువ్వసలు ఏ అమెరికాలో ఉంటే నోబెల్ బహుమతి అందుకునే దానివే, సునీతా!" కరుణ అంటుంది.
    "మీ ఆయన సైంటిస్టు అయ్యేవారు..."
    కరుణ నవ్వుతుంది. నీలకంఠం కల్పించుకుంటాడు. నిజం, పెద్దమ్మా. మీరు నా శిష్యులై ఉంటే ఈపాటికి రీసెర్చి చేయించి చంద్రమండలాన్ని భూమిమీదకు తెచ్చిఉందును."
    "పాపం! అయ్యగారికి పెద్ద ఆశే ఉంది." కరుణ మాట విసురుతూంది.
    "లేకపోతే! చిన్న ఆశ మనకసలు ఉండనే ఉండదు."
    ప్రస్తావన అటు ఇటు తిరిగి కాలేజీమీదికి మళ్ళుతుంది.




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.