Home » D Kameshwari » Agni Pariksha
"ఊహూ... అది మాత్రం చెయ్యను. రాజీపడి మళ్ళీ ఆయన దగ్గరకి వెడితే యింకా ఆయన మరింత విజ్రుంభిస్తారు చచ్చినట్లు వచ్చాక యింకా హీనంగా చూస్తారు. అది మాత్రం చేయను. ఏమయినా మళ్ళీ ఆయనతో కాపురం ప్రసక్తిలేదు."
"అయితే యింక ఎందుకు ఈ విషయంఆలోచిస్తారు. జరగబోయేది కాలానికి వదిలేయండి. ఎంత కాదనుకున్నా కన్నకూతురిని ఏ ఆధారం లేకుండా రోడ్డుమీదికి గెంటరు కదా మీవాళ్ళు, అన్నీ చెప్పి, ఉద్యోగం చూసుకుంటాను, అది దొరికే వరకు వుంటాను అని చెప్పు మీరేమిటి అంతడీలా పడిపోతున్నారు అపుడే....గంట క్రితంవున్న నిజం లేదు యిప్పుడు మీలో..... కమాన్ చీర్ అప్, భర్త యింటినుంచి వస్తే ప్రపంచమే అంతం అయిపోయినంత దిగులుపడి పోతున్నా రెందుకు రాజేష్ ఆమెకు ధైర్యం చెపుతూ ఉత్సాహపరిచాడు. అర్చన నవ్వి చెమ్మగిలిన కళ్ళు కొంగుతో వత్తుకుంది. "మీరేలేకపోతే, మీరిలా ధైర్యం చెప్పకపోతే నేనేమయ్యేదాన్నో గదా." అంది.
"ఏమీ అవరు. నేను లేకపోతే యింకోరెవరో ఆశ్రయం ఇచ్చే వారు కాదు' ఆదుకొనే వారు. ప్రపంచం యింకా గొడ్డుపోలేదు. మనుషుల్లో యింకా మానవత్వం పూర్తిగా అడుగంటలేదు" తేలిగ్గా నవ్వాడు రాజేష్ చేతినానుకుని "పదకొండు అయింది నేవెళ్ళి క్యారియర్ తీసుకొస్తాను. మీరు కాసేపు పడుకుంటే పడుకోండి రాత్రంతా నిద్రలేదు."
"నా టిక్కట్టో......టిక్కట్టు బుక్ చెయ్యరా."
"సేమ్ డే కయితే రిజర్వేషన్ టిక్కెట్టు యివ్వరు ముందుగా - కాస్త ముందుగావెళ్ళి టిక్కెట్టుకొని, బెర్తుకోసం ప్రయత్నించాల్సిందే ఎవరినో పట్టుకొని - రష్ సీజన్ కాదు గనక దొరకచ్చులెండి" రాజేష్ క్యారేజి పట్టుకుని స్కూటరు తాళాలు తీసుకుని వెళ్ళాడు. రాత్రి నిద్రలేక, జరిగిన ఒక్కొక్క సంఘటన ఆమె మనసుమీద దెబ్బతీయడంతో శారీరకంగామానసికంగా అల్సిపోయిన అర్చన ఓపిక లేనట్టు నిస్త్రాణగా పక్కమీద వాలిపోయింది.
"అర్చనగారూ. మీరేం అనుకోకపోతే ఒక్క విషయం అడగనా భోజనంచేసి యిద్దరూ విశ్రాంతిగా డ్రాయింగు రూములో కూర్చున్నాక రాజేష్ సందేహిస్తూ అడిగాడు.
"అడగండి, సందేహం ఎందుకు మీ దగ్గిర నాకు దాచడానికి ఏమీ లేదు. మీ సందేహం ఏమిటో నాకర్ధం అయింది లెండి." అర్చన నిర్లిప్తంగా నవ్వుతూ అంది.
"అసలు మీకు మీవారికి ఎందుకు పడలేదు ముందు నించీ వుందా ఆయన మిమ్మల్ని సరిగా చూడలేదా అసలు ఇది మీ పర్సనల్ మేటర్ అనుకోండి. కానీ, అనుకోకుండా నేను మీ గొడవలో ఇన్వాల్వ్ అయ్యాను అసలు ఎందుకిలా జరిగిందా అన్న ఆరాటం అనండి కుతూహలం అనండి నిన్ను నిలవనీయడంలేదు." ఫ్రాంకే గా అడిగాడు. అర్చన నిట్టూర్చింది చిన్నగా.
"రాజేష్ గారూ - మనవాళ్ళనే పూజకొద్దీ పురుషుడు అనే సామెతలో ఎంత నిజం వుందో ఇప్పుడు నాకర్ధం అయింది అన్నీ వుండి అనుభవం లేకపోవడం అంటే ఏమిటో నన్నుచూస్తే తెలుస్తుందీ ఎవరికయినా రాజేష్ గారూ. అయినవారింటపుట్టి, కలవారి యింట మెట్టి, నాలుగైదు వేలు తెచ్చుకునే-భర్తలభించడం ఏ ఆడపిల్లకయినా అదృష్టమే అవుతుంది అంత వరకు నేనూ అదృష్టవంతురాలినే! అయితే అన్నింటిని మించని ఐశ్వర్యం భర్త అనురాగం పొందడం, అన్నింటిని మించిన అదృష్టం భార్యాభర్త మనసులు కలవడం తనువులు కాదు ఏకం కావల్సింది మాట, మనసు అన్నది అనుభవంలోకి వచ్చాక అర్ధం అయింది. అందరి ఆడపిల్లల్లాగా కన్నెగా వుండగా కలలు కన్నాను కట్టుకున్నవాడు అలరిస్తాడు. మురిపిస్తాడని మురిశాను. నా అందం రోడ్డున పోయేవారిని ఒక్కక్షణం నిలబెట్టేటంతటిది అని చిన్నప్పటినించి అందరూ అనడం. అనుకోడం విన్నాక పెద్దయ్యాక నా అందం ఎందరో పురుష హృదయాలని కల్లోలపరుస్తూంది కాలేజీలో చూసి గర్వపడ్డాను. ఈ అందాన్ని ఆరాధించే పురుషుడు వస్తాడని, నా అందానికి నీరాజనాలు పట్టి, నన్ను అందలం ఎక్కించి ప్రేమాభిమానాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడని కలలుకన్నాను. ఆ ఊహల ఉయ్యాల యింత దారుణంగా పట్టి కొట్టి నన్ను కిందపడేస్తుందన్నది ఆనాడూ ఏనాడూ అనుకోలేదు."
"మీరూ చాలా భావావేశంగా మాట్లాడుతున్నారు. ఎమోషన్ కి తోడు మంచి ఎక్స్ ప్రెషన్ కూడా వుంది మీకు.....రచయిత్రిగా రాణిస్తారు రాస్తే ఆమె భావావేశం గుర్తించి ఆ ప్రవాహానికి అడ్డుకట్టవేశాడు రాజేష్ చిలిపిగా నవ్వి.
అర్చన కొద్దిగా సిగ్గుపడి "భావావేశమో ఏం ఆవేశమో నాకు తెలియదు గాని జీవితం నన్ను వంచించింది రాజేష్ గారూ! అన్నీ యిచ్చినట్లే యిచ్చి, వడ్డించిన విస్తరిని నోటిముందు నించి లాగేసింది. ఏ అనుభూతులకి, అనుభవాలకి నోచుకోకుందానే మూడేళ్ళ నావైవాహిక జీవితం ముగిసిపోయింది. ఆమె గొంతు వణికింది. కంటిలో నీటి పొర కదిలింది. విచలితురాలై "రాజేష్ గాఒరో, అందరూ పొగిడిన నా అందమే నాకు శత్రువవుతుందని అనుకోలేదు-భార్యా రూపవతీ శత్రు అన్న సామెత నా పట్ల నిజం చేశాడు నా భర్త."
"మీరూరికే అలా బాధపడి మాట్లాడే మాటలయితే అసలు ఏం చెప్పవద్దు. మీరు చాలా అప్ సెట్ అవుతున్నారు. మీ మానిన పాతగాయాలు కెలికినట్టయింది నేను అనవసరంగా."





