Home » Jonnalagadda Rama Lakshmi » Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1



    "మాకు తోచింది మేం చెప్పాం. నీకు తోచింది నువ్వూ చెప్పొచ్చుగా-" అన్నాడు శేషగిరి.
    "నేను మీకు వీసీఆర్ నమ్మను. ఏమీ అనుకోవద్దు.."
    "ఎందుకని?"
    "త్రయిన్లో మానేజ్ చేసుకునేందుకు నా పద్ధతులు నా కున్నాయి. మీ యింట్లో వీసీఆర్ టెస్టింగయింది అందుకు చాలా చాలా థాంక్స్....." అన్నాడు గోపాల్.
    "మానేజ్ చేయడమంటే లంచమివ్వడమేగా? వాళ్ళ కిచ్చే లంచం-మాకు కన్సెషన్ గా యివ్వవచ్చు...." అన్నాడు శేషగిరి.
    "చూడండి సార్! నేను వ్యాపారస్థుడి కొడుకును. గౌరవంగా బ్రతికినవాణ్ణి. ఒకరిచేత వేలెత్తి చూపించుకోవడం నా కిష్టముండదు...." ఆగాడు గోపాల్.
    "ఇప్పుడు మాత్రం నీకేమయింది?"
    "నేను పదమూడు వేలక్కొన్నానన్న వీసీఆర్ని-మీరేడువేల కడుగుతున్నారు. అంటే అర్ధమేమిటి? ఇదేదో దొంగసరుకని మీరనుమానిస్తున్నారు. బొంబాయిలో ప్లాట్ ఫారాల మీద అమ్ముకునే వాళ్ళదగ్గర తప్ప ఇలాంటి బేరాలుండవుకదా! నేను చాలా హర్టయ్యాను. ఇది దొంగ సరుకుకాదు. కష్టార్జితంతో కొన్నది...."
    శేషగిరి అతణ్ణనునయించి తన ఉద్దేశ్యమది కాదని మరీ మరీ చెప్పాడు.
    "అయితే మీకిది నేనమ్మగలను. కస్టమ్స్ వాళ్ళకి మూడువేలదాకా లంచమివ్వాల్సుంటుంది. మీరు చెప్పి నట్లు-ఆ డబ్బు మీకే కన్సెషన్ గా యివ్వచ్చు. అంటే పదివేలు. కానీ నేనిది పదివేలకు అమ్మను. పదివేల ఎనభైనాలుగుకిస్తాను....." అన్నాడు గోపాల్.
    "మధ్య ఆ ఎనభైనాలుగేమిటి?" అన్నాడు శేషగిరి.
    "పదమూడు మా యింట్లో అడ్డొచ్చిన అంకె. మీరిది పదమూడువేలకు కొనడంలేదు. కాబట్టి ఇందులో అంకెలన్నీ కలిపితే పదమూడు రావాలి. పదివేల ఎనభైనాలుగంటే-ఒకటి, ఎనిమిది, నాలుగు.....అన్నీ కలిపి పదమూడుకదా!"
    "వద్దులే!" అన్నాడు శేషగిరి- "మా యింట్లో ఉన్నక్యాషంతా కలిపి ఏడువేలు. నువ్వేమో ఈ రాత్రికే వెళ్ళి పోతున్నావు...."
    "కావాలంటే టికెట్ కాన్సిల్ చేసుకుంటాను. మిగతా డబ్బు రేపుదయం వచ్చి వసూలు చేసుకుంటాను. ఆ కాన్సిలేషన్ చార్జెస్ కూడా మీవే!" అన్నాడు గోపాల్.
    శేషగిరి కొడుకు తండ్రివంక గుర్రుగా చూసి-"ఏడువేలకు మించి వీసీఅర్ కొనే తాహతు మాకులేదు...." అన్నాడు.
    "అయితే సెలవు...." అన్నాడు గోపాల్.
    "ఒక్కసారి లోపలకూడా అడిగివస్తాను-" అన్నాడు శేషగిరి.
    తండ్రీ కొడుకులు లోపలకు వెళ్ళారు. ఆడవాళ్ళతో కలిసి విషయం చర్చించారు.
    ముందాడవాళ్ళుత్సాహపడ్డారు.
    "ఉగాదికి మీ ముగ్గురికీ కలిపి పదివేల రూపాయల బంగారం కొనే కార్యక్రమముంది. ఆలోచించుకోండి-బంగారం కావాలా, వీసీఆర్ కావాలా?" అన్నాడు శేషగిరి కొడుకు.
    కాసేపాలోచించి ఆడవాళ్ళు బంగారానికే ఓటువేశారు.
    "బంగారంలాంటి వీసీఆర్-మళ్ళీ అమ్ముకుంటే పదమూడు వేలొస్తుంది...." అన్నాడు శేషగిరి నిట్టూర్చి.
    "వీసీఆర్ బంగారంలాంటిదే కానీ బంగారంకాదు-" అన్నాడు కొడుకు.
    బయట్నించి గోపాల్ కేకపెట్టాడు-"అయ్యా! నాకు ట్రైన్ టైమవుతోంది. సెలవిప్పిస్తే వెళ్ళొస్తాను...."
    "వెళ్ళనివ్వండి నాన్నా! అతడే మళ్ళీ మనకు పట్టుకొచ్చి వీసీఆరిస్తాడని నా నమ్మకం...." అన్నాడు శేషగిరి కొడుకు.
    గోపాల్ వీసీఆర్ తీసుకుని వెళ్ళిపోయాడు.
    శేషగిరికి కాస్త బాధనిపించింది.
    యాభయ్యోపడిలోకి వచ్చినప్పట్నించీ ఆయనలో తిరిగే ఓపిక తగ్గింది. టీవీ ప్రోగ్రామ్సు బాగా ఎంజాయ్ చేస్తున్నాడాయన. అయితే టీవీలో తెలుగుమాట వినపడ్డం లేదని ఆయన బాధ!
    రాత్రి పదకొండు దాటినా శేషగిరికి వీసీఆర్ ఆలోచన లతో నిద్రపట్టలేదు.
    సుమారు పదకొండున్నర ప్రాంతాల కాలింగ్ బెల్ మ్రోగింది.
    అప్పుడాయనొక్కడే మెలకువగా ఉన్నాడు.
    "గోపాల్ వచ్చాడేమో- ఏడువేలకే వీసీఆరిస్తాడేమో!" అనుకుంటూ ఆయన పక్కమీంచి లేచాడు.
    తలుపు తీసేసరికి ఎదురుగా ఉన్నది గోపాల్ కాదు. మరెవరో!
    "నేనండి.....ఇందాకా వచ్చానుగా-" అన్నాడతడు ఒరియాలో.
    శేషగిరికి గుర్తొచ్చింది. అతడు గోపాల్ తీసుకొచ్చిన వీసీఆర్ మెకానిక్!
    "ఏం కావాలి?" అన్నాడు శేషగిరి ఒరియాలో.
    "వీసీఆర్ తీసుకుని వెడదామని వచ్చానండి...."
    "వీసీఆర్ తీసుకుని వెళ్లడమేమిటి?" అన్నాడు శేషగిరి అర్ధంకాక....
    "అదే-సాయంత్రం గోపాల్ బాబు మీ యింట్లో సినిమా వేసుకొంటామని వీసీఆర్ అద్దెకు తెచ్చారుగా. అద్దె ఆయనే కట్టేశాడులెండి! వీసీఆర్ వెనక్కు తీసుకుని వెడదామని వచ్చానండి...." అన్నాడు మెకానిక్.
    శేషగిరి ఇంటిల్లపాదినీ లేపాడు.
    ఆయన బుర్రలో అంతా అయోమయమైపోయింది.
    మెకానిక్ జరిగింది తెలుసుకుని గోలపెడుతున్నాడు.
    అప్పటికప్పుడు స్కూటర్ మీద హోటల్ అనార్కలీకి వెడితే-అందులో గోపాల్ పేరుమీద గత రెండు మూడు రోజులుగా ఎవరూ దిగలేదని తేలింది.
    కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కాస్త లేటయింది. స్టేషనుకు వెడితే అక్కడా గోపాల్ కనబడలేదు.
    మోసం చేసేవాడు నిజాలు చెబుతాడా!
    మెకానిక్ దిగులుగా వెళ్ళిపోయాడు. అతడు చేసిన తప్పేమీ లేకపోయినా యజమాని కోపానికి గురిగాక తప్పదతడికి!
    శేషగిరింట్లో మాత్రం-శేషగిరి కొడుకును విపరీతంగా మెచ్చుకొని-"ఈ రోజు నువ్వు ఏడువేల రూపాయలు సేవ్ చేశావు...." అన్నాడు.
    "అది దొంగసరుకై ఉంటుందని ఊహించాను కానీ మరీ యిలా జరుగుతుందని ఊహించలేదు. దొంగ ఏడు వేలకే కక్కుర్తిపడకపోవడం మన అదృష్టం...." అన్నాడు శేషగిరి కొడుకు.


                               :-అయిపోయింది:-




Related Novels


Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.