Home » Dr C ANANDA RAMAM » Nanrushi Kurutay Kavyam


   
    పరిగెడుతున్నాను రావును అందుకోవాలని, ఆ జ్యోతి ప్రకాశంలో నన్నావరించిన అంధకారాన్ని దూరం చేసుకోవాలని! పరుగెడుతూన్నకొద్దీ ప్రకాశం అధికమవుతూంది. రావు ఆకృతి స్పష్టమవుతూంది. చీకట్లు పలచనవుతున్నాయి. కానీ, ఇంకా రావు దూరంగానే ఉన్నాడు. ఆ జ్యోతి దూరం గానే ఉంది.
    ఏ శక్తితో పరుగెడుతున్నానో ఆ శక్తి హఠాత్తుగా క్షీణించిపోయింది. ఉన్నపాటున కుప్పగా కూలి పోయాను. రావు కనిపిస్తున్నాడు. కానీ, పరుగెట్టలేను. రావును అందుకో లేను. ఎలుగెత్తి పిలుస్తున్నాను. అయినా, ఆ పిలుపు ధ్వనించటం లేదు. అక్కడి వాతావరణంలో వాయువు లేదా? అందుకనే నా పిలుపు ధ్వనిగా రావును చేరలేకపోతూందా? ఆ కారణంగానే నాకు ఊపిరాడటం లేదా?
    అవును! నాకు ఊపిరాడటం లేదు. ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి. నాలో జీవశక్తి హరించుకు పోతూంది. మన నావరించిన ఈ సమస్త వాతావరణమూ చైతన్యమయమా? ఈ చైతన్య జీవ కెరటాలు వాయురూపంలో నిరంతరం మనలో నుండి ప్రవహిస్తున్నంత వరకేనా మనకు చైతన్యం? నా కా వాయు కెరటా లందటం లేదు. నాలో చైతన్యం క్షీణిస్తూంది! నాలో చైతన్యం పూర్తిగా నశించక ముందు ఒక్క క్షణం రావును చేరుకోగలిగితే! ఒక్కసారి రావు చేతిలో చెయ్యి ఉంచి తరవాత శాశ్వతంగా జడా కృతి పొందితే!
    యావచ్చక్తి నీ వినియోగించి రావును పిలుస్తున్నాను. నా సమస్త చైతన్యమూ అతి తేలికయి ఎక్కడికో తేలిపోతూంటే, అది ఎగిరిపోకుండా గట్టిగా 'రావు' అనే రెండక్షరాలకూ దానిని బంధించాను. ధ్వని లేని ఆ పిలుపుకు బలహీనంగా ఉన్న ఆ బంధం సడలిపోయి, ఆ చైతన్య శక్తి అనంతంలోకి ఎగిరిపోవాలని ఆరాట పడుతూంది! పోనీయటం లేదు నేను! ఒక్కసారి రావును దగ్గిరగా చూడాలి! ఒక్కసారి రావు చేతిని పట్టుకోవాలి!
    రావ్! రావ్! రావ్!
    చైతన్య రహితమైన ఆ జీవ శూన్య వాతావరణంలో ధ్వని కల్పించటానికి ప్రయాసపడుతున్నాను.
    హమ్మయ్య! ధ్వనిస్తూంది. 'రావ్!' ఆ రెండక్షరాలూ అతి తీయగా నా చెవులకు వినబడుతున్నాయి. ఎగిరిపోతున్న నా చైతన్యాన్ని మరి కాస్త దృఢంగా ఈ ధ్వనికి బిగించి, మరింత ఎలుగెత్తి పిలుస్తాను!
    "రావ్!"
    "శారదా!"
    నా కళ్ళకు రావు కనిపించాడు. గట్టిగా రావు చేతిని పట్టుకున్నాను. రావు చేతులు నన్ను ఆప్యాయంగా నిమురుతున్నాయి. కన్నీళ్లు! ఏ నాడూ దేనికీ చలించని రావు కళ్ళలో నీళ్ళు! ఎందుకు?
    నా చుట్టూ ఎవరెవరో ఉన్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు.
    నాకు రావు తప్ప ఎవరూ కనపడటం లేదు. మరేదో లోకంలోనుండి లాగ ఏవో మాటలు వినబడుతున్నాయి.
    "హమ్మయ్య! కళ్ళు విప్పింది. జాగ్రత్త! ఆయాస పెట్టకండి. పరిస్థితి బాగుండలేదు."
    "ఫరవాలేదంటారా, డాక్టర్ గారూ! మా వదిన బ్రతుకుతుందంటారా?"
    "చెప్పలేం! ఆవిడకు స్మృతి వచ్చి మాట్లాడితే, నెల రోజులుగా అపస్మారక దశలో పడి ఉన్నట్లు తెలియనీయకండి. అందరూ ఏం జరగనట్లే మాట్లాడండి!"
    నా చుట్టూ ఏవేవో ధ్వనులు! ఒక్క మాటా అర్ధం కావటం లేదు. ఒక్క ఆకృతీ స్పష్ట పడటం లేదు. రావునే తదేకంగా చూస్తున్నాను. రావు పెదవులు కదులుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. "రావ్! నా కళ్ళు మూసుకు పోతున్నాయి. మూసుకోవాలని లేదు. ఇంకా నిన్నే చూడాలని ఉంది. కానీ, మూసుకుపోతున్నాయి. పోనీలే! నిన్ను చూశాను. ఆ దివ్వె ఏది? ఏం చేశావ్ ఆ జ్యోతిని?"
    రావు చేతిలో నుండి నా చెయ్యి జారిపోతూంది. జారిపోనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు రావు. ఆ దార్ధ్యం, ఆ ఉష్ణం నా నరనరాలకూ వ్యాపించింది. బాగా నామీదకు దగ్గిరగా వంగాడు.
    "శారదా! వీల్లేదు. నువ్వు బ్రతకాలి. బ్రతకాలి. శారదా!"        
    అప్పుడు అర్ధమయింది. నేను చచ్చిపోతున్నానా?
    ఎలాంటి అవివేకిని నేను! ఊహతో ఏ విషయాన్నీ తెలుసుకోలేను. అనుభవాలతోకాని జీవితాన్ని దర్శించలేను.    
    నా కళ్ళు వాలిపోతున్నాయి. ఏవేవో వింతవింత ధ్వనులు!
    మా చుట్టుపక్కలవాళ్ళందరూ అంతిమ క్షణాలలో మా సంభాషణ చూసి ఆశ్చర్యపోతున్నారులా ఉంది.
    రావు ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ రావు మనసు నొప్పించానా? అయ్యో! మరొక్కసారి రాకూడదూ?
    "అమ్మా!"
    అత్యంత మధురమయిన స్వరం నా చెవులలో పడింది. రెండు లేత చేతులు నన్ను పెనవేసుకున్నాయి.
    మూసుకుపోతున్న నా కళ్ళు ఏదో ప్రేరణతో తెరుచుకున్నాయి.
    "పాపా!"
    "అమ్మా! నాకు నువ్వు కావాలమ్మా! నువ్వు ఎక్కడికీ వెళ్ళిపోకు! నాకు నువ్వూ, నాన్నగారూ-ఇద్దరూ కావాలి. నాన్నగారిని తీసుకురావటానికి వెళ్ళాను. నాన్న గారు వస్తే నువ్వు వెళ్ళిపోతావా? నేనే నీతో వచ్చే స్తాను."
    వెక్కి వెక్కి ఏడుస్తూంది పాప.
    పాప-'నీతో వచ్చేస్తాను' అనటం భరించలేక పోయాను.
    "ఏడవకు, పాపా! ఎక్కడకూ వెళ్ళను. నీతోనే ఉంటాను. నువ్వు తీసుకొచ్చావా నాన్నగారిని?"
    "అవును! పాప తీసుకొచ్చింది నన్ను!"
    నా దగ్గిరే కూర్చున్న రావు నా ముఖంలో తొంగి చూస్తూన్న జీవకళను సంతృప్తితో చూస్తూ అన్నాడు.
    "నువ్వు వెళ్ళవు కదూ!" పాప మళ్ళీ ఏడుస్తూ అడిగింది.
    "ఉహుఁ! వెళ్ళను." పుల్లల్లాంటి నా చేతులతో పాప చెక్కిళ్ళను తుడిచాను.
    రావు చెప్పింది ఒక రకంగా నిజమే! పాప రావును తీసుకురాకపోయినా, రావు నా దగ్గిరకు రావటానికి పాప పరోక్ష కారకురాలు!
    అకస్మాత్తుగా వచ్చిన పాపను చూసి ఆశ్చర్య పోయాడు రావు.
    "నే నింక అక్కడి కెళ్ళను, నాన్నగారూ! మీరు నా దగ్గి రెందు కుండరూ?" ఏడుస్తూ అడిగింది పాప.
    "ఏం జరిగింది, పాపా!"    
    "కాన్వెంటులో అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. మీరు మా నాన్న కాదుట! లతీఫ్ మామయ్య మా నాన్నట! అందుకే లతీఫ్ మామయ్య నన్ను కారులో దింపుతున్నాడుట! మీరు మా నాన్నగారు కాదు కనక నా దగ్గిర ఉండటం లేదుట! ఏం, నాన్నగారూ! మీరు మా నాన్నగారు కాదా!"
    పాప రావును కౌగిలించుకుని తన ఉక్రోష మంతా కరిగిపోయేలా ఏడ్చింది.
    "అమ్మకు చెప్పావా, ఈ సంగతి?"
    "ఎలా చెప్పను? అమ్మ పడుకుంది. లతీఫ్ మామయ్య అమ్మ దగ్గిర గొడవ చెయ్యనివ్వటం లేదు."
    "ఎందుకు పడుకుంది?"
    "ఏమో! ఎప్పుడూ పడుకుంటుంది!"
    "జ్వరమా?"
    "డాక్టరు గారు రాలేదుగా మరి? నాకు జ్వరం వస్తే డాక్టరుగారు వస్తారు."
    "అమ్మ అసలు లేవటం లేదా?"
    "అసలు లేవటం లేదు. అన్నం కూడా తినటం లేదు. సీతాలు కాఫీ ఇస్తుంది."
    నాకు ఒంట్లో కులాసాగా లేదని అర్ధమయింది రావుకు.
    ఏ కారణం వల్ల తన గుండెలు పగిలిపోతున్నా నాకు భర్తగానే ఉండటానికి నిర్ణయించుకున్నాడో, ఏ కారణం వల్ల తనకు సర్వాధికారాలూ ఉన్నా కోర్టు కెక్కక పాపను నాకే వదిలిపెట్టాడో ఆ కారణం వల్లనే - పాప భవిష్యత్తుకోసమే - పాప చెయ్యి పట్టుకుని రావు నా దగ్గిరకు వచ్చాడు.
    కర్తవ్యదీక్షతో యాంత్రికంగా నా దగ్గిరకు వచ్చిన రావు హృదయాన్ని నా ఆర్తి వశపరుచుకుంది.         కొంచెం కోలుకుని మాట్లాడే శక్తి వచ్చాక రావును అడిగాను:
    "నాకు ఏకాగ్రత ఎందుకు కుదరటం లేదని అడిగాను ఆనాడు. నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు."
    "వెళ్ళిపోలేదు. సమాధానంతో వచ్చాను. పాపను నీ దగ్గిరికి పంపించింది నేనే! అదే సమాధానం!"
    "ఎలా?"
    "నీలో జీవితేచ్చ నశించిపోయింది. జీవితంలో ఆసక్తి అడుగంటింది. ఉత్సాహం పూర్తిగా నశించిన నీలో ఏకాగ్రత సాధ్యం కాలేదు. ఏ పరిస్థితులలోనూ జీవితేచ్చ నశించకూడదు. దురాశను దూరం చెయ్యాలి కాని, ఆశను అడుగంట నియ్యకూడదు. తృష్ణ వెంట తగలరాదు కాని అన్వేషణ అంతం కారాదు. ఉన్మాదో ద్రేకానికి ఉద్వాసన చెప్పాలి కాని ఉత్సాహాన్ని క్షీణించ నియ్యకూడదు. నీలో జీవించాలనే కోరిక నశించింది కనకనే ఏ మందులూ పనిచెయ్యలేదు. పాప నీకోసం ఆక్రోశించే సరికి పాపకోసం బ్రతకాలనుకున్నావు. ఆ ఇచ్చ నీలో ప్రవేశించాక మేము నిన్ను బ్రతికించుకో గలిగాం! ఇప్పుడు ప్రయత్నించు. ఏకాగ్రత సాధించ గలవు."
    నిరంతరాన్వేషణ, నవనవోన్మేషణమయిన ఉత్సాహ శక్తి, మమత నిండిన మనసు, నిర్మొహమైన దృష్టి, ఏకాగ్రమైన సాధన - ఇవి లేక రస సృష్టి సాధ్యం కాదు.
    'నా నృషిః కురుతే కావ్యం' అన్న ఆర్యోక్తి విని వాల్మీకి వ్యాసాదులు ఋషులు కావటం వలన ఈ ఆర్యోక్తి ప్రచారంలోకి వచ్చిందని భావించాను.
    ఏ మహానుభావుని హృదయ వినిర్గతమోకాని ఈ సూక్తి ఎంత భావన నిమిడించుకొంది తనలో!
    అబ్దుతోజ్జ్వల శిల్ప శోభితాంగ, సరసాంతరంగ, భావాంబర వీథి విశ్రుత విహారిణి, శారదాజ్యోతి స్స్వరూపాన్ని లేశమాత్రంగా నైనా - మరుజన్మలో నైనా సాక్షత్కరింప చేసుకోగలనా?
    పరిమళ ఎందుకో పకపక నవ్వుతూంది. లేవబోతున్న నన్ను రావు పొదివి పట్టుకుని నడిపించాడు.
    అక్కడి దృశ్యం చూసి రావు, నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాం!
    పాప మా ఎవ్వరివైపూ చూడకుండా చకచక ఏదో వ్రాసేస్తూంది!


        
                              ----:సమాప్తం:----




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.