Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    తలుపు చప్పుడైంది. పాట ఆపి, విశాల తలుపు తీసింది. ఎదురుగా చక్కని యువకుడు తీర్చిదిద్దిన మొహమూ, తెలివుితేటలయిన కళ్ళూ!

    "ఈ యింటివారున్నారా అండీ!"

    "యెవరూ!"

    "వెంకట్రామయ్యగారు"

    "వెంకట్రామయ్యగారా....వెంకట్రా... పెద్ద బొజ్జ.." విరగబడి నవ్వింది విశాల.

    అతను తెల్లబోయాడు. తేరుకొని, తిరిగి నవ్వాడు. విశాల నవ్వాపుకొని, కొంటెగా అంది "లేరండి" ఆ గొంతులో పిలుస్తోన్న వేయి చేతులు కనపడ్డాయి. ఆ యువకుడికి.

    "ఎక్కడుంటున్నారు? బస మార్చారా?" అన్నాడు.

    "అవును ప్రక్కవీధిలో వుంటున్నారు"

    అతను వెళ్ళలేదు. ఆమెకేసి తదేక ధ్యానంగా చూస్తున్నాడు. ఆమె సిగ్గుపడింది. కళ్ళు పైకెత్తి దింపింది. పెదవులు కదిలినై.

    అతడు నవ్వుతూ  "మళ్ళీ వస్తా- ష్!" అంటూ వెళ్ళిపోయాడు.

    విశాల జరిగిందంతా ఆలోచించింది. భయమూ, పశ్చాత్తాపమూ గుండెలో చిచ్చును రగులుకొలిపాయి. అద్దం ముందుకు వెళ్ళి కనురెప్పలు పైకెత్తి దింపింది. సరీగ్గా అదే అర్ధం. ఎంత వెధవపని! ఎంత ద్రోహం! "వాడు వస్తే రోకలితో తలమీద బాదుతా. పాపం, అందమైనవాడు. ,ఐతే మాత్రం వస్తే చంపేస్తా" అంటూ ఆమె తలుపులన్నీ గడియవేసింది.

    ఆకలి వేసింది. కడుపునిండా భోంచేసింది. పాందానులోంచి తమలపాకులు తీసి వేసుకొంది. లైట్లు ఆర్పింది. తిరిగి 'on' చేసింది. బొమ్మల పత్రిక తీసి చదవటం మొదలుపెట్టింది. కాని ఆమెలో భయం పోలేదు. వాడు వస్తాడేమో.....! కాని తలుపులన్నీ గడియ పెట్టింది కదూ!

    ఎనిమిది, తొమ్మిది.....పది ఐంది. వాడు రాడు అనుకుంది. తిరిగి వీధి తలుపు చూసి పడుకుంది. నిర్భయంగా కన్ను మూసింది. పెద్ద సముద్రంలో చిన్ననావ. దాంట్లో తానూ, భర్తా.......తుఫాను, నావ తలక్రిందులైంది. ఆ కలకి ఆమె అదిరిపడింది. కన్ను విప్పింది. ఎదురుగ్గా అతను..... నొక్కు నొక్కుల జుట్టూ సిల్కు లాల్చీ, చేతికి వాచీ....

    "ఎవరు నువ్వు. ఎలా వచ్చావు ఫో!" అని భయంతో అరిచింది.

    "భయమెందుకు , వెళ్ళక ఇక్కడుంటానా! దొడ్డితలుపు తీసివుంటే నువ్వెలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను విశాలా!" అన్నాడు బుజ్జగింపుగా.

    "వెళ్ళిపోండి! వెళ్ళిపోండి"

    "నువ్వెందుకు పిలిచావూ?"

    "పొండి, లేకపోతే అపాయం...... బుద్ది వుండనక్కర్లేదూ?"

    "తిట్టటానికా పిలుస్త? పోనీ వెళ్తాను" అంటూ ఆమెకేసి చూశాడు. ఆమె మాట్లాడలేదు. నవ్వుతో దగ్గరకు వెళ్లి భుజంమీద చేయి వేశాడు.

    "ఫో నీచుడా" అని అరిచింది. కాని ఆ స్పర్శ ఆమెలో తీవ్ర సంచలనం కలిగించింది. అతను చాతుర్యంతో ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు. ఆమె లొంగిపోయింది.
           
    ఉదయం లేచేటప్పటికి ఆమె హృదయం భారంగా తోచింది. ఒక విధమైన ఆవేదనతో, హంతకుడటివలె, తన్ని తానే చూసుకుని భయపడింది. ఆమె కళ్ళమ్మట, నీళ్ళు బొటబొట కారినై. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది.

    మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచింది. చాలా నీరసంగా బలహీనంగా మూల్గింది. ముందు రాత్రి సంగతి ఆమెకి జ్ఞప్తికి వచ్చింది. పాపభయమూ పశ్చాత్తాపమూ ఆమెను తిరిగి ఆవరించినై. ఆకలి మాట మరిచిపోయి ఏడుస్తూ పడుకుంది.

    "విశాలా!"

    ఆ పిలుపు విని ఉలిక్కిపడి లేచింది విశాల. భర్త ఎదురుగా నిప్పులు చిమ్మే కళ్ళతో నించొని ఉన్నాడు. విశాల కంగారుతో, అవమానంతో తడబడుతూ లేచింది. కాని కళ్ళు తిరిగి అతని పాదాల దగ్గిర పడిపోయింది.

    "క్షమించండి. నే తప్పు చేశాను శిక్షించండి. తెలియక -తెలియక చేశాను" దీనంగా కన్నీళ్ళతో అతని కాళ్ళు పట్టుకుంది. శాస్త్రి ఆమె జుట్టుపట్టుకుని వీధిలో కీడ్చివేశాడు. ఆమె 'క్షమించరూ!' అంటూ ఏడుస్తోంది. శాస్త్రి తలుపు గడియ వేశాడు.

                           *        *        *

    వారం రోజుల తరువాత శాస్త్రికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో

    "మరిచిపోయారా మీ గత జీవితాన్ని, ఎవరి జీవితంలో లేవు యీ తప్పులు?

    అయినా మిమ్మల్నే ప్రేమించాను. ఈ ఉత్తరం మీకు చేరేటప్పటికి గోదావరి తల్లి ఒడిలో వుంటాను. ఆ పవిత్ర జలం అనేకమంది పాపాలకు ఆశ్రయ మిచ్చింది. నాకున్నూ...."

    ఉత్తరం పట్టుకొన్న అతని చెయ్యి వణికింది.

                          (వాణి -25 ఆగస్టు, 1941)
                 
                                  *****************
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.