Home » D Kameshwari » Chikati Podduna Velugu Rekha
- "సుజాతా!....నీవీ ఉత్తరం చదువుకునేసరికి నేను ఈలోకం నుంచి చాలా దూరం వెళ్ళిపోయి వుంటాను! ఇంతకంటే మరో గత్యంతరం కనబడలేదు సుజా నాకు! అవమానం, అవహేళనలనుంచి తప్పించుకోడానికి మరోదారి ఏదీ కనపడలేదు నాకు! అసలు నాకు బ్రతుకుమీద యిచ్చ నశించింది సుజాతా! యిదివరకు భవిష్యత్ పట్ల వున్న ఆ ఆశ కాస్తా పోయాక యింకా యీ బ్రతుకుపట్ల కోరిక చచ్చిపోయింది. అందుకే యీ నిర్ణయం చేసుకున్నాను.
సుజాతా! నాకు నిన్న నీవు మాటిచ్చావు, నేనేం చెప్పినా చేస్తానని.... సుజా! నీవు వున్నావన్న విశ్వాసంతోనే నేనింతకి తెగించగలిగాను... సుజాతా, పిల్లలకి నువ్వు తల్లివి గాకపోయినా తల్లి కంటే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నావు. అభిమానిస్తున్నావు. ఆ నమ్మకంతోనే వాళ్ళకి నేను లేకపోయినా తల్లి లేని లోటు వుండదనీ, నీ వుండగా వాళ్ళు అనాధలు కారనే విశ్వాసంతోనే నేను వారినివదిలి నిశ్చింతగా వెళ్ళగలుగుతున్నాను.
సుజాతా, నీకు నాకు ఇది ఏనాటి అనుబంధమో తెలియదు. ఏ సంబంధంలేని మనిద్దరిమధ్య ఈ అనుబంధం ఏమిటో అర్ధంగాదు! నీవు నాకు స్వంత చెల్లెలికంటే ఎక్కువగా అన్పిస్తున్నావు. అందుకే నిన్ను ఇంతభారం వహించమని కోరుతున్నాను.
సుజాతా! పిల్లలిద్దర్ని పెంచి పెద్ద చేసే బాధ్యత యింక నీదే! ఆయనకి పెద్ద శిక్ష ఎలాగూ తప్పదు. ఇంక పిల్లలకి నీవు తప్ప ఎవరున్నారు? అమ్మ రోగిష్టిది. ఆవిడ యింకెన్నాళ్ళో బ్రతకదు. అసలే అంతంతగా వున్న ఆవిడ ఈ వయసులో వచ్చిన కష్టానికి తట్టుకుని నిలబడలేదు. అమ్మకి యీ వృద్ధాప్యంలో యింత కష్టం తెచ్చిపెట్టినందుకు నేను విచారిస్తున్నాను. అయినా మరో గత్యంతరం కనపడడం లేదు. ఇంక ఎవరో బంధువులనే వారు ఎక్కడో వున్నా నా పిల్లలని ఎందుకు చూస్తారు?
ఇంక యీ యిల్లు, ఈ పిల్లలు, యీ సంసారం అంతా నడవడం నీది, రామకృష్ణదే భారం! సుజాతా నిన్న వీలునామా రాసి వకీలుగారి దగ్గిర వుంచాను. వకీలు సూర్యనారాయణగారు వీలునామా చదివి విన్పిస్తారు. సుజాతా నా పిల్లలకి ఆస్తిపాస్థులకి ఏం లోటులేదు! వాళ్ళకి నీవు ఈయాల్సింది ఆదరాభిమానాలు మాత్రమే!
నా నర్సింగ్ హోమ్ రామకృష్ణ నడపాలని నా కోరిక! రవి పెద్ద వాడయి డాక్టరు చదవాలని, చదివాక నా నర్సింగ్ హోమ్ లోనే ప్రాక్టీసు పెడతాడని ఆశ! రవి నా అభీష్టం ప్రకారం డాక్టరు కాకపోతే రామకృష్ణ ప్రాక్టీసు చేసినన్నాళ్ళు చేసి తరువాత అది అమ్మేసి ఆ డబ్బు రవికి యీయాలని నా కోరిక!
నా దగ్గిరున్న రొక్కం పాతికవేలు. రేఖ పెళ్ళికి ఖర్చుచేసి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యండి- నా ఇన్సూరెన్స్ డబ్బు ఏభైవేలు రవి చదువుకి, రేఖ చదువుకి ఇంటి ఖర్చుకి ఖర్చుపెట్టండి. నా నగలు, చీరలు రేఖకి యీయండి. ఈ యిల్లు యికనించి మీదే! రామకృష్ణ నీవు పిల్లలకి తల్లిదండ్రుల క్రిందే లేక కనుక యీ యింట్లో మీ యిద్దరికీ సర్వాధికారాలుంటాయి. మీ తదనంతరమే రవికి చెందుతుంది. రామకృష్ణ సంపాదించే డబ్బు మీ యిద్దరిదే! పిల్లలమీద ఆస్థిపాస్థులమీద మిమ్మల్నిద్దర్ని గార్డియన్లుగా నియమించాను.
నా కీ వూర్లో వున్న రెండు స్థలాలు అమ్మితే కనీసం ముఫ్ఫై వేలు వస్తాయి. ఆ స్థలాలు నీ పేర ఒకటి, రేఖపేర ఒకటి రాశాను. సుజాతా, నీ పెళ్ళికి పెద్దగా నేనేమీ యీయలేకపోయాను. అందుకే నీకు పసుపు కుంకం క్రింద నీ అక్క యిస్తూంది. అలాగే రేఖకి పెళ్ళిలో పసుపు కుంకం క్రింద చదివించండి.
రామకృష్ణకి నేనేం యీయగలను! నీ లాంటి భార్యవున్న రామకృష్ణకి ఇంక ఇచ్చేందుకు ఏముంది? డాక్టరుగా నా యింట్లో ప్రవేశించిన రామకృష్ణకి అందుకే నర్సింగ్ హోమ్ ఇచ్చాను. నా నర్సింగ్ హోమ్ ఇప్పటిలాగే ఎప్పటికీ నడవాలని నా కోరిక.
సుజా! అమ్మ పెద్దదయింది. రోగం, యీ దుఃఖం ఆవిడని యింకెన్నాళ్ళో బ్రతుకనీయదు. ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటావు గదూ!
ఇంకేం రాయను సుజాతా! నేనేం చెప్పి, ఏంచేసి నీవు నాకు చేయబోయే దానికి బదులు తీర్చుకోగలను?
సుజాతా! పిల్లలు ఏ క్షణంలోనూ అమ్మలేదే అని బాధపడే క్షణం రానీయవని నా నమ్మకం. అందుకే నిశ్చింతగా చచ్చిపోగలుగుతున్నాను. అమ్మకి నా ఆఖరి నమస్కారాలు చెప్పు. నీవు, రామకృష్ణ పిల్లపాపలతో పది కాలాలపాటు సుఖంగా బ్రతకాలని ఆశీర్వదించడం మినహా ఏం చెప్పగలను నీకు. పిల్లలకి నా ఆశీర్వచనాలు! ... పిల్లలు..... పిల్లలనే తలుచుకుంటూ, వాళ్ళని నీ చేతులలో పెట్టి వెళ్ళిపోతున్నాను .... సుజా వెడతాను.....
కల్యాణి"
"ఆంటీ" .... బావురుమంది సుజాత ఉత్తరం చదివి.
"ఆంటీ, ఇదా మీరు నన్ను అడిగింది? ఇదా మీకు నేను చేస్తానన్నది! నా మీద ఇంత భారంపెట్టి వెళ్ళిపోయారా? ఇందుకా అన్నిసార్లు నా దగ్గిర మాట తీసుకున్నారు? మూర్ఖురాలిని. తెలుసుకో లేకపోయాను" ఏడుస్తూ అనుకుంది సుజాత.
"ఏమిటి సుజాతా! ఏం రాశారు మేడమ్ ఉత్తరంలో?" రామకృష్ణ కళ్ళు తెరిచి చదువుతున్న సుజాతని అడిగాడు.
"చూడండి....ఆంటీ, మన ఇద్దరిమీద యీ ఇంటిభారం. పిల్లల భారం అంతా పెట్టి వెళ్ళిపోయారు. ఆవిడకి మన మీద ఎంత నమ్మకమో చూడండి. మనకూ ఆమెకీ ఏం సంబంధం వుందని మనల్ని నమ్మి యీ భారం అప్పగించి వెళ్ళారు. చదవండి" ఉత్తరం అందించింది సుజాత.
రామకృష్ణ ఉత్తరం చదివి నిట్టూర్చాడు "హు.... మరి అంతేగా? ఆ పిల్లలకి మన కంటే ఎవరున్నారు? రెండేళ్ళుగా వాళ్ళని చూస్తున్న నీ కంటే ఆప్తులు వాళ్ళకి ఎవరున్నారు? సుజాతా, ఆవిడ మనకు చేసిందానికి ఆవిడపట్ల కృతజ్ఞత చూపుకోడానికి ఆఖరికి యిదొక అవకాశమే మనకు మిగిలింది. వాళ్ళకి డబ్బుకి లోటులేకుండా ఆవిడే చేసి వెళ్ళారు. ఎటొచ్చి మనం చెయ్యాల్సింది వాళ్ళకి తల్లిదండ్రులు లేని లోటు కనపడకుండా ఆదరించడమే!"





