Home » Muppala Ranganayakamma » Stree



    "ఎవరో అన్నారో లేదో తెలీదు గానీ ఈ ముక్క నువ్వే అంటున్నావు కాదుటమ్మా?"
    "ఇక ఊరుకో, జానకీ! కబుర్లన్నీ ఇంటి దగ్గర."    
    "నిజమేలే , మనం నోరు మూసుకోకపోతే బండి కాస్తా దిగిపోయెలా ఉంది."
    స్టేషన్ దాటి, జనసమర్ధం తగ్గగానే జట్కా వేగం అందుకుంది.
    వసుంధర సుజాత వచ్చినందుకు చాలా సంతోష పడింది. "నిన్ను పంపించినందుకు అత్తగారికి ఎన్ని కృతజ్ఞత లైనా చెప్పుకోవాలి" అంది సుజా చెయ్యి ఆప్యాయంగా పట్టుకుని, స్నానాలు కాఫీలూ అయ్యాయి. జానకి ఆడబిడ్డ సంగతి కాస్తా మరిచిపోయి స్నేహితురాలితో ముచ్చట్ల లో మునిగి పోయింది. వాళ్ళ కబుర్లకు అంతరాయం కలిగించకుండా దూరంగా కిటికీ దగ్గరికి వెళ్ళి నించుంది సుజాత.
    అటుగా వచ్చిన చంద్రశేఖరం సుజాను చూసి ఆగాడు. "ఎండుకిక్కడ ఒంటరిగా నించున్నారు? ఓ! వాళ్ళిద్దరూ కబుర్ల లో మునిగి మిమ్మల్ని వదిలేసి నట్లున్నారే!"
    సుజా తలైనా తిప్పి చూడకుండా కిటికీ అవతలికి చూస్తూనే ఉంది: "ఫర్వాలేదు లెండి"
    చంద్రశేఖరానికి నవ్వు రాబోయింది. ఈవిడికి నిజంగానే కోపం వచ్చింది కాబోలు! "వసుంధర ని పిలుస్తానుండండి."
    "ఆహా వద్దు. వాళ్ళిద్దరూ చాలా కాలానికి కలుసుకున్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకేం భయం? అలా మొక్కల్ని చూస్తూ నించున్నాను కదూ?"
    చంద్రశేఖరం కదిలి వెళ్ళలేదు. "మీకు పువ్వు లంటే చాలా ఇష్టమా?"
    చిత్రంగా చూసింది సుజా. "ఏం? మీకు పువ్వులంటే అంత అయిష్టమా?"
    నవ్వాడు శేఖరం. "మీది కళా హృదయమన్న మాట! నేనంత సున్నితమైన వాణ్ణి కాదండీ!"
    అదంతా అనవసర ప్రసంగమో ననిపించింది సుజాతకు. తిరిగి జవాబు చెప్పకుండా కిటికీ కేసి తల తిప్పుకుంది.
    "పోనీ, వాళ్ళేలాగూ మాట్లాడు కుంటున్నారు. కాస్సేపు మీకు మొక్కలన్నీ చూపిస్తాను, రాకూడదు?"
    "అబ్బే! వద్దులెండి. ఇక్కడి నుంచి అంతా కనపడుతొందిగా?" సుజా ఒక రకమైన నిర్లక్ష్యం తోనే మాట్లాడింది.
    ఇల్లంతా పెళ్ళి సందడిలో మునిగి ఉన్నా సుజాకు కాలక్షేపం కావటం కష్టంగానే ఉంది. వసుంధర చూపించిన పుస్తకాల బీరువా దగ్గర కూర్చుని అరలన్నీ చూసింది. అన్ని పుస్తకాలు ఒక్కసారి కళ్ళ పడితే అద్భుతమైన పెన్నిదేదో లభించినంత సంతోషం వేసింది. అన్నిటినీ వరసగా వీణ మెట్లు మీటినట్లు వేళ్ళతో తాకి చూసింది. తను వెళ్ళేసరికి అన్నీ చదివేస్తే? అన్నీ!
    లోపలికి రాబోయిన చంద్రశేఖరం గుమ్మం లోనే నిలబడిపోయాడు. కంగారుగా లేచి నించుంది సుజాత.
    "ఆ డెస్కు లో నా పెన్ను ఉంది. కొంచెం ఇస్తారా?" అన్నాడు.
    టేబుల్ దగ్గరికి నడవబోయి ఆగింది సుజాత. "మీరు వచ్చి తీసుకోండి. నేను బయటికి వెళ్తాను."
    "వద్దు. మీ కిక్కడే బావుంటుంది. కూర్చునీ చదువుకోండి. నాకింకేమీ పని లేదు. పెన్ను తీసుకు వెళ్ళిపోతాను. బజారు నుంచి ఏవేవో సామాన్లు వచ్చాయి. కాస్త లిస్టు రాయాలని" అంటూ గదిలో కి వచ్చి డెస్క్ లాగి పెన్ను తీసుకొంటుంటే కొంచెం నొచ్చు కుంతున్నట్టే అంది సుజాత; "ఇది మీగది అని నాకు తెలీదు."
    నవ్వాడు చంద్రశేఖరం. "తెలిస్తే కూర్చునే వారు కాదు. అవునా? మరేం బాధపడకండి. ఇక్కడి కెవ్వరూ రారు. ప్రశాంతంగా ఉంటుంది. చదువుకోండి" అంటూ వెళ్ళిపోయాడు హడావుడి గా. వెళ్తూ వెళ్తూ గది తలుపులు దగ్గరికి వేసి మరీ వెళ్ళాడు.
    సుజాత నెమ్మదిగా వెళ్ళి బీరువా ఎదుట నించుంది. ఓ పావుగంట వెదికి నాలుగైదు పుస్తకాలు దగ్గర పెట్టుకుని కుర్చీలో కూర్చుంది.
    "పందిట్లో పెళ్ళవుతున్నది!" అంటూ బాండు వాళ్ళు ట్యూను వాయిస్తున్నారు. వినాలనిపించి పుస్తకం గుండెల మీద పరచుకుని వెనక్కు వాలింది.
    జానకి విసురుగా గది తలుపులు తోసుకుని వస్తూ "ఆహా! ఏం దర్జాగా పవ్వళించావమ్మా? నిన్నీ మూల దాక్కుని కూర్చోమన్నానా నేను? నీ ఆతీ గతీ చూడటం లేదని అన్నయ్య మమ్మల్నందర్నీ చివాట్లు పెట్టి వెళ్ళాడు. ఇకనైనా లేచి బయటికి రా! అలా బయటికి వచ్చి అందరి దగ్గరా కూర్చోరాదూ?' అంది గబగబా.
    సుజా తాపీగా నవ్వుతూ, "ఒక్కదాన్నీ కూర్చోవటమే నా కిష్టమనీ మీ అన్నగారితో వెళ్ళి చెప్పు. ఇక్కడ కూర్చుని హాయిగా చదువుకోమని నాకు చెప్పి గాలి దుమారంలా వచ్చి లాక్కు వెళ్ళమని నీకు చెప్పాడేమిటా పెద్ద మనిషి?' అంది.
    "ఆ తగూ ఏదో తీరిగ్గా వేసుకుందువు గానీ లేచిరా, తల్లీ! బాత్ రూం కాస్త ఖాళీ అయింది. తొందరగా స్నానం చేసి బట్టలు మార్చుకు కూర్చో ఆ లేత పసుపురంగు జరీ చీర తీసి పెట్టెను పెట్టి మీద. పెళ్ళి వారు వచ్చే వేళ అయిందిట. విడిదికి వెళ్దాం . లే మరి."
    సుజా కుర్చీకి మరీ అంటుకు పోయింది. "నేను చదువుకుంటాను. వదినా! విడిదికి అక్కడికీ తిరగటం నాకు సిగ్గు బాబూ!"
    "సిగ్గు చిన్నప్పుడే పోవాలి గానీ ఇంకా ఎంత కాలం? పెళ్ళికి వచ్చి పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటావా? ఇదెక్కడి చోద్యం? ముందు లేచి వస్తావా ? రావా?"
    లేవక తప్పలేదు. పుస్తకం మూసి టేబిల్ మీద పెట్టి వదినగారి వెనుకే వెళ్ళింది సుజా.
    హాల్లోకి వెళ్ళేసరికి చంద్రశేఖరం ఎవరితోనో మాట్లాడుతున్న వాడు వెనక్కు తిరిగి చూస్తూ అన్నాడు: "బస్సు వస్తోంది, జానకీ! మీరంతా తయారేనా?"
    "ఇదిగో, ఈవిడ గారిదే ఆలస్యం. అక్కడెక్కడో అంతకరం లో దూరి కూర్చుంది. వెళ్ళి లాక్కువచ్చాను. ఇక సింగారం చూడు, ఎంతసేపు చేస్తుందో!"
    అప్పటికే బాత్ రూమ్ కేసి వెళ్ళిపోయింది సుజాత. పెళ్ళి పెద్దరిక మంతా తన ఒక్కదానిదే నన్నట్టు తిరుగుతున్న జానకి సుజాను కూడా తన వెనక వెనకే తిరగమంది.
    "ఊహూ! నేనిలా తిరగలేను బాబూ! పోయి గదిలో కూర్చుంటాను. ముహూర్తం వేళకి పిలు. తప్పకుండా వచ్చి చూస్తాను" అంటూ ప్రాధేయ పడింది సుజాత.
    "చాల్లే. నీ అపురూపం నువ్వూను!" అంటూ విసుక్కుంది జానకి.
    "పోనీ , సుజాని చదువుకోనిద్దూ. తనకంతా కొత్త. ఎలా తిరుగుతుంది?" అంది వసుంధర నెమ్మదిగా. "వెళ్ళు, సుజా! ఈ గందరగోళం నీకేం పనికి రాదు."
    "ఇదిగో ఆ ముహూర్తం వేళకి నేనేం పిలవను. దాన్నే పిల్చుకోమని చెప్పి వెళ్ళు" అంది కోపంగా జానకి.
    సుజా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
    విడిదిలో దిగిన మగ పెళ్ళి వారి టిఫిన్లూ, కాఫీలూ అయ్యాయి. ఓ ఐదారుగురు ఆడవాళ్ళు పెళ్ళి కూతుర్ని చూస్తామంటూ బయల్దేరి వచ్చారు. జానకి గబగబా వెళ్ళి ఆడబిడ్డను మళ్ళా లాక్కు వచ్చింది. ఓ పావుగంట అలాగే ఇబ్బందిగా కూర్చుని జానకి ఎటో వెళ్ళగానే లేచి చక్కా పోయింది సుజాత. గది తలుపులు బిదాయించుకుని మళ్ళా కుర్చీలో జేరబడింది. పుస్తకం తో పది పేజీలు  తిప్పేసరికి కళ్ళు కూరుకు పోయాయి. తనకు తెలీకుండానే నిద్రాదేవి ఒడిలో విశ్రమించింది.
    తలుపుల మీద టిక్కు టిక్కు చప్పుళ్ళతో త్రుళ్ళి పడి లేచి చీకటి ఆవరించుకున్న గదిలో కంగారు పడుతూ తిరిగిందో క్షణం. కళ్ళు నులుముకుని ఎలాగో గుమ్మం పోల్చుకుని తడబడుతూ వెళ్ళి తలుపులు తీసింది.
    "ఇదేమి టీంత చీకట్లో కూర్చున్నారు?" చంద్రశేఖరం ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
    "అబ్బే! చదువుతూ చదువుతూ ఉండగానే నిద్ర పట్టేసింది.
    "అయ్యో! డిస్టర్బ్ చేసినట్టున్నాను. జానకీ వాళ్ళూ పందిట్లో వున్నారు. ముహూర్తం వేళ సమీపిస్తుందని ఒక్కసారి పిలిచి రమ్మని చెప్పింది."




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.