Home » Jonnalagadda Rama Lakshmi » Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1



    వెంకటేశ్వర్లు ఎవరికైనా ఫోన్ చేసి అక్కణ్ణించి టెలిగ్రాం ఇప్పించాడేమో-ఆయన ఎంతకైనా సమర్ధుడు!
    అయితే కన్న తల్లి విషయంలో రిస్కు తీసుకోదల్చుకోలేదు రాంకుమార్. ఉన్నపళంగా అతడు తన ఊరికి బయల్దేరాడు.
    అక్కణ్ణించి ఎనిమిది గంటల బస్సు ప్రయాణం.
    రాత్రి పదయ్యేసరికల్లా రాంకుమార్ తన ఇల్లుచేరాడు.
    ఇంట్లో తల్లి నిక్షేపంలా ఉంది. అసలు గుమ్మంలో ఎదుటపడి అతణ్ణి పలకరించినదామే!
    రాంకుమార్ తెల్లబోయి - "నువ్వు క్షేమంగానే ఉన్నావా?" అన్నాడు.
    తల్లి ఆప్యాయంగా అతఃది వంక చూసి-"ఓహో-అయితే టెలిగ్రాం అందిందన్న మాట-"అని-"ఏమండోయ్-మన రాంబాబు వచ్చాడు" అంటూ కేకపెట్టింది.
    ఆ కేకకు బదులుగా లోపల్నుంచి ఇద్దరు చెల్లెళ్ళూ, ఒక తమ్ముడూ వచ్చారు. వారి వెనుక నెమ్మదిగా వచ్చాడు రాంకుమార్ తండ్రి.
    ఈలోగా తల్లి అతణ్ణి కుశలప్రశ్నలు వేసి కుర్చీలో కూర్చోపెట్టింది.
    "టెలిగ్రాం మీరే యిచ్చారా?" అన్నాడు రాంకుమార్ అందర్నీ ఉద్దేశించి.
    "ఇచ్చింది నేను-కానీ ఇవ్వమన్నది మీ అమ్మ..." అన్నాడు తండ్రి.
    "ఎందుకలా యిచ్చారు? నేనంత కంగారుపడతానొ తెలియదా?" అన్నాడు రాంకుమార్ చిరాగ్గా.
    "చూశారా-వాడికి నేనంటే ఎంత ప్రేమో" అంది తల్లి.
    "ప్రేమ సంగతి సరేనమ్మా-ఇలాంటి పనులు చేయడం వల్ల నిజమేదో అబద్దమేదో తెలియక-ఒకోసారి ఏదైనా అయినా కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది-" అన్నాడు రాంకుమార్.
    "నాకు తెలుసురా-కానీ ఎన్నుత్తరాలు రాసినా పెళ్ళి గురించి నువ్వేమీ మాట్లాడ్డం లేదు. ఇక్కడికి రావడం లేదు. అందుకని నేనే అలా టెలిగ్రాం ఇవ్వమన్నాను."
    "చాలా పొరపాటు చేశావమ్మా-అవతల కొంప మునిగే పనులున్నాయి. నీ టెలిగ్రాం చూసుకుని అన్నీ వదులుకుని ఉన్నపళంగా వచ్చాను. అయితే రేప్పొద్దున్నే ఫస్టు బస్సులో తిరిగి వెళ్ళిపోతాను" అన్నాడు రాంకుమార్.
    "వీల్లేదు-నువ్వు నాలుగురోజులిక్కడే వుండాలి" అంది తల్లి.
    "ఎందుకని?"
    "నీకు పెళ్ళిచూపు లేర్పాటవుతున్నాయి."
    "ఇవతల పెళ్ళిచూపులనుకుంటే అవతల ఉద్యోగమే పోవచ్చు  నాకు. ఆ విషయం ఆలోచించావా అమ్మా!"
    తల్లి అతడివంక నిర్లక్ష్యంగా చూసింది.
    అక్కడున్న మిగతా నలుగురు మనుషులూ శిలాప్రతి మల్లా నిలబడి తల్లీ కొడుకుల సంభాషణ వింటున్నారు.
    "అమ్మా-రేప్పొద్దునే నేను పోతున్నాను" అన్నాడు రాంకుమార్.
    "వెళ్ళవు-"
    "వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది...."
    "పోతే పోనీ!"
    "అమ్మా! నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అన్నాడు రాంకుమార్.
    "ముందు నేను చెప్పేది పూర్తిగా విను" అందతడి తల్లి.
    సీతాపతి వారికి దూరపు బంధువు. ఇటీవలే ఆయన వ్యాపారంలోకి దిగి ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. అనుకోకుండా రెండు నెలలక్రితం యాక్సిడెంటు చేసి మంచం పట్టాడు. అందాకా వ్యాపారం చూడ్డానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు. అయితే ఆయన నమ్మకస్థుడైన మనిషికోసం చూస్తున్నాడు. ఆయన కొక్కగానొక్క కూతురు. ఆ కూతుర్నిచ్చి పెళ్ళిచేసి అల్లుడికి వ్యాపారం అప్పజెప్పాలని ఆయన అనుకుంటున్నాడు.
    "నా కిల్లరికం ఇష్టంలేదు" అన్నాడు రాంకుమార్.
    "ఆయన చాలా మర్యాదస్థుడురా....పాపం అలాంటి షరతులేమీ లేవు. నిన్నాయన ఇల్లరికముండమనడం లేదు. మేనేజరుగా నిన్నప్పాయింట్ చేసి నెలజీతం తీసుకోమంటున్నాడు. నువ్వు వేరే కాపురం పెట్టవచ్చు."
    "జీతం ఎంతిస్తాడుట?"
    "ఆరంభంలో పదిహేనువందలు నెలకు...."
    "అమ్మా-నీకు తెలుసుగదా-ప్రస్తుతం నా నెల జీతం రెండువేలు...."
    "వెర్రినాయనా! నామకః జీతంకానీ-ఆ ప్రెస్సు నీదే కదా...."
    "అయితే నేను చెప్పేది కూడా వినమ్మా-నా యజమాని వెంకటేశ్వర్లు-ఆ ఏడుకొండల వాడికంటే కూడా మహిమలోనూ, డబ్బులోనూ బలవంతుడు. ఆయనకూడా తన కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చేస్తానంటున్నాడు....."
    రాంకుమార్ తల్లి ఉలిక్కిపడినా-"వాళ్ళు మన వాళ్ళేనా?" అనికూడా వెంటనే అంది.
    "ఈ రోజుల్లో ఇంకా కులాలూ, మతాలూ ఏమిటమ్మా?"
    "ఈ రోజులూ ఆ రోజులూ అని లేదు. మనిషి బ్రతికున్నంతకాలం కులాలూ, మతాలూ ఉంటాయి" అంటూ మొదటిసారిగా రాంకుమార్ తండ్రి పెదవి విప్పాడు.
    "కానికులం చేసుకుందుకు నీకేం కర్మరా-చదువుంది. రూపముంది. తెలివుంది. ఆ సీతాపతి యాభైవేలు కట్నమిచ్చి వియ్యపురాలు, ఆడపడుచు లాంఛనాలలో ఘనంగా పెళ్ళి చేస్తానంటున్నాడు. మన సంప్రదాయం చూసీ, నీ బుద్ది చూసీ ఆయన మోజుపడుతున్నాడు తప్ప ఆయనక్కుర్రాళ్ళు దొరక్క కాదు" అంది రాంకుమార్ తల్లి.
    "కానీ అమ్మా! మా వెంకటేశ్వర్లు ఇలాంటి ప్రెస్ ఓనర్లు వందమందిని బజార్లో పెట్టి వేలం వేయగలడు. నాకా యింటల్లుడినయ్యే అవకాశం పోగొట్టవద్దు. కాస్త నిదానంగా ఆలోచించండి" అన్నాడు రాంకుమార్.
    "ఇందులో ఆలోచించడానికేమీ లేదు. నువ్వు నామాట కాదంటే నామీద ఒట్టే" అని రాంకుమార్ తల్లి అతడికి మరి మాట్లాడే అవకాశ మివ్వకుండా లోపలకు వెళ్ళి పోయింది.
    రాంకుమార్ తెల్లబోయి అటే చూస్తూండిపోయాడు. తల్లి ఒట్టు నతడింతవరకూ నిర్లక్ష్యం చేయలేదు.

                                       3

    రైల్వేస్టేషన్లో కారు సిద్దంగా ఉంది. అందులోంచి సీతాపతి దిగి రాంకుమార్ కుటుంబ సభ్యులందర్నీ గౌరవంగా ఆహ్వానించి కారెక్కించాడు.
    "మీ వంట్లో కులాసాగా వుంటోందా?" అన్నాడు రాంకుమార్ తండ్రి.
    "ఏం కులాసాలెండి-మిమ్మల్ని చూసి కొండంత బలం వచ్చింది. ఏదో అడపా తడపా యిలా తిరగడానికే తప్ప, అట్టే ఇల్లుకదిలే అవకాశం నాకు లేదు" అన్నాడు సీతాపతి.
    రాంకుమార్ కాయన్ను చూస్తే చిరాగ్గా అనిపిస్తోంది. ఆయన మాటలు వింటే అసహనంగా వుంటోంది. అయినా వ్యక్తపరచలేదు.
    కారో యింటి ముందాగింది.
    ఆరుగదుల బంగళా. గదులన్నీ విశాలంగా ఉన్నాయి. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ.
    "ఇల్లెంత బాగుందో చూశావా?" అంటూ తల్లి రాం కుమార్ చెవిలో గొణిగింది.
    "ఇది వెంకటేశ్వర్లు ఔట్ హౌస్ లా ఉంది" అంటూ రాంకుమార్ తల్లి చెవిలో గొణిగాడు.
    ఇంటిల్లపాదీ బాగా మర్యాదలు తెలిసినవారై వుండాలని తల్లి అనుకుంటే-అది అతి వినయమని రాంకుమార్ అనుకున్నాడు. వారికి మర్యాదలు మాత్రం ఎంతో బాగా జరిగాయి.
    రాంకుమార్ నిర్లక్ష్య వైఖరిని సీతాపతి గుర్తించినట్లే కనపడ్డాడు. ఆయనకు రవంత అసంతృప్తి కలిగింది. కాబోయే అల్లుడి మనసు కుల్లాసం కలిగించాలని ఆయన పాపం చాలా ప్రయత్నాలు చేశాడు.
    అయితే అప్పటికి వెంకటేశ్వర్లుతో సవాలు చేశాక-నాలుగోరోజు రాంకుమార్ కు బంగారు పిచ్చుక సురేఖ తన చేజారి పోతోందన్న భావం అసహనాన్ని పెంచుతోంది. అతడు ముభావంగా విన్నాడు సీతాపతి మాటలు. సీతాపతి అందుకు చిన్నబుచ్చుకున్నాడు.




Related Novels


Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.