Home » Komala Devi » Unnatha Sikaralu



    "ఎవరు చెప్పబోవటం లేదు" సర్దుకుని కూర్చున్నాడు.
    "ఇక వదిలేది లేదు. ఇంతవరకు తెలిశాక చెప్పకపోతే...."
    "అమ్మో! ఇది ఎడం కాలు కాబోలు! సమానంగా వుంది.... భయం వేస్తోంది....."అంటూ సరదాగా బెదిరి చూచాడు. ప్రేమ పెదాలు బిగించింది.
    "చెప్తాను వినండీ దేవీ! టూర్ కు వెళ్ళినప్పుడు గీతకు కొంత డబ్బు తక్కువ పడింది. ఈ మాట మాట వరుసకు సరళ తో అందిట. టూర్ కు వంద రూపాయలు సమయాని కందక పొతే తను వెళ్ళటం హుళక్కే అని వెంటనే ఆ మాట కాస్తా ణా చెవిని వేసింది సరళ. నేను నాన్నతో అన్నాను. మేమిద్దరం ఇస్తే గీత పుచ్చుకోదు, అందుకని అమ్మ ఒకనాడు గీతకు బలవంతాన ఇచ్చింది. అప్పులా కాదని కూడా ఖచ్చితంగా అందిట. గానీ గీత ఒప్పుకుంటుదీ? తర్వాత పరీక్ష ఫీజు తనకై తానె వచ్చి అడిగింది....అమ్మనే సరాసరి వచ్చి అడిగింది. సమయానికింట్లో డబ్బు లేక పోయింది. నన్ను బ్యాంక్ కు పంపవలసి వచ్చింది. అది రెండొందలు. తానిప్పుడు పనిలో ప్రవేశించింది కదూ తీరుస్తోంది...."
    ప్రేమ చెంప మీద చేయి ఆన్చి వింటోంది. ఆమె హృదయంలో తుఫాను రేగింది. గీత తన చిన్ననాటి స్నేహితురాలు. తామిద్దరూ కలిసి చదువుకున్నారు. ఒకరి నించి ఒకరికి రహస్యాలంటూ లేవు. పరస్పరం ఎప్పుడూ సహాయం చేసుకుంటూ ఇంతవరకోచ్చారు. తనను అడగలేక పోయింది, అంటే తన స్నేహాన్ని చిన్న చూపు చూచి నిన్న కాక మొన్న వచ్చిన నిరంజన్ ను అడిగింది. ఆమాత్రం సాయం చేసే అవకాశం యిబ్బాక పై పెచ్చు తన నించి ఈ రహస్యం ఇంతవరకు దాచింది. దాని అర్ధం ఏమిటి?
    మరుసటి రోజు గీత ఉత్తరం రానే వచ్చింది.
    నీదగ్గర డబ్బు తీసుకోలేదని నీకు కోపం కలిగి వుండొచ్చు, విషయం తెలియటానికే ఈ జాబు.
    నీవు ఆరైనా నూరైనా నాకు అప్పుగా ఇవ్వవు. ఎవరి సహాయమైనా నాకెందుకు! నాకు కావలసింది అప్పు, ఆ విధంగా నువ్వు అంగీకరించవు. ఊరక ఇస్తానంటావు- అది నాకు సమ్మతం కాదు నేను చేసిన స్వల్ప సహాయానికి నీ హృదయం- మీ తల్లిదండ్రుల హృదయం - కృతజ్ఞత తో నిండి వుంది. ముఖ్యంగా నువ్వు ఏ విధంగానైనా నాకు నీ కృతజ్ఞత ను కనుపర్చాలని అనుక్షణం తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నావు. అట్టి సమయంలో నేను డబ్బు అడగటం ఉచితంగా తోచలేదు.
    అలాంటి పరిస్థితిలో సరళ టి మాట్లాడగా వాళ్ళు డబ్బు ఇస్తే నిరాకరించ లేకపోయాను, నాకు ఎడారి లో పన్నీరు దొరికినట్లయింది. వెంటనే తీసుకున్నాను. ఆమె తిరిగి ఇవ్వ వద్దన్నారు....కానీ నేను తిరిగి పంపితే తీసుకొంటారు. అదికాక, నీకు పంపితెసరి -- నిన్నొక బాధ్యతతో పెట్టవచ్చు.
    నా స్థానంలో ఎవరు వుండినా ఈ విధంగానే ప్రవర్తించి వుండేవారని నా ఉద్దేశం.

                                   33

    సాయంత్రం గీత - వెంకటేష్ లు ఇంచుమించు ఒకే సమయానికి ఇల్లు చేరారు.
    ఇద్దరు ముఖాలు కడుక్కొని డైనింగ్ టేబిల్ ముందు చెరొక కుర్చీలో కూచున్నారు. వెంకటేష్ మాట్లాడకుండా షర్ట్ జేబులోంచి ఒక కవరు తీసి గీత కందించి కప్పులో కాఫీ మెల్లగా సిప్ చేస్తూ ఆమెను గమనిస్తున్నాడు.
    గీత ఆ కాగితాల్ని చూచీ చూడక ముందే అవేవో దస్తావేజులని తెలిసింది. చదవటానికి ప్రయత్నించి చదవలేక ఆ కాగితాన్ని ప్రక్కకు త్రోసింది. రెండవ కాగితాన్ని తీసుకుంది. అది నిరంజన్ దస్తూరి లో వుండటం చూచి ఆమె చకితయై చటుక్కున చేతిలోకి తీసుకుని గబగబ చదవటం మొదలు పెట్టింది.
    కన్నీరు చెంపల మీదుగా కారుతుంది. వెంకటేష్ చటుక్కున లేచి ప్రక్క కొచ్చాడు. "గీతా -- ఏమిటిది ? ఇది సంతోష సమయం" ఆమె ముఖాన్ని ముని వ్రేళ్ళతో ఎత్తి కన్నీరు తుడిచాడు.
    గీత అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అసలిదంతా ఏమిటి? మీరు నిరంజన్ దగ్గర అప్పు తీసుకోవట మేమిటి? అతన్ను మీకెలా తెలుసు? తెలిసినా ఇవ్వటాని కతని దగ్గర డబ్బు ఎక్కడిది?"
    "నువ్వు అలా తొందర పడితే ఎక్కడి నించి ప్రారంభించాలో "తెలియడం లేదు" అంటూ నసిగాడు. గీత మాట్లాడలేదు . అతడు కొన్ని క్షణాలు దీర్ఘాలోచనలో వుండి పోయాడు. చటుక్కున స్పురించటం తో అన్నాడు ".........ఆ.........నిన్ను చూచి వెళ్ళిపోయాను........ అప్పుడు చేతకాని తనం -- ఏది బలహీనత - మన స్టైర్యం లేక అమ్మ చెప్తున్న డానికి తాళం వేస్తూ గడిపేశాను. ఒకరోజు అలా కూచుని ఆలోచిస్తున్నాను. బొంబాయి లో ట్రైనింగ్ కని వెళ్ళిన రోజులవి.......మనసులో ఏదో అశాంతి -- ఆశించినది పొందలేకపోయానే అన్న అసంతృప్తి తో....జీవితమే దుర్భరంగా అనిపించింది. ఓరోజు నిరంజన్ ఫోన్ చేశాడు. నువ్వన్నట్లుగానే అతనేవరైంది నాకు తెలియదు. తను- తమ్ముడు నరేంద్ర అక్కడున్నట్లు నాతొ మాట్లాడాలని ఫోన్ చేశాడు. అతడికి నాతొ పనేమిటి? ఏం మాట్లాడాలి. అనుకుంటున్నాను. అంతలోనే నీ పేరు చెప్పి తను నీ క్లాస్ మేటి అని చెప్పి ఆమె విషయం మీతో మాట్లాడాలి-- అన్నాడు -- ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వారి హోటలు అడ్రస్ కు వెళ్లాను. వారిద్దర్నీ చూడగానే నా కోర్కె ఫలిస్తుందన్న ఆశ జనించింది.
    నేను ఫైజర్ కంపెనీ లో ట్రైనింగ్ కని వెళ్ళినట్లు నువ్వు సరళ తో అన్నావట...నిన్ను వివాహం చేసుకోటానికి డబ్బు అత్యవసరమా అని ప్రశ్నిస్తే ఔనన్నాను. మా అమ్మకు డబ్బే ప్రాణమని స్పష్టంగా చెప్పాను. మా గృహపరిస్థితులు చెప్పక తప్పలేదు. నాన్నగార్కి పక్షవాతం రావటంతో ఇంటి మీద అప్పు చేశాం గా. మూడు వేలు నాల్గు వేలైందని -- ఇంకొన్నాళ్ళు పొతే ఐదు వేలు కావచ్చునని చెప్పాను....డానికి నిరంజన్ ఏమన్నాడో తెలుసా?" గీత ఫస్టున కృతర్దురాలౌతుంది . ఆమెకు వెంటనే పని దొరుకుతుంది. ఆమెను వివాహం చేసుకుంటే ఆమె , మీరు కలిసి ఆ అప్పు రెండేళ్ళ లో తీర్చేయగలరు. గీతను చేసుకుని అప్పు తీరుస్తానని మాట యిస్తే ఆ డబ్బు తాను అప్పు పెడతా నన్నాడు?
    అమ్మ ఎన్నో విషయాల్లో -- ముఖ్యంగా డబ్బు విషయాల్లో బోల్తా పడింది. ఒకసారి చేయి కాలాక ఆమె ఇక తెగించదు కొడుకే అగుగాక ఆ ధైర్యం ఆమెకు లేదు. చేసుకునే అమ్మాయి విద్యావంతురాలు స్వంత మేనకోడలు-- కచ్చితంగా నయా పైసలతో వసూలు చేసుకోగలదా? అమ్మ ఒప్పుకోదు. అమెకేన్నో అనుమానాలున్నాయి. డబ్బు ఆమె కందాలీ. ఇల్లు విదిపించాలి. ఒక్కసారి ఐదు వేలు కావాలి..... వీలైతే యింకా ఎక్కువ కావాలి-- ఐదు వేలు కావాలంటే అంత ధనం ఇవ్వగల పిల్ల కావాలి.... అదేమంత కష్టం కాదు గానీ నాకు మాత్రం ఎవ్వరు ఇంతవరకు కుదరలేదు అని నిరంజన్ తో అన్నాను.
    నరేంద్ర  అన్నాడు. "గీత చెల్లిని-- లలిత ను నేను వివాహం చేసుకోబోతున్నాను. చెల్లి పెళ్ళయిన తర్వాత ఆమె పెళ్లి త్వరలో జరగాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంది. వాళ్ళ పెద్దక్క వెధవ అయిపోయి తిరిగి రావటం వీరిద్దరి పెళ్లి చేయను ఆర్ధిక స్తోమత లేక రఘుపతి గారు ప్రయత్నాలు చేయకుండా వుండుట చూస్తుంటే మాకు ఏవిధంగా వారికి సహాయ పడలేక పోతున్నామే అన్న చింత వుంది ....నాకెంతో ఆశ్చర్య మేసింది. ఆత్రుతతో ఇక తాళలేక అడిగాను. "మామయ్య ఒప్పుకున్నాడా?' అని డానికి ఏం జవాబు చెప్పాడో తలచుకుంటే నాకెంతో ఆశ్చర్యంగా వుంటుంది. గీతకు అప్ప జెప్పాము. మా తమ్ముడు నరేంద్ర కు లలిత నచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులను నొప్పించే బాధ్యత గీత పై పడింది." నేను గబుక్కున  అన్నాను. వాళ్ళు అంగీకరించనట్లయితే ?" ఇద్దరూ ఒకరి నొకరు చూచుకున్నారు. నరేంద్ర ముఖం నిండా ఆనందమే .... వాళ్ళు ఒప్పుకోకపోయి నట్లయితే రిజిష్టర్ పెళ్లి చేసుకుంటాను. వీరిద్దర్నీ చూచి నాకెంతో ధైర్యం వచ్చింది. ఎవరో పరాయి వాడు మీ కుటుంబం విషయం లో కొంత శ్రద్ధ చూపుతుంటే స్వంత బావనైన నేను నీ విషయంలో ఏదో ఒకటినిశ్చయించి వివాహం చేసుకోలేనా? అమ్మను ఒప్పించకెనా? ప్రయత్నిస్తాను. అని వాళ్ళకు మాట యిచ్చాను. నాకెంతో ధైర్యం వచ్చింది. అప్పుడే కూచుని అమ్మకు ఉత్తరం రాశాను. ఇలా తెగించి రాయగలనని కలలో కూడా అనుకోలేదు.
    నిన్ను తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోనని. రాసేశాను. డబ్బు ముఖ్యం కాదని రాశాను -- ఉత్తరం పోస్ట్ చేసిన తర్వాత నా హృదయం తేలిక పడింది. నాల్గురోజులు, వారం రోజులు దాటి పోయాయి. అమ్మ నించి ఉత్తరం కోసం ప్రతి క్షణం నిరీక్షిస్తుండే వాడిని. అమ్మ వీల్లేదని ఖచ్చితంగా వ్రాసేస్తే డానికి నేనేం జవాబు వ్రాయాలి? నేననుకున్నట్లే అమ్మ గీతయినా సరే డబ్బు తేవలసిందే అంది, ముందు చెప్పిన పాయింట్లే . ఇల్లు విడిపించాలంది- కూతురి పెళ్లి చేయాలంది. ఈ కోర్కె అసహజంగా లేదు ఆలోచించాను, పరిష్కార మార్గం ముందే ఆలోచించాంగా -- గీత చదువు పూర్తవుతుంది. ఆమె కూడా సంపాదించగలదు. ఇద్దరం కలిసి ఆ అప్పును తీర్చగలము ....ఇలా అని రాసిస్తాను. అని విపులంగా నిరంజన్ కు రాశాను.
    నా ట్రైనింగ్ పూర్తయింది. ఇక వారం రోజులకు బొంబాయి నించి ఇంటి కెళ్ళాలను కుంటుండగా నిరంజన్ నుంచి ఉత్తర మొచ్చింది. అది రిజిష్టర్ కవరు? సంతకం చేస్తుంటే నే నా చేయి కంపించింది. దానిలో ఏమున్నదో ఊహించగలవా?
    ఆ మాటకు గీత ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న బలంలో ఒకరి కళ్ళలో కొకరు చూస్తూ వుండిపోయారు. ఆ దృష్టి బంధం ఎంతసేపటికి ముడి వీడలేదు.
    గీత గట్టిగా కళ్ళు మూసుకుంది. కన్నీటి బిందువులు రాలినై. వెంకటేష్ ముందుకు వంగి ఆమె చేతి మీద తన చేయి వేసి మృదువుగా నొక్కుతూ " అందులో -- " అన్నాడు.
    "ఊ-- డబ్బు వుంది" అంది గద్గదిక స్వరంతో గీత.
    'అవును డబ్బు , ఆరు వేలకు చెక్కు! ఈ డబ్బు మీద వడ్డీ లేదని వీలును బట్టి తీర్చవచ్చును అని హైదరాబాద్ కు వచ్చినప్పుడు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ తెరిచి అక్కడ డబ్బు జమ చేసి ఆరు వేలయినప్పుడు తనకు ట్రాన్స్ ఫర్ చేయమని రాశాడు."
    'అంత డబ్బు నిరంజన్ కు ఎక్కడ నుంచి వచ్చింది?' గీత అడిగింది.
    అ డబ్బు ఎక్కడిదో తెలిసికోవాలని నాకు కూడా అత్రంగానే వుండేది. కాని నిరంజన్ చెప్పలేదు చెప్పడు కూడా.
    "మీరు గట్టిగా అడిగినట్లయితే ........."    
    "ఓ-- బాగానే అడిగాను, నవ్వి వూరుకున్నాడు ....ఆ చెక్కు అందినప్పుడు అంగీకరించడమా, తిరస్కరించడమా సందిగ్ధంలో పడిపోయాను.
    కానీ ఆ డబ్బును కాదన్నట్లితే నువ్వూ, నేను ఇట్లా....కాలేము కదా. కనుచూపు మేర నాకు అలాంటి స్నేహితులు లేరు ఒకటా? రెండా? ఆరు వేల రూపాయలు! నిరంజన్ కు ఆ మరుసటి రోజున నా కృతజ్ఞతలు తెల్పుతూ ఉత్తరం రాశా ----"
    "మీ మీద నిరంజన్ కు ఎంత నమ్మకం " ఇంత డబ్బును ఏ పత్రం లేకుండా ఇచ్చాడు ?......"

                                           
    ఆమె మాటల కడ్డు తగుల్తూ అన్నాడు "నామీద అనకు గీతా! తన స్నేహితురాలైన గీత కాబోయే భర్త అని నాకు గౌరవం ఇచ్చి నన్ను నమ్మాడు గానీ -- వ్యక్తిగతంగా అతనికి నేనంటే ఏవిధమైన అభిప్రాయం వుండి వుండదు."
    తన భర్త తీక్ష దృక్కులను ఎదుర్కొంది గీత. ఆమె తేలికగా నవ్వి అంది - "అబ్బ - భార్య ను గూర్చి ఏం గొప్పలు చెప్పు కుంటున్నారో ? చిన్నతనంగా లేదూ?"
    "ఉహూ -- నా గీత నా దేవత....
    "ఈ దేవత డబ్బు లేని దేవత ...ఊ....ఈ మాటలకేం గానీ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి" గీత టేబిల్ మీద చేతులు కట్టుకుని ముందుకు వంగింది.
    వెంకటేష్ వెనక్కి అనుకున్నాడు. "డబ్బు చేతి కందింది. కానీ నాకు మాత్రం సంతృప్తి లేదు. నిరంజన్ నన్ను ఏమీ అడగలేదు. ఇంటి పత్రాలు గాని, వడ్డీ గానీ అడగలేదు. ఒక్క తల్లి కడుపునా బిడ్డలే డబ్బు విషయంలో ఒకరినొకరు నమ్మరు. ప్రాణ స్నేహితులే బద్ద శత్రువులై పోతారు. నిరంజన్ నిజంగా పూజనీయుడు. ఊతగా ఇచ్చిన హస్తాన్నే అయినా నా బుద్దిని నమ్మలేక వెంటనే వెళ్లి ఒక లాయర్ సాయంతో అతనికి నేను ఆరువేలు బాకీ వున్నట్లు వ్రాయించి నిరంజన్ కు రిజిష్టర్ పోస్టులో పంపించాను. అది అందిన వెంటనే అతడు ఎంతో నొచ్చుకుంటూ ఉత్తరం రాశాడు.....ఏది ఏమైనా నా విధి నెరవేర్చాను. ఇప్పటికి ఆ ఆరువేలు పంపగల్గాను. ఈ పత్రం వాపసు వచ్చింది. దీనిని ఏం చేద్దాం -- ఫ్రేము కట్టించు కుందామా?'
    "మీ జీతమెంత ?"
    "ఇన్నాళ్లయ్యాక ఇదేం ప్రశ్న?"
    "నిజం తెలియనన్నాళ్ళు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి"
    "మగవాడి జీతం, ఆడదాని వయసు అడగకూడదు."




Related Novels


Unnatha Sikaralu

Aardhana

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.