Home » Dr C ANANDA RAMAM » Aparajitha



    'లే, మాధవీ! ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది. ఇన్నాళ్ళూ నీ జీవితాన్నైనా చక్కదిద్దగలనేమో అన్న ఆశతో బ్రతుకుతుండేవాడిని. ఇప్పుడిక నాకదీ తీరిపోయింది. పోదాం పద!' అన్నాడు రాజారావు.
    మాధవి, ఆ గొంతులో ధ్వనించిన విషాదానికి భయపడి పోయింది. అతని వాలకం చూచి, దిగులుపడ్డది. మరో మాటా పలుకూ లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని అనుసరించింది. ఇంటికి చేరేసరికి శివశాస్త్రి పరిస్థితి ఏమీ బాగాలేదు.
    
                                 *    *    *

    మధు మరో వారంరోజులు నరహరి దగ్గరే ఉన్నాడు. అతనిలో ఉన్న జడత్వాన్ని పోగొట్టడానికీ విచారం మాయం చెయ్యడానికీ నరహరి ఎన్నివిధాలుగానో పాటుపడ్డాడు. ఒకరిని ప్రేమించి మరొక రిని వివాహం చేసుకుని సుఖంగా బ్రతుకు తున్న మనుషుల్ని ఎత్తి చూపుతూ, తనకు తెలిసిన గాధల నెన్నిటినో విసుగు లేకుండా చెప్పాడు. ఇంచుమించు ప్రతి సాయంత్రమూ నరహరి మిత్ర హృదయాన్ని మరల్చాలని చేసే ప్రయత్నం ముందు మధు కేవలం తటస్థంగా మిగిలిపోయేవాడు.
    'మధూ! ఇవ్వాళ మీ నాన్నగారి దగ్గర్నుండి ఉత్తరం వచ్చింది, అంటూ జేబులోనుండి కవరొకటి తీసిచ్చాడు ఆవేళ కాలేజినుండి వస్తూనే నరహరి.
    'నే నిక్కడున్నట్లు నువ్వు రాశావా?' ఆశ్చర్యంగా, జాబు అందుకుంటూ అడిగాడు మధు.
    'అవును-ఒరే, మనల్ని కన్నందుకు తల్లినీ తండ్రినీ సుఖపెట్టడం మన విధి. అది లేకపోగా అంతులేని దుఃఖాల పాలు చెయ్యడం క్షమించరాని నేరం. ఒక్కగా నొక్కబిడ్డవు. నీవు పరారీ అయి పోతే ముసలి మనస్సుల క్షోభ ఎలా ఉంటుందో కొంచెమైనా ఆలోచించుకో కుండా ఇలా ఉంటివి. నీవు ఇక్కడికి వచ్చినరోజే నాన్నగారికి వ్రాసేశాను. ముందా ఉత్తరం చదువుకో!'
    ఉత్తరం నరహరికి వ్రాసిందే, 'మధు మాకు ఒక్కగా నొక్కబిడ్డ నాయనా! మేం కుదిర్చిన సంబంధం ఇష్టం లేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అతని ఆంతర్యం మాకు చెప్పి ఉంటే ఈ పెళ్ళికి ప్రయత్నాలు చెయ్యకనే పోదుము. వాడు ఎవర్ని కట్టుకున్నా ఎక్కడ తిరిగినా సుఖంగా ఉండడమే మాకు కావలసింది. పెద్దతనంలో మాకు కడుపుకోత తెచ్చి మమ్మల్ని శిక్షించవద్దని నీ మిత్రుడికి చెప్తావనుకుంటాను. వాడికి మా ఆశీస్సులు.-'
    తండ్రికి తనమీద చాలకోపం వచ్చింది. నిష్టూరంగా ఉన్న ఆ ఉత్తరం మధు అంతర్గత చైతన్యాన్ని కదిలించి తల్లిదండ్రుల విచారవదనాల్ని కళ్ళముందు నిలిపింది. తన బ్రతుకుకు పరమార్ధ మేమిటో తనకే తెలియడంలేదు. ప్రేమించిన పిల్లను దూరం చేసుకున్నాడు. అనాలోచితంగా తొందరపడి మరో పిల్లతో తన జీవితానికి ముడి రచించుకున్నాడు. కన్నతల్లి కీ తండ్రికీ దుఃఖాన్ని మిగిల్చి ఇలా పారిపోయి వచ్చేశాడు. ఏమి సాధిద్దామని వచ్చినట్లు? జరుగుతున్న చరిత్రకు భయపడి వచ్చేశాడా? తను పారిపోయినంతమాత్రాన ఎక్కడిదక్కడ ఆగిపోతుందనుకున్నాడా? ఉత్త ఉష్ట్ర పక్షి తెలివి తనది. 'ఛ, ఇలా కాదు బ్రతకవలసింది. ఈ జీవితానికో గమ్యం ఉండాలి. చేసిన తప్పులు మన స్పూర్తిగా దిద్దుకునే నేర్పు అలవడాలి. నిండుగా మనిషిలా గుండె ధైర్యంతో ముందుకు సాగడం నేర్చుకోవాలి. కల లోంచి అప్పుడే లేచిన వాడికి మల్లేమధు,
    'నరహరి! రేపే ప్రయాణం కడ్తున్నాను. ఇన్నాళ్ళనుండీ నువ్వు చేసిన బోధల సారాంశం వంటపట్టినట్లే ఉంది' అన్నాడు.
    ఆ మాటలకు నరహరి మనస్సులో ఆనందమంతా ఒక్కసారిగా కళ్ళల్లో వెలిగింది.
    'ముందు ఇంటికి వెళ్ళు. అమ్మకూ నాన్నకూ కనపడి ఆ మీద నీ కార్యక్రమాన్ని నిర్ణయించుకో. ఇంతకీ నీ ఉద్యోగం నీకోసం ఇంకా ఇంకా ఉంటుందా? మళ్ళీ ప్రయత్నాలు మొదలెట్టుకోవల సిందేనా?'-
    'ఒద్దు పొమ్మని కాలదన్నిన వాళ్ళకోసం ఉద్యోగాలు పడిగాపులు కాసే కాలమా యిది? ఏదీ దొరక్కపోతే మా ఊళ్ళో సొంత సేద్యం ఉండనే ఉంది. నాన్న గారికి ఆసరా అవుతానన్న తృప్తన్నా మిగులుతుంది నాకు.'
    'ఎంత పిత్రుభక్తుడివిరా' పల్లెటూర్ని అంటిపెట్టుకుని సేద్యం చేసుకోడానికింకా చాలాకాలం ముందుందిగాని, నాదో సలహా విను! నీకు మన శర్మ జ్ఞాపకం ఉన్నాడా?'
    'ఏ శర్మ?'
    'నా క్లాస్ మేట్ సుందర శర్మ. నీకు జ్ఞాపకం లేదూ, ఎప్పుడూ నాకూడా తిరిగే వాడు!'
    'అవును నరహరీ! వాడు బ్రిలియంట్ గా ఉండే ఆడపిల్లలంటే కుళ్ళు కుంటుండేవాడు కదూ! వోసారి ఎవర్నో ఏడిపించబోయి ప్రిన్స్ పాల్ చేత వార్నింగిప్పించుకున్నాడు!
    'వాడే! ఆ హాబీ ఇప్పటికీ పోలేదులే. అది మరో అవతార మెత్తింది. వాడి పత్రికలో ఆడవాళ్ళను ఎగతాళి చేస్తూ అసూయ కుమ్మరించే ఆర్టికల్సన్నీ ఆడపేర్లూ మగపేర్లూ రకరకాలుగా పెట్టుకుంటూ వాడె రాసుకుంటుంటాడు. పత్రిక సర్కులేషన్ పెరగడానికి అది గూడా ఒక కారణం. ఇంతకూ వాడు నడిపే పత్రికే తెలుగుజ్యోతి, నువ్వు చూసే ఉంటావు - ఈ మధ్య నేను హైదరాబాదు పనిమీద వెళ్తే మాటల్లో మరో సబ్ ఎడిటర్ని కూడా వేసుకోవాల్సి వచ్చేట్టుందన్నాడు. పోనీ నువ్వెళ్ళ రాదూ?
    'నాకిస్తా డంటావా?'
    'ఎందు కివ్వడూ? తెలుగు సాహిత్య మంతా ఆ చివర్నుండి ఈ చివరదాకా ఔపోసన పట్టిన వాడివి, నీకంటే అర్హుడు వాడికి మాత్రం దొరకద్దూ! అయినా నేనూ ఉత్తరం వ్రాస్తాను - వెళ్ళి చూడు!'
    సరే నన్నాడు మధు.
    కొంతసేపు మిత్రులిద్దరూ మాటాపలుకూ లేకుండా ఆగిపోయారు. ఇంతలో అపర్ణ కాఫీ తెచ్చి యిచ్చింది. ఇద్దరి మనసు ల్లోనూ ఎన్నెన్నో మాట్లాడుకోవాలన్న కాంక్ష ఉంది. కానీ ఎలా మొదలు పెట్టాలో తెలీక ఇద్దరూ కాస్త సేపు మధనపడి పోయారు. చివరకు మధే అన్నాడు-
    'ఇక నన్నడగాల్సింది ఏమీ కనిపించ లేదా నరహరీ నీకు?'
    'ఎందుకు లేదూ! అసలు నువ్వు చెప్పవలసిందంతా అట్లానే ఉండిపోయింది. ప్రపంచంలో ఎటువంటి క్లిష్ట సమస్యల కైనా వోపిగ్గా వెతకితే వో పరిష్కార మార్గం దొరికి తీరుతుంది. ఇకముందు నీ జీవితాన్ని నడపదలుచుకున్న మార్గ మేమిటో తెలిస్తే నేను సంతోషిస్తాను. ఇంతవరకూ వో నిర్ణయానికి రాకపోతే తొందరేమీ లేదు వచ్చాకే వో ఉత్తరం వ్రాసి తెలియబర్చు.'
    'కొత్తగా ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయమంటూ ఏమీలేదు. నేను ప్రేమించిన మాధవి నా కందుతుందన్న ఆశ ఎటూ లేదు. ఈపాటికి ఆవిడ తన అక్క భర్తకు మరో భార్యగా, అక్కబిడ్డకు మరో తల్లిగా స్థిరపడడం జరిగినా జరిగి ఉండవచ్చు. ఆ ఉదారురాలికోసం నా జీవితాన్ని నాశనం చేసుకుని మజ్నూలా మారిపోవడం అవసరమా! అటువంటి అవసరం ఏమీ లేదని నీ జీవితం నాకు గుణపాఠం నేర్పుతోంది. అపర్ణ నిన్నెంతగా సుఖపెడుతోందీ నేను చూస్తున్నాను గతాన్ని మర్చిపోయి ఆవిడనే మనస్సునంతా నింపుకుని నీవెంత హాయిగా బ్రతుకుతున్నదీ గమనిస్తున్నాను. అదీకాక నేను రాధను ఒదులు కోవడానికి ఏమాత్రమూ వీలులేదు నరహరీ! ఆ అమ్మాయిపట్ల నా ప్రవర్తన కొండంత బాధ్యతను నామీదమోపుతోంది.'
    'ఒకవేళ మాధవిని నువ్వు సరిగా అర్ధం చేసుకోలేదేమో ఆవిడా నీకోసమే ఎదురు చూస్తూంటే ఏం నిశ్చయించుకుంటావు?'
    నిశ్చయాలకుగానీ, నిర్ణయాలకుగానీ, నాకో అవకాశమంటూ మిగిలింది గనకనా! నేను చేసిన పొరపాటువల్ల, రాధ తప్ప మరెవరైనా నా భార్య కావడం జరిగితే నాకు మనశ్శాంతి ఉండదు. రాధే నన్ను నిరసించి తన మార్గాన్ని తను నిర్ణయించుకుంటే అది వేరేమాట! అదీగాక ఇక్కడ నీకో విషయం స్పష్టంగా తెలియాలి. విశాలంగా దిక్కులకు  పరుచుకున్న చెట్టు, ఎండనంతా తాను భరిస్తూ తన్ను చేరిన వారికి చల్లని ఆశ్రయాన్నిచ్చి సేద తీరుస్తుంది. సరిగ్గా మాధవి అలాంటిదే. ఒకరికి సుఖాన్నందించే ప్రయత్నంలో తాను పడుతున్న కష్టాన్ని నవ్వుతూ భరించగల వోపిక ఆవిడసొత్తే తన ఆశ్రయం కిందికి వచ్చిన వ్యక్తులు ఎవరై ఉండాలనే జిజ్ఞాసకంటే, ఎంతగా తాను వాళ్ళను సుఖపెడుతున్నావనే అంచనాయే ఆవిడకు తృప్తి కలిగిస్తుంది. ఇంతకూ అటువంటి ఆశ్రయాన్ని పొంది అలసటెరగకుండా జీవితాంతమూ గడపగలిగే అదృష్టం నాకేలేదు-రాధ విషయం అలా కాదు ఉత్త ఉద్రేకపు ముగ్ధ మన స్ఫూర్తిగా ఒక వ్యక్తిని ప్రేమించగల గాఢ శీలత ఉంది. అతనికి ఆత్మార్పణ చేసుకోగల ఉదారతా ఉంది. కాని ఆ వ్యక్తికి లొంగి అతనిమీదే ఆధారపడే బలహీనత లేదు. ఇంత జరిగింతర్వాత కూడా రాధ, నేనూ లేకుండా, నా చేయూత అవసరం లేకుండానే తాననుకున్న విధంగా జీవితాన్ని మలుచుకోగలదు. ఈ సంధి కాలంలో జాగృత మవుతున్న అద్బుత శక్తికో ప్రతీక రాధ? తరతరాలుగా అధికారం నెరవడం మాత్రమే అలవాటు చేసుకున్న ఏ పురుషుడూ, రాధలో తాను కోరుకున్న భార్యను పొంది తృప్తిగా బ్రతక లేడు. విధి చిత్రంగా నా జీవితాన్ని అటువంటి స్త్రీ జీవితంలో ముడి వేస్తోంది మనస్పూర్తిగా ఆ విధివిలాసాన్ని శిరసావహిస్తాను. నా అదృష్టం ఎలా ఉంటుందో వేచి చూడవలసిందే' అన్నాడు మధు. నరహరి ఈ మాటలు విని, 'నీ నిర్ణయానికి నిన్ను ప్రశంసిస్తున్నాను మధూ! నీ జీవితం సుఖప్రదంగా సాగాలని కోరుకుంటున్నాను'-అని, 'అపర్ణా' అని కేకవేశాడు.
    అపర్ణ గాజులు గలగల లాడించుకుంటూ, ముఖాన్ని చిరునవ్వుతో వెలిగించుకుంటూ వచ్చింది.
    'వింటున్నావా? మీ మరిది నిర్ణయం? అన్నాడు నరహరి.
    'మీరు కట్టించిన ఈ రెండంగణాల మహాభవనంలో, గోడ కివతల మీరు మాట్లాడుకుంటుంటే, అవతల వద్దను కున్నా వినక తప్పుతుందా? అన్నీ వింటూనే ఉన్నాను'- అన్నది.
    'మరికనేం? హారతి పళ్ళెం పట్రా! మరిది పెళ్ళికొడుకై మారాలని కోరుకో' అంటూ గలగలా నవ్వాడు నరహరి.




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.