Home » Dr C ANANDA RAMAM » Aparajitha



    పరమేశ్వరి భోజనానికి పిలవటంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు.

                                                   *    *    *

    మరో మూడు నెలలు గడిచాయి. మాధవికి ఆ మూడు నెలలకాలం నడకా, బరువు నెత్తి కెత్తుకున్నా చీమ నడకలా అనిపించింది. రాత్రింబవళ్ళు రచనా వ్యాసంగంలో నిమగ్నమైన రాధకు 'ఇంత త్వరగా రోజులు దొర్లిపోతున్నాయ్' అనిపించింది.
    ఆరోజు ఆదివారం. మాధవీ, రాధా, ఒకే సారి భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా రాధ లేచి బాత్ రూంలోకి పరుగెత్తింది. ఆమె వెనకే అర్ధంకాని మాధవీ ఆదుర్దాగా వెళ్ళింది. వాంతి చేసుకుంటున్న రాధ తలను మాధవి రెండు చేతులతో పట్టుకొంది.
    "ఏమయిందమ్మా!" మాధవి రాధను లోపలకు తీసుకు వస్తూ వుండే పరమేశ్వరి ప్రశ్నించింది ఆదుర్దాగా.
    "భయం లేదులే. రాత్రంతా నిద్రలేకుండా రాస్తూ కూర్చొని ఉండి ఉండేది. పైత్యం ఉంటుంది. వాంతి చేసుకొంది." అంది మాధవి.
    రాధ మంచంమీద పడుతూనే కొట్టేసి నట్లు సొమ్మసిల్లి పడుకుంది. మాధవి రాధను పరిశీలించి చూసింది. ఏదో భావం లీలగా తోచి కంపించిపోయింది మాధవి.
    ఏమిటి తను వూహిస్తుంది నిజమేనా? రాధ అందువల్లనే అంత ముభావంగా బయట ముఖం కూడా చూడకుండా ఉంటోందా! అవును! రాధ రూపంలో కూడా మార్పు వుంది. ఇంతవరకూ ఎవరూ గమనించనేలేదు.
    మాధవి మనస్సు చీదర చీదరగా వుంది. ఎలాగో రెండు ముద్దలు తిని రాధ గదిలోకి వచ్చింది. గాఢ నిద్రలోవున్న రాధను లేపటం ఇష్టంలేక అక్కడనుంచి వెళ్ళిపోయింది.
    ఆ పడుకోవటం రాధ సాయంత్రం ఆయిదు గంటలకుకాని లేవలేదు. ముఖం కడుక్కొని చల్లగాలికి రాధ డాబా మీదకు వెళ్ళింది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న మాధవి కూడా రాధ వెనకే డాబామీదకు వెళ్ళింది.
    మాధవి వెళ్ళేప్పటికి రాధ డాబా పిట్టగోడ మీద కూర్చుని వుంది. ఆమె చూపులు కళ్ళముందున్న గాడాంధకారాన్ని చీల్చుకుంటూ ఏదో వెలుగును చూట్టానికి ప్రయత్నిస్తున్నట్టున్నాయి. మాధవి రాధకు ఎదురుగా పిట్టగోడమీద కూర్చొని ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసింది. రాధ ముఖం కొంచెంగా ఉబ్బివుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తన ముఖంలోకి జాలిగా చూస్తున్న మాధవిని చూసి "ఏమిటక్కా అలా చూస్తున్నావు?" అంది రాధ. రాధ స్వరంలో ఎంతో అలసట కనిపిస్తుంది.
    "ఎన్నో నెల?" మాధవి రాధ ముఖంలోకి గుచ్చి చూస్తూ దృఢంగా అడిగింది.
    అనుకోకుండా వచ్చిన ప్రశ్నకి రాధ తడబాటు చెందలేదు. "మూడు" అంటూ తాపీగా జవాబిచ్చింది. మాధవి కళ్ళు పెద్దవి చేసుకొని రాధ ముఖంలోకి చూసింది. రాధ అంత సూటిగా, అంత త్వరగా తన ప్రశ్నకు జవాబిస్తుందని మాధవి ఆశించలేదు. రాధ మీద కోపం వచ్చింది. ఇంతకు తెగించి, ఎంత నిబ్బరంగా ఉందో! కుటుంబం ఎలా తలెత్తుకొని నిలబడుతుందనుకుంటుందో! ఇంత కళంకాన్ని ముఖానికి పులుముకోని లోకంలో ఎలా తలెత్తుకోని తిరగ గలదో! ఏమిటా ధీమా! ధైర్యం!
    "ఎంత పనిచేశావు రాధా!" అని మాత్రమే అనగల్గింది మాధవి.
    రాధ మౌనంగా ఉండిపోయింది.
    "ఇంతకాలం ఎందుకు వూరుకున్నావ్? నాకైనా చెప్పి ఉండవచ్చుగా? పద బయలు దేరి వెళదాం" అంటూ లేచి నిలబడింది మాధవి.
    "ఎక్కడకు?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాధ.
    "లేడీ డాక్టరుదగ్గరికి!" కాస్త విసుగ్గా వుంది మాధవి స్వరం.
    "ఎందుకూ?" నిర్లక్ష్యంగా అడిగింది రాధ. మాధవికి నిజంగానే కోపం వచ్చింది. "ఎందుకేమిటి! ఆమాత్రం వూహించలేవూ!" అంది విసురుగా.
    "వూహించాను కనుకనే ఎందుకంటున్నాను."
    మాధవికి మతిపోయినంత పనయింది. వెర్రిగా చూస్తూ వుండిపోయింది. రాధ తల తిప్పుకొని వీధిలోకి చూడసాగింది.
    "మధు తిరిగి వస్తున్నాడా?"
    "తెలియదు."
    "మరి! నువ్వు ఇలాగే ఉండి ఏం చెయ్యాలని?" మాధవి అయోమయంగా ప్రశ్నించింది.
    "ఆ విషయం ఇంకా ఆలోచించలేదు"
    "అందుకే డాక్టరు దగ్గరకు రమ్మంటున్నాను."
    "లోకానికి భయపడి భ్రూణ హత్య చేసేంతటి పిరికిపందనుకాను" అంది రాధ విసురుగా.
    "అందుకని. ..అమ్మా నాన్నకు తెలిస్తే ఇంకేమయినా వుందా?"
    "నన్ను ఇంట్లోనుంచి తరిమేస్తారు. అంతేగా. నెలరోజుల నుంచీ ఆ అనుమానం మెదిలి, నేను ఉద్యోగం చూసుకున్నాను. రేపే జాయిన్ కాబోతున్నాను."
    'ఎక్కడ? ఏ ఉద్యోగం!'
    "ఈ ఊళ్ళోనే ఒక పత్రికాఫీసులో."
    "రాధా! పిచ్చిదానిలా ప్రవర్తించకు. సంఘం నిన్ను ఈ పరిస్థితిలో గౌరవంగా బ్రతకనివ్వదు. నీవల్ల మే మందరం తలలు వంచుకొని నడిచే దుస్థితికి కుటుంబాన్ని తీసుకెళ్ళకు."
    "నేను చేసిన పనికి మీకు తలెత్తుకు తిరిగే ధైర్యం లేకపోతే అది మీ కర్మ. నేను తలెత్తుకొని తిరగ్గలను. నేను చేసింది ప్రకృతికి విరుద్ధమైన పనికాదు. మధును నేను ప్రేమించాను. మధు ప్రతి రూపం నాలో జీవం పోసుకొంటోంది. దాన్ని నేను చేజేతులా నాశనం చేసుకోలేను" అంది రాధ కొంచెం గా వణుకుతున్న కంఠంతో.
    'పోనియ్ ఒకటి చేద్దాం. మధు వాళ్ళ ఇంటికి వెళదాం. విషయం చెబుదాం. వాళ్ళు నిన్ను కోడలుగా స్వీకరిస్తే..."
    "ఎంత పిచ్చిదానివి మాధవీ! వాళ్ళు స్వీకరిస్తారా? అయినా అలా వెళ్ళి వాళ్ళను ప్రాధేయపడటం, వాళ్ళచేత నానా మాటలూ పడి బయటకు నెట్టించుకోవటం నేను చెయ్యలేని పని. నా ఇష్టంతోనే నన్ను నేను మధుకు సమర్పించుకున్నాను. మధు నన్ను ప్రేమించటం లేదు. ఈ సాకుతో బలవంతంగా మధు ఇంట్లో స్థానాన్ని సంపాదించుకోవటం నాకు ఇష్టం లేదు." అంది రాధ దృఢంగా.
    "అన్నిటికీ అన్ని చెబుతావు? పెళ్ళి కాని తల్లుల్ని ఈ సంఘం స్వీకరించదు. ఎన్ని కష్టాలు ఎంత తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వుంటుందో నీకు అర్ధం కావడం లేదు." అంది మాధవి దిగులుగా.
    "నాకు తెలియక కాదు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. సంఘం అంటే నాకు భయంలేదు. వ్యక్తుల సుఖాన్ని దృష్టిలో వుంచుకొనే సంఘం ఏర్పడింది. అలాంటి సంఘం వ్యక్తుల జీవితాల్నీ, సుఖాన్ని బలిచేస్తుంటే, ఆ సంఘంతో నాకు పనిలేదు. ఒకనాడు విధవావివాహాలను కూడా సంఘం ఇంతగానూ ప్రతిఘటించింది. మొదట విధవా వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కోన్నారు. ఈనాడు అలాంటివి చూట్టానికి అలవాటు పడ్డ సంఘం విధవా వివాహాలను గురించి అట్టే పట్టించు కోవటం లేదు. ఎవరో కొందరు ధైర్యం చేసి, సంఘం అందించి హాలాహలాన్ని మ్రింగి తేనే కాని ముందు ముందు వివాహం కాని తల్లుల్ని అంగీకరించదు. వివాహం అంటే ఏమిటి? నాకు మధుతో వివాహం అయిందని నేను అనుకొంటున్నాను. మధునే నా భర్తగా స్వీకరించాను. జీవితాంతం మధునే నా భర్తగా, అతను నన్ను స్వీకరించినా, లేకపోయినా, ఆరాధిస్తాను, దానికి సంఘం ఇచ్చే సర్టిఫికేట్ నాకు అక్కర్లేదు" ఉద్రేకం రాధ కంఠం నుంచి మాటల్ని పెగల నివ్వలేదు.
    "నువ్వు...... అంటే..... బిడ్డను కనిపెంచుకుంటావా?" మాధవి ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
    "ఎందుకంత ఆశ్చర్యం? నేను బిడ్డను కని ధైర్యంగా పెంచుకుంటాను. మాతృత్వం ధరించడం స్త్రీకి గర్వకారణం. అందులో సిగ్గు పడాల్సిందేమీ నాకు కన్పించలేదు.' అంది రాధ నిశ్చలంగా.
    ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు రాధా?"
    "సిగ్గా! ఎందుకు? సిగ్గుపడే పనులు నేనేమీ చెయ్యలేదు. ఒకర్ని ప్రేమించి మరొకర్ని వివాహం ఆడటానికి సిద్ధపడలేదే! నేను మనసారా ప్రేమించిన వ్యక్తిని నేను భర్తగా స్వీకరించాను అందుకు నేను గర్విస్తున్నాను. ఏనాటి కయినా మధు తిరిగి వస్తాడని నాకు నమ్మకం వుంది రాకపోయినా అతడే నా భర్త అనుకోవడానికి నా అంత రంగం సంశయించదు.
    "రాధా! నా మాట విను! కుటుంబానికి కళంకం తేకు. పోనియ్ ఒకటి చేద్దాం! ఇలాంటి వాళ్ళకోసం కొన్ని గృహాలు నడవబడుతున్నాయ్! హైదరాబాద్ లోనే వున్నాయ్! రహస్యంగా కొంతకాలం అందులో వుండు. ఏదో ట్రైనింగ్ క' ఏ మద్రాసో వెళ్ళినట్లు చెప్పవచ్చు."
    "బాగుంది. తర్వాత?"
    రాధ స్వరంలోని వ్యంగ్యాన్ని అర్ధం చేసుకొని మాధవి చెప్పుకు పోసాగింది.
    "బిడ్డ పుట్టాక ఏ అనాథ శరణాలయంలోనో ఉంచుదాం. ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ఉండిపోవాలి. అప్పుడప్పుడు పిల్లవాణ్ణి వెళ్ళి చూస్తూ ఉండవచ్చు. మధు తిరిగివచ్చి, నిన్ను స్వీకరిస్తే పిల్లవాణ్ణి తెచ్చుకోవచ్చును."
    "ఒకవేళ మధు తిరిగి రాకపోతే?" రాధ రెట్టించింది.
    "తిరిగి రాకపోతే కొంతకాలం పోయాక అనాథాశ్రమం నుంచి ఎవర్నో పెంచుకోవటానికి తెచ్చుకున్నట్లు చెప్పి వాడినే తెచ్చి పెంచుకోవచ్చు."
    "నా పిల్లవాణ్ణి నేను అనాథ పిల్లవాడని చెప్పి పెంచుకోవటమా? అప్పుడు మాత్రం లోకం వదిలేస్తుందా ఎన్నో రకాల పుకార్లు పుట్టవా?"
    "నా మాట విను రాధా!" మాధవి రాధ రెండు చేతులూ పట్టుకొంది.
    రాధ అదోలా, విజ్ఞాని అజ్ఞానిని చూసి నవ్వినట్లు నవ్వింది.
    "నన్నూ, నా ఆశయాలను అర్ధం చేసుకోవాలంటే నువ్వు ఇంకా పెరగాలి మాధవీ! నా నిర్ణయానికి తిరుగులేదు. ఇల్లు కూడా దొరికింది. రేపే వెళ్ళిపోతున్నాను. అమ్మా, నాన్నా, ఎటూ ఇక నా ముఖం చూడరు నీకు ధైర్యం వుంటే, నన్ను నీ చెల్లెలుగా చెప్పుకొనే సాహసం వుంటే ఎప్పుడైనా వస్తూ వుండు!" అంటూ మాధవి జవాబుకి ఎదురు చూడకుండా లేచి క్రిందకు వెళ్ళి పోయింది రాధ.
    మాధవి రాధ వెళ్ళిన వైపే పిచ్చిచూపులు చూస్తూ కూర్చుండిపోయింది.

                                         *               *          *
                            (నాలుగవ భాగం ప్రారంభం, రచయిత్రి శ్రీమతి నాయని కృష్ణకుమారి)




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.