Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


                   
                                                            దొంగ

    మసక మసకగా వుంది వెన్నెల. చెట్లకిందవున్న చీకటిలోంచి నడుస్తున్నాడు గోపాలం. మోకాళ్ళపైకి ఎగకట్టిన పంచకట్టూ, ఛాతీకి బిగుతుగా అంటుకొని పోయిన బనీనూ, మొలలో చిన్నకత్తి - ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ఉన్నాడు గోపాలం......

    మధ్య మధ్య త్రేనుపులు వస్తున్నాయి పుల్లపుల్లగా - ఒకే ఒక గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికీ, హుషారుకీ. చదువురాని వాడైనా, ప్రతిదీ ఒక ప్లాను ప్రకారం నడవాలి గోపాలానికి. ఏ పని చేసినా ముందూ వెనకా చూసి ఆలోచించి బేరీజువేసే అలవాటు వుంది అతనికి. ఒక స్వాభావికమైన వివేకం వుంది. అందుకే రత్తయ్యా, సోములూ ఎంతో నమ్మకంవుంచి అతనిమీద యీ బాధ్యత వేశారు. వాళ్ళిద్దరూ లేకుండా వుంటే, పనులు సవ్యంగా జరుగుతాయి. వాళ్ళిద్దరికీ నిదానంలేదు. ఉత్త కంగారు, ఉత్తి ఆశ తప్ప.    

    రాత్రి ఒంటిగంట దాటితేకాని ఆవిడమొగుడింటికి రాడు. రెండు వారాలు పరిశీలనగా చూసి యీ విషయం గ్రహించాడు. ఆ క్లబ్ లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బయిపోయేవరకూ అక్కడే ఉంటాడు. ఈలోగా అతని భార్య వొంటరిగా ఇంట్లో వంటగది పక్కగా ఉన్న గదిలో పడుకుని నిద్రపోతుంది. వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి. దొడ్డి చాలా పెద్దది. ఎన్నో మొక్కలూ చెట్లూ వున్నాయి. వాటి నుండి తాను కనుపించడు. మరీ మంచిది వంటగది కిటికీ వానకి తడిసి ఎండకి ఎండి కమ్ములు పట్టుతప్పి వున్నాయి బలంగా తెలివిగా పని చేస్తే మూడు నాలుగు ఊచల్ని తీసెయ్యవచ్చును. ఇంక ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పని చాలా సులభం. తాను అవతల గది తలుపు కొడతాడు మెల్లిగా. ఆవిడ ఏ ఎలకో, పిల్లో అనుకుని తలుపు తీస్తుంది అంతే తాను కత్తి చూపించి భయపెడతాడు. మెళ్ళోవున్న నాలుగు పెటల గొలుసు ఒడుపుగా, తాపీగా తీసుకుంటాడు. ఆమె తెప్పరిల్లే లోపల, కేకవేసే లోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యుడైపోతాడు.

    గోపాలం ఇలాగ తన ప్లానంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి, అక్కడక్కడ ఒక రిద్దరు రాత్రించరుల్ని తప్పించి. ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట ఇది. ఊళ్ళోవున్న జనసంచారమూ, అలజడీ ఇక్కడ ఉండవు. మొదట ఆట అయిపోగానే మొగలోవున్న కిళ్ళీకొట్లూ, చిన్న కాఫీ హోటలూ మూసేస్తారు. చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్ళలోంచి మాత్రం విద్యుద్దీప కాంతి కిటికీలలోంచి వస్తోంది. మొత్తంమీద వీధులూ, ఇళ్ళూ ఆమసక వెన్నెలలో ఒంటరిగా గోపాలంకోసం యెదురు చూస్తోన్నట్టు వున్నాయి.

    గోపాలానికి తను చేసే పనిమీద నైతిక సందేహాలు ఏమీలేవు. దొంగతనం తప్పనీ, పాపమనీ అతను అనుకోలేదు. ఎందరో తమ తమ అవసరానికి ఎన్నో వృత్తులూ, ఉద్యోగాలు చేసినట్టుగా అతనూ ఇది చే్స్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణచేసే పిరికితనం కాని, అసలటువంటి ఆలోచనలకి అవసరంకాని అతనికి కనిపించలేదు. అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడమూ ఒప్పించడమూ లాంటి బాధలు కలుగలేదు. తనపనిలో దొరికిపోతే జైలుకి వెళ్ళాలన్న భయమూ, జ్ఞానమూ వున్నాయి అతనికి. అందుకే జాగ్రత్తగా ప్లాను వేసుకుంటాడు. ఎంతో అవసరమైతేకాని రత్తయ్యనీ, సోముల్నీ వెంటతీసుకుని వెళ్ళడు. వాళ్ళిప్పుడు తనకోసం ఆశగా చూస్తూంటారన్న ఆలోచన అతనికి మరిప్పుడు ఉత్సాహం ఇచ్చింది.

    ఆ ఇల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేలులా వుంది. ప్లాను ప్రకారం ఇంటి వెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు. అరటిచెట్టూ, కొబ్బరి చెట్లూ ఏవేవో మొక్కలూ, తుప్పలూ, అంతా గలీజుగా చీకటిగా ఉంది. నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరకు వచ్చాడు గోపాలం. కిటికీ వూచల్ని ఒకసారి లాగిచూశాడు. ఇంతలో అతనికి లోపల్నుంచి మాటలు వినిపించాయి. అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టనిపించింది. ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి. గోపాలానికి కుతూహలం కలిగింది. బహుశా ఆ వచ్చిన వాళ్ళెవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును. తన మార్గం నిరాటంకమవవచ్చును అనికూడా అనిపించింది. ఒక వేళ ఎవరేనా ప్రియుడేమో -మొగుడు లేకుండా చూసి ప్రేమకలాపం జరుపుతుందేమో అని ఊహ తట్టింది. మాటలు తొందరగా గట్టిగా వినబడుచున్నాయి. ఆవిడ గొంతులో ఏదో భయం, బాధా ఉన్నాయి. అతని కుతూహలం హెచ్చింది. బ లంగా వూచల్ని లాగి కదిపి ఊడదీశాడు. నేర్పుగా ఏర్పడిన జాగాలోనుంచి వంటింట్లోకి ప్రవేశించాడు. పక్క గదిలోనుంచి మాటలు వినబడుతున్నాయి.

    "వద్దండి -నా మాట వినండి" ఆవిడ గొంతు.

    "ఇస్తావా- తగలనియ్యనా" మగ గొంతు.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.