Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    "పడుకో రామచంద్రం, ఇలాగా పడుకో" అంటూ మెల్లగా రామచంద్రాన్ని వెనుక సీటులో పడుకోబెట్టాడు. పైమీద కండువాతీసి కాలిమీద గట్టిగా  బిగించి కట్టాడు. "భయపడకు భయపడకు" అని హెచ్చరిస్తున్నాడు. భూషణం గొంతులో ప్రామంలేదు, ఎండిపోయి చచ్చిపోయి ఉంది.

    రామచంద్రం కళ్ళల్లో విపరీతమైన భయం సుళ్ళు తిరిగింది. వెర్రిగా పరవళ్ళు తొక్కింది. చావుకన్నా దాన్ని గురించిన భయం భరింపలేనిది. మనిషియొక్క ప్రాణం సంరక్షణార్ధం వెర్రిగా అరుస్తూ నరాలలో కళ్ళల్లో గుండెలలో పరుగులెత్తుతుంది. ఆప్రాణం యొక్క ప్రథమ వివేకం  "నేను" అన్న అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది. మొరపెట్టుకుంటుంది. మోదుకుంటుంది. గిజగిజలాడుతుంది. రామచంద్రం , వణికిపోతున్నాడు. రామచంద్రంలోని "నేను" లుప్తమైపోతున్నాడు. కరిగిపోతుననాడు. కోట్లకొలదీ రక్తకణాల సైన్యాన్ని తన్ని తాను రక్షించుకుంటానికి యుద్దానికి పంపిస్తున్నాడు. కాని పామువిషం ముందు యింత సైన్యమూ ఓడిపోతోంది. కాలకూట జ్వాల రక్తాన్నీ, మాంసాన్నీ, ధాతువునీ, అంతటా రూపహీనంగా పరుచుకున్న ప్రాణాన్ని కాల్చివేస్తోంది. "భూషణం నేను చచ్చిపోతాను , చచ్చిపోతున్నాను" అంటూ అరిచాడు రామచంద్రం, బొంగురుగా, గాద్గదికంగా.

    భూషణం యిటూ, అటూ చూశాడు. ఎవరూ లేరు. చుట్టూ భయంకరమైన అడవి. ప్రతి నిముషమూ అమూల్యమైనది. ఒక నిముషం గడిచింది. అంటే రామచంద్రం, నివారించలేని విపత్తులోకి జారిపోతున్నాడు. భూషణం కర్తవ్యతా విమూఢుడైపోయాడు. ఏమీ చెయ్యలేని, ఏమి చెయ్యాలో తెలియని తన అవివేకం, తన అశక్తతలో తనే బంధింపబడి కొట్టుకుంటూ నీరసంగా "ఏం భయంలేదు భయంలేదు" అంటూ గుండెలు రాస్తున్నాడు.

    "నా భార్యా - నా పిల్లలు .....రక్షించు భూషణం రక్షించు-" రామచంద్రం దీనంగా ఏడుస్తున్నాడు.

    నాకు కాళ్ళూ చేతులూ ఆడడంలేదు. ఇంత భయంకరమైన అనుభవం నన్ను సందులలో కూడా సళ్ళించివేసింది. బావురుమని ఏడవాలని అక్కడనుంచి పారిపోవాలనీ ఉంది. కాని ఎక్కడికి పోను. ఎలా పోను ఆ అడవిలో!

    "గుండె బరువెక్కిపోతోంది. భూషణం" రామచంద్రం గొంతు క్షీణిస్తోంది. అతని నుదుటిమీద చెమట బిందువులు - అంత చలిగాలిలో కూడా.

    "ఆపద్భాంధవా! జగద్రక్షకా! నా రామచంద్రాన్ని రక్షించు" తడబడుతూ భూషణం రెండు చేతులూ పైకెత్తి జోడించాడు.

    రామచంద్రం వగరుస్తున్నాడు. అతని కళ్ళు పిచ్చిగా వున్నాయి. పెదవుల చివరినుండి నురగ కక్కుతున్నాడు. అది చూసిన నాగభూషణం "బాబోయ్" అని వెర్రికేక పెట్టాడు. నిలువునా వణికిపోతున్నాడు.  "వీడిశవాన్ని యింటికి తీసుకువెళ్ళి చెల్లెలికి ఎలా చూపించనురా" అంటున్నాడు రామచంద్రం కళ్ళు తెరచి  "నా పెళ్ళాం...." అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు.

    అవధానిగారు ఆగారు. గతస్మృతుల పునశ్చరణవలన ఆయన గొంతు ఉద్రేకంతో బాధతో నిండింది. మేమందరం వూపిరాపి వింటున్నాం. ఆచారి బల్లని రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకొని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది. తోటలో ఏమీ ఎరగనట్టు ఈ మాటలేవీ విననట్టు చెట్లు చీకటిలో నిశ్శబ్దంగా నుంచున్నాయి. ఒక నిముషం ఆగి అవధానిగారు చెప్పడం సాగించారు.

    భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెలమీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. అడవిలో మృత్యువులాంటి చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిదరంగు వెన్నెల .నాగభూషణం రెండు చేతులతోనూ నమస్కరించి కళ్ళుమూసుకుని ప్రార్ధిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను కాలం కదలడంలేదు. తన యినుప పిడికిలితో మా తలలమీద నొక్కుతోంది కారులో మూడు ప్రాణాలూ ఒక ప్రాణం కథావశిష్టంగా అయిపోతోంది. తక్కిన రెండు ప్రాణాలు నీరసించి అచేతన స్థితిలోకి జారిపోతున్నాయి. అసలే అడవి. ... అందులో కాళ్ళముందు శవం. శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖ జీవితానికీ, నౌకర్లకీ, అబద్దాలకీ, బేషజాలకీ అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి యింతకన్న ఆపద ఏముంది? ఇంతలోకీ అడవిలో కాస్త దూరంలో ఒక చోట గప్పున మంటరేగింది. బలహీనమైన నా మనస్సు ఇంక తట్టుకోలేక పోయింది. "బాబోయ్ దెయ్యం" అని అరిచి వెనక్కి పడిపోయాను.

    బహుశా అయిదారు నిముషాలలోనే తెలివి వచ్చివుంటుంది. కల్ళు తెరిచి చూశాను. స్టీరింగుకీ సీటుకీ మధ్యగావుంది నా తల. మెల్లగా లేచి బయంగా వెనుక సీటులోకి చూశాను. నాగభూషణం సీటునానుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.