Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "అయితే చిరుతపులి వుందంటావా మామయ్యా" అన్నాను నేను.

    "ఆ చిరుతపులీలేదు గిలీలేదు. ఈ పల్లెటూరివాళ్ళు వూరికే ఇలాగ పుకార్లు వేస్తుంటారు. అబ్బాయ్! ఇది ఇంగ్లీషువాడి రాజ్యంరా. వాడి తుపాకి ముందు సింహాలూ, పులులూ నిలుస్తాయట్రా..." అంటూ రామచంద్రం ఏదో చెపుతున్నాడు కాని కారు యింజనులోంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వినపడకుండా చేసింది.

    "ఇదేం జబ్బురా వెధవ కారుకి. మళ్ళీ ఆగిపోతుందేమో!" అన్నాడు నాగభూషణం భయంగా.

    "ఇది మీకాలంలోలాగే రెండెడ్ల బండికాదురా భూషణం. ఫోర్డుయింజను ఇలాగ చప్పుడైతే ఇంజన్ మాంచి బలంతో వుందన్నమాట" అంటూ రామచంద్రం ఏక్సిలేటర్ మీద కాలునొక్కాడు. కారు రయ్యి మని చీకట్లో దూసుకుపోతోంది. నాకు ఏదో సరదాగా థ్రిల్లింగ్ గా వుంది. ఆ చిరుతపులి గొడవ మాత్రం మధ్య మధ్య భయపెడుతోందితప్ప.

    "చూశావా ఒక్క పిట్టకూడా మైళ్ళకొద్దీ వెళ్ళినా కనబడదు. ఈ చెట్లచాటుకి దొంగలు గుంపులుగా దాక్కుని పల్లెటూరి ప్రయాణీకుల్ని దోచుకునేవారు. యిదివరలో....." అన్నాడు మామయ్య.

    గత చరిత్ర నా కళ్ళముందు లీలగా ఆడింది. ఇలాగ రోడ్డూ అవీ వుండేవికావు. అక్కడక్కడా ఓ పల్లెటూరు వుండేది. ఏ కాకతీయులో , చాళుక్యులో పరిపాలిస్తూ వుండేవారు. అపుడు దేశంలో వీరులూ, వీరవనితలూ, బందిపోటు దొంగలూ, మట్టిరోడ్లూ, పులులూ, ఎలుగుబంట్లూ , స్థిరమైన నమ్మకాలూ, సంప్రదాయాలూ అన్నీ వుండేవి. ఇప్పుడు రోడ్లూ, టెలిగ్రాఫ్ తీలగూ, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్నీ, క్రూరమృగాల్నీ నాశనం చేశాయి. వాటితోపాటు వీరవరులూ, స్వధర్మనిరుతులూ కూడా మాయమైపోయారు.

    "అడవి వచ్చేసింది. ఇది దాటితే యింకా పదిహేనుమైళ్ళు తణుకు"అన్నాడు రామచంద్రం.

    నాగభూషణం జవాబివ్వలేదు. వెనక్కి జేర్లబడి నిద్దరోతున్నాడు.

    "నువూ నిద్రపోతున్నావా ఏమిటిరా?" అన్నాడు రామచంద్రం నన్ను ఉద్దేశించి

    "లేదు" అన్నాను నేను దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తూ అడవి మధ్యనుండి రోడ్డు ఒక రాక్షస సీమంతంలాగా వుంది. అడవిలో అంతా కటికి చీకటిగా ఉన్నట్టుంది.

    ఇంజన్ లో ఏదో ఠప్ మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతువేసి ఆగిపోయింది.
    "ఏమయింది?" అన్నాడు నాగభూషణం.

    రామచంద్రం మాట్లాడకుండా దిగి యింజన్ ని పరీక్ష చేశాడు.  "సరీగా కనపడటంలేదు" అంటూనే పరీక్ష చేస్తున్నాడు. కీచురాళ్ళ కూతలు ఉచ్ఛస్వరంతో వినపడుతున్నాయి. నాగభూషణఁ కూడా దిగాడు. కంగారుగా అన్నాడు. "ఏం బాగుపడుతుందా?" అని అడిగాడు. రామచంద్రం మాట్లాడకుండా వెనుకసీటు కిందనుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు.

    "చిరుతపులి యీ అడవిలోనేనా వుందీ?" అన్నాను నేను.

    మామయ్య ఉలిక్కిపడి "ఎక్కడ?" అని ఒక గంతు వేశాడు.  "వెధవాయ్ సడెన్ గా అలా అన్నావేమిటిరా?" అన్నాడు కోపంగా . రామచంద్రం పనిముట్లు టిక్ టిక్ మని చప్పుడు చేస్తున్నాడు. శ్రమవలన అతని బరువైన వూపిరి చప్పుడు కూడా వినపడుతోంది. మధ్య మధ్య ఎండుటాకులలో గలగలమని చప్పుడు! పక్షి కూతలు........ కిచకిచలు..... ఇన్నిటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం.

    "తెల్లవారితే కలక్టరుగారింట్లో పెళ్ళి....." స్వగతం చెప్పుకున్నాడు మామయ్య.

    "నువ్వేం చదివిస్తున్నావ్" అన్నాడు రామచంద్రం.

    "నేను వెళ్ళలేకపోతే ఎంత అభాసు అవుతుంది?" అన్నాడు భూషణం.

    "చిరుతపులి మనుషుల్ని తింటుందా మామయ్యా" చిన్నవాడినైన నాకు ఒక పక్క భయం. మరొకపక్క కుతూహలం.

    "ప్లీడరుగారు పక్కలు వేయిస్తానన్నారు. వినలేదు ఖర్మం" మళ్ళీ భూషణం మామయ్య స్వగతం. ఏదో చెప్పలేని భయం అందరిలో.

    వెన్నెల మరి కాస్త వచ్చింది. ఆకాశంమీద చంద్రుడు ఎర్రగా వున్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు. నోరు, చెక్కిళ్ళు పెరికి వేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం వూడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుణ్ణి చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీరసంగా, నిగూఢంగా ఉన్న అడవిమీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనగా దుశ్శకునంలాగా అనిపించాడు. వెలవెలబోతున్న వెన్నెల కూడా కాష్టభస్మంలాగా భయపెడుతోంది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.