Home » Muppala Ranganayakamma » Krishnaveni



    నా గుండెలు బరువెక్కి పోతున్నాయి. కళ్ళ వెంట గిర్రున నీళ్ళు తిరిగాయి. - "నేను మాధవ్ ను మర్చిపోలేను శాంతా!" అన్నాను. శాంత ఎన్నిచెప్పినా మాధవ్ ని దూరం చేసుకోకూడదని మనసు ఘోషపెట్టింది.
    "పోనీ అన్నీ నిర్లక్ష్యం చేసి మొండిగా వెళ్ళిపోతావే అనుకో, కానీ అక్కడమాత్రం నీకు రక్షణ ఏది?"    
    "మాధవ్ నన్ను మోసం చెయ్యడు శాంతా!"
    "మాధవ్ మోసం చేస్తాడనికాదు, నే ననేది. మాధవ్ కే ఏమీ చెయ్యలేని పరిస్థితి సంభవిస్తుంది. కేసంటూ వస్తే వుద్యోగం వదులుకోవాల్సి వస్తుంది. ఆ ఆధారం లేకుండా బ్రతుకగలుగడానికివెనుక చిల్లిగవ్వ ఆస్తి లేదన్న సంగతి అందరికీ తెలుసు. నువ్వు వుద్యోగం చేసి సంపాదించటమో, లేకపోతే ఇద్దరూ కూలీ నాలీ చేసుకుంటు పాటలు పాడుకుంటూ బ్రతుకుదామనుకోడానికి ఇదేం సినిమా కాదు. నూరేళ్ళ జీవితం. పోనీ నిన్ను భార్యగా చెప్పుకోకుండా, ఏ బంధువుగానో చెప్పు కుని వుద్యోగం నిలుపుకోగలిగినా, అరుణ వల్ల నీకు గొడవ లేకుండా పోతుందని అనుకోలేం. ఒక ప్పుడున్న పెంకితనాలకూ, పట్టుదలలూ కలకాలం వుండిపోవు. అరుణలో మార్పు రావచ్చు. తనతప్పు కలుసుకుని పశ్చాత్తాపపడొచ్చు. మాధవ్ దగ్గర కొచ్చి క్షమించమని వేడుకోవచ్చు. ఎంతైనా మాధవ్ అరుణను అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకున్నాడు. అది మాధవ్ శాశ్వతంగా మర్చిపోలేడు. అరుణ కాళ్ళబడి మన్నించమని ప్రాధేయపడిన వాడు కాదని తిరస్కరించలేడు. ఒకవేళ తిరస్కరించినా, అరుణ వూరుకోలేదు. నిన్ను ప్రాధేయపడుతుంది దేవిరిస్తూంది. అప్పుడు.... ....."
    "అరుణలో అంత మార్పా?"
    "ఎందుకు రాకూడదూ? ఎంతటి మార్పు లైనా కాలమే తీసుకు వస్తుంది. అసలు అరుణ ఇప్పటికే మారివుంటూందని నా అనుమానం. అలా జరుగదని అనుకోకు. జరిగితే ఏం చేస్తావు?
    "ఇద్దరం వుండకూడదా?"
    శాంత ఆశ్చర్యపడింది - "ఎంత చిత్రంగా మారావ్ కృష్ణవేణీ! నీ మంచిచెడ్దలే నువ్వు ఆలోచించుకోలేనంత అసమర్ధురాలవై పోతావని ఎన్నడూ అనుకోలేకపోయాను. నా పెళ్ళికిముందు ఎన్నివిధాల చెప్పానో గుర్తుందా? ఇప్పుడు భార్య వున్న మనిషితో జీవితం గడపాలని నిర్ణయించుకున్నావు. బాగుపడాలనా? మూన్నాళ్ళ ముచ్చటతో చూసిపోవాలనా? ఆ సంసారంలో అరుణకూ నీకూ సాపత్యమా? అరుణ మాధవ్ భార్య. ఆ యింటి కోడలు - కానీ నువ్వెవరివి? ఆ యింట్లో నీ కున్న చోటేమిటి? ఆలోచించావా? మాధవ్ దయగా చూస్తే చూడొచ్చు, కానీ జీవితకాలం ఆ దయాదాక్షిణ్యాలకోసం దేవిరించాలి. ఎప్పుడే అవాంతరం వస్తుందోనని గడగడలాడాలి. అరుణ కున్న విలువా? అరుణకున్న అధికారం నీ కుంటా యా? ఒక యింటికి కోడలుగా - ఒక భర్తకు భార్యగా వుండవలసిన నీ కిదేం ఖర్మ కృష్ణ వేణీ! నిండు బ్రతుకంటే ఎన్ని సమస్యలెదురవుతాయో ఆలోచించావా? మాధవ్ ఇద్దరు భార్యల్నీ, వాళ్ళ సంతానాన్నీ పోషించుకోగల శక్తిగలవాడేనా? నీ బిడ్డలకూ, నీకూ ఎటువంటి భవిష్యత్తు వుంటుందో వూహించుకోలేవా? కృష్ణవేణీ! చాలా తొందర పడుతున్నావు. ప్రతివిషయాన్నీ నేను భయంకరంగా చిత్రిస్తున్నానని అనుకోకు. నీ నిర్ణయం నువ్వు మార్చుకోనినాడు నీ బ్రతుకును నువ్వే అశాంతిపాలు చేసుకున్నదానివి అవుతావు. అన్నీ నిర్లక్ష్యం చేసి వెడతావు. కానీ ఆ సంసారం నీ స్వంతం కాదు. ఆ మాధవ్ నీవాడు కాడు. దాంపత్యబంధాలంటూ-అనురాగమంటు ఎన్ని కబుర్లు చెప్పేదానివి? ఒక మనసు ఒక మనిషికే పరిమితం కావాలనీ, అప్పుడే ఆ రెండు బ్రతుకులూ సార్ధకమవుతాయనీ, .....ఏమిటేమిటో అనేదానివి. ఆ అభిప్రాయాలన్నీ మార్చుకున్నావా? ఏ మాశించి యింత సాహసానికి తెగించావు కృష్ణవేణీ!"
    నేను అయోమయంగా శాంత కళ్ళలోకి చూస్తూవుండిపోయాను. నేను చెయ్యాలనుకున్న పనిలో ఇంత వ్యవహారం ఇమిడి వుందని ఎన్నడూ అనుకోలేకపోయాను. శాంత చెప్తూన్న విషయాలు అతిశయోక్తులుకావు. నిండు బ్రతుకు నిర్ణయించుకుంటున్నప్పుడు మంచిచెడ్డలు ఆలోచించుకో గలగాలి. కాని మాధవ్! ఎలా మర్చిపోను? ఇన్నాళ స్నేహం - ఎలా ...?కళ్ళు చెమర్చాయి. నేల మీదికి చూపులు దించుకున్నాను.
    "పెంచుకున్న మమతల్ని మర్చిపోవాలంటే బాధగానే వుంటుంది కృష్ణవేణీ! కాని పరిస్థితులు కూడా ఆలోచించాలి. మనబ్రతుకుల్ని మన ఇష్టానుసారం సాగించుకోలేము. దాటలేని ఆటంకాలు ఎదురవుతాయి. తప్పనిసరిగా తల ఒంచాల్సి వస్తుంది. ఏం కృష్ణవేణీ? నేను చెప్పిన విషయాలు నీకు సమంజస మనిపించటం లేదా?"
    నేనేమీ మాట్లాడలేకపోయాను.
    శాంత కూడా వూరుకొంది.
    అంత వరకూ మవునంగా కూర్చున్న రేణు కలగజేసుకొని అంది - "శాంతా! మాధవ్ అరుణకి విడాకులిచ్చేస్తే ఏ గొడవా లేదుగా? ఇష్టంలేనివాడు ఇంకా ఆ ఆటంకం ఎందుకుంచుకోవాలి?" రేణు సలహా నాకేమంత తృప్తి అనిపించలేదు. అంతలో శాంత అంది -" తప్పు కదా రేణూ? కృష్ణవేణి అలానే అడిగితే దాని మాధవ్ అంగీకరించవచ్చు. కాని అది ధరమంటావా? అరుణ మూర్కంగానే ప్రవర్తించి దనుకుందాం - మనమూ ఆడవాళ్ళమే. తోట ఆడదానికి అన్యాయం చేసి సుఖపడబోయేదేమిటి ఏమో! సలహా మాత్రం నే సమర్ధించలేను."
    "అరుణకి అన్యాయం చెయ్యకూడదంటావ్ మాధవ్ పరిస్థితి ఆలోచించావా? అతని జీవితం అలా పపోవాల్సిందేనా? రేణుకెందుకింత దయగలిగిందో అర్ధం కాలేదు.
    "ఎవరి జీవితాలెవరు సరిదిద్దగలరు చెప్పు? అతన్ని వుద్దరించాలని అనుకొంటే మనం నవ్వుల పాలు కావాల్సి వస్తుంది." "కాని రఘుని చేసుకొనే ముందు నువ్వీ విషయం ఆలోచించావా? అతని జీవితం చక్కదిద్ధాలని ఎందుకంత ఆరాటపడ్డావ్?" నామాటల్లో ఏదో తీవ్రత నాకే ధ్వనించింది.
    "అది వేరు కృష్ణవేణీ! నన్ను పదిమందీ మెచ్చుకున్నారు గానీ హేళన చెయ్యలేదు. ఏం జరిగినా నాకెప్పుడూ లోకం సానుభూతి వుంటుంది. కాని నీ స్థితి అది కాదు. నీ మొహం మీదే నిన్ను ఎత్తి పొడుస్తారు. నవ్వులపాలు చేస్తారు. పదిమంది మధ్యా బ్రతికేవాళ్ళం. ఆ పదిమందికీ మనమీద సదభిప్రాయం లేకుండా బ్రతకలేం. ఒకరితో మనకి అవసరమేమిటి? అనుకుంటాం గానీ లోకం సానుభూతి వుండితీరాలి కృష్ణవేణీ!"
    ముగ్గురి మధ్యా మవునం రాజ్యం చేసింది. ఉన్నట్టుండి వెళ్తానని లేచాను.
    "ఏమిటి నిర్ణయించుకున్నావ్?" అంది శాంత. "నువ్వెన్నిచెప్పు శాంతా! నేను మాధవ్ ని దూరం చేసుకోలేను." అన్నాను దృఢంగా.
    "ఆవేశపడకు కృష్ణవేణీ! ఒంటరిగా సావధానంగా ఆలోచించి చూడు. నీకు అంతకుమించి ఏమీ చెప్పలేను. అదైనా స్నేహాన సాహసించగలిగాను-అమ్మనీ, నాన్ననీ నవ్వుల పాలు చెయ్యకు. నిన్ను ఎదటివాళ్ళు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకు. భవిష్యత్తులో విచారించవలసిన పరిస్థితి తెచ్చుకోకు,,,,,నిజానికి నేనే ఎంతో మొండితనం చేసి రఘుని పెళ్ళిచేసుకున్నాను. కొన్నాళ్ళకైనా పరిస్థితి చక్కబడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే జీవితమంతా కుళ్ళిపోయేదాన్ని. కాని అప్పుడు తొందరపడుతున్నానని తెలీలేదు- చెప్పినా విన్పించుకోలేదు. నువ్వు మాత్రం అలా చెయ్యకు. నీ పరిస్థితులు నీకు అర్ధం కాకపోవచ్చు, గానీ ఒడ్డున వుండి చూసే మాకు తెలుస్తుంది"
    అన్నిటికీ మౌనం వహించాను.

                            *    *    *

                    

    తలగడలో మొహం దాచుకొని బావురుమని ఏడిచాను. ఒక్కసారిగా శిఖరాలనుంచి జారిపోయి నట్టని పించింది. ఒంటరిగా సావధానంగా ఆలోచించమంది శాంత. శాంత దూరాలోచన కలది. నన్ను ప్రాణంలా ప్రేమిస్తుంది. నామంచికోరే చెప్పివుంటుంది. చిన్నతనం నుంచీ అది అంటే నాకు లక్ష్యం వుంది.
    శాంత దగ్గరకు వెళ్ళకుండా వుంటే బావుండిపోయేదనిపించింది. శాంతతో మాట్లాడక ముందు నాలో ఎంతో ధైర్యం. మాధవ్ దగ్గిరకు చేరిపోవాలన్నది ఒకటే కోరిక - మాధవ్ ని ద్వేషించే అరుణ ప్రసక్తి ఇక మాధవ్ జీవితంలో ఎన్నడూ రాదనీ అన్నయ్యని క్షమించగలిగిన అమ్మా నాన్నా కొన్నేళ్ళకైనా నన్నూ క్షమించి ఆదరిస్తారనీ-అవే నమ్మకాలతో ఇంత స్నేహాన్ని పెంచుకున్నాను. మాధవ్ నింత సన్నిహితం చేసుకున్నాను. కాని......అన్నిటినీ అపోహలుగా తుడిచి వేసింది శాంత. "అమ్మనీ నాన్ననీ నవ్వులపాలు చెయ్యకు - నిన్ను ఎదుటివాళ్ళు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకు - భవిష్యత్తులో విచారించవలసిన పరిస్థితి తెచ్చుకోకు."
    ఏం చెయ్యను ప్రభూ? ఇంతటి విషమస్థితి లో ఇరుక్కుంటానని ఒక్కనాడైనా అనుకోలేక పోయాను.
    అమ్మ ఎంతకుమిలి పోతుంది! నాన్నగారెంత సిగ్గుపడి పోతారు! అన్నయ్య మాత్రం ఎలా అసహ్యించుకొంటాడో! మచ్చ లేనికుటుంబానికి మచ్చదెచ్చి - కన్నవాళ్ళని నవ్వుల పాలుజేసి ఏమి సుఖపడిపోతాను? ఎలా సంతోషంగా వుంటాను.
    అదీ అనుమానపు బ్రతుకేగదా? మాధవ్ నిర్లక్ష్యం చెయ్యకపోవచ్చు. కానీ చుట్టూ సంభవించే పరిస్థితుల్ని ఎవరు చక్కబరచగలరు? లక్షాధికారిణీ - అందాల భరిణీ అరుణ తిరిగి మాధవ్ దగ్గరకు చేరటం నిజమే అయితే ఆ తర్వాత పరిస్థితులెలా మారుతాయో భగవంతుడి కొక్కడికే తెలియాలి - మాధవ్ నా స్వంతం కావాలి. ఆ సంసారం నాది కావాలి. అందులో మరో ఆడది చోటు చేసుకొంటే సహించ గలిగే శక్తి నాకు లేదు. ఒక ఇంటికి కోడలిగా - ఒక భర్తకి భార్యగా నేను తగనా? ఆ గౌరవం - ఆ అధికారం మాధవ్ సంసారంలో నేను పొందగలుగుతానా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. లోకం నన్ను ఇంటి ఇల్లాలిగా గౌరవించదు. అత్తగారు నన్ను కోడలిగా ప్రేమించదు. చట్టం నాకు తోటి స్త్రీలకు కల్పించే రక్షణ కల్పించదు. ఎవరికీ అక్కర లేనిదానినా నేను? ఇటు పుట్టింటి ఆధారాన్ని దూరం చేసుకొని, అటు ఆవ్యక్తినీ దగ్గిర చేసుకోలేకపోతే ఎందుకీ అర్ధంలేని కోరిక?




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.