Home » Dr C ANANDA RAMAM » Aparajitha



    దశాహ కర్మ కూడా గడిచిపోయింది. రావలసిన బంధువులంతా వచ్చి వెళ్ళి  పోయారు. అందరికీ రాధ చేతుల్లో ఉన్న పసిపాప పెద్ద ప్రశ్నార్ధకమే అయింది. ఎవరి ఊహాగానాల్లో వారుండి పోయారు. గట్టిగా తర్జన భర్జనలు చెయ్యడానికీ అభిప్రాయాలు వెలిబుచ్చడానికీ అది సరియైన సమయం కానందువల్ల రాధ బతికి పోయింది. రాజారావు రాధను కుశల ప్రశ్నలు మాత్రం వేసి ముక్తసరిగా ఉండిపోయాడు. పరమేశ్వరి తన సొంత బిడ్డను కర్మాంతరానికి వచ్చిన బంధువుల్లో ఒకరున్నట్లు గానే చూచింది తప్ప ఎటువంటి ఆత్మీయతా కనపర్చలేదు. రాధకీ వాతావరణమంతా కృత్రిమంగా ఊపిరి తీసుకోడానికీ బరువుగా ఉంది. ఇందరిలో ఒక్క మాధవే తన్ను ఆప్యాయంగా చూచుకొంటోంది, వీళ్ళంతా తన్ను వెలివేసినట్లు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? తాను పుట్టి పెరిగి అల్లరి చిల్లరిగా గంతులు పెట్టి ఆనందాన్ని పండించిన ఈ యిల్లే తన్ను నిలవనీయకుండా కసిగా తరిమి వేస్తున్న దెందుకానీ? మనుషులు నిజంగా విచిత్ర జంతువులు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఆప్యాయతలు వలకబోస్తూ తాము తప్పనుకున్నది కనపడ్డప్పుడు, ఆ మనిషినే ఆకులో పురుగులా విదిల్చి వేయగలుగుతున్నారు. ఒడ్డునుండగా చల్లగా హాయిగా కాళ్ళను తాకుతూ గిలిగింతలు పెట్టే తరంగాలు, లోతుకు దిగగానే కిందకీడ్చి ప్రాణాల్ని బలిదీసుకుంటున్నట్లే!-సంఘం నిజంగానే భయంకర మైంది. కల్లోల సముద్రం లాంటిది రాధ వెన్ను పాములో మొదటిసారి భయం జరజరా పాకినట్లయింది. ఇంతలో తన బేలతనానికి తానే నవ్వుకుని ధైర్యం తెచ్చుకుంది తర్వాత నాలుగు రోజులేనా ఉండకుండా హైదరాబాదుకు ప్రయాణం కట్టింది. పరమేశ్వరి వారించలేదు. తన తల్లి, ఇకముందు ఎక్కడ ఉండి ఎలా జీవితం గడపదలచుకున్నదో అడగడానికైనా సాహసం చాలలేదు రాధకు. పరమేశ్వరి ముఖం కావురు గమ్మిన అగ్ని కుండంలా ఉండి భయపెడుతుండేది. పైకి కనపడకపోయినా ఆవిడ లోపల రాజుకుంటున్న నిప్పు ముట్టుకుంటే మాడ్చేస్తుందన్న భయం! - 'అయినా మాధవి ఉండగా అమ్మకేం కొదవ?'- అనుకుంది రాధ. మాధవి స్పృహ తగల గానే చిత్రంగా ఈర్ష్య సన్నగా కదలాడుతుంది గుండెలో . 'తాను అనుభవించనిదీ, నేను అనుభవిస్తున్నదీ సుఖం ఏముంది? పై పెచ్చు తనకు స్వార్ధపరురాలనే ముద్ర మిగిలింది. తోటివాళ్ళ సానుభూతి లేకుండా పోయింది. మాధవికి సంఘం అండ ఉంది. తనకేం మిగిలిందని!'- ఈ జరుగుతున్న చరిత్ర, తన జీవితం సుఖమయ భవిష్యత్తుకు చేరుకోడానికి ఎంతవరకూ తోడ్పడుతుందో నిర్దారించుకోలేక అయోమయంలో పడిపోయింది రాధ.

                              *    *    *

    సుందర శర్మ మధుకు ఉద్యోగం ఇచ్చాడు. తల్లికీ తండ్రికి చెప్పి వచ్చి వరంగల్ లో కనుక్కుంటే రాధ లేదనీ హైదరాబాద్ లొ ఉద్యోగమేదో చేస్తోందనీ తెలిసింది. శివశాస్త్రి చనిపోయిన వార్తా, మాధవీ పరమేశ్వరీ ఇద్దరే ఉంటున్న వార్తా సేకరించాడు. శకుంతల వాళ్ళ దగ్గరే పెరుగుతోంది. నిజానికి వాళ్ళ వాటాలో ఉండి వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకున్న దోషానికి, తను వెళ్ళి పరమేశ్వరిని పలకరించ వలసిందే. కాని ఆ భావనే మధు గుండెల్లో చెప్పడానికి ఇదీ అని నిర్ణయించలేని భయాన్ని కలిగించింది. మాధవి తాననుకున్నట్లుగా బావ ఇంటికి వెళ్ళి పోలేదు. తనకోసం నిరీక్షిస్తున్నదా! తన మీద పెంచుకున్న ఆశల్ని తెంచుకోకుండా ఇంకా మమకారంతో ఎదురు చూస్తోందా? అదే నిజమైతే తానే మందభాగ్యుడు. ఏ మొహం పెట్టుకుని మాధవిని చూడగలడు తను! ఒకవేళ ఆ నిస్వార్ధజీవి ఎదురుగుండా నిలబడితే తన మనస్సెలా మారుతుందో తనకేం తెలుసు! ఇక ఈ జన్మలో ఆవిణ్ణి చూడడం సంభవం కాకూడదు- అని నిశ్చయించుకున్నాడు మధు. ఎవరికంటా పడకుండా తిన్నగా హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరిపోయాడు.
    రాధను కలుసుకోడానికి అతని మనసంతగా ఆతురత పడడంలేదు. ఎలా జరగాలో అలా జరుగుతుంది. రాధకు తానే కావలసివస్తే తమ యిద్దరి కలయికా విధి చేతనే కల్పింపబడుతుంది. రాధే తన్ను వెతుక్కుంటూ రావచ్చు. లేదా తనకే రాధ తటస్థ పడవచ్చు. వియోగాగ్నిలో కుమిలి పోతూ ప్రియురాలికోసం వేచి ఉన్న ప్రియుడి అవస్థలో ఉన్నాడా తను! ఇంతకూ ఎవరు తన ప్రియురాలు? మాధవిని తను చేరలేడు, రాధను హృదయ మంతా నింపుకుని కోరనూ లేడు. కాని రాధే తన భార్య. విధి నియమం అంత కఠినంగా ఉన్నట్లు తోచి శాపోహతుడిలా నీరసపడిపోయాడు మధు.
    ప్రెస్ లో పని చాలా ఎక్కువగా ఉంది. పని కూడా తనకు కొత్త కావడంవల్ల నానా హైరానా పడిపోతుండేవాడు మధు.
    ఆవేళ ప్రఖ్యాత రచయిత్రి రాధికారాణి సీరియల్ కథలో ఒక భాగం కంపోజ్ చెయ్యవలసి ఉంది. ముందు స్క్రిప్ట్ వోసారి చూచి, స్పేసింగ్ సర్దుకుని, కంపోజు చెయ్యడాని కివ్వమని శర్మ పని అప్పజెప్పి వెళ్ళాడు. స్క్రిప్ట్ చదవడం మొదలుపెట్టాడు మధు. అంతకు ముందు చాలా కథ జరిగిపోయింది. జరిగిన కథకని వ్రాసిపెట్టిన సూచిక చదివాడు. ఇద్దరు నాయికల మద్య ఒక్క నాయకుడు ఇరుక్కుని సతమత మౌతున్న కథలాగుంది. మధు పెదాలమీద అప్రయత్నంగా చిరునవ్వు తోచింది. ఆడవాళ్ళు కథలు రాస్తే ఇంతే. ఒక నాయకుడికి ఒకతే హీరోయిన్ ఉండడం వాళ్ళకు తృప్తిగా ఉండదు కాబోలు! సినిమాల్లో చూచే కష్టాలనీ, కన్నీళ్ళనూ, అందమైన హీరోలనూ మనసులో పెట్టుకుని కథలు నడుపుతారు; ఏ ప్రొడ్యూసరైనా తమ కథ సినిమా తియ్యకపోతాడా అన్న ఆశ కాబోలు!

                                    20

    కథ నడిచే తీరు బాగుంటుంది. అంతా పాత్రల మధ్య సంభాషణలుగానే కథను పొదిగి నడపడంవల్ల రచన పాఠకుడి ముక్కుకు తాడుపోసి చరచరా ముందుకు లాక్కుపోయే విధంగా ఉంది. శైలి, భాష బాగుంది. మధు తన్మయంగా చదవసాగాడు.
    ఒకచోట ఒకపాత్ర బహుశా రచయిత్రి దృష్టిలో అసలు హీరోయిన్ అంటోంది. 'చూడు శ్రీధర్! నన్ను నువ్వు మర్చిపోమ్మన్నా పోలేవు. ఇప్పుడు నాపట్ల నీ ప్రవర్తన నీమీద పెద్ద బాధ్యతనే మోపుతోంది. ఆ లక్ష్మి తోపాటు ఈ సుందరికి కూడా ఇక నీ హృదయంలో స్థానం ఇవ్వక తప్పదు!'
    మధు మనస్సు చళ్ళున కొరడాతో కొట్టినట్లయింది. ఎవరు? ఎవరీ రాధికా రాణి! తన రాధ కాదుకదా! ఎన్నాళ్ళ కిందటి మాటలివి! తమ జీవితంలో తానూ రాధా పాత్రలుగా మారి చెప్పుకున్న డైలాగులు కధల్లో కెక్కించే అవకాశం రాధకు తప్ప మరెవరికుంది!' - ఇకనొక్క క్షణం మధు మనస్సు స్థిరంగా ఉండలేకపోయింది. అక్కడున్న ఫైల్సన్నీ వెతుక్కుని మొత్తం కథంతా చదివాడు. ఆ శ్రీధర్ తనే రాధ రాసిన కధే ఇది. కాబట్టే శ్రీధర్ లక్ష్మి మీద ప్రేమను సుందరి మీదికి మళ్ళించుకున్నాడు చివరకు ఆవిడ లేందే బ్రతకలేననే స్థితికి వచ్చాడు. సుందరిని పెళ్ళి చేసుకున్నాడు. కధ చివర లక్ష్మి చచ్చిపోయింది. అనాలోచితంగా మధు మనస్సు వికలమైనట్లయిపోయింది- 'ఒద్దు! మాధవి చచ్చిపోదు. చచ్చిపో కూడదు. నలుగురికి నీడనిస్తూ పదిమందిని సేదదీర్చే పచ్చని చెట్టులాంటి మాధవి జీవితం మోడుబారి పోకూడదు: స్వార్ధ త్యాగంతో కలకలలాడుతూ పదికాలాల పాటు పచ్చగా బ్రతకాలి' అనుకున్నాడు మనస్పూర్తిగా.
    తర్వాత సుందర శర్మను కలుసుకున్నప్పుడు ఉత్కంఠను ఆపుకోలేకపోయాడు మధు. 'రాధికారాణి ఎవరండీ? మీకు తెలుసా?'
    ప్రఖ్యాత రచయిత లేవయ్యా. ఆవిడ రచనలంటే పడిచస్తారు జనం. తర తరాలుగా పురుషుల ఇనపహస్తాలలో స్త్రీ జాతి నలిగి నశించి పోతున్నదట కదూ! అందుకని వాళ్ళ ఉద్ధరణకి కంకణం కట్టుకుంది. మొగుళ్ళ కెదురు తిరగమనీ, వాళ్ళకు లొంగి అడుగులకు మడుగులొత్తద్దనీ చెప్తుంది.' కసిగా అన్నాడు సుందరశర్మ.
    'బలే వారండీ మీరు! ఈ జరుగుతున్న నవలలో ఆ ధోరణేం లేదే!'    'ఇదా! ఇందులో మరో సొంత ధోరణి ఉంది. గమనించావో లేదో ఇందులో! హీరో యిన్ ప్రేమించిన వాణ్ణి ఒద్దనుకుని బావతో లేచిపోవాలని చూస్తుంది. మరో హీరోయిన్ జబర్దస్తీగా పెళ్ళి కాకుండానే పిల్లన్ని కంటుంది. హీరోకే అనుకో! పైపెచ్చు అలా అనడం తప్పు కాదని ఆవేశంగా వాదిస్తుంది- ఉత్త ఆడరచన్లు. పైగా సంఘం దాని నియమాలూ, అన్నీ స్త్రీని నాశనం చెయ్యడానికి పురుషులు సృష్టించారని గోల పెడతారు.'
    'అయితే ఇటువంటివి జీవితంలో జరగవంటారా?' 'జరిగితే మాత్రం కథలు రాసుకోవాలేమిటి? ఆడవాళ్ళు తమ స్థానం ఎరిగి ఉన్నదానితో తృప్తి పడకూడదు కాబోలు! ఆఫీసులోల్లా, చదువుల్లో వాళ్ళే, చివరకు పత్రికల్లో కూడా వాళ్ళే నాయె- మా ఖర్మ ఎలా కాలిందంటే, వో ప్రఖ్యాత రచయిత్రి రచన లేకపోతే పేపర్లు చెల్లకుండా తిరిగి వచ్చేస్తయ్-'
    మధు నవ్వుకున్నాడు. 'అందుకే కాబోలు మహానుభావుడు ఆడపేర్లు కూడా పెట్టుకుని పత్రిక నింపుకుంటుంటాడు. పురాణ కాలంలో పురుషద్వేషుల్నెరుగుదుము గాని ఈ కాలాని కితగాడు స్త్రీ ద్వేషిగా వెలుస్తున్నాడు' అనుకున్నాడు. అంతతో ఊరుకోకుండా.

                                  




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.