Home » Dr C ANANDA RAMAM » Aparajitha



    ఆ యువకుడు, ఇంటికి అల్లంత దూరంలో ఆగిపోయాడు. ఇద్దరూ వో క్షణం ఏదో మాట్లాడుకున్నారు నిల్చొని. ఆ యువకుడు తన చేతిలో వున్న ప్యాకెట్ ను రాధ చేతికిచ్చి, ఆమె చేతిని ఒకసారి తన చేతిలోకి తీసుకోని వదిలి వెళ్ళి పోయాడు. రాధ ఇంటికేసి నడక సాగించింది. మాధవికి కంపర మెత్తినట్లయింది. గబ గబా డాబా దిగి కిందకొచ్చింది.
    రాధ చేతిలో ప్యాకెట్లతో లోపలకు వచ్చింది. మాధవిని చూసీ చూడనట్లే నిర్లక్ష్యంగా లోపలకు వెళ్ళిపోయింది. మాధవి రాధ వెనకే గదిలో ప్రవేశించింది. రాధ చేతిలోని ప్యాకెట్ విప్పింది. సుబ్బు వన్నె ధర్మవరం పట్టుచీర. మాధవి తెల్లబోయి చూసింది. రాధ చీర పెట్టెలో పెట్టి వెనక్కి మళ్ళింది. గది గడపలో నిల్చొని వున్న మాధవిని చూసి ముఖం చిట్లించుకొంది.
    'రాధా!' కటువుగా వుంది మాధవి స్వరం.
    
    'ఏం?' అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది రాధ మాధవి ముఖంలోకి.
    'ఆ చీర ఎక్కడిది? అంత ఖరీదైన చీర కొనటానికి నీకు అంత డబ్బు ఎక్కడనుంచి వచ్చింది?' మాధవి రాధ ముఖంలోకి తీక్షణంగా చూస్తూ ప్రశ్నించింది.
    'ఏం నీకు చెప్పాలా?' స్వరంలో నిర్లక్ష్యానికి మాధవికి కోపం ఎక్కువయింది.
    'అవును!'
    'ఎందుకో తెలుసుకోవచ్చునా?'
    'ఈ ఇంటికి నేను పెద్ద బిడ్డగా, నీకు అక్కగా...'
    'హూఁ అలాగా? అంటే నేను నీ అదుపాజ్ఞాల్లో వుండాలంటావు?' వాల్యూం పెద్దది చేస్తూ కసిగా అడిగింది రాధ.
    రాధ స్వరంలోని తీవ్రతకు మాధవి కొంచెం వెనక్కు తీసింది.
    'అది కాదు రాధా! నువ్వలా పురుషులతో విచ్చలవిడిగా తిరగటం ఏమీ బాగాలేదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మొన్నను నేనూ నా స్నేహితురాలూ సినిమాకు వెళ్తే అక్కడా నువ్వే తయారు. ఇద్దరు మగవాళ్ళతో సినిమాకు వచ్చావు.నాకు తల కొట్టేసి నట్లయింది. ఇంటర్వెల్లో లేచి వచ్చేశాను.'
    'ఇంకా?' వ్యంగ్యంగా ప్రశ్నించింది రాధ.
    'ఈ రకరకాల చీరలు నీకు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నేను చూడలేదనుకున్నావా? వాడెవడో వీధి చివరవరకూ వచ్చి నీచేతికి ప్యాకెట్ ఇవ్వడం చూశాను.'
    'అయితే ఏమంటావ్?'
    'కాస్త ఇంగితజ్ఞానంతో ప్రవర్తించమంటాను.'
    'అలాగా? మధుతో నీవు షికార్లు కొట్టింది ఇంగిత జ్ఞానంతోనేనా? ఆ తర్వాత మధుకు మొండిచెయ్యి చూపించి బావతో పార్కులకు తిరగటంకూడ ఇంగిత జ్ఞానమేనా?'
    'రాధా!'
    'ఎందుకలా అరుస్తావు వున్న మాటంటే? నేనేం తప్పు పనులు చెయ్యటం లేదు. పురుషులతో స్వతంత్రంగా తిరిగి నంత మాత్రం చేత ఆడవాళ్ళు చెడిపోతున్నారనుకోవటం తను అజ్ఞానాన్ని బయట పెట్టుకోవటమే. ఆడవాళ్ళు ఆడవాళ్ళూ స్నేహంగా వున్నట్లూ, మగవాళ్ళూ స్నేహంగా వున్నట్లు? మగవాళ్ళూ మగ వాళ్ళూ-ఆడవాళ్ళూ ఎందుకుండకూడదు? నీలా నాకు మగవాళ్ళంటే భయం లేదు. సంఘం అంటే అంతకంటే జంకు లేదు నాకు ఆత్మవిశ్వాసం వుంది. నా ఇష్టం లేకుండా ఏ మగవాడూ నామీద చెయ్యి వేసే ధైర్యం చెయ్యలేదనే నమ్మకం నాకుంది. మగవాడు ఆడదాన్ని ఆమె ఇష్టంలేకుండా ఏదో చేసేస్తాడనే విషయాన్ని నేను నమ్మను.' రాధ ఆవేశంతో మాటలు పెగలక ఆగిపోయింది.
    మాధవి ఆశ్చర్యంగా రాధ ముఖంలోకి చూస్తూ నిల్చుండిపోయింది.
    వో క్షణం ఆగి రాధ మళ్ళీ అందుకొంది. 'నాకవ్వన్నీ ఎక్కడనుంచి వస్తున్నాయనీ, ఎవరిస్తున్నారనీ కాదూ నీ అనుమానం? కొందరు యువకులు నాచుట్టూ భ్రమరాల్లా తిరుగుతున్న మాట నిజమే. నా అనుగ్రహం కోసం నాకు రకరకాల బహుమతుల్ని ఇవ్వటానికి పోటీ పడుతున్నారు. వాళ్ళందరు చూసేదీ నిజమైన నిష్కల్మషమైన ప్రేమేనని నేను భ్రమపడటం లేదు. వాళ్ళు నన్ను భ్రమపెట్టి తమకోర్కెల్ని తీర్చుకోవాలని చూస్తున్నారు. నేను వాళ్ళను మూర్కుల్ని చేసి నాకు కావాల్సిన వస్తువుల్ని సంపాదించుకుంటున్నాను.'
    రాధను చిన్నపిల్లగానే ఊహించు కుంటూ వచ్చిన మాధవికి రాధ మాటలు మతి పోగొట్టాయి. తెల్లపోయి చూడటం తప్పించి ఏమీ మాట్లాడలేక పోతుంది.
    'ఒక విషయం గుర్తుంచుకో, నేను మార్గం తప్పి ప్రవర్తించాలనుకుంటే నన్నెవ్వరూ ఆపలేరు. నాకు కావాల్సిందీ, నేను మనసారా కోరుకొనేది నిర్భయంగా చెయ్యగలను. అనవసరంగా నామీద పెత్తనం చెలాయించటానికి ప్రయత్నించకు. నా స్వవిషయాల్లో జోక్యం కలుగ జేసుకోకు. నేను ఇప్పటికే రచయిత్రిగా కొంత స్థానాన్ని సంపాదించు కున్నాను. నీకంటే నేను ఎక్కువ చదువుతాను. ఎక్కువ ఆలోచిస్తాను. నాకు నచ్చిన మార్గంలో నేను నడుస్తాను. నీలా ఏదీ తేల్చుకోలేక, నాకేది కావాలో నాకే తెలియని పరిస్థితిలో నేను లేను.'
    'ఏవిటర్రా అన్నాలకు రారేం? ఎంత సేపు కబుర్లు!' అంటూ పరమేశ్వరి వచ్చింది.
    మాధవి త్రుళ్ళి పడి వంటింట్లో కి నడిచింది, రాధ తువ్వాలూ, సబ్బుపెట్టా తీసుకొని బాత్ రూం కేసి నడిచింది.
    ఆ రాత్రంతా మాధవికి కంటిమీదకు కునుకు రాలేదు. రాధ ఎంత ఎదిగిపోయింది? ఎన్నిమాటలు మాట్లాడింది? అలాంటి భావాలు రాధాలో ఎలా ప్రవేశించాయో! రాధ సంధియుగంలోని స్త్రీకి ప్రతినిధిలా మాట్లాడింది. ఆమెలో ఏదో తుఫాను చెలరేగుతోంది. కసి కట్టలు తెచ్చుకుంటూంది. చివరకు రాధ జీవితం ఏమవుతుందో, తెగిపోయిన గాలిపటంలా గమ్య రహితంగా విహరిస్తున్న ఆమె జీవితం పటం చివరకు ఎక్కడపోయి వాలిపోతుందో! అది ముళ్ళ కంచెమీద యినా వాలవచ్చు లేక నందనవనం మీదయినా వాలవచ్చును. రాధ జీవితాన్ని గురించిన ఆలోచనలు మాధవి మనస్సును అమితంగా కలవర పెట్ట సాగాయి.
    రాధ అన్నట్లు నిజంగానే తనకేం కావాలో తనకే తెలియదు? అవును? ఇంతవరకూ తనకు మధు కావాలో, బావ కావాలో కూడా సరిగ్గా నిర్ణయించుకోలేక పోయింది. అందుకే తను మధును....తనను అంతగా ఆరాధించిన వ్యక్తిని.....తనకోసం ఎలాంటి కష్టాన్నయినా నవ్వుతూ భరించిన మధును .... తను తెలివి తక్కువగా దూరం చేసుకొంది. తనకు నిజంగానే రాధ కున్నటువంటి ధైర్యం లేదు. తను తప్పక మధును వెతుక్కుంటూ వెళుతుంది. ప్రపంచంలోని మరే శక్తీ తనను మధునుంచి వేరు చెయ్యలేదు.
    తెల తెల వారుతుండగా ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయింది మాధవి.

                                  *    *    *

    శకుంతలను తీసుకోని పరమేశ్వరి బయలుదేరుతూ వుంటే మాధవి పిల్లను హృదయానికి గాఢంగా హత్తుకుంది. పెంచిన మమకారంలో మాధవి మనస్సు కకావిక లైంది. కళ్ళలో నీరు సుళ్ళు తిరిగింది. 'అక్కా నన్ను క్షమించు, నీకు మాట ఇచ్చిన ప్రకారం నీ బిడ్డను నా బిడ్డగా చేసుకోలేని అసమర్ధురాలను.' అంటూ శ్యామలకు మనస్సులోనే క్షమాపణ చెప్పుకొంది. శివశాస్త్రి భార్యను బస్ వరకూ దిగబెట్టడానికి బయలు దేరాడు. మాధవికి అంతవరకూ కూడా వెళ్ళాల్సిన అవసరం కలగలేదు. పరమేశ్వరి పిల్లను తీసుకొని రిక్షా ఎక్కుతూ వుంటే మాధవి దిగాలుపడి గడపలోనే నిల్చుండి పోయింది. రిక్షా కదిలిపోతుంటే కన్నీటితో పసిదాన్ని సాగనంపింది మాధవి. తీరా లోపలకు వచ్చాక ఇల్లంతా బావురుమంటూ బోసిగా, ఖాళీగా కనిపించింది. శకుంతల నుదూరం చేసుకొన్న బాధ ఒక వైపూ, మధును దగ్గిర చేసుకోబోతున్న ఆనందం మరోవైపూ, చీకటి వెలుగుల్లా ఆమె హృదయాన్ని చుట్టి వేశాయి.
    మాధవి తన పెద్ద హ్యాండ్ బ్యాగ్ ను తీసుకొని, అందులో ఒక చీరా, జాకెట్ పెట్టుకుంది. రాజారావు పంపించిన డబ్బు కవరుతో బ్యాగ్ లొ పెట్టుకొంది. బయటకు రాబోతున్న మాధవికి రాధ తన గదిలోకే వస్తూ ఎదురైంది. మాధవి ప్రశ్నార్ధకంగా రాధవైపు చూసింది.
    'శకుంతల ను ఎందుకు అమ్మ తీసుకెళ్ళి పోయింది. బావ పంపించమన్నాడా?' కుతూహలం ఆమె స్వరంలో స్పష్టంగా జ్యోతకం అయింది.
    'అవును!' మాధవి ముక్తసరిగా జవాబిచ్చింది.
    రాధ వోక్షణం రాధ ముఖంలో గుచ్చి చూసింది. అక్కడ ఆమెకు ఏ భావమూ గోచరించలేదు.
    'బావ పెళ్ళి చేసుకోవటం లేదా?'
    'ఏమో నాకేం తెలుసు?' మాధవి విసుగ్గా అంది.
    'నిన్నే చేసుకుంటా డనుకున్నాను?' రాధ స్వరంలోని వ్యంగ్యం మాధవికి చెంపదెబ్బ కొట్టినట్టయింది.
    'రాధా! ఏమిటా వాగుడు?' అంటూ మాధవి విసురుగా బయటకు వెళ్ళిపోయింది.
    అలా వెళ్ళిపోతున్న మాధవికేసి జాలిగా చూస్తూ రాధ నిట్టూర్చింది. ఆ సమయంలో రాధను మాధవి చూడగలిగితే, రాధకు తనమీద తను ఊహించుకొంటున్నలాంటి కసిగానీ, కోపంగానీ, ఏమీ లేదని తెలిసిపోయేది ఆమెకు,
    మండుతున్న జ్యోతి మీద బుట్టబోర్లించినట్టు అప్పుడే ఆకాశంలో వెలుగు ఆరిపోతూంది. దుమ్ము రేపుతూ వచ్చి ఆగింది బస్, బస్ దిగి కాలిబాటన ఊళ్ళోకి నడక సాగించింది మాధవి. మాధవికి ఆ పల్లె వాతావరణంలో వో వింత ప్రశాంతత గోచరించింది. పశువులు ఇళ్ళకు తిరిగొస్తున్నాయి. పిల్లలు గుంపులు గుంపులుగా చేరి రకరకాల ఆటు ఆడుతున్నారు. దాదాపు అన్ని ఇళ్ళకూ వీధివాకిలికి ఇరువైపులా రాతి అరుగులు వున్నాయి. వయసు మళ్ళినవారు అరుగుల మీద కూర్చొని వున్నారు. మాధవి, చిన్నతనం నుంచీ బస్తీలోనే పెరిగిన మాధవి, ఆ పరిసరాల్ని ఉత్కంఠతో పరిశీలిస్తూ నడుస్తూంది. పిల్లల దగ్గిర్నుంచీ, పెద్ద వాళ్ళ వరకూ, వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ, తననో వింత వస్తువును చూసినట్లు చూస్తున్నారనేది గ్రహించిన మాధవి తనలోకి తనే కుంచించుకుపోసాగింది. పమిట చెరగును భుజాల మీదగా కప్పుకొని, తల వంచుకొని గబగబా నడక సాగించింది.
    ఊరు చౌరస్తా చేరుకున్న మాధవికి ఎటు వెళ్ళాలా అనే సందేహం కలిగింది. తనను వో వింత జంతువులా చూస్తున్న వాళ్ళను 'ఫలానా వారి ఇల్లు ఎక్కడ' అని అడగాలంటే మాధవికి అభిమానంగా వుంది. అయినా తప్పదు అనుకున్న మాధవికి రచ్చబండ మీద కూర్చొని వున్న కొందరు పెద్దలు తనకేసే చూస్తూండటం కనిపించింది. ధైర్యం చేసి రచ్చబండ దగ్గరకు వెళ్ళింది.
    'ఏంమ్మా? ఎవరిల్లు కావాలి?' సందేహిస్తూ నిల్చున్న మాధవిని ఓ గుబురు మీసాల ముసలాయన ప్రశ్నించాడు. అతని కంఠంలో ఆశ్చర్యంతోపాటు ఆదరణకూడా నిండివుంది.  
    'పాపయ్య శాస్త్రిగారి ఇల్లు!' చిన్నగా గొణిగింది మాధవి.
    'ఏ పాపయ్యశాస్త్రి? ఈ ఊళ్ళో ఇద్దరున్నారు?' అన్నాడు లంక పొగాకు చుట్ట తాలూకుపొగను గుప్పుగుప్పున వదులుతూ.
    మాధవికి ఏం చెప్పాలో తెలియక మౌనం వహించింది.
    'ఇంటి పేరేమిటమ్మా?' అన్నాడు లావుపాటి ముసలాయన.
    ఇంటి పేరేమిటో మాధవికి తెలియదు. మధు 'వి' అని రాసేవాడు.
    'వాళ్ళబ్బాయి పేరు మధు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూంటాడు. ఇంటి పేరు 'వి' అని రాసేవాడు'. అంది మాధవి చిన్నగొంతుతో జంకు జంకుగా.
    ముగ్గురు పెద్ద మనుషులూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకొన్నారు. పొదల సందునుంచి చీల్చుకుంటూ సూర్యకిరణాలు వచ్చినట్లు, గుబురు మీసాల సందుల్నించి హాసరేఖలు ముందుకొచ్చాయి. గుబురు మీసాల తాలూకు పెద్దమనిషి ముఖంలోకి, అతని చిరునవ్వు 'అలా చెప్పు. అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చిన పట్నం అమ్మాయిని అన్నమాట!' అని నిలదీసి అడిగింది అతని చిరునవ్వు. మాధవికి అక్కడ నిల్చోవాలంటే ఇరుగ్గా, ఇబ్బందిగా వుంది. అక్కడనుంచి పారిపోగలిగితే బావున్ను అనిపించింది. తను ఇలా వచ్చి వుండాల్సింది కాదనిపించింది.
    'ఈ వీధినే వెళ్ళి రెండో సందు....కుడివైపు రెండో సందులో చివరి డాబా ఇల్లే మధుసూధనరావు ఇల్లు.' అన్నాడు వో వయసుమళ్ళిన పెద్దమనిషి.
    బ్రతుకు జీవుడా అనుకుంటూ మాధవి అక్కడనుంచి ముందుకు నడిచింది, ఆమె ఎంతవేగంగా నడుస్తున్నా! ఆ పెద్దమనుషుల తాలూకు చూపులు తనను వెంటాడుతున్నట్టే అనిపించింది మాధవికి.
    పల్లెటూర్లు స్వర్గసీమలని వింది. కాని తను కాలుపెట్టిన క్షణం నుంచే తనకు అది నరకసీమలా, చాలా ఇరుగ్గా అనిపిస్తూంది. చిన్నతనంనుంచీ బస్తీ లోనే పెరిగి పెద్దై ఒక్కసారి పల్లెటూర్లో కాలుపెట్టిన వాళ్ళకు పల్లె వాతావరణం అలాగే అనిపిస్తుందో ఏమో?




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.