Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


 

   "రెండేసి రోజులు కూడు లేకండా వుండి పని నేర్చుకునేవాణ్ణి దోసకాయలు తినిబ్రతికే వాణ్ణి. మునసబుగారి యింటికి పది బిందెల నీళ్ళు మోసేవాణ్ణి. రాత్రీ పగలూ అనక, దెబ్బలు, చీవాట్లూ తింటూ ఈ వడ్రంగి పని నేర్చుకున్నాను. మరి యిప్పుడు మనతో సమానమైన వడ్రంగి యెవడంటాను? మునసబుగారికీ, జమీందారుగారికీ, కోట రామయ్యగారికి...."

    "మీరే చేసి ఇవ్వడం" అని పూర్తిచేశాడు వీరన్న. పనివాళ్ళందరూ తమ యజమాని ఉపన్యాసానికి తలలూవూపి  "సెభాష్" అన్నారు. బాబు మాత్రం అక్కడ వున్న పెద్ద పెద్ద దూలాల్నీ, రంపపుపొట్టు వాసననీ అమాయకంగా పడివున్న బల్లలూ -చెక్కలూ అతి విచిత్రంగా కుర్చీలు బీరువాలూ అయిపోయే మహత్తునీ వింతగా చూస్తూ నిలబడ్డాడు. గౌరీనాధం మాట్లాడుతూన్నంత సేపూ అందరూ పనులు మానేసి కులాసాలో కబుర్లలో పడ్డారు. గౌరీనాధం హెచ్చరించాడు. కాని పనివాళ్ళు వినిపించుకోలేదు. తాత మాత్రం కునుకుపాట్లు పడుతూనే చక్రం తిప్పేస్తున్నాడు. అతని చెయ్యి సంవత్సరాల అలవాటువల్ల తక్కిన దేహం నుంచి విడివడి ఒక ప్రత్యేక మనస్తత్వాన్ని అలవరచుకుంది. రాములు శ్రీరామనవమి ఉత్సవాలలో భోగం ఆటని వర్ణిస్తున్నాడు.
 
    "అబ్బో, అబ్బో, ఏం సోకు. ఏం  సోకురా, వాళ్ళకి. ఏం గుమాగా ఆడిందిరా. బుగ్గమీద యేలేసుకుని 'తూరుపు తెల్లారే నాసాఁయీ' అంటూ, ఏంసోకు.ఏం సోకు" గౌరీనాధం హెచ్చరిస్తుననా, రాములు తన ధోరణి మానలేదు. గౌరీనాధం ఉగ్రుడైపోయి సుత్తిపట్టుకుని కేకలు వేస్తూ రాములు తలమీద కొట్టబోయాడు. రాములు తప్పుకోపోతే తల పగిలిపోయి ఉండును.


    గౌరీనాదం కార్ఖానా చాలా పెద్దది. ఇప్పుడు ఆ వూరికి దూరంగా ఉండే పెద్ద మైదానంలో కట్టే మిలటరీ పనులకు యితను వడ్రంగి. కంట్రాక్టు పద్దతిమీద పని సాగుతోంది. తాపీ పనివాళ్లూ, వడ్రంగులూ, యితర కూలీలూ అక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని కుటుంబాలతో ఉంటున్నారు. ఈ మిలటరీ నిర్మాణం సగంలో ఆపివేశారన్న విషయం ఈ కథకి ప్రస్తుతం కాదు.

     "ఇంటికి పోదాం పద" అన్నాడు గౌరీనాధం బాబుతో, బాబు చేత్తో చిన్న మూట పట్టుకుని వెనకాలే వెళ్ళాడు. ఒకే సైజులో వరుసగా గుడిసెలు తీర్చివున్నాయి. చూరుల్లోంచి దీపం వెలుతురు యివతల నేలమీద సన్నంగా సాచుకొని పడుతోంది. గుడిసెల వెనకాల ఉన్న పెద్ద తుమ్మలబీడు చీకట్లో చీకటిలా భయంకరంగా ఉంది.

    "ఈ కుర్రాణ్ణి పనిలో చేర్చుకున్నాను. వీడికి తిండి పెట్టు" అని గౌరీనాధం భార్యతో చెప్పాడు. బాబు భోజనంచేసి మూట తలకింద పెట్టుకుని ఒక మూల పడుకున్నాడు. అలసిపోయిన అతని దేహం విశ్రాంతిని కోరుతుంది. ఇంతలోకి గౌరీనాధం చిన్నకూతురు గంగి అక్కడికి వచ్చింది. బాబు మొహం పరీక్షించి యిలా అంది.

    "నువ్వు దిక్కులేనోడివి కదూ?"

    "ఆఁ" అన్నాడు బాబు గర్వంగా.

    "మరి నీ జుత్తు దువ్వుకోలేదేం!"

    "నా యిట్టం"

    "అదేంటి -అంత వణ్ణం తినేశావ్. గేదలాగ. ఎంత తినేశావో."

    "ఆకలేసింది. పొద్దుట కూడు తినలేదు" అన్నాడు బాబు. అతను ఆవులించాడు.

    "నా దగ్గర ఎన్నో గమ్మత్తులున్నాయి. నీకు చూపించనులే" అంది గంగి మూతి ముడుచుకుని.

    "ఉఁ"

    "అప్పుడే నిదరేంటి - ఛా!"

    "పో పో నంజా నాకు నిధరొత్తుంటే" బాబు నిద్రపోయాడు.

    గంగి అలాగే కూచుని కబుర్లుచెప్పి చివరికి విసుగెత్తి వెళ్ళిపోయింది.

                                          2

    బాబుకి వడ్రంగంపని ఏమీ చాతవడంలేదు. గౌరీనాధం తిట్టిపోస్తున్నాడు. అన్నిటికన్నా కొలిమితిత్తి వీరన్న కూడా అదమాయించడం బాబుకి ఏమీ బాగాలేదు. కార్ఖానాలో ఉన్నంతసేపూ బాబుకి గంగి చూపెట్టిన సంగీతపు పెట్టెమీదనే దృష్టి వుంది. అది నోట్ల పెట్టుకుని వూదితే, రకరకాల స్వరాలతో బలేగా మోగుతుంది.,

    "ఎక్కడ కొన్నావు నువ్వు" అన్నాడు గంగితో.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.