Home » Unnava Vijayalakshmi » Acharanalo Abhudayam

20
మరో ఆరు నెలలు గడిచాయి. వసంత అత్తగారు జబ్బుతో మంచం ఎక్కింది. చిన్నాడ బిడ్డ కాలేజీ లో చదువుతోంది-- ఆ పిల్ల ఏ పనీ ముట్టుకోదు. ఇంట్లో వంట పని, ఆఫీసులో పని చూసుకోలేక సతమత మయి పోయేది వసంత. శారీరకంగా విశ్రాంతి లేకపోయినా మనస్సు కయినా స్త్తిమితం అనేది లేకుండా చేసేది అత్తగారి ధోరణి.
'నాన్నగారు లేనే లేరు-- నేనయినా వుండగా ఆ చిన్నదాని పెళ్లి కూడా కానీచ్చేయి-- లేకపోతె నా తరువాత దాని గతి ఏమవుతుందో , మీరెలా చూస్తారో అని నాకు శాంతి లేకుండా పోతుంది.' అని కొడుకు ఇంట్లో ఉన్నంత సేపూ గొడవ పెడుతూ ఇంట్లో వాళ్ళేవ్వరికీ శాంతి లేకుండా చేసేదావిడ.
'ఇప్పుడు నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నాలుగు నెలలు పొతే హాయిగా లేచి తిరుగుతావు -- అయినా వదిన నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటోంది. నువ్వు పదే పదే అలా అంటుంటే -- తను ఏమనుకుంటుంది?' అని చిన్న కూతురు మధ్య మధ్య మందలిస్తున్నా ఆవిడ నోటికి తాళం పడేది కాదు.
చివరికి మూర్తి చెల్లెలు పరీక్షలయి పోగానే పెళ్లి ఏర్పాట్లు చేశాడు -- ఆఫీసులో అంత క్రితం చేసిన అప్పులు పూర్తిగా తీర్చలేదు. కనక కొత్త అప్పు ఇవ్వరు. కాబట్టి ఈసారి బయట తెలిసిన వాళ్ళ దగ్గర కాస్త వడ్డీ ఎక్కువయినా తీసుకొచ్చాడు. ఇంక దానితో నా బాధ్యత తీరిపోతుంది. మా ఇద్దరి సంపాదనతో అప్పులు తీర్చడం ఎంత సేపు? అనుకున్నాడతను.
చిన్న కూతురు పెళ్లి చూడటం కోసమే ప్రాణాలతో వున్నట్లుగా ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయిన కొద్ది రోజుల లోనే వసంత అత్తగారు కన్ను మూసింది.
ఇంక ఇంట్లో మిగిలింది -- వసంతా భర్తా -- యిద్దరూ సంపాదించు కుంటున్నారు. ప్రొద్దుటే లేచి గబగబ వంట చేసి భర్తకి పెట్టి తను తిని యిల్లు సర్చుకుని ఆఫీసుకి వెళ్ళిపోతుంది వసంత.
ఇంటికి తాళం పెట్టి ఇద్దరూ చెరో తాళం దగ్గరుంచు కుంటారు -- ఎవరు ముందు వచ్చినా యిబ్బంది లేకుండా.
సాయంకాలం ఆఫీసు నుంచి వచ్చి కాఫీ కాచి భర్తకి యిచ్చి తను తాగుతుంది. అది తాగి మూర్తి ఏ షికారు కో, ఏ స్నేహితుడిని చూడటానికి వెళ్ళట మో లేకపోతె యింట్లోనే కూర్చుని పేపరు చదువు కోవట మో చేస్తుంటే వసంత స్నానం చేసి వచ్చి వంట ప్రయత్నం లో పడుతుంది. ఆ తరువాత కాస్సేపు ఖబుర్లు చెప్పుకుని భోజనం చేస్తారు. ఆ తరువాత మళ్లీ ఖబుర్లు చెప్పుకొటం తోనో చదువు కోటం తోనో కాస్సేపు గడిచిపోతుంది-- ఆ తరువాత నిద్ర -- ఇది వారి దినచర్య.
ఇది చెప్పుకొటాని కీ వినటానికీ బాగానే వుంటుంది -- వాళ్ళకేం నిక్షేపంలా ఇద్దరూ నాలుగు చేతులతో సంపాదించు కుంటున్నారు. హాయిగా అనుభవిస్తున్నారు-- అంటారు ఎవరైనా చటుక్కున. కాని, ఆ సంసారం లో మాత్రం హాయి ఆనందమూ అనేవి మచ్చుకైనా లేకుండా పోయాయి రాను రాను.
పెళ్లి అయిన నాటి నుంచీ వసంత భర్త ప్రవర్తన గమనిస్తూనే వుంది. ఎందుకో అందుకు చిరాకు పడటం, ఎప్పుడూ చిర్రూ బుర్రూ లాడటం, మాటకి ముందు సందర్భం వున్నా లేకపోయినా వ్యంగ్యాలు వెటకారాలు విసరటం అతనికి పరిపాటి-- కొన్నాళ్ళ కి కాకపొతే కొన్నాళ్ళ కయినా అతను మారక పోతాడా అని వసంత ఆశించింది. కాని అతని ప్రవర్తన అంత కంతకు భరించ శక్యం కానిదిగా తయారయిందే తప్ప అతనిలో తను ఎదురు చూసిన మార్పు మాత్రం రాలేదు.
క్రమంగా అతని చిరాకుని వేటకారాలని అర్ధం చేసుకో గలిగింది వసంత. వసంత ఆఫీసులో పదిమంది మొగవాళ్ళ మధ్య కూర్చుని పని చేస్తుంది అన్న విషయం అతనికి చాలా కంట కింపుగా తయారయింది -- అలా రోజుల తరబడి గంటల తరబడి ఒక్క దగ్గర వుండి పని చేస్తున్నంత సేపూ ఆ మొగాళ్ళు ఆడవాళ్ళ ని కొరుక్కు తినేసేలా చూస్తూంటారుట. అలా అలా పరిచయాలూ స్నేహాలూ పెంచుకుని మొగుడ్ని వదిలేసి వో ఆడదీ, పెళ్ళాన్నీ వదిలేసి మరో మొగాడు మళ్లీ పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా తనకి తెలుసట-- అంతదూరం వెళ్ళని వాళ్లు కూడ గంటల కొద్దీ ఖబుర్లు చెప్పుకొటం హోటళ్ళ కి సినీమాలకీ వెళ్ళటం చూస్తుంటే నే అతనికి అసహ్యంట -- అతను ప్రత్యేకంగా తన పేరు ఎత్తి చెప్పక పోయినా అతని వుద్దేశ్యం అభిప్రాయాలూ అర్ధం చేసుకున్న వసంత ఉద్యోగం మానేస్తానంది-- మూర్తి కి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. ఆఫీసులో వసంత చేత చేయించిన అప్పులో, ఇంకా సగం కూడా తీరలేదు-- ఇప్పుడు వుద్యోగం మానేస్తానంటే ఉన్న పళంగా అదంతా ఎక్కడి నుంచయినా తెచ్చి వాళ్ళ కివ్వాలి -- చేసిన అప్పూ కూడా తీర్చాలి-- తన ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవటం ఈ అప్పులన్నీ తీరటం సాధ్యం కాదు. అందుచేత వసంత చేత వుద్యోగం చేయించటం తప్పని సరి. మరో వుద్యోగం అంటే ఏ ఆడపిల్లల స్కూల్లో నొ పంతులమ్మ పని లాంటిది దొరికితే దీనికి రాజీనామా ఇప్పించేసి అందులో చేర్పించాలని అతని వుద్దేశ్యం -- అయితే అది నేరవేరే లోపునే మరో ఉపద్రవం వచ్చి పడింది.

రాఘవేంద్ర రావు వసంతా వాళ్ల చుట్టం, వరసకి బావ అవుతాడు. అతనికి బెజవాడ లో వుద్యోగం దొరికింది. అతను వుద్యోగం లో చేరి హోటలో గది అదీ తీసుకుని వో రోజు తీరుబడిగా సుధాకరం వాళ్ళ యింటికి వెళ్ళాడు. అక్కడ ఖబుర్లూ అవీ అయాక అతను వసంత ని కూడా చూస్తాన నటంతో సుధాకరం అతన్ని వెంట పెట్టుకుని వసంతా వాళ్ళింటి కి తీసుకు వచ్చాడు. రాఘవేంద్రం చాలా సరదా మనిషి. అతను వసంత తో కలివిడిగా మాట్లాడటం వసంత కూడ నవ్వుతూ అన్నగారి తోనూ అతనితోనూ మాట్లాడటం మూర్తి కి కొంచెం చిరాకని పించింది. అయినా పైకి ఏమీ అనలేదు. ఆ తరువాత ఎప్పుడైనా వీలుంటే, బుద్ది పుట్టినప్పుడల్లా రాఘవేంద్రం సుధాకరం తో కలిసి కాని, ఒంటరిగా గాని వసంతా వాళ్ళింటి కి వస్తూండే వాడు. అతను వచ్చినప్పుడల్లా భర్త మూల ముడుచుకు కూర్చోటం అతను వెళ్ళిన తరువాత ఏవో సూటీ పోటీ మాటలనటం తో వసంత కి అతని అభిప్రాయం అర్ధమయింది. కాని 'మా వారికి నువ్వంటే మంచి అభిప్రాయం లేదు నువ్వు మా యింటికి రావద్దు, నాతో మాట్లాడ వద్దు' అని స్పష్టంగా చెప్పలేక పోయింది రాఘవేంద్రం తో ...తను ముభావంగా వుంటే అతనే అర్ధం చేసుకుంటాడనుకునేది -- రాఘవేంద్రా ని కున్న బంధు ప్రేమ, కాస్త దగ్గరి వాళ్లు కనిపించేసరికి పట్టుకుని పాకులాడే స్వభావం , వెర్రి అభిమానం ఇవన్నీ కలిపి వసంత ముభావం గాని మూర్తి అంతర్యం కాని గుర్తించలేని వాడిగా చేశాయి.
మరో నాలుగైదు నెలలు గడిచి పోయాయి. వో ఆదివారం ఉదయం మామూలుగా లేచి త్వరగా వంట చేసింది వసంత. ఆఫీసులో పూర్తి చేయాల్సిన పని చాలా వుండి పోయిందనీ, ఆదివారమయినా ఆవాళ మామూలు వెల్టి కే భోజనం చేసి ఆఫీసు కి వెళ్తానని క్రితం రోజే చెప్పాడు మూర్తి.
భోజనం చేసి పది గంటలకి అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు-- వసంత కూడ భోజనం చేసి, శలవ రోజు కావటం తో తీరుబడిగా ఇల్లంతా సర్దుకుని మధ్యాహ్నం కాస్సేపు పుస్తకాలు, పత్రికలూ తిరగేసి, మూడు గంటలకి కుంపటి అంటించి టిఫినూ కాఫీ తయారు చేసింది. ఆ తరువాత తల దువ్వుకుని మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని, చీర మార్చుకుని దిండు గలేబుకి ఎంబ్రాయిడరీ కుడుతూ కూర్చుంది.
ఇంతలో వీధి తలుపు చప్పుడయితే మూర్తి వచ్చాడను కుని వెళ్లి తలుపు తీసింది. ఆ వచ్చింది మూర్తి కాదు, రాఘవేంద్రం .
'అన్నగారు నిద్ర పోతున్నారా , మీ దంపతుల దగ్గర శలవు తీసుకు వెడదామని వచ్చాను. నాకు మెడ్రాసు లో మరో మంచి వుద్యోగం వచ్చింది -- ఈ రాత్రి మెయిల్లో నే వెళ్లి పోతున్నాను.' అన్నాడతను లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ.
'ఆహా అలాగా -- కంగ్రాచ్యు లేషన్సు -- వారు పని వుందని ఆఫీసుకి వెళ్ళారు-- కాస్సేపటి లో వచ్చేస్తారు.' అంది వసంత మరో కుర్చీలో కూర్చుంటూ.
వాళ్ళిద్దరూ అలా ఖబుర్లు చెప్పుకుంటుండగా వచ్చాడు మూర్తి. రాఘవేంద్రాన్ని చూసి ఓసారి మొహం చిట్లించుకుని ఏదో ముభావంగా పలకరించి లోపలికి వెళ్ళిపోయాడు. అతను బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కు వచ్చాక అందరికీ టిఫినూ కాఫీ తెచ్చింది వసంత. అవి తిని మరి కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయాడు రాఘవేంద్రం. అతన్ని కాస్త దూరం వెళ్ళ నిచ్చి వీధి తలుపులు గడియ పెట్టి, ఇంతసేపూ అణుచుకున్న అక్కసు వెళ్ళ కక్కటం మొదలు పెట్టాడు మూర్తి.
'వాడు వచ్చి ఎంత సేపయింది?'
'ఇప్పుడే -- మీరు వచ్చే ముందే.' అంది వసంత అతని దూకుడు చూసి హడలి పోతూ.
'మరి బుకాయించకు-- ఉదయం నేను వెళ్ళగానే వచ్చి వుంటాడు-- నేనివాళ ఇంట్లో వుండనని నిన్ననే నీకు తెలుసు గా, రమ్మని చెప్పి వుంటావు-- వాడ్ని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని-- నాకంటే ఆస్తి పరుడు, నాకన్నా ఎక్కువ చదువు కున్నవాడు, పెద్ద వుద్యోగస్తుడు అందగాడు, ఇంక నీ మనస్సు చలించటం లో వింత ఏముంది-- ఇంకో పెద్ద వుద్యోగం వచ్చిందని చెప్పటానికి వచ్చాడా -- వాడితో పాటే మద్రాసు వెళ్లి పోక పోయావ్ ....' ఈ విధంగా సాగిపోతున్న అతని ధోరణి కి మొదట ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు వసంత కి-- చివరికి మరి మౌనంగా వుండలేక , కాస్త దూకుడు గానే అంది.
'నోటికి ఎంత వస్తే, అంతా అనకండి -- మీరన్న మాటే-- అంటే-- నా కంటే అందమయిన ఆడది కనిపిస్తే మీ మనస్సు చలిస్తుందని నేనంటే నూ వాళ్ళతో మీకు అక్రమ సంబంధం అంట గడితే నూ మీకెలా వుంటుంది ? మాటలు అనటానికి మొగవాడి కోక న్యాయం, ఆడదానికి మరో న్యాయం లేదు. ఎవరైనా ఎదుటి వ్యక్తిని గౌరవించి తాను తిరిగి గౌరవం పొందాలి.'
'నోర్మూయ్-- ' వసంత అలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నందు కు కాస్సేపు స్తంభించి పోయినట్లు నిలబడిపోయిన మూర్తి గొంతు పెగల్చుకుని గట్టిగా అరిచాడు.
'మాటకి మాట సమాధానం చెప్పే దాకా వచ్చిందన్న మాట -- ఔనులే ఎన్నయినా చెప్తావు. నీకేం నెలకి నూరు రూపాయల పైన సంపాదించు కుంటున్న దానివి. ఈ మొగుడు గాడు నిన్నేమీ తిండి బట్టా ఇచ్చి పోషించక్కర్లేదు. వీడని వదిలేసినా నీ బ్రతుకు నువ్వు బ్రతక గలననే ధీమా వుంది-- ఆ ధైర్యం తోనే కదూ ఇన్ని మాటలన గలిగావు.'
'నేను మీ మీద ఆధారపడి లేననీ, మీరు లేకుండా కూడా దర్జాగా బ్రతక కలననీ ఆ మాట లేవీ నేనన లేదు -- అసలు నేను మీకు వ్యతిరేకంగా నడిచింది మిమ్మల్ని లెక్క చెయ్యకుండా మాట్లాడింది ఇంత వరకూ ఎప్పుడూ లేదు. ఇంక ఇవాళ సంగతంటారా , ఎవరి సహనాని కయినా వో హద్దు వుంటుంది. అందులోనూ నన్ను గురించి నీచంగా అసభ్యంగా మాట్లాడుతుంటే విని భరించటం నా వల్ల కాదు....ఇంకో విషయం చెప్తున్నాను-- మీ భార్య పరాయి మొగవాడి కంట పడకూడదు. ఇల్లు దాటి వీధిలో కేక్కడికి వెళ్ళకూడదు అని మీరు అనుకునే ట్లయితే అలా నాలుగు గోడల మధ్య వుండగలిగే అమ్మాయినే పెళ్లి చేసుకో వలసింది. ఉద్యోగం చేస్తున్న అమ్మాయికి అలా ఎవ్వరి తోటీ మాటా పలుకు లేకుండా వుండటం సాధ్యం కాదు -- బయట తిరుగటమూ తప్పదు.....'



_large.png)