Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    "నీకు అవన్నీ అనవసరం. నేను చెప్పినట్లు చెయ్యి" ఆజ్ఞాపించాడు మాధవుడు.

    శేషయ్య ఏనాడు మాధవుణ్ణి కాదనలేదు.

    కారు సెలూన్ దగ్గరా, రెడిమేడ్ షాపు దగ్గర ఆగి, బయలుదేరేసరికి శేషయ్య రూపం సర్వాంగసుందరంగా అభినవంగా సూట్, బూట్ , హేట్ తో దర్శనీయంగా తయారయింది. ఈసారి కారు ఓ పెద్ద హోటల్ ముందు ఆగింది.

    "ఇదిగో శేషూ, రెండవ అంతస్తులో నీ కోసం ఎయిర్ కండిషన్డు గది ఒకటి తీసుకున్నాను. ఈ మూడు వందలూ నీదగ్గర ఉంచుకో,. నాల్గవ రోజునాటికి నీ దగ్గర పైసా కూడా ఉండకూడదు. ఈ హోటలులో నీకు సర్వ సౌఖ్యాల్నీ, భోగాల్నీ ఎప్పుడు కోరినా పళ్ళెంలో పెట్టి అందిస్తారు. హాయిగా, కులాసాగా అనుభవించు" అంటూ మాధవుడు మూడువందల రూపాయల నోట్లు శేషయ్య కోటుజేబులో పెట్టి విష్ చేసి వెళ్ళిపోయాడు.

    తెల్లబోయి నుంచున్న శేషయ్యని ఇద్దరు హోటల్ జవాన్లు గౌరవంగా.

    భక్తి శ్రద్దలతో నడిపించుకు వెళ్ళి లిఫ్ట్ ఎక్కించి రెండవ అంతస్తులో ఒక పెద్ద గదిలో దిగవిడిచారు.

    చలువరాయి చప్టాలో, చల్లదనం ఇచ్చే రంగులతో నిగనిగ మెరిసే సామాగ్రితో టెలిఫోన్, రేడియోగ్రాములతో, వేడి, చల్లని కుళాయిలతో కిటికీలకి సిల్కుతెరలతో, పువ్వుల కుండీలతో ఎవరో సౌఖ్యం అనే భావాన్ని భౌతికంగా తర్జుమా చేసి, నాలుగు గోడలమధ్యా బంధించినట్టనిపించింది శేషయ్యకి.

    మంచంమీద వాలగానే డన్ లోపిల్లో మెత్తని వూపుకి తన్నొక దేవకన్య మెత్తగా మత్తుగా కౌగిలించుకుంటూన్నట్టు అనుమానపడి ఫక్కున నవ్వేశాడు.

    "రోజుకి గదికి అద్దె ఎంత?" అని అడిగాడు శేషయ్య.

    "నలభై రూపాయలు" అన్నాడు బోయ్.

    ఉలిక్కిపడి "నాకు తాగేందు కేదేనా కావాలి. మాంచి మాంచి...." అని పేర్లు తెలియక తికమకపడ్డాడు శేషయ్య.

    రకరకాల పానీయా లతని ముందుకు వచ్చిపడ్డాయి.

    "నాకు తినేందు కేదేనా కావాలి" అన్నాడు శేషయ్య.

    నానావిధ భక్ష్యాలూ అతని ఎదుట సాక్షాత్కరించాయి.

    "అబ్బ, వొళ్ళు నొప్పులుగావుంది. నిద్రవస్తోంది" అనుకున్నాడు శేషయ్య తనలో తాను.

    ఒక ఓఢ్ర మంగలి వళ్ళు పట్టగా, రేడియోనుంచి చక్కని పాటవింటూ కలలుకంటూ నిద్రపోయాడు శేషయ్య.

    సాయంత్రం టాక్సీలో పార్కుకీ, ఊరు శివారుకి , థియేటర్ కీ వెళ్ళాడు. ఎక్కడా అతనికి అమితమైన గౌరవం . ఒకచోట జనం గుంపులుగాచేరి , గారడీ ప్రదర్శనాన్ని చూస్తున్నారు. అటువంటి వీధి ప్రదర్శనాలు చూడడం బాగా అలవాటయిన శేషయ్య కారాపి, అక్కడ దిగాడు. ఎవరో అడిగారు.

    "అయ్యా తమరెవరు, ఎక్కడ ఉంటున్నారు?"

    "దేవేంద్రా హోటల్, రూమ్ నెంబరు 18" అన్నాడు శేషయ్య.

    అంతే, జనం పాయలుగా విచ్చిపోయారు. జనం పీతల్లా ముడుచుకుపోయారు. కొందరు 'సలాం' అన్నారు. కొందరు నమస్కరించారు. పక్కనున్న టీ దుకాణంవాడు గబగబా ఓ కుర్చీ తీసుకువచ్చి వేశాడు. శేషయ్యకీ వెర్రి ఆనందమూ, గర్వమూ కలిగాయి.

    రాత్రి వెన్నెలలో Roof-garden లో భోంచేశాడు. సగం సగం బట్టల్ని ధరించి, ఉద్రేకపరిచే నాట్యాన్ని చూస్తూ బీరునీ వైన్ నీ తాగాడు. తూలుతూ గదిలోకి వచ్చాడు. కాలింగ్ బెల్ నొక్కాడు.

    "చిత్తం" అన్నాడు నౌకరు వచ్చి.

    "కావాలి" అన్నాడు శేషయ్య.

    "ఏమిటి సార్"

    "వాళ్ళు"

    "ఎవరు సార్"

    "పిల్లలు"

    కాసేపట్లో కృత్రిమమైన నవ్వుల్ని కురిపిస్తూన్న ఒక తైనాతీ వచ్చాడు. ఆల్బమ్ ఒకటి తీసి చూపించాడు. ఆశగా, ఆబగా అన్ని బొమ్మలు చూసి ఒక బొమ్మమీద వేలు పెట్టి "ఇది" అన్నాడు శేషయ్య.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.