Home » yerramsetti sai » Rambharosa Apartments
.jpg)
హఠాత్తుగా మాకెదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో నుంచి బిగ్గరగా ఏడుపులు వినిపించేసరికి, ఏం జరిగిందో అర్ధం కాక నేనూ, మా సొసైటీ కల్చరల్ సెక్రటరీ శంకరమూర్తి డోర్ తెరచి ఆ ఫ్లాట్ లోకి పరుగెత్తాం.
అప్పటికే మా సొసైటీ జనరల్ సెక్రటరీ మొహిందర్ సింగ్, ప్రెసిడెంట్ హమీద్ మియా, యూత్ వింగ్ సెక్రటరీ విజయ్ యాదవ్, షైనీ అందరూ గుమికూడి ఉన్నారు. మధ్యలో ఆ ఫ్లాట్ ఓనర్ బోసుబాబు, వాళ్ళావిడా దిగాలుపడి కూర్చుంటే బోసుబాబు అత్తగారు ఇల్లెగిరేంత గొంతుతో ఏడుస్తోంది.
"ఇంక వీడి ప్యూచరేమిట్రా దేవుడో - వీడి జీవితం నాశనమైపోయింది నాయనోయ్-" అని ఆవిడ ఏడుస్తోంటే షైనీ, మొహిందర్ సింగ్, హమీద్ మియా, అవధాని, విజయ్ యాదవ్ ఆమెని ఓదారుస్తున్నారు.
"ఏడవకండి! ఇదంతా అల్లామియా డెసిషన్! అపన్ క్యా కర్ సక్ తే?" అంటున్నాడు హమీద్ మియా!
"మేమంతా ఉన్నాం కదురా భయ్! గట్ల పరేషానయితే ఎలా?" అంటున్నాడు విజయ్ యాదవ్.
"ఎట్ల జెప్పాల్నో సమజ్ కావటం లేదు. రాక రాక ఇంత మంచి మనిషి బోసుబాబుకే ఈ పరేషాని రావాల్నా?" అన్నాడు విజయ్ యాదవ్.
"అంటే ఏమైంది? ఒకవేళ అతనికి ఎయిడ్స్ వచ్చిందా?" డౌటుగా అడిగాడు.
దాంతో బోసుబాబు మండిపడ్డాడు.
"నాకు ఎయిడ్సా? ఏంటి? పిచ్చిపిచ్చిగా ఉందా?" కోపంగా శంకరమూర్తినడిగాడు.
"ఎవరూ విషయం చెప్పకపోతే అలాంటి అనుమానాలే వస్తయ్ మరి!" అన్నాన్నేను శంకరమూర్తికి సపోర్ట్ గా!
"మా అబ్బాయి ఇంటర్ వ్యూలో ఫెయిలయ్యాడ్రా భయ్!" చిరాగ్గా చెప్పాడు బోసుబాబు. అతని మాటలతో మాకు కన్ ఫ్యూజన్ ఇంకా ఎక్కువయిపోయింది.
ఎందుకంటే బోసుబాబుకి ఇంటర్ వ్యూలకు హాజరాయేంత వయసుగల కొడుకులెవరూ లేరని అందరికీ తెలుసు.
"మీ అబ్బాయా?"
"అవునయ్యా! నేన్చెప్పేదేంటి మరి?"
"నీకు జాబ్ కోసం ఇంటర్ వ్యూలకెళ్ళేంత పెద్ద కొడుకెక్కడున్నాడని?"
అడిగాడు శంకరమూర్తి అనుమానంగా.
మాకు పాత తెలుగు సినిమాలు కొన్ని గుర్తుకొచ్చాయ్.
ఓల్డ్ శోభన్ బాబు జీవితంలోకి సడెన్ గా ఓ యాంగ్ శోభన్ బాబు వచ్చి "నాన్నా! నేను నీ కొడుకుని! అమ్మ మీ దగ్గరకెళ్ళమంది!" అంటూ డైలాగ్ కొట్టేవాడు.
బోసుబాబు మా ఇద్దరివంకా 'డిజ్ గస్టింగ్' గా చూశాడు.
"అరే- నీయవ్వ- ఇంటర్ వ్యూ అంటే ఆ ఇంటర్ వ్యూ కాదురా భయ్- ప్రీ నర్సరీ- ఉయ్యాలా జంపాలా స్కూల్ ఇంటర్ వ్యూ-"
మేము ఉలిక్కిపడ్డాం.
"ఏంటది? ప్రీ నర్సరీ- ఉయ్యాలా జంపాలా స్కూలా?"
"అంటే ఆ స్కూలు పేరు వినలేదా మీరు? మంచిగున్నార్లే! మన ట్విన్ సిటీస్ లో బెస్ట్ ప్రీ నర్సరీ స్కూలది?" అంది షైనీ మా అవస్థ చూసి వితరణ ఇస్తూ.
"అలాంటి పేరుగల స్కూల్ ఉన్నట్లే తెలీదు నాకు" అన్నాడు శంకరమూర్తి కొంచెం గిల్టీగా ఫీలవుతూ.
"గల్లీకో స్కూలున్నది ఇయాళ్రేపు! ఎన్నని గుర్తుంటయ్?" శంకరమూర్తిని సపోర్ట్ చేశాడు విజయ్ యాదవ్.
"చాలా మంచి స్కూలన్నా అది! రీసెంట్ గానే ఎన్ ఆర్ ఐ లు ఓపెన్ చేసిన్రది! నర్సరీ కంటే కూడా చిన్న పిల్లల గురించన్నట్లు! జబర్దస్త్ స్కూలంటలే! అమెరికన్ స్టాండర్డ్!" వివరించాడు మొహిందర్ సింగ్.
"అవ్! బహుత్ ఫేమస్ స్కూల్ హై! మొన్న అడ్మిషన్స్ టైమ్ ల రద్దీ ఎంత ఎక్కువున్నయ్ అంటే - యాభైమంది తల్లులు ఆ నూకుడులో హాస్పిటల్ ల జాయినవ్వాల్సివచ్చింది. ఎడ్యుకేషన్ మినిష్టర్ మేడమ్ ఎంక్వయిరీ కూడా ఆర్డర్ జేసినయ్. ఆ ఎంక్వయిరీ కమిటీల మా కజిన్ బ్రదర్ షకీల్ మియా ఒక మెంబరన్నట్లు- ఆ కమిటీ ఏం రిపోర్టిచ్చింది ఎరికేనా" అడిగాడు హమీద్ మియా.
"ఏమిచ్చింది?" మిగతా వాళ్ళంతా అతని చుట్టూ గుమికూడారు.
"ఆస్కూల్లోనే ఒక మంచి ఎన్ ఆర్ ఐ దవాఖానా భీ ఓపెన్ చేస్తేగట్ల అడ్మిషన్ టైమ్ ల దెబ్బలు తగిలే పేరెంట్స్ ని అక్కడే ఆ దవాఖానాలోనే అడ్మిట్ చేయొచ్చని ఇచ్చిన్రు! ఇక ఆడూఈడూ ఎందుకని ఆ స్కూల్ ఓనరే హాస్పిటల్ కూడా షురూ జేసిండు!"
"అట్లాగా! ఆ హాస్పిటల్ పేరేంటి?" అడిగాడు శంకరమూర్తి.
"తల్లివడి!"
"అహా! ఎంతబాగా పెట్టాడండీ! మరా హాస్పిటల్లో చేరేది ఆ స్కూల్లో అడ్మిషన్ కొచ్చిన తల్లులూ, వాళ్ళ పిల్లలే కదా!" మెచ్చుకున్నాడు రెడ్డి. అయినాగానీ నా కన్ ఫ్యూజన్ పోలేదు.
"నాకింకా కన్ ఫ్యూజన్ పోలేదు బోసుబాబూ! మీ అబ్బాయి నాలుగో క్లాస్ లో ఆల్ రెడీ చేరాడు కదా! మళ్ళీ వాడిని 'ఫ్రీ నర్సరీ- ఉయ్యాలా జంపాలా స్కూల్లో ఎందుకు చేర్పిస్తున్నట్లు?"
బోసుబాబు నెత్తికొట్టుకున్నాడు.
"అబ్బా! నువ్ మాట్లాడేది మా పెద్దాడి సంగతయ్యా. నేను మాట్లాడేది మా రెండోవాడి సంగతి!"
శంకరమూర్తి ఇంకా కన్ ఫ్యూజయిపోయాడు.
"రెండోవాడేంటి. నీకుంది ఒకడే కొడుకు కదా?"
"అబ్బా! పదినెలల క్రితం రెండోవాడు పుట్టాడు లేవయ్యా! వాడిని ఉయ్యాల్లో వేసేరోజున పార్టీ కూడా ఇచ్చాను మీ అందరికీ! పార్టీ దొచ్చి కూడా ఆ విషయం గుర్తుపెట్టుకోలేదంటే దిసీజ్ టూమచ్" కోపంగా అన్నాడు బోసు.
శంకరమూర్తి, నేనూ నాలిక్కరచుకున్నాం.
"సారీ బ్రదర్! మనదేశంలో ఏదయినా గుర్తుపెట్టుకోవచ్చుగానీ పాపాయిలు పుట్టిన వేళావిశేషాలు గుర్తుంచుకోవటం చాలా కష్టం! ఎందుకంటే మనవాళ్ళు సాధించే గొప్ప ఎచీవ్ మెంట్ అదొక్కటే కదా-"





