Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
           
                                      2

    రెండు రోజుల్నుండి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళడం మానేశాడు. అతని చిన్న కొడుక్కి జబ్బు చేసింది. ప్రమాదకరమైన జబ్బు చేసింది. వాంతులూ, విరేచనాలూ...... తిరిగి తిరిగి వచ్చిన తనకీ విషయం తెలియదు. కాళ్లూ చేతులు చల్లబడిన పిల్లవాణ్ణి జయ ఆస్పత్రికి తీసుకు వెళ్ళింది. భార్య నడవలో పడుకొని వుంది. ఆమె ఏడుస్తోంది కాబోలు తనకు తెలియదు. వెళుతూనే "ఎక్కడైనా బియ్యం దొరికాయా ఆకలౌతోంది అన్నం పెట్టు" అన్నాడు. ఈ మధ్య ఎప్పుడూ అతను అన్నం పెట్టమని అడగలేదు. ఎవరైనా వచ్చి తినమంటే తినేవాడు. లేనిదే అందరూ యింట్లో పస్తు అని గ్రహించి నోరు మూసుకొని పడుండేవాడు. అలాంటిది ఈవేళ ఎప్పటి చేతకానితనంతో చావు బతుకులలో ఉన్న కొడుకుకోసం ఘూర్ణిల్లే ఆమె దగ్గరకి వెళ్ళి కులాసాగా "అన్నం పెడతావా" అన్నాడు. ఆమె చటుక్కున ఉగ్రరూపంతో లేచింది. విడిపోయిన జుట్టుతో జ్వలించే కళ్ళతో  "ఛా పశువా" అని అరిచింది. అరుస్తూనే పక్కన ఉన్న చెంబును తనమీదికి బలంకొద్దీ విసిరింది. చెంబును తనమీదికి బలంకొద్దీ విసిరింది. చెంబు గురితప్పి తలుపును తగిలి పిడుగు పాటంత చప్పుడయింది. అతను స్తంభించిపోయాడు. ఏమీ అర్ధంకాలేదు. ఆమె నిలువెత్తునా నేలమీద దొర్లుతూ  "కొడుకో" అని మొత్తుకుంటోంది. కొడుకు పోయాడా! అతనికి భయమేసింది. ఇంటిల్లిపాదీ తనచుట్టూ మూగి "నువ్వే హంతకుడివి" అని అరుస్తున్నట్టనిపించింది. పోలీసులు వచ్చి తనని జైలుకు లాక్కువెళుతూన్నట్టు అనిపించింది. అతను గబగబా యింట్లోంచి వెళ్ళిపోయాడు.

    ఎక్కడనుంచో ఎవరినుంచో అతనికి తప్పించుకు పారిపోవాలనిపించింది. ఆ రాత్రి అంతా వీధులన్నీ తిరుగుతూ ఇక్కడా అక్కడా కూర్చుంటూ కాలం గడిపాడు. ఎక్కడికి పారిపోవడం? ఎవరినుంచి? అని ప్రశ్నించుకున్నాడు. అతనికి మెరుపులా జవాబు తట్టింది. తననుంచి తన బతుకు నుంచి. అంతకన్న మార్గంలేదు. మృత్యువే శరణ్యం. అదే అతనికి శాంతినిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది. సత్రం అరుగుమీదికి వెళ్ళి పడుకున్నాడు. ఎలా చావాలో, ఎప్పుడు చావాలో నిశ్చయించుకున్నాడు. తనుగాని తన కుటుంబంగాని ఇక బతకలేదు. బతికే మార్గంలేదు. తానేం చేయలేడని ఇదివరకే రుజువైంది. తనంత వెధవ బతుకు బతికి లాభంలేదు. తర్వాత రోజున రైలుకింద తలపెట్టడమే మార్గం అనుకున్నాడు. ఎలా చావాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు.

    బాగా ఎండ మీదపడుతుంటే వెంకటేశ్వర్లుకి మెలుకువ వచ్చింది. ముష్టివాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ కుండలు ఎండలో నల్లగా మెరుస్తున్నాయి. వెంకటేశ్వర్లు ఒకసారి తన పెళ్ళాన్నీ, పిల్లల్నీ చూడాలనుకున్నాడు. తన వీధి మొగవరకు వెళ్ళాడు. అతనికి దైర్యం చాలలేదు. అతనికి భార్య లోపలికి రానివ్వదేమో! మళ్ళీ ఏవిఁటి ఈ మమకారం? తన యింటిపక్క వాళ్లబ్బాయి వస్తున్నాడు. వాణ్ణి ఆపి "ఏరా మా చిన్నబ్బాయికి జబ్బు చేసిందట. బతికాడా చచ్చిపోయాడా" అన్నాడు.
 
    "బతికాడు. నిన్న సాయంత్రం ఆస్పత్రినుంచి తీసుకొచ్చారు" అంటూ వెళ్ళిపోయాడు. "పోన్లే" అనుకుని వెనక్కి తిరిగాడు. మళ్ళీ సత్రం అరుగుమీదికి వచ్చాడు. అతనికి తన చిన్నతనం అంతా జ్ఞాపకం వచ్చింది. తనకి కాస్త దెబ్బ తగిలినా, జబ్బుచేసినా తల్లిచేసే ఆర్భాటం, ఆదరం, లాలనా అన్నీ జ్ఞాపకం వొచ్చాయి. ఇప్పుడెవరున్నారతనికి.  "ఏం వెంకటేశ్వర్లూ ఇలా ఉన్నావేం మొహం అలా మాడిపోయిందేం. నాన్నా యీ పాలు తాగు" అని ఎవరంటారు. అతని కేడుపు వచ్చింది. చచ్చిపోదామనుకున్న వెంకటేశ్వర్లు ఆఖరిసారిగా తనమీద తను జాలిపడి ఏంతోసేపు ఏడ్చాడు. మధ్యాహ్నం సత్రం గుమాస్తా వీధిలోకి వెళుతూ తన కిచ్చిన రెండరటిపళ్ళూ తిని కడుపునిండా నీళ్ళు తాగి గోడ నానుకుని కూర్చుండిపోయాడు.

    సాయంత్రం అవుతూన్న కొలదీ అతనికి భయం ఎక్కువౌతోంది. అతనికి చావడం తప్పదు. ఆ నిర్ణయంమారదు. కాని ఏదో బాధ ఏదో తీపి అతనిలో గందరగోళం చేస్తున్నాయి. అతను పళ్లు బిగబట్టి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అతని బాల్యం, కాపురం, పిల్లలు, బడి, యిన్ స్పెక్టరు అన్నీ అతని మనస్సులో గిర్రున తిరుగుతున్నాయి. రోడ్డు మీద ఏదో శవాన్ని మోసుకుపోతున్నారు. అథను చూడలేక మొహం పక్కకి తిప్పుకున్నాడు. మళ్ళీ ఆకలి మొదలుపెట్టింది.

    ఆకలితోపాటు నీరసం. ఆ నీరసంలో వొళ్ళంతా బిగుసుకుపోతూన్నట్లని పించింది. మళ్ళీ ఈసారి గట్టిగా అనిపించింది చచ్చిపోవడమే మంచిదని.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.