Home » Komala Devi » Unnatha Sikaralu



    సుధాకర్ మెల్లగా లోపలి కెళ్ళాడు. అతని గుండెలు దడదడ లాడాయి. దోమ తెరలో -- సన్నటి విద్యుద్దీప కాంతిలో దుర్గ మొహం స్పష్టంగా కనబడలేదు. గోడ వారగా పనిమనిషి హాయిగా నిద్రపోతోంది. "వాళ్ళ వార్డన్ ఇప్పుడే వెళ్ళారు భోం చేసి మళ్ళీ వస్తామన్నారు.
    సుధాకర్ ఇవతలికి వచ్చాడు. ముఖం కన్నా కట్టిన కట్లె ఎక్కువగా అగుపిస్తున్నాయి. ఒకచేయి కన్పబడలేదు సీసా లోంచి చుక్కచుక్కగా రక్తం. ఆమె చేతి నాళం లోంచి శరీరం లోకి ప్రవహిస్తోంది. ముక్కు, కళ్ళు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి కుర్చీ దగ్గరగా లాక్కుని కట్టు కట్టిన ఆమె కుడి చేతి మీద లీలా మాత్రంగా చేయి వేశాడు. తన వల్ల కదా అమెకిలాంటి ఆపద సంభవించింది ! "సిస్టర్ చేతికి ఏదైనా ఫ్రాక్చర్ అయిందా?"
    "ఔను, గాజు పెంకులు గ్రుచ్చు కున్నవి తీయటానికి చాలా కష్టమైందట. అదృష్టం కొద్ది , మల్తిఫుల్ ఫ్రాక్చర్ కాదు" మొదటిసారిగా ఆమె పట్ల పాప భీతితో సుధాకర్ హృదయం కలుక్కు మంది. ఈమె ఏ పాపం చేసి ఎరగదు. అవినీతి కార్యాలు చేసేదొకరు, భాధలనుభావించేది మరొకరు. మొన్ననే ఒక సినిమా చూచాడు! భర్త సముద్రం మీద వెళ్ళాడు. అతడు క్షేమంగా తిరిగి రావాలంటే అది అతని స్త్రీ ప్రవర్తన పై ఆధారపడి వుంది. ఆమె పవిత్రంగా వుండి తన భర్త అన్ని గండాలు తప్పించుకుని రావాలని ప్రార్ధిస్తే ఆ విధంగా జరుగుతుందని వారి నమ్మకం ....ఆమె ఒకానొక క్షణికా వేశాలకి లొంగిపోయింది . అక్కడ భర్తను సముద్రం కబళించి వేసింది. దుర్గ తన పవిత్రతను కోరింది....ఇప్పుడింత బాధకు లోనైంది. తనను చూచి...కాదు కాదు....తన చేయి ఆ లెక్చరర్ కమల నయన నడుం చుట్టూ వుండటం చూచింది. తమ ఇద్దరి భుజాలు రాచుకోవడం చూచింది. తనేల్లాంటి వాడో ఆమెకు తెలుసు. తనమీది ఏహ్య భావంతో విడిగా వచ్చేసింది. అయినా తన చేష్టలకూ ఆమె మనస్సు కూ ఏదో సంబంధం ఉన్నట్లు ఆ దృశ్యాన్ని చూచి భరించలేక పోయింది.
    ఆ ఒక్క క్షణం దాటిపోయినా ఆమె క్షేమంగా మెట్లు దిగి వెళ్లి పోయేది. ఈ అపాయం సంభవించేది కాదు.
    "సిస్టర్ ....ఒక్కసారైనా మెలుకువ వచ్చిందా?"
    "ఆ....వచ్చిందిట  అప్పటికి చేతికి కట్టు కట్టే పని పూర్తీ కానందువల్ల మార్ఫియా యిచ్చారు. చాల నొప్పి , పాపం " నర్స్ దూరంగా కిటికీ దగ్గర నుంచుని గోళ్ళు గిల్లుకోవటం మొదలెట్టింది. సుధాకర్ నేనిక్కడే వుంటా నన్నట్లు నిలుచున్నాడు. అరాగంట తరువాత దుర్గ కొద్దిగా కదిలింది. ఆశతో -- నిరీక్షణ తో ఆమె వైపు చూచాడు పాలిపోయిన పెదిమలు విడివడి స్వల్పంగా కనిపించినై . బాధతో ముఖం ముడుచుకు పోయింది...." అమ్మా అంటూ హృదయ విదారకంగా మూల్గింది.
    ఏ క్షణంలో నైనా ఆమె కండ్లు తెరవగలదు. తనను చూచి తిరిగి స్పృహ కోల్పోదు కదా! "ప్లీజ్! ఆ డ్యూటీ డాక్టరును ఈమెకు మెలకువ వచ్చిందని చెప్పండి" అన్నది నర్స్.
    వారంతా లోపల ఉన్నంత సేపు సుధాకర్ బైట పచార్లు చేస్తూనే వున్నాడు. దుర్గ తనను చూస్తుందా?
    డాక్టర్ బైటి కొచ్చాడు అతనికి ఎదురెళ్ళి తన్ను తాను పరిచయం చేసుకున్నాడు...."డాక్టర్ ఈమె నా భార్య. అనివార్య కారణాల వల్ల మా సంబంధం తెగి పోయిందను కొండి కాని పరిస్థితుల దృష్ట్యా ఆమె దగ్గర వుండటానికి వచ్చాను....ఆమెకు నేనోచ్చానని తెలిసిన తర్వాత .......నేను కనబడితే ; హటాత్తుగా కనబడడం వల్ల ఆమెకేమీ కాదు గదా?....
    డాక్టరు సుధాకర్ భుజాన్ని మెల్లగా తట్టాడు. మంచిది మీరు ఇక్కడ నిరీక్షిస్తున్నట్లు ముందుగా తెల్సిన తర్వాత వెళ్తేనే మంచిది సిస్టర్" అని ఆమె వైపు అర్ధవంతంగా చూచాడు.
    సిస్టర్ లోపలి కెళ్ళింది . దుర్గ సన్నగా మూల్గుతోంది.....ఆమె మీదికి వంగి మెల్లగా అంది...."చూడమ్మా ....నన్ను చూడటానికి ఎవరెవరో వచ్చారు. సుధాకర్ గారట -- మీ భర్త గారు-- మిమ్మల్ని చూడటానికి రెండు గంటల నించి వేచి వున్నారు. రమ్మనమని చెప్పేదా? దుర్గ జవాబు కోసం ఎదురు చూడకుండానే ఆమె లేచింది, నర్స్ ను చూచి పైకి రమ్మని సైగ చేసింది.
    సిస్టర్ బైటికి వచ్చి సుధాకర్ ను వెళ్ళమని సైగ చేస్తూ అన్నది. "మనః క్లేశం కల్గించే మాటలు మాట్లాడకండి." సుధాకర్ మెల్లగా తలుపులు త్రోసుకుని లోపలి కెళ్ళాడు.
    దుర్గ కళ్ళు మూసుకుని వుంది, కానీ ఆ మూసిన రెప్పల్ని చీల్చుకుని కన్నీరు కారుతోంది. ఆమె హృదయం ఉవ్వెత్తున లేచి పడ్తోంది . సుధాకర్ ఆమె ప్రక్కనే కూర్చుని తన రుమాలుతో కన్నీరు అద్దేడు. "దుర్గా -- ఇటు చూడు -- "పదేపదే ఆమె పేరు ఉచ్చరించాడు. దుర్గ రెండు చేతులు కట్టి వేశారు. ఆమె బాధను ఓర్చు కుంటూ ముఖం చిట్లిస్తోంది.    
    సుధాకర్ ఆమె మీదకు వంగి ఆమె చెంపల్ని తన చేతుల్లో పట్టుకుని "దుర్గా -- నన్ను క్షమించలేవూ? నా నుంచి నువ్వింత బాధపడటం నేను సహించలేను -- నువ్వు త్వరగా బాగై పోవాలి -- ఇక నాకేమీ అక్కరలేదు. నువ్వు నా ఆస్తి నంతా దేశ రక్షణ నిధికి ఇచ్చేశావటగా ! అయినా ఫర్వాలేదు. అందువల్ల మేలే జరిగింది. చిచ్చు బుద్దితో మందున్నంత సేపు వెలుగులు వెదజల్లి చప్పగా అరిపోయినట్లు చేతిలో డబ్బు ఆడుతుంటే అహంకారంతో విచ్చలవిడిగా తిరిగి విచిత్రమైన కోరికలతో కాలం గడిపే వాడిని. అది అయిపోయిన మరుక్షణం గాలిపోయిన బుడగ లా చప్పగా అయిపోయే వాడిని. ఇది గాలిలోని బలహీనత దుర్గా , మానవునికి ముఖ్యమైనది డబ్బు అని అంటుంటే అతడు అసాధారణ ప్రతిభాసంపన్నుడై పదిమంది లో తలెత్తుకు తిరగ గల స్థోమత లభించగలదని కోరిన సుఖం లభించగలదనుకున్నాను. కాని, డబ్బుతో పాటు గుండె నిబ్బరం ధైర్య సాహసాలు అవసరమని నాకెప్పుడు భావనలోకి రాలేదు. నేను పిరికి వాడిని దుర్గా. ఈ పిరికితనమే నా పాలిట ఉచితయై నన్ను భోగం పాలు చేయకుండా కాపాడింది.....దుర్గా ....నిన్నింక విసిగించను . నీ మానసిక బాధను త్వరగా మరిచి నువ్వు పూర్తీ ఆరోగ్యం పొందాలి ఇటు చూడు.
    దుర్గ కళ్ళు తెరిచింది. భర్త మాటలు మగత నిద్రలో మధుర స్వప్నంలా తోచాయి. అయినా ఎందుకో 'వద్దు' అన్నట్లు తల ఆడించింది. మౌనంగానే తల అటు త్రిప్పి మంచి నీళ్ళ వైపు చూచింది.
    సుధాకర్ ఒక్క పరుగున బైటి కెళ్ళి ఏదైనా ఇవ్వవచ్చు నో లేదో కనుక్కుని వచ్చాడు. ఫ్లాస్కు లో పాలు కప్పులో పోసి చెంచా తీసుకుని వచ్చాడు.
    "దుర్గా -- నోరు తెరువు ." ఆమె మెల్లగా నోరు తెరిచింది.
    నాలుగైదు చంచాలు త్రాగిన తర్వాత "చాలు" అంది ఆమె ఆమె పెదిమలను మెల్లగా తుడిచి ప్రసన్నంగా నవ్వాడు?"
    తలుపు త్రోసుకుని దుర్గ హాస్టల్ వార్డన్ వచ్చింది. సుధాకర్ ను అక్కడ చూచి నిశ్చేష్టు రాలైంది ఆమె.
    "మీరు -- మీరు --" సుధాకర్ మంచం మీద నించి లేచి నుంచున్నాడు.
    "దుర్గ -- ణా భార్య -- మీరేమీ గాభరా పడనవసరం లేదు.....ఆమె కొన్ని క్షణాలు ఇద్దరి వైపు మార్చి మార్చి చూచింది.
    "ఏమమ్మా నువ్వు ఎప్పుడూ చెప్పనే లేదు" ఏవో మాట పట్టింపు లొచ్చి విడిపోయాం ....ఈరోజు జరిగిన అపాయానికి కారకుడను నేనే....' అన్నాడు సుధాకర్.
    "మీరు వెంటనే రాలేదు కూడా"
    "ఔను....ఒక నిర్ధారణ కు వచ్చేసరికి ఇన్ని గంటలు పట్టింది.
    "ఇలా మనసు మార్చుకున్నందుకు తర్వాత పరితపించరను కుంటాను......."
    "లేదు ...పరితపించను అని దృడంగా అన్నాడు. దుర్గ హృదయం ఉద్వేగం లో ఒక్కసారి ఎగిరి పడింది.
    "నా దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదు. మెల్లగా గొణిగింది.
    "నాకేమీ అక్కర్లేదు" అంటూ దుర్గ ప్రక్క కూర్చున్నాడు.
    "మిస్టర్ సుధాకర్ అయితే రాత్రి పూర్తిగా ఒక్కడే వుంటారా? "వుంటాను ...ఈమె ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే"-- అంటూ నిశ్చింతగా నిద్రపోతున్న పని మనిషి వైపు చూచాడు.
    తెల్లవారే లోగా బిలబిల మంటూ సరళ, రమణ, నిరంజన్ దుర్గ అత్త మామలు అందరూ వచ్చారు. సరళ ను దగ్గరకు రమ్మని పిల్చింది దుర్గ. సరళ దగ్గరగా వంగింది.
    "నన్ను చూట్టానికి వారొచ్చారు. రాత్రంతా ఇక్కడే నన్ను కనిపెట్టుకుని కూర్చున్నారు. ఇందాకనే ఐదు గంటలకు వెళ్లి పోయారు"
    సరళ ముఖ దేదీప్యమానంగా వెలిగి పోయింది"విన్నారా! ఇదేంత శుభ దినం ? సుధాకర్ రాత్రంతా ఇక్కడే వుండి ఇప్పుడే వెళ్లారట...."
    "నిజమేనా దుర్గా?" అత్తగారు ముందు కొచ్చి ఆత్రుతగా అడిగింది.
    "ఔనంది --పది గంటల నుంచి ఇక్కడే వున్నారు"
    "ఏమన్నాడేమిటి ?" ఆశ్చర్యంతో అడిగాడు తండ్రి--




Related Novels


Unnatha Sikaralu

Aardhana

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.