Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu



    తల విదిలించాడు నీలకంఠం. "అదంతా కేవలం అపోహ! ది నిజమని మీరూ నమ్మితే విరమించుకోవచ్చు!"
    "నాకా ఉద్దేశ్యం లేదు. ఆమె ఇష్టానిష్టాలతో నాకు నిమిత్తం లేదు. కష్టమైనా, సుఖమైనా నా నిశ్చయం మారదు" అంది కరుణ.
    నీలకంఠం నిశ్శబ్దంగా తలపై కెత్తాడు. మరికాసేపు ఉండి కరుణ వెళ్ళిపోయింది. సునీత కించిత్తు సందేహ పడింది కరుణ మాటలకు.
    యాదగిరి వీళ్ళనసలు పట్టించుకోలేదు.    
    ఫిబ్రవరి నెలలో నీలకంఠం తల్లిదండ్రులు, అతని పెదనాన్న వచ్చారు. బామ్మగారు ఇంటి దగ్గిర ఎవరూ లేరని రాలేదు. ఈసారి వాళ్ళను తను ఉంటున్న ఇంట్లోనే దింపాడు నీలకంఠం. సునీతను చూసి, ఆమే కరుణ అనుకున్నారు వాళ్ళు. తరవాత కరుణ ఎవరో తెలిసింది.
    కరుణ తల్లికి వాళ్ళను మర్యాదచెయ్యక తప్పలేదు. కరుణ తమ్ముడు శ్యామ్, వాళ్ళు వస్తున్నారని తెలిశాక పిచ్చిపనులు చేస్తే, గొంతు పిసికి చంపేస్తానని తల్లిని బెదిరించాడు. అతనికి కొంచెం ఆవేశం పాలు అధికం.
    కరుణను చూసి నీలకంఠం తల్లిదండ్రులుకూడా తృప్తి పడ్డారు. ఆవేళ సునీత ముందుగానే వెళ్ళి కరుణ నలంకరించటంలో తోడ్పడింది. ఎలా మెలగాలో మరీ మరీ చెప్పింది. కరుణ తు చ తప్పలేదు.    
    నీలకంఠం తల్లిదండ్రులకన్నా వాళ్ళ పెదనాన్నే ఎక్కువగా వాళ్ళ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. చిన్నప్పటినించీ తన ఇంట్లో పెరగటంచేత నీలకంఠానికేది కావాలో, ఏది అవసరమో ఆయనకే బాగా తెలుసు.
    కట్నం కానుకల ప్రసక్తి అంత ప్రాముఖ్యం వహించ లేదు.
    కరుణ తమ్ముడు ఊరుకోలేదు. "అమ్మ నగలు రెండు మూడు ఉన్నాయి. అవైనా కుదువబెడితే అక్కయ్య జీతంలో విడిపించింది. అదీకాక అక్కయ్య పొదుపుచేసిన డబ్బు ఓ రెండు వందలు ఉంటుంది. ఈ ఇల్లు అమ్మి పెళ్ళి ఖర్చులూ అవీ వెళ్ళదీస్తాం. డబ్బేమైనా మిగిలితే అది అక్కకు ఇచ్చేస్తాం, నగలుకూడా!"
    ఇరుపక్షాలకు సమ్మతమైంది. తాంబూలాదులు పుచ్చుకోవటమూ అయింది. ముహూర్తం మే నెల మొదటి వారంలో నిశ్చయించారు.
    మళ్ళీ నీలకంఠం పెళ్ళివరకూ విశేషాలేమీ జరగలేదు. అతని పెళ్ళికి వేణుకూడా వచ్చాడు. యాదగిరి వెళ్ళలేదు.
    కరుణ తరఫున సునీతే పెళ్ళి పెద్ద అయిందనవచ్చు. ఒకసారి వేణుకు ఎవరో సునీతను చూపిస్తూ, "ఆమె మీ భార్యా?" అని అడిగారు. వేణు ఆయన్ని చురుకుగా చూసి, మళ్ళీ అంతలోనే చిరునవ్వు తెచ్చుకుని, "అవును" అన్నాడు. సునీతకు, నీలకంఠానికి చెప్పి ఒకటే నవ్వు.
    నీలకంఠం అన్నాడు: "నిజంగా జరిగితే బావుంటుంది!"
    "బాబోయ్! ఈ నాటీ గర్ల్ నా? మొట్టికాయలు మొట్టేసిందంటే మన పని ఠా! నన్ను మార్కెట్లో వేలం వేయిస్తుంది."
    "పట్టి పిరికివారు, నీడను చూసి జడుసుకుంటారు,"
    "ఇక నువ్వు ధైర్యం టాబ్ లైట్సు వేసి వీరుణ్ణి చెయ్యి!"
    సునీత కరుణకు ఒక గాజుల జత బంగారపుది, నీలకంఠానికి ఒక ఉంగరం చదివించింది. వేణు వాళ్ళిద్దరికీ కలిసి ఒక రేడియో ఇచ్చాడు. వాళ్ళిద్దరికి బహుమతులు చదివించటం కోసం రెండు వందల రూపాయలు జీతంలో తీరుస్తానని వేణు దగ్గిర తీసుకుంది సునీత.

                         *    *    *    *

    "రావచ్చా?" గుమ్మంలో మాట వినబడింది.
    ఆర్తి తలఎత్తి చూసింది. కల్యాణి పూర్వం లేని కొత్తదనం, కళ్ళు వ్యక్తం చేస్తున్న విచారరేఖలు ఆర్తి గమనించగలిగింది.
    "రండి..... రా .... రా ..." అపుడే ఆపరేషన్ థియేటర్ లో నుంచి వచ్చిన ఆర్తి కాసేపు విశ్రాంతిగా కూర్చుని ఇంటికి వెళదామనుకుంటున్నది. ఆపరేషన్ ఉండటంవల్ల రోగులకు సాయంత్రం పరీక్షలు రద్దు చేసుకుంది ఆవేళ.
    కళ్యాణి ఆసీనఅయింది. ఆర్తి చిరునవ్వుతో, "విష్ యు గుడ్ లక్. ఎన్నో నెల?" అంది.
    కళ్యాణి నిట్టూరుస్తూ, "రెండవ నెల" అంది.
    "దిగులుగా ఉన్నావేం?"
    "దిగులా? ఏమీలేదు, డాక్టర్! జాగీర్దారుగారు స్వర్గస్థులయ్యారు."
    "ఎప్పుడు? ఎప్పుడు?"
    "పదిరోజులైంది. వారి స్వస్థలం రాలక్నోలోనే ..." కన్నీటి చుక్కలు రెండు టప్ మని రాలాయి టేబిల్ మీదున్న పాడ్ పైన.
    "ఏం జబ్బు?"
    "జబ్బేమీ లేదు. ఇక్కడినుండి నెలక్రితం లక్నో వెళ్ళాం. అక్కడ వారికి భూములు, ఓ బంగళా ఉన్నాయి భార్య తరఫున. ఒకనాటి రాత్రి కడుపులో నొస్తున్నదని వచ్చారు. తెల్లవారుజామువరకూ బాధపడి, తగ్గినట్టే తగ్గి, మళ్ళీ ఎక్కువై పోతూందంటూ డాక్టరుకు ఫోన్ చేసేలోగా ..."
    'ఉఫ్ ... " ఆర్తి చేతిని నుదురుకు కొట్టుకుంది.
    కళ్యాణి మళ్ళీ మొదలుపెట్టింది. "కానీ, డాక్టర్, ఆయన నన్ను అన్యాయంచేసి పోలేదు. ఇక్కడ ఉన్న బంగళా, యాభై వేల రొక్కమూ నా కిచ్చిపోయారు. డాక్టర్, నే నాయన భార్యను కాకపోయినా...."
    "కళ్యాణీ, మంచివాళ్ళు ఎప్పుడూ అల్పాయుష్కులు గానే ఉంటారు. చావు మానవునికి సహజం. రవీంద్రుడన్నట్లు, నిరంతరం ప్రవహించే జీవనస్రవంతికి బాధామృత్యువులే శాంతినిస్తాయి."
    "డాక్టర్,, నాకూ బతకటం అంటే విసుగెత్తింది. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూంది. కాని .... కాని ..... వారు, పుట్టబోయే నా పాపకోసమైనా ఆ పని చెయ్య వద్దన్నారు. మరీమరీ చెప్పారు. 'బేగం ... బేగం' అంటూనే కన్ను మూశారు. అందుకే నేనందుకు సాహసించలేకపోతున్నాను."
    "జీవితానికి వెరిచి ఆత్మహత్యకు పాల్పడటం పిరికి తనం. కళ్యాణీ, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే రెండు నేరాలు చేసినదానివి అవుతావు. దేవుని న్యాయస్థానంలో నీకు న్యాయం చేకూరదు. ఇంకా.....నువ్వు మరణించిన నీ భర్త జాగీర్దారుగారి జ్ఞాపకార్ధం ఏదైనా చెయ్యటం, ఆయన చివరి కోరికలు తీర్చటం ఉత్తమమైనవి. ఏ లోకల్లోనో ఉన్న ఆయన ఆత్మ శాంతిస్తుంది."
    "అదే చెయ్యాలనుకుంటున్నాను. వచ్చిందీ అందుకే ఆయాన చివరి కోరిక ఒక్కటే, డాక్టర్. నాకు ఆడబిడ్డ జన్మిస్తే 'రజనీప్రియ' అని, మగబిడ్డ జన్మిస్తే 'మహబూబ్ కుమార్' అని పేరు పెట్టమన్నారు. ఆయనెంతో సహృదయులు. హిందూముస్లిమ్ భాయ్ భాయ్ అన్న దృక్పథం వారిది. ఖురాన్ తోబాటు గీతా శ్లోకాలు పఠించిన మహానుభావులు. అందుకే....అందుకే....నేను పతితనని తెలిసీ చేరదీశారు. తన బేగాన్ని చేసుకున్నారు."
    కొంతసేపు మాటలే లేవు.
    "డాక్టర్, మీరు నాకు కొంత సహాయం చెయ్యాలి. లోకంలో నాలా కాలుజారినవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆయన నా కిచ్చిన డబ్బుకాక, నావంటిమీదా పెట్టెలోనూ ఉన్న నగలు సుమారు పాతిక వేలు ఖరీదు గలవీ, ఆ బంగళా అమ్మితే వచ్చిన డబ్బూ మీకిచ్చే స్తాను. మీరు ఈ ఆవరణలోనే ఒక ఆశ్రమంలాంటిది కట్టించి, పతితులైనవారికి ఆశ్రయ మివ్వాలి. అయితే వాళ్ళను ఎల్లకాలం అట్టే పెడితే, పోషించడానికి నేనిచ్చిన డబ్బూ, చివరకు మీ ఆస్తీ చిల్లిగవ్వ మిగలదు. అందుకని కుట్టుపని, నూలు వడకడం మొదలైన చిన్న పనులు, వీలైన చిన్న కుటీర పరిశ్రమలు వ్యాపకంగా పెట్టించి వారికీ స్వయంగా జీవించడం నేర్పాలి. వీలైతే కొందరిని నర్స్ ట్రెయినింగ్ కూ, టీచర్ ట్రెయినింగ్ కూ పంపి. తమ కాళ్ళమీద తామే నిలబడేట్లు చెయ్యాలి. అటు రోగులకు సేవ చెయ్యడం, ఇటు ఇది నిర్వహించటం మీకు కష్టంగా ఉంటే నేనా ఆశ్రమాన్ని నడపగలను. నాకు కొన్ని చేతిపనులు తెలుసు. మిగతావాటికి ఎవరినన్నా చెయ్యి తిరిగిన వారిని జీతమిచ్చి పిలిపిద్దాం."
    "ఓ, చాలా పెద్ద ఆదర్శమే, కళ్యాణీ! నాకూ ఇష్టమే. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించటానికయ్యే ఖర్చులు నేను భరిస్తాను. నువ్వన్నట్లు నర్స్, టీచర్స్ గానేకాక గ్రామసేవికలుగా, శిశుసంక్షేమాదులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కాస్త చదువుకున్నవాళ్ళు కావాలి!"
    "నేను వాళ్ళకు చదువు చెబుతాను. ప్రైవేటుగా మెట్రిక్ కు కట్టించవచ్చు. నాకు తెలిసిన ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళకు సాయంత్రాలు ఒకటి రెండు గంటలు పార్ట్ టైమ్ ఏర్పరిచి అందుకు జీతాలివ్వవచ్చు."
    గడియారం టంగ్ మని ఒకటి కొట్టింది. అయిదున్నర.
    "శుభసూచకం, కళ్యాణీ! గడియారం కూడా శుభం అంటున్నది. తరవాత అన్నీ యోచిద్దాం గానీ, ఇంటికి వెళదాం పద."
    ఇంటికి వెళుతున్నప్పుడు కళ్యాణి అంది: "నేనిక ఆ బంగళాలో ఉండలేను, డాక్టర్. అంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్ని. అదీగాక తేపతేపకూ జాగీర్దారుగారు అవుపిస్తారు అందులో. ఎక్కడ చూసినా వారి చిహ్నాలే!"
    "వేరే ఇల్లు అద్దెకు తీసుకుంటావా?"
    "కాదు. మీరు.... మీరు అనుగ్రహిస్తే ఆశ్రమం కట్టించేదాకా మీ ఇంట్లో..."
    ఆర్తి ఆమె భుజం తట్టింది. "నా సోదరికి ఎప్పుడూ స్వాగతం ఉంటూనే ఉంటుంది. కళ్యాణీ, నేను నీ స్వంత సోదరిననుకో! అందులో నీవు నిరభ్యంతరంగా తిరగవచ్చు."
    "కృతజ్ఞురాల్ని. కృతజ్ఞురాల్ని, డాక్టర్. వచ్చే జన్మలోనైనా మీ ఋణం తీర్చుకో ప్రయత్నిస్తాను."
    రాత్రి తొమ్మిది గంటలకు కారుమీద పెళ్ళికి వెళ్ళిన వేణు తిరిగి వచ్చాడు. కళ్యాణిని గూర్చి, ఆమె సంకల్పాన్ని గూర్చి రాధవల్ల విన్నాడు.
    "మంచిదే. అక్కయ్యాకూడా ఇందుకు పూనుకోవటం ముదావహం. నీవుకూడా తోచిన సహాయం చెయ్యి. రాధా!"    
    "నేనా? ఏం సహాయాలు ఉన్నాయి?"
    "ఏదైనా సహాయమే. అనాథాశ్రమంలో చేరినవాళ్ళు నిరాశపడకుండా అనునయించటం, చదువురానివాళ్ళుంటే ఓనమాలు నేర్పటం-అప్పటి కేది తోచినా చెయ్యాలి. మన కంపెనీనుండి కొంత డబ్బుకూడా సహాయం చేస్తాను."
    సునీత వచ్చిన రోజున ఆర్తి ఆమెకూ ఎరుకపరి చింది కళ్యాణిని. సునీత తల ఊపుతూ, "నేను వాళ్ళకు చదువు చెబుతాను, మిషన్ కుట్టడం, టైప్ రైటింగ్, నూలు వడకడం-ఏదైనా సరే నేర్పగలను. నానుండి ఏం కావలసివచ్చినా, మీరు సునాయాసంగా పొందవచ్చు, డాక్టర్!"
    వారం రోజుల్లో ఆశ్రమ నిర్మాణానికి సర్వ సన్నాహాలూ జరిగాయి. ఆస్పత్రి పశ్చిమ దిశాభిముఖంగా ఉంది. దాని కెదురుగా ఆర్తి బంగళా ఉంది. కుడి వైపున కాంపౌండ్ మెయిన్ గేటు, ఎడమవైపున విశాలమైన ఖాళీస్థలం. అక్కడే నిర్మాణాని కనువుగా ఉంటుందని ఇంజనీరు సలహా ఇచ్చాడు. అంటే ముందు ఆ ఆవరణలో కాలు పెడుతూనే కనబడేది ఆశ్రమం అన్నమాట.
    అది పూర్తి అయ్యాక దానికి 'గీతాఆశ్రమం'గా పేరు స్థిరపరిచింది కళ్యాణి. ఇప్పుడు ఆ కాంపౌండ్ మొత్తానికి 'గీతా భవన్స్' అన్నపేరు. హాస్పిటల్ పేరు గీతా వైద్యశాల. ఆర్తి బంగళా పేరూ గీతాభవనమే! అప్పట్లో సారథి ఉండగా పవిత్రమైన భగవద్గీతను దృష్టిలో ఉంచుకుని ఆ పేర్లు పెట్టాడు.         కళ్యాణి తను అనుకున్నవన్నీ అందులో ప్రవేశ పెట్టింది. సునీత సలహామీద అనాథ బాలలకు కూడా కొంతభాగం కేటాయించబడింది.

                          *    *    *    *




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.