Home » Dr C ANANDA RAMAM » Aparajitha



    'నీ ఉత్తరం అందింది. చదివాను. చాలా బాధ కలిగింది.'
    మాధవి ముందుకు చదవలేక పోయింది. బావకు తన ఉత్తరం బాధను కలిగించిందా? బావ తన ఉత్తరం చదివి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడనుకొన్న తన ఉత్తరం బావకు బాధను కలిగించిందా?
    'నీ ఉత్తరం చదివాను. మరోసారి...మరోసారి చదివాను. అలా ఎన్నిసార్లు చదివానో చెప్పలేను.'
    మాధవి తేలిగ్గా నిట్టూర్చింది. అనవసరంగా భయపడినందుకు, తనలో తనే నవ్వుకుంది.
    'ఉత్తరం ఆలోచించాను, చాలా చాలా ఆలోచించాను. ఎంతో ఆలోచించే ఈ నిర్ణయానికి రాగలిగాను.'    
    మాధవి ఊపిరి బిగబట్టి చదవసాగింది.
    'మాధవీ నన్ను నీవు చాలా స్వార్ధపరుడుగా ఊహించి వుంటావు గదూ? అవును మాధవీ! నేను చాలా స్వార్ధంగా ప్రవర్తించాను. నాకు ఊహ తెలిసింతరవాత నేను ఎన్నడూ ఇంత చిన్నవాణ్ణిగా ప్రవర్తించలేదు. కేవలం నీకోసం....నిన్ను నా దాన్ని చేసుకోవటం కోసం, చాలా సంకుచితంగా ప్రవర్తించాను. నీ సున్నితమైన మనస్సును నొప్పించాను. నిన్ను, నువ్వు ప్రేమించే వ్యక్తినుంచి దూరం చేశాను. అయినా, నువ్వు నన్ను నిందించలేదు. అసహ్యించుకోలేదు. నువ్వు కారుణ్యమూర్తివి మాధవీ! నువ్వు చాలా ఎత్తైన దానివి. అందుకే నామీద జాలితో, నీకు నీ అక్కయ్య అంటే వున్న అభిమానంతో...ఆమె కిచ్చిన వాగ్దానానికి బద్దురాలివై శకుంతలకోసం, నీ ప్రేమను సహితం త్యాగం చెయ్యటానికి సిద్ధ పడ్డావు.'
    ఏమిటి ఇలా రాస్తున్నాడు. బావ బహుశా తనను.....కాదు......బావ ఎన్నటికీ అలా రాయడు. బావకు తను కావాలి ఆ కళ్ళలో ఎంత ఆరాధనా, ఆర్తిగా తనకోసం ఎంత తపన.
    'నన్ను అర్ధం చేసుకుంటావు గదూ మధూ! నిన్ను ఇలా సంబోధించే అధికారం నాకు లేదని నాకు తెలుసు. అయినా నిన్ను ఇలా పిలవటమే నాకు ఇష్టం. నువ్వు మధును ప్రేమిస్తున్నట్లు నాకు తెలియదు. మధు నువ్వంటే పడి చస్తా డనీ, నిన్ను తన దాన్నిగా చేసుకోవాలనే నీకు డబ్బుఅప్పు ఇచ్చాడనీ తలచాను. అతను చేసిన సహాయానికి కృతజ్ఞతతో నువ్వు కట్టుబడి వుండాల్సి వచ్చిందనుకున్నాను. అందువల్లనే నిన్ను రుణ విముక్తను చేద్దామనీ, నిన్ను నా దాన్నిగా చేసుకుందామనీ ఆశ పడ్డాను. నిన్ను నా దానినిగా చేసుకోవాలనే ఆర్తి నాలో ఈనాడు రగిలింది కాదు. ఏనాడో....పెళ్ళి చూపులకు వచ్చిన, నాడే.....నిన్ను చూసిన ప్రథమ క్షణంలోనే నేను ఇంతకాలంగా, నా కలల్లో....ఊహల్లో వెతుక్కుంటూన్నది నిన్నేనని గుర్తించాను. నిన్ను చూడగానే నాకు నువ్వు, నాలో మరుగుపడిన ఏదో మధుర స్మృతిలా అనిపించావు. నువ్వే పెళ్ళి కూతురిగా ఊహించకున్న నా మనస్సు తన చుట్టూ వో సుందర ప్రపంచాన్నే అల్లేసుకుంది. కాని దురదృష్టవంతుణ్ణి, ఆ ప్రపంచంలో ఎంతోసేపు వుండలేక పోయాను. ఎవరో నన్ను బలవంతంగా ఆ ప్రపంచం నుంచి క్రిందకు తోసేశారు. సుఖస్వప్నం చూస్తూ ఆనంద డోలికల్లో ఊగిపోతున్న నన్ను బలవంతంగా నిద్రనుంచి లేపారు. స్వప్నం చెదిరిపోయింది. మనస్సు చిన్న పోయింది. నువ్వు పెళ్ళికూతురువు కావనీ, నీఅక్క పెళ్ళి కూతురనీ తెలిసింది. వెంటనే అక్కడనుంచి వెళ్ళిపోవాలనిపించింది. కాని అలా వెళ్ళిపోలేకపోయాను. కారణం నువ్వేనంటే నమ్మవు కదూ? ఆ ఇంటి వాతావరణం బాగా పురిపెట్టిన తాదులా వుందని గ్రహించాను అందరూ బిగుసుకొనిపోయి వున్నట్లు కనిపించారు. నీ పెద్ద కళ్ళలొ ఏదో ఆందోళన కనిపించింది, మీ అక్కయ్య వివాహం ఆ ఇంటికి ఓ పెద్ద సమస్యగా పరిణమించిందని గ్రహించాను. ఆ ఇంట్లో నువ్వు కూడా వున్నావు కనుక, ఆ ఇంటికీ నాకూ ఏదో అనుబంధం వున్నట్లు అనిపించింది.  ఆ ఇంటి సమస్యను పరిష్కరించగలగటం నాకు వో అదృష్టంగా అనిపించింది. మీ అక్కయ్యను వివాహం చేసుకోవటానికి అంగీకరించాను. కట్నం మా నాన్నగారి ప్రోద్భలంవల్ల తీసుకోక తప్పిందికాదు. అలాగని పక్షంలో ఆ నాన్న ఈ వివాహానికి అంగీకరించరని నాకు తెలుసు.
    మీ అక్కయ్యను భార్యగా, జీవిత భాగస్వామినిగా గౌరవించగలిగానే కాని ప్రేమించ లేకపోయాను. మీ అక్కయ్య అకాలమరణానికి గురికావటం, శకుంతల భాధ్యత నీ మీద పడటం చిత్రంగా లేదూ? మోడు వారిన నా జీవిత తరువు నాకు తెలియ కుండానే చిగుళ్ళు వేయసాగింది. కళ్ళలోనే కరిగిపోయిన కలల్ని కళ్ళ ఎదుట చూడాలనే కాంక్ష మరోసారి తల ఎత్తింది. నిన్ను నాదాన్ని చేసుకోవాలనే వాంఛ తీవ్రం అయింది. నువ్వు మధును ప్రేమిస్తున్నాననే అనుమానం కలిగినా, నాలోని స్వార్ధం ఆ అనుమానాన్ని జోకొట్టి నిద్రపుచ్చటానికి ప్రయత్నించింది. ఆనాడు మధును కలుసుకోవటానికి నువ్వు పడిన ఆరాటం, కలుసుకోలేక పోయినందుకు పొందిన ఆవేదనా నాకు అర్ధం కాకపోలేదు. అయినా అర్ధం కానట్లే నటించాను. నిన్ను నాతో పార్కుకు రావలసిందిగా బలవంతం చేశాను. అయిష్టంగానే నాతో పార్కుకు వచ్చావు. నీ మనస్సు సున్నితం, ఇతరులను నీ కారణంగా నువ్వు బాధ పడనివ్వవు. అందుకే నువ్వు బాధపడి, నాతో పార్కుకు వచ్చావు.'
    మాధవి ఉత్తరం నుంచి తల పై కెత్తి వో క్షణం ఏకాక్దకో దూరాలకు, ఆలోచనారహితంగా చూస్తూ వుండిపోయింది.
    'ఆ రోజు నన్ను వివాహం చేసుకోమని, నిన్ను ఒప్పించటానికి అనేక విధాల ప్రయత్నించాను. ఇంటికి వచ్చాక నాలోకి నేను తిరిగివచ్చాను. తాపీగా ఆ విషయం గురించి ఆలోచించాను. నేను ఎంత సంకుచితంగా ప్రవర్తించానో అర్ధం చేసుకున్నాను. నా ప్రేమ మీద నాకె చిన్న చూపు ఏర్పడింది. అందులో స్వార్ధపు వాసన వున్నట్లు గ్రహించాను. పవిత్ర ప్రేమ ఎప్పుడూ తను ప్రేమిస్తున్న వ్యక్తుల నుంచి దేనిని పొందుదామా అని ఆరాటపడదు. తను ప్రేమిస్తున్న వ్యక్తులకు తాను ఏమి ఇవ్వగలదా అనే తహ తహ మాత్రమే తెలుసు నిజమైన ప్రేమకు. ఆలోచించాను.... ఆలోచించాను ......ఎన్నో రాత్రిళ్ళు అలోచిస్తూనే గడిపాను. శకుంతల మిషతో నిన్ను నాదాని నిగా చేసుకోవటానికి ప్రయత్నించటం, ఎంత అల్పత్వమో తెలుసుకొని సిగ్గు పడ్డాను. బలవంతంగా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా, నిన్ను నాదాన్ని చేసుకోవటానికి ప్రయత్నించాను. నా సుఖం కోసం....నా ఆనందంకోసం....నా ప్రేమకోసం....నీ సుఖాన్నీ.....నీ ఆనందాన్నీ....నీ ప్రేమనూ....నలిపి వేయటానికి ప్రయత్నించాను. మాధవీ.....మధూ.....నిన్ను ఇలా పిలవటం ఆఖరుసారే కావచ్చు..... నన్ను క్షమిస్తావు గదూ?'
    మాధవి చేతిలో కాగితాలు గాలికి రెపరెపలాడాయి. ఆమె గుండెలు దడదడ లాడాయి. అయితే బావ.... కాదు.... అలా ఎన్నటికీ కాదు.....ఊపిరి బిగబట్టి ముందుకు చదవ సాగింది.
    'నేనే నీకు ఉత్తరం రాయాలను కున్నాను. నీనుంచే ఉత్తరం వచ్చింది. మధు వెళ్ళిపోయాడని రాశావు. బహుశా మధు కోపగించుకొని వెళ్ళివుంటాడు. అలా మధు వెళ్ళి పోవటం నీ మనస్సును లోతుగా గాయపరచింది. చాలా లోతైన గాయం తగిలినప్పుడు వెంటనే బాధ తెలియదు. మధు అలా వెళ్ళిపోయినందున, నువ్వు బాధపడుతున్నానో లేదో కూడా నీకు తెలియనంతగా దిమ్మెరపోయావు. ఎంతో లోతుగా దెబ్బతగలటం వల్లనే నీకు జీవితం మీద విరక్తి కలిగింది. దెబ్బతిన్న ప్రేమ నీలో ద్వేషంగా మారింది. నీకు తెలియకుండానే మధు మీద ప్రతీకారం తీసుకోవాలనే కసినీలో బయలుదేరింది. అందువల్లనే నీవు నాకు ఆ ఉత్తరం రాశావు. శకుంతలను తీసుకొని వస్తున్నానని రాశావు. కాని నేను నిన్ను భార్యగా స్వీకరించిన మరుక్షణంలోనే, నీలోని ప్రతీకారేచ్చ చల్లారుతుందనీ, ప్రతీకారం తీర్చుకో గలిగిన ద్వేషం పశ్చాత్తాపంగా మారుతుందనీ, పశ్చాత్తాపాగ్నిలో దగ్ధం అయిన ప్రేమ తప్త స్వర్ణంలా కల్మష రహితంగా హ్రుదయాన్నంతా ఆక్రమించు కుంటుందనీ నీకు తెలియదు. ఆ తరవాత నువ్వు చేసిన తప్పు గ్రహించుకోని కుమిలిపోతావు. మధుకోసం రోదిస్తావు. అదీకాక నీకు నేనంటే జాలి. జాలి వల్లనే ఆవేశంలో ఇంత త్యాగానికి తయారయావు. నాకు కావాల్సింది జాలి కాదు. నామీద ఎవరైనా జాలి చూపటాన్ని భరించలేను. అది నా స్వభావానికి విరుద్ధం. నాకు కావాల్సింది నీ మనస్సు. అది నీ దగ్గర లేదని నాకు తెలుసు. మధుకు కోపం రావటంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఆనాడు మనిద్దర్నీ పార్కులో చూసి వుంటాడు. అందుకే అలిగి వెళ్ళి పోయి వుంటాడు. అంతమాత్రానికే అభిమాన పడిపోతే ఎలా మాధవీ!' ప్రేమ......అభిమానం......రెండు కత్తులు ఒక ఒరలో ఇమడనట్లే......ఒక్క హ్రుదయంలో ఇమడవు. మధు ముందు అభిమానం ఏమిటి? అతన్ని కలుసుకో అతనికి కలిగిన భ్రమను తొలగించు. నేను కట్నంగా తీసుకొన్న నాలుగు వేలూ పంపించాను. మధుకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేయ్! మీరిద్దరూ సుఖంగా వుండాలని మనసారా కోరుతున్నాను.'




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.