Home » Komala Devi » Aardhana


                             
    తల్లి కేంచేయాలో తోచలేదు. పాపను అక్కున జేర్చుకుని తల నిమురుతూ అంది" "కల్యాణి ఒంట్లో కులాసాగా లేదని రాసింది. ఒంటరిగా ఎలా నిర్వాకం చేస్తుందో ఏమో!....ఇక్కడికి రమ్మనమని చెప్పు" "అలాగే వెళ్తున్నా నమ్మా -నాన్నా వెళ్తున్నాను.....తల్లీ తాతయ్య గారికి అమ్మమ్మకు నమస్కారం చెయ్యి." తల్లీ చెప్తుంటే పాప బుల్లిచేతులు జోడించింది. కూతురు చెబుతున్న తీరు తల్లికి మరింత బాధకల్గించింది. కోరికోరి వెళ్తున్నాను అంటోంది.
    కుమార్ మాత్రం మర్యాదకొద్దీ వెళ్ళొస్తానంటూ నమస్కరించాడు.
    "మీకు చాలా కృతజ్ఞులం - చాలా త్వరగా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీ దర్శనం?" తండ్రి ఆ విధంగా మాట్లాడుతుంటే మంజుకు ఆశ్చర్యంగా వుంది.
    "అమెరికానించి వచ్చిన తర్వాత అంటూ చేతులు జోడించి పైకి చూశాడు. భగవంతుడు చల్లగా చూస్తే అన్న భావన అతని ముఖంలో ప్రస్ఫుటమైంది.
    అందరు కార్లో ఎక్కారు.
    "మీ ఫీజు ఇచ్చుకోలేదు. ఇది వుంచండి. ఒక కవరు కుమార్ చేతిలో పెట్టబోయాడు. కుమార్ చెయ్యి వెనక్కు దీసుకొని. "నా విధి నేను నిర్వహించాను. ఇది ప్రైవేటు ప్రాక్టీసు కాదుగదా!" అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. వీళ్ళు నములుతూ మౌనం దాల్చాడు.
    టాక్సీ స్టార్ట్ అయింది.
    తండ్రి ఆఖరుక్షణంలో ఒక్కమారు కుమార్ తో కరస్పర్శచేసి వదిలాడు.
    "వెళ్ళొస్తాము - టాటా చెప్పు తల్లీ - జాగ్రత్తగా వెళ్ళండి- ఉత్తరం రాయండి" ఇత్యాది వీడ్కోలు మాటల్లో కారు ముందుకు సాగిపోయింది...
    విడువబడిన వాళ్ళిద్దరూ తదేకంగా టాక్సీ వెళ్ళిన దిక్కుకేసి చూస్తూ నుంచున్నారు, టాక్సీ మలుపు దిరిగింది, అదిరేపిన ఎర్రదుమ్ముమాత్రం రోడ్డంతా అలుముకుని వుంది. వారిహృదయాలు కూడా అట్లాగే ఉన్నాయి. వాళ్ళు వచ్చారు- వెళ్ళారు. కాని అంతా అసంతృప్తి - ఏదోబాధ. ఏదో వెలితి - దానికి కారకులెవరు? ఏమో- ఎవరో? వాళ్లిద్దరు ఎంతసేపో మెట్లమీదనే నుంచుండి పోయారు!

                             *    *    *

    ఆ వేళ విమానాశ్రయం కిటకిట లాడుతోంది. ఎక్కడ చూచినా మంజుల. కుమార్ ల శ్రేయోభిలాషులు, స్నేహ బృందమే కానవస్తున్నారు.
    కుమార్ పేరుపేరున కరచాలనం చేస్తూ వెళ్తున్నారు. ఖాన్, మూర్తి పూలమాలాలంకృతుడినిచేశారు. గాఢంగా ఆలింగనం చేసి కొన్నారు.
    సర్జన్ మాదప్ప అప్పుడే వచ్చారు, కుమార్ చేతిని తన రెండుచేతుల్లో గట్టిగా పట్టుకుని హేపీ లాండింగ్. అండ్ బెస్ట్ ఆఫ్ ఎవ్విరీ థింగ్" అన్నాడు.
    పాప లావణ్య ఏడ్పు మొదలెట్టింది మంజు దగ్గర కొచ్చాడు. ఆమె అశ్రుపూరిత విశాల నయ నాలను చూచి కుమార్ ఆమె చేతిని మృదువుగా తన చేతులోకి తీసికొని దైర్యం చెబుతున్నాడు. మంజు పెదాలపై మెరిసిన హాసరేఖ చూచి అతనికి ధైర్యం వచ్చింది, కొడుకులిద్ధర్ని ముద్దు పెట్టుకున్నాడు!
    టైం అయింది కుమార్ విమానం ఎక్కాడు.
    పాప ఏడ్పు మాని అంతా వింతగా చూస్తోంది.
    కల్యాణి చాటుగా కళ్ళు వత్తుకుంది.
    కుమార్ చేయివూపి తన సీట్ లో కెళ్ళి కూచున్నాడు.    
    విమానం రొదజేస్తూ మెల్లగా రన్ వేమీద పరిగిడుతోంది.
    మంజు హృదయం అంతకన్నా బిగ్గరగా రొద జేస్తోంది. సహింపలేని ఎడబాటుకు బాధగా మూల్గింది. దుఃఖంతో భారభరితమైన హృదయాన్ని చిక్కబట్టి సజలనేత్రాలతో పరుగిడు తున్న విమానంవైపే తదేకంగా చూస్తుండిపోయింది. కల్యాణి అక్కదగ్గరకు వచ్చి నుంచుంది.
    రానురాను విమానం దూరమౌతోంది శబ్దం వినిపించటంలేదు ఆ నీలాల నింగిలో చుక్కలా మారిన విమానాన్ని చూస్తూ మెలగా నిట్టూర్చింది.
    రఫీకా ఎత్తుకున్నబాబు ఏడుపు మొదలు పెట్టటంతో మంజుకు తన ఉనికి గుర్తొచ్చింది భర్తకు ప్రతి రూపమైన ఆ బిడ్డను అక్కున జేర్చుకుని మౌనంగా బైటికి నడిచింది. ఆమెతో అందరూ కదిలారు.
    ఒకవైపు రాఫీకా, ఒకవైపు కల్యాణి రాగా మంజు టాక్సీ ఎక్కింది. లావణ్య మూర్తి దగ్గర కూచుంది. మరొక బాబు ఖాన్ దగ్గరున్నాడు.
    అందరి దెస పరిశీలనగా చూచిందామె.
    తాము ఒంటరిగా లేరు. తమకు సుహ్రుత్కోటి వుండగా తనకీ భయం దేనికి మంజుకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.
    తను ఎప్పుడు కూడా ఎవరిచేత త్యజింపబడలేదు.
    తను సౌభాగ్యం కోసం తహతహ లాడే ఈ స్నేహబృందం- తమ సుఖాన్ని సర్వదా కాంక్షిస్తూ బహుముఖంగా తోడ్పడే వీళ్ళందరూ ఎంత? హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.
    హృదయాంతర్గతంగా వెల్లువలుగా వస్తున్న ఈ భావపరంపరల ధాటికి ఆమె విచలితయైంది.
    చెక్కిళ్ళు అశ్రుధారలచే తడిసినై. ఆమె తుడుచుకోడానికి ప్రయత్నించలేదు. పరధ్యానంగా దూరంగా దిగంతాల కవతలగా చూస్తుండి పోయింది. టాక్సీ కదిలింది.            
    ఇల్లు చేరగానే టెలిగ్రాం ఎదురు చూస్తోంది. ఆత్రంగా విప్పింది. అది తన తండ్రిగారి వద్ద నుంచి తన భర్తకు వచ్చిన శుభాశీస్సులు.
    కొన్ని వందల్లో ఇదొకటి-
    అతని చేతుల్లో స్వాస్థ్యత పొందిన రోగులకు అతను జ్ఞాపకం వున్నట్లే తన తండ్రికి కూడా డాక్టరుగా తన భర్త గుర్తున్నాడు.
    అంతే!
    మూడవనాటికి ఇంటినుంచి ఉత్తరమొచ్చింది.
    మంజు ఆశ్చర్యాని కంతులేదు. అందులో వ్రాయబడిన విషయం అలాంటిది.
    ".....నువ్వు వెళ్ళదలిస్తే మనవాళ్ళను, పాప లావణ్యను మాదగ్గర ఉంచుకుంటాము.....ఈ విషయంలో నువ్వు ఇతర ప్రయత్నాలేమీ చేయబోకు...."
    ఫ్యాన్ గాలికి చేతిలోని ఉత్తరం రెపరెప లాడుతోంది. ఆమె ఎటూ తేల్చుకోలేక సతమత మైంది. కేవలం మాటమాత్రంగా రాశారేమో. తను అంగీకరించదని విశ్వసిస్తున్నారేమో! లేక హృదయ పూర్వకంగా రాశారా?
    మంజు నిర్ణయించుకోలేక పోయింది.
    ఇదంతా కల్యాణి. అమ్మ చేసినపనే, నాన్నకు అంత విశాలహృదయంలేదు. అతడు శిస్తుడు. అంత త్వరలో మారలేడు.
    నెలరోజలనంతరం మంజు ఇంటికి వ్రాసింది. "....డాక్టరుగారు ఈ ఊరు వొదలక ముందే అన్ని ఏర్పాట్లు చేసి - మరీ వెళ్ళారు. అందులూక పొల్లు తప్పిపోవడానికి వీలులేదు? మీరు అన్యధా భావించకండి..."
    ఉత్తరం పోస్ట్ కు పంపి సుదీర్ఘంగా నిట్టూర్చింది.


                         -****సమాప్తం****-




Related Novels


Unnatha Sikaralu

Aardhana

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.